మొఘలులు, బ్రిటీషర్స్.. భారత్ లో అక్కడ మాత్రం జెండా పాతలేకపోయారు!

స్వాతంత్ర్యానికి పూర్వం భారత్ అంటే పరాయిపాలన. అందులో ముందు మొఘలులు, ఆ తర్వాత బ్రిటీషర్స్ దే ఆధిపత్యం. అలా దేశం మొత్తాన్ని తమ గుప్పిట పెట్టుకుని నడిపించిన మొఘలులైనా… ఆ తర్వాత వచ్చిన బ్రిటీషర్స్ అయినా… దేశంలో ఒకే ఒక్క ప్రాంతంలో మాత్రం తమ ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయారు. అదేంటో చాలామందికే తెలిసే ఉంటుంది. తెలియనివారికోసమే ఈ చరిత్ర పాఠం.

భారతదేశాన్ని మొదట మొఘలులు పాలించారు. బాబర్ 1526లో భారత్ లో మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఆ తర్వాత 1857లో బ్రిటీష్ వారు ప్రవేశించారు. బ్రిటీష్ వారి ఎంట్రీతో దాదాపుగా మొఘలు సామ్రాజ్యం పాలన పతనావస్థకు చేరుకుంది.

1526కు ముందు భారత్ ను వివిధ రాజవంశాలు పాలించాయి. కానీ, 1526లో బాబర్ దండయాత్రతో మొఘలుల పాలనకు బీజం పడింది. అయితే, అటు మొఘలులైనా.. ఇటు బ్రిటీష్ వారైనా భారతదేశంలోని అన్ని రాజ్యాలపైనా ఆధిపత్యం కనబర్చారు. వారి స్వాధీనంలోకి తెచ్చుకుని వారి ఏలుబడిలో పాలన సాగించారే కానీ.. నేటి ప్రముఖ పర్యాటక ప్రాంతాన్ని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయారు. ఆ ప్రాంతమే గోవా.

బ్రిటీష్ వారు సుమారు 200 ఏళ్లు భారత్ ను పాలించారు. 1947 వరకూ భారతదేశం వారి ఆధీనంలోనే ఉంది. ఇక్కడి వనరులను పూర్తిగా దోచుకున్నారు. కానీ, వారు గోవాను మాత్రం కనీసం ముట్టుకోలేకపోయారు. బ్రిటీష్ వారే కాదు.. మొఘలులూ ఆ సాహసం చేయలేకపోయారు. భారత్ లోని అన్ని ప్రాంతాల్లోనూ అటు మొఘలులైనా.. ఇటు బ్రిటీష్ వారైనా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోగల్గారేగానీ… గోవా విషయంలో మాత్రం వారి ధైర్యం సరిపోలేదు.

అయితే, గోవా కూడా బానిస దేశంగానే కొనసాగింది. అది పోర్చుగీసువారి పాలనలో ఉండేది. పోర్చుగీసువారు దాదాపు 450 ఏళ్లపాటు గోవాను ఏలారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 14 ఏళ్లకుగానీ.. గోవాకు పోర్చుగీసువారి నుంచి విముక్తి లభించింది. గోవా స్వాతంత్ర్యం కోసం అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పలుమార్లు చర్చలు జరిపినా.. పోర్చుగీస్ అంగీకరించలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది. 30 వేల మంది సైనికులను యుద్ధానికి సిద్ధం చేసింది. మూడువేల మంది పోర్చుగీస్ సైనికులపై భారత ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు దాడులకు దిగాయి. 36 గంటలపాటు కొనసాగిన ఆ పోరులో పోర్చుగీస్ తలవంచింది. భేషరతుగా గోవాపై నియంత్రణను వదులుకుంది. పోర్చుగీస్ జనరల్ మాన్యుయేల్ ఆంటోనియో వసాలో ఎ సెల్వా సరండర్ పత్రం మీద సంతకం పెట్టేశాడు.

