మనదేశంలో సినిమా, క్రికెట్, పాలిటిక్స్… వీటికున్న క్రేజ్ మరో రంగానికి కనిపించదు. అలా కనిపించకపోవడంపై ఎవరి అభిప్రాయాలెలా ఉన్నా… అవే ఎక్కువ ప్రమోటవుతున్నాయనే వాదన, బాధా ఎవరికైనా ఉన్నా… అదిప్పట్లో అంత త్వరగా మారిపోని నిజం. అందుకే, అభిమానం వెర్రితలలు వేస్తూనే ఉంటుంది. అలాంటి అభిమానుల నుంచి ఇద్దరు బాలీవుడ్ హీరోలకు ఎదురైన అనుభవాలు.. అందుకోసం, వారు స్పందించిన తీరు కాస్త ఆసక్తికరం.

90ల్లో తీవ్రవాదులతో సంబంధాలు, ఏకే 56 రైఫిల్, 9 ఎంఎం పిస్టల్ వంటివి కల్గి ఉండటంతో టాడా కింద అరెస్టైన ఖల్ నాయక్… సాజన్, సడక్, మన్నాభాయి ఎంబీబీఎస్, మున్నాభాయ్ లగేరహో వంటి సినిమాలతో బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందిన కథానాయకుడు.. ప్రముఖ బాలీవుడ్ వెటరన్ హీరో హీరోయిన్స్ సునీల్ దత్, నర్గీస్ కుమారుడు.. సంజయ్ దత్ ది బాలీవుడ్ లో ఓ ప్రత్యేక స్థానం. తనపై అలిగేషన్స్ ఎలా ఉన్నా.. తనంటే అభిమానించేవారికీ కొదవలేదు. అలాంటి అభిమాని కథే ఇది. ఆ ఘటనపై సంజయ్ దత్ స్పందనేంటో కూడా ఈ కథ చెబుతోంది.
2018లో బాలీవుడ్ లో ఒక స్టోరీ బాగా వైరలైంది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఓ 62 ఏళ్ల మహిళ.. తను చనిపోయిన తర్వాత తన యావదాస్తినీ బాలీవుడ్ స్టార్, తన అభిమాన హీరో అయిన సంజయ్ దత్ కు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు ఓ లేఖ రాసింది. ముందు ఈ వార్త ఫేక్ అనే ప్రచారం జరిగినా.. అది నిజమేనని స్వయానా సంజయ్ దత్తే తేల్చిచెప్పేశాడు.
నిషాపాఠిలో అనే ఓ అభిమాని తన ఆరోగ్యం బాగాలేదని.. ఇక ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ లేదని తెలుసుకుని వీలునామా లాంటి ఓ లేఖను తన ఖాతాలున్న బ్యాంకుకు రాసింది. తను చనిపోయాక తన పేరిట ఉన్న 72 కోట్ల రూపాయలను హీరో సంజయ్ దత్ కు అప్పగించాలన్నది ఆ లేఖ సారాంశం. ఇది ఆ మధ్య ఫేక్ అనే ప్రచారం జరిగినా కర్లీ టేల్స్ అనే ఓ డిజిటల్ ఛానల్ తో జరిపిన ఇంటర్వ్యూలో సంజయ్ దత్ నిజమేనని ధృవీకరించాడు.
సదరు రిపోర్టర్.. మరి ఆ డబ్బంతా ఏం చేశారనీ సంజయ్ దత్ ని అడిగాడు. నిషాపాఠిల్ కుటుంబానికే తాను ఆ ఆస్తిని తిరిగి ఇచ్చేనాని చెప్పాడు సంజయ్ దత్. ఇక్కడ ఒక బాలీవుడ్ హీరోను అమితంగా ఆరాధించిన ఓ వ్యక్తి వీరాభిమానం కనిపిస్తే… ఆ ఆస్తిని తన పేరిట చేసింది కదా అనే సొంతం చేసుకోకుండా.. తిరిగి వాళ్ల కుటుంబీకులెవరో తెలుసుకుని ఇచ్చేయడం సంజయ్ దత్ గొప్పదనం.
ఇక ఇలాంటి మరో భిన్నమైన ఘటనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూ ఎదురైంది. ఓరోజు షారుక్ విల్లా మన్నత్ లోకి అక్కడున్న సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని ఎంట్రీ అయ్యాడు. వచ్చిన ఆ అభిమాని ఏకంగా షారుక్ ఖాన్ స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఈత కొడుతున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఏయ్ నువ్వెవరని నిలదీస్తే.. తనకేమీ వద్దని.. జస్ట్ షారూక్ ఖాన్ స్నానం చేసే స్విమ్మింగ్ పూల్ లో తానూ స్నానం చేస్తే చాలని చెప్పుకొచ్చాడు. సెక్యూరిటీ హడావిడితో అక్కడికెళ్లిన షారుక్ కు ఆ అభిమాని వింత కోరిక.. సరదాగా, కాస్త వినోదంగానూ అనిపించిందట. అతణ్ని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకున్నాని.. స్విమ్మింగ్ పూల్ లో స్నానం మినహా.. కనీసం ఆటోగ్రాఫ్ గానీ, ఫోటోగ్రాఫ్ గానీ ఏవీ అభిమాని కోరుకోలేదని షారుక్ కూడా ఒకనొక సందర్భంలో తన అభిమాని కథ చెప్పుకొచ్చాడు.

ఇలాంటి కథలను మనం సినిమాల్లోనే కాదు… క్రికెట్ లోనూ గమనించవచ్చు. ఏకంగా స్టార్ క్రికెటర్స్ ఆడుతున్నప్పుడు వాళ్ల డిమాండ్స్ కోసమో, క్రేజ్ తోనో న్యూడ్ గా మైదానాల్లోకి వెళ్లే అభిమానులనూ గమనించవచ్చు. అలాంటి అనుభవం ఇంగ్లాండ్ తో మ్యాచులో గవాస్కర్, శ్రీకాంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. బ్రింగ్ బ్యాక్ బోథమ్ అంటూ ఓ మహిళ ప్లకార్డులో మైదానంలోకి దూసుకొచ్చింది. అంతెందుకు 103 ఏళ్ల వయస్సులోనూ ధోనీ ఆడుతున్నాడంటే చాలు ఐపీఎల్ జెర్సీ వేసుకుని గ్రౌండ్లో వాలిపోయే చెన్నైకి చెందిన రాందాస్ కథైనా… వివ్ రిచర్డ్స్ ఆటకు ఫిదా అయిన నీనాగుప్తా స్టోరీ అయినా.. అభిమానుల మనస్తత్వాలను పట్టిచూపేవి.



