వారికి అడవే ఆకలి తీర్చే అమ్మ. గుక్కెడు గంజికైనా… ఆ గంజి కాచుకునే పొయిలో పుల్లలకైనా వారి జీవనాధారం అరణ్యమే. విల్లంబులతో వేటకు వెళ్లి రిస్క్ చేస్తేనేగానీ… జీవితం గడవని స్థితి. కానీ, ఇప్పుడా స్థితి నుంచి వెయ్యెకరాల్లో లక్షన్నర పండ్లమొక్కులు పెంచి.. స్థితిమంతులయ్యారు. సాగే జీవితాధారంగా బతుకుతూ విజయవంతమైన కథానాయకులుగా ఎదిగిన ఎందరో అన్నదాతలను సైతం.. ఆ ఆదివాసీల వ్యవసాయం ఇప్పుడు అబ్బురపరుస్తోంది. ఆ ఆదీవాసీల సక్సెస్ వెనుక శ్రమ గురించి తెలుసుకోవాలంటే… ఓసారి స్వాతంత్య సమరంలో ప్రముఖ పాత్రధారుడైన మన్యం వీరుడు అల్లూరి నడయాడిన ప్రాంతానికి వెళ్లిరావాలి.

స్వాతంత్ర్య పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలియనివారెవరు..? అదిగో ఆయన సంచరించిన నేలలో స్వాతంత్ర్యం వచ్చినా.. పాలకుల దృష్టికి నోచుకోలేకోపోయిన అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ భగత. ఇదంతా నిన్నమొన్నటి వరకూ చెప్పుకున్న మాట. కానీ, ఇప్పుడు కొయ్యూరు మండలంలో భగత అనే తెగ.. సాగు ప్రపంచానికి దిక్సూచై నిల్చిన ఓ సక్సెస్ స్టోరీ.
అయితే, ఎక్కడో కొయ్యూరు మండలంలోని ఆదివాసీల జీవితాల్లోని చీకటి వెలుగుల్ని కళ్లకు కట్టే జర్నలిజం ఇప్పుడెక్కడుంది..? మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకూ అర్బనైజేషన్ ముసుగు వేసుకున్న రోజుల్లో.. గిరిజన, ఆదివాసీ గూడాల్లో జనమేమైపోతే ఎవరికేంటి..? తెల్లార్లేస్తే డ్రైవ్స్ అంటూ రేటింగ్స్ తో పోటీ పడుతూ దుమ్మెత్తుకుపోసుకునే ఫైటింగ్ కాలంలో.. పత్రికలకూ, టీవీ ఛానల్స్ కూ ఎక్కడో ఆ ఆదివాసీల కథెలెలా రుచించుతాయి..? జీవవైవిధ్యం గురించి.. వైవిధ్యమైన జీవన స్థితిగతుల గురించి ఎవడిక్కావాలి..?
కానీ, నీటి నిల్వలు నిండుకున్న చోటే.. దాహం తీర్చే ఓ చెలిమె తారసపడుతుంది. అలాంటి మీడియా సంస్థలు అక్కడో, ఇక్కడో, ఎక్కడో అన్నట్టు అప్పుడప్పుడూ అరణ్యం కథల్ని, అనాగరికుల వ్యథల్నీ సమాజానికి చెబుతాయి. ఏసీ రూముల్లో, డెస్కుల్లో కూర్చుని.. ఎదుటివాడు ఏది చెబితే అది రాసుకుని.. దాన్నే అటుఇటుగా తిరగరాసే విశ్లేషణలందించే మీడియాలా కాకుండా.. అనుభవిస్తేనేగానీ భ్రమలు తొలగిపోవన్నట్టుగా ఫీల్డ్ విజిట్ లో ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసి.. కళ్లతో తాము చూసింది.. చెవులతో తాము విన్నది.. అక్షరాస్యతకు నోచుకోలేనివారు చెప్పలేనిది.. అత్యంత ప్రభావవంతంగా సమాజం ముందుంచుతాయి.
అదిగో, అలాంటి కోవలో ముందు వరుసలో ఉండేదే.. రూరల్ మీడియా. తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలాంటి తేడాల్లేకుండా.. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలన్న బేధాలు చూపకుండా 360 డిగ్రీల కోణంలో రూరల్ మీడియా ప్రెజెంట్ చేసిన, చేస్తున్న కథనాలెన్నో! ఎన్ని ఊళ్లు, ఎన్ని వ్యథలు, ఎన్ని కథలు, ఎంత మంది కథానాయికలు, ఎందరు కథానాయకులు.. మరో నలుగురికి ఉత్ప్రేరకమయ్యే ఎన్ని సక్సెస్ స్టోరీసూ.. ఒక్కమాటలో రూరల్ మీడియా జర్నీ.. నేటి జర్నలిజం సమాజం అభినందించాల్సిన.. అనుసరించాల్సిన ఓ ప్రయాణం!!
ఆ రూరల్ మీడియానే ఇప్పుడు వెనుకబడిన భగత ఆదివాసీ తెగ గురించి జనానికి పరిచయం చేసింది. ఓవైపు చుట్టూ కొండలు… మరోవైపు సముద్రం… మధ్యలో వైజాగ్ పట్టణం… దానికి ఓ నూటాయాభై కిలోమీటర్ల దూరంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఓ మారుమూల అత్యంత వెనుకబడిన గిరిజన తెగ భగత ఉండే కొయ్యూరు ప్రాంతం. ఇలా, కేవలం వారి గురించే కాదు.. అడవితో పెనవేసుకున్న వారి బతుకుచిత్రం.. ఏమీ లేని చోట ఎలా విజయగాధగా మారారు… పండ్ల తోటల పెంపకంలో ఎలా ఆదర్శమయ్యారో తెలియజెప్పుతూ రూరల్ మీడియా చేసిన ప్రెజెంటేషన్… ఆ కొయ్యూరు ఆదివాసీల జీవన కథనాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.
చిత్తశుద్ధి కల్గిన జర్నలిజం తల్చుకుంటే సమాజాన్ని ఎంత ప్రభావితం చేయొచ్చో కూడా ఈ సక్సెస్ స్టోరీ మనకు చెబుతుంది. ఎందుకంటే రూరల్ మీడియా కమిట్ మెంట్ కు… ఇప్పుడు భగత ఆదివాసీ జీవితాలకు నాబార్డ్ తో పాటు.. రాంకీ ఫౌండేషన్ కూడా తోడవ్వడంతో… ఏమీ లేని చోట ఒక అపూర్వ విజయానికి నాంది పడింది. మరెందరికో ఇప్పుడు ఆదర్శమై నిలుస్తోంది.
ఆదివాసీల వెలుగుబాట.. మాతోట పేరుతో ఆ కథనానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తున్నాం.. చూడండి.. ఇలాంటి ఇండిపెండెంట్ కమిటెడ్ జర్నలిజాన్ని తప్పకుండా ఆదరించండి.