గోవా విముక్తిలో రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖులెందరో కీలకపాత్ర పోషించారు. అనారోగ్య కారణంగా గోవాలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్లి లోహియా.. బ్రిటీష్ పాలనను మించిన అధ్వాన్నపాలనను చూసి చలించిపోయాడు. అక్కడ అందకుండాపోయిన పౌరహక్కులపై దృష్టి సారించిన లోహియా.. వెనువెంటనే ఒక 200 మందిని సమావేశపర్చి పౌరహక్కులపై సమావేశం నిర్వహించాడు.

1946, జూన్ 18వ తేదీన రామ్ మనోహర్ లోహియా ఏకంగా తన అనారోగ్యాన్నీ లెక్క చేయకుండా వర్షం కురుస్తున్నప్పుడు ఓ బహిరంగసభలో పోర్చుగీస్ పాలకులకు వ్యతిరేకంగా గళం విప్పాడు. దాంతో ఆయన్ను మర్గావ్ జైల్లో వేశారు. దాన్ని ఖండిస్తూ హరిజన్ వార్తాపత్రికలో మహాత్మాగాంధీ ఓ ఆర్టికల్ రాశారు. దాంతో పోర్చుగీసువారు లోహియాను గోవా సరిహద్దుల్లో వదిలేసి.. ఐదేళ్లపాటు ఆయన గోవాలోకి రాకుండా నిషేధం విధించారు. ఏదైతైనేం.. లోహియా గోవాలో స్వాతంత్ర్య కాంక్ష రగిల్చారు. దాంతో అక్కడి క్యాథలిక్ క్రిస్టియన్స్, హిందువులంతా ఒకటయ్యారు.

లోహియా స్ఫూర్తితో ఆ తర్వాత ఆజాద్ గోమంతక్ దళ్ ఏర్పాటైంది. విశ్వనాథ్ లవాండే, దత్తాత్రేయ దేశ్ పాండే, నారాయణ్ హరినాయక్, ప్రభాకర్ సినారి వంటివారితో ఆ విప్లవ దళం ఏర్పాటైంది. ఆ ఉద్యమంలో పాల్గొన్న పలువురిని పోర్చుగీస్ పాలకులు జైళ్లల్లో పెట్టారు. కొందరు ముఖ్యులను ఆఫ్రికా జైళ్లకు తరలించారు.

అలా స్ఫూర్తి పొందినవారిలో మధు దండావతే వంటివారినీ స్ఫురణకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గోవా విముక్తికి ప్రధాన కారకుల్లో మధు దండావతే పేరు కూడా ఉంటుంది. పోర్చుగీస్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేక పోరాటంలో.. కేవలం 93 మందితో కూడిన నాటి బృందానికి గోవా విమోచన్ సమితి నాయకుడిగా దండావతే ప్రదర్శించిన చొరవ ఆయన ఉద్యమ రాజకీయ జీవితంలో ఓ మైల్ స్టోన్. నహీ నహీ కభీ నహీ భారత్ గోవా అలగ్ నహీ.. లాఠీ, గోళీ ఖాయేంగే, ఫిర్బీ గోవా జాయేంగే అంటూ దండావతే చేసిన నినాదాలు నాటి ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి.

అన్ని పోరాటాల తర్వాతగానీ.. గోవా భారతదేశంలో అంతర్భాగమై స్వతంత్ర్యాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1987, మే 30న గోవాకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా దక్కింది. అందుకే, ప్రతీ మే 30 గోవా వ్యవస్థాపక దినాన్ని కూడా జరుపుకుంటుంటారు.

1961 డిసెంబర్ 19వ తేదీన పోర్చుగీసు నుంచి గోవాకు విముక్తి లభించి.. భారతదేశంలో అంతర్భాగమైంది. అలా గోవా విషయంలో అటు మొఘలులుగానీ, ఇటు బ్రిటీష్ వారుగానీ కన్నెత్తి కూడా చూడని స్థాయిలో పోర్చుగీసువారి ఆధిపత్యం వారిని మించి కొనసాగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles