ప్రస్తుత తరం డిజిటల్ యుగాన్ని అరచేతుల్లో చూస్తే… 70-80ల నాటి తరం రేడియోతో ఒక స్వర్ణయుగాన్నే చూసింది. ఈనాటికీ కొందరికి ఆ పురా జ్ఞాపకాలే రీఛార్జ్ . ఇవాళ బ్లూ టూత్ కనెక్టివిటీతో రెండు ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఎవరికిష్టమైన పాట వారు వింటుంటే… కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసి, చాలా ఊళ్లల్లో జనాలందరినీ ఒక్కచోటకు తెచ్చిన ఘనత నాటి రేడియోది. ఒక సామాజిక చర్చకు తెరలేపిన వైభవం నాటి ట్రాన్సిస్టర్లది. అలాంటి స్వర్ణయుగంలో సరిహద్దులు దాటి మన ఇళ్లల్లోకి వచ్చి పలకరించిన రేడియో స్టేషన్ సిలోన్. ఆ సిలోన్ రేడియోకు ఆత్మలా కోట్ల మందిని అలరించిన స్వరం పేరు మీనాక్షీ పొన్నుదురై.

నాటి భారతంలో ఆల్ ఇండియా రేడియో ఉన్నప్పటికీ.. సినిమా పాటల ప్రసారం విషయంలో కొన్ని కఠినతరమైన నిబంధనలతో పాటు, నాటి ఏఐఆర్ దగ్గరున్న టెక్నాలజీ అనుకున్న స్థాయిలో ట్రాన్స్ మిట్ చేయలేకపోయింది. ఆ ఖాళీని సిలోన్ పూరించింది. అదే ఆ తర్వాత శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్. శక్తివంతమైన ట్రాన్స్ మీటర్ల సాయంతో సిలోన్ ప్రసారాలు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలకు కాస్త వినీ విననట్టుగానే వినిపించేవి. సిలోన్ ట్యూనింగ్ కే సమయం పట్టేది. కానీ, సిలోన్ లో వస్తున్న పాటలపైనున్న క్రేజ్ తో ఎంత సమయమైనా జనం ఓపికతో రేడియో సెట్లను ట్యూన్ చేస్తూ అతుక్కుపోయేవారు. సిలోన్ ప్రసారాలతో తమిళపాటలు అశేషమైన శ్రోతలను సంపాదించుకున్నాయి. మొత్తంగా ఆ సిలోన్ భారతదేశానికి ఓ సాంస్కృతిక విప్లవాన్నే మోసుకొచ్చింది. ఆ విప్లవాన్ని రగిలించిన బ్రాడ్ కాస్టర్స్ లో మహారాణి.. మీనాక్షీ పొన్నుదురై!
మీనాక్షీ స్వరానికెందుకంత డిమాండ్..?
ముక్కూ ముఖం తెలియని వ్యక్తి.. సిలోన్ లో అనౌన్సర్ గా మోగించిన గొంతుతో.. ప్రతీ ఇంటింటికీ చేరింది. ఆ మేజిక్ జనాల్ని మెస్మరైజ్ చేసింది. గాంభీర్యం, మాధుర్యం, స్పష్టత ఆ గళం ప్రత్యేతకతలు. ఆ తర్వాత నాటి నుంచి నేటి వరకు ఎందరు రేడియా జాకీలు వచ్చినా మీనాక్షీ పొన్నుదురై గొంతు విన్నవారెవ్వరూ ఇంకొకర్ని ఒప్పుకోరు. పూలలాంటి మధురమైన పాటలను ఆమె దండ కట్టి… తెనెపలుకుల్లాంటి తన మాటలతో ఇంటింటికీ చేర్చేది. ఆమె మాటలనూ పాటలంత ఆసక్తిగా.. సంగీతంలా ఆలకించే శ్రోతలుండేవారు. మీరు కోరిన గీతం మీ కోసమంటూ ఆమె పలకరింపు ఆత్మీయతను పంచేది. అలా, ఓ రేడియో అనౌన్సర్.. ఇంటింటి కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. ఆమె అనౌన్సర్ గా ఏ కార్యక్రమం చేసినా చాలు.. ఇతర కార్యక్రమాలను పోస్ట్పోస్ చేసుకుని మరీ రేడియోకు చెవులు రిక్కరించేవారు.

తెలుగు నేలనూ ప్రభావితం చేసిన సిలోన్!
సిలోన్ రేడియో ప్రసారాలు తమిళంలో ఉన్నప్పటికీ.. దాని ప్రభావం నాటి తెలుగు నేలపై కూడా ప్రసరించింది. సంగీతానికి భాష అడ్డుకాదంటుంటారు. అందుకే భాష రాకపోయినా.. తమిళం పాటలనూ తెలుగువారు అమితంగా వినేవారు. ఇష్టపడేవారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఈ ప్రభావం నాడు ఆంధ్రప్రదేశ్, మద్రాస్ సరిహద్దుల్లో స్పష్టంగా కనిపించేది. అలా సిలోన్ విపరీతమైన ఆదరణను దక్కించుకుంది. మన తెలుగు సింగర్సైన ఘంటసాల, ఎస్. జానకీ, సుశీల, బాలు వంటివారు పాడిన తమిళపాటలు అలా మనవారినీ చేరేవి. ఆ పాటలతో పాటే.. మీనాక్షీ మాటలూ ఇంటింటికీ సుపరిచితమై నిల్చిపోయాయి.
లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అనే వాక్యాన్ని తన కామెంట్రీలో బాగా వాడేవారు మీనాక్షి పొన్నుదురై.
ఆమె ప్రారంభించిన ఆ మాటల ఒరవడే ఆ తర్వాత ఈరోజు వరకూ మనం వింటున్న వివిధ భారతీ, ఎఫ్ఎం రేడియోలకూ ఒక కొనసాగింపు, ఓ స్ఫూర్తి.
ఆమె వ్యాఖ్యానానికి ముగ్ధులయ్యే అభిమానులతో సిలోన్ స్టేషన్ కు వచ్చే ఉత్తరాలు తక్కువేమీ కాదు. తరచుగా తనను అభిమానిస్తూ రాసే కొందరిని బాగా గుర్తు పెట్టుకుని, వాళ్ల చిరునామాలతో సహా చదివి వినిపించేవారామె. ఒక్కోసారి శ్రోతల నుంచి కావల్సినన్ని లేఖలు రాకపోతే కొంత బాధపడేవారు. అంత బోల్డ్ గా మనసు విప్పేవారు కాబట్టే ఆమెకు శ్రోతలంత దగ్గరయ్యారు.
ఎప్పుడైనా తానొక పాట అనౌన్స్ చేశాక.. తప్పిపోయ్యో.. పాట దొరక్కో.. సాంకేతిక సమస్యతోనో వేరే పాట ప్లే అయితే శ్రోతలు ఎలా ఫీలవుతారోనన్న దిగులు ఆమె మాటల్లో ఏనాడూ కానరాకపోయేది. ఏమైంది ఈమెకు అనుకుంటున్నారా అంటూ ఉల్టా ప్రశ్నిస్తూ వ్యాఖ్యానాన్ని సందర్భానికనుగుణంగా మల్చుకునేవారు. పరుగులాటలో ఒక్కోసారి రికార్డులటూ ఇటు అవ్వడం సహజమేనంటూ ఒకింత బెదిరింపు గంభీర స్వరంతోనే చనువుగా కన్విన్స్ చేసేవారు.
సాంకేతిక విప్లవాలు ఇంకా రోజురోజుకూ మనం ఊహించని విషయాల్ని మన ముందుకు తీసుకురావచ్చు. కానీ, కొన్ని స్వరాలు.. వారు పంచిన మాటలు, పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా తన గొంతుతో ఉర్రూతలూగించిన మధుర వాణే మీనాక్షి పొన్నుదురై.
రేడియో నుంచి నేటి డిజిటల్ యుగం వరకూ మనం ఎన్నో అద్భుతాలను సాధించాం. కానీ, మనిషి ఒంటరితనానికి నేటి యుగం ఓ సాక్షీభూతంగా నిలుస్తోంది. ఆ రోజుల్లో రేడియో వినికిడి ఓ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అలా విన్నదాన్ని ఊహించుకునేందుకు ఆలోచనలకు పదును పెట్టేవారం. కానీ, నేడు అంతా ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ తోనూ, వర్చువల్ ఎఫెక్ట్స్ తోనూ అన్నీ మన కళ్ల ముందుకే వచ్చేస్తున్నాయి. నేటి డిజిటల్ యుగంలో అల్గారిథమ్సే చివరకు మనం కోరిన పాటలను మన ముందుంచుతున్నాయి. ఇంత వడవడిగా అద్భుతాలు సాధిస్తున్నా.. నాటి సామూహిక అనుభవాలు, ఆత్మీయ పలకరింపులు.. వాటికి ఊతమిచ్చిన సిలోన్ రేడియో.. అందులోనూ నాటి నిరాడంబర కాలానికి ప్రతిబింబమైన మీనాక్షీ వంటి స్వరమాధుర్యాలు మాత్రం ఇప్పుడు గత చరిత్రగా మారిన పురాజ్ఞాపకాలు మాత్రమే.



