మహ్మద్ రఫీ వర్సెస్ కిషోర్ కుమార్ ఈ ఇద్దరూ బాలీవుడ్ లెజెండ్ సింగర్స్. ఒక్క బాలీవుడ్ కే పరిమితమైతే మనం మాట్లాడుకోకపోయేవాళ్లం. ప్రపంచం మొత్తం హిందీ సినీగీతాలవైపు ఎందరినో ఆకర్షించిన గళాలవి. కానీ, అలాంటి ఇద్దరు సినీసంగీత యోధుల మధ్య ఒక చిన్న ఈగో సాగింది. ఆ క్రమంలో రఫీ వర్సెస్ కిషోర్ దా మధ్య ఏం జరిగింది..?
రఫీ సుమారు 1940ల్లోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సుమారు 40 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యమన్నట్టుగా 1980లో తాను మరణించేవరకూ తన ప్రియమైన గొంతుతో అలరించాడు.పైగా తనకున్న హిందుస్థానీ సంగీతానుభవం, గజల్స్ గానం వంటివి రఫీకున్న అదనపు హంగులు. దాంతో సినీసంగీతంలో మకుటం లేని మారాజుగా ఒక వెలుగు వెలిగాడు. కానీ, కిషోర్ కుమార్ ఎంట్రీతో అంతటి బాలీవుడ్ సంగీత రారాజులో కూడా గుబులు మొదలైంది.

ఈ విషయాల్ని ఈమధ్య శుభంకర్ మిశ్రా అనే ఓ యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సుధేశ్ భోంస్లే వెల్లడించాడు. బాలీవుడ్ లో కిషోర్ కుమార్ ఎంట్రీ సమయంలో చాలామంది తనకు శాస్త్రీయ సంగీతం తెలీదని కాస్త పక్కనబెట్టేవారు. నౌషాద్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ వంటివారైతే కిషోర్ కుమార్ ను ఎవరైనా పాడిస్తే.. క్లాసికల్ మ్యూజిక్ రానివాడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారన్నట్టుగా గుస్సా కూడా ప్రకటించేవారట.
కానీ, కిషోర్ కుమార్ ఆర్డీ బర్మన్ తో జత కట్టాక శరవేగంగా ఊపందుకున్నాడు. తన పాటలన్నీ చార్ట్ బస్టర్ లలో టాప్ లో నిల్చి అత్యంత ప్రజాదరణ పొందడం మొదలెట్టాయి. ఆ తర్వాత కిషోర్ ను తిట్టిన నోళ్లే ఆ తర్వాత నోళ్లు వెళ్లబెట్టాయి. కిషోర్ దాకు ప్రశంసల జల్లు కురిసింది. అవకాశాలూ అదే స్థాయిలో పెరిగాయి. అదే సమయంలో ఇక రఫీసాబ్ పనైపోయింది.. మూటముల్లె సర్దుకోవడమేనన్న ప్రచారాన్నీ లేవనెత్తారు.
కానీ, కిషోర్ కుమార్ మాత్రం తరచూ అవకాశం వచ్చినప్పుడల్లా రఫీసాబ్ తో పోల్చడాన్ని తప్పుబట్టేవారట. రఫీసాబ్ అంటే తనకు చాలా గౌరవమని ఆయనతో నేనెప్పటికీ తులతూగనంటూ వినమ్రంగా చెప్పుకొచ్చేవాడు. పైగా రఫీసాబ్ పనైపోయిందంటూ తనతో పోలుస్తూ చేసే ప్రచారాన్ని ఆపాలని కోరాడు.
రఫీ నైపుణ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేనప్పటికీ.. సంగీత ధోరణుల్లో వస్తున్న మార్పులు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఓసారి కిషోర్ కుమార్ నటిస్తున్న సినిమాలో ఓ పాట కోసం రఫీని పిల్చాడట కిషోర్ దా కుమారుడు అమిత్ కుమార్. కానీ, రఫీ అందుకు నిరాకరించాడట. ఉతావో ఇస్కో యే దూబ్తా సూరజ్ హై అంటూ తనను తాను అస్తమిస్తున్న సూర్యుడిగా చెప్పుకొచ్చాడట రఫీ. ఇక ఆరాధన తర్వాత రఫీ తనను తనకు తానే పక్కకు జరగడం మొదలెట్టాడట. ఆ సమయంలో రఫీ ఎప్పుడూ లేనివిధంగా గడ్డం పెంచుకుని కనిపించడం కూడా కిషోర్ కుమార్ రాకతో రఫీలో మొదలైన గుబులుగా బయట చర్చ జరిగింది.
మహ్మద్ రఫీ తీవ్ర నిరాశలో ఉన్న సమయమది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్ తో నేను గాయకుడిని కాదంటూ రఫీ కనబర్చిన నైరాశ్యం ఆయన్నూ కదిలించిందట. దాంతో రఫీ తిరిగి మళ్లీ పుంజుకోవడానికి కిషోర్ ను ఆది నుంచీ ఇష్టపడని నౌషాద్ అమితంగా ప్రోత్సహించడం మొదలెట్టాడు. రఫీ అభిమానులైన లక్ష్మీకాంత్ ప్యారేలాల్, దర్శకుడు మన్మోహన్ దేశాయ్ వంటివారు తిరిగి అమర్ అక్బర్ ఆంథోనితో రఫీని పాటల స్టూడియో మెట్లెక్కించారు. ఆ సమయంలోనూ మొదట్లో కాస్త సంకోచించిన రఫీ.. తనను ఇంకా ఎందుకు పిలుస్తున్నారని రావడానికి నిరాసక్తతే కనబర్చాడు. కానీ, మన్మోహన్ దేశాయ్ పట్టుబట్టడంతో పర్దా హై పర్దా పాటతో పాటు, షిర్డీవాలే సాయిబాబా వంటి ఐకానిక్ సాంగ్స్ తో మళ్లీ పునరాగమనం చేశాడు రఫీ.
కొంతకాలంపాటు ఇన్ఫెక్షన్ కారణంగా కూడా రఫీ గొంతు మూగబోయింది. దాంతో అధికారికంగానే ఆయన ఓ చిన్న సెలవు కూడా తీసుకున్నాడు. అదే సమయంలో కిషోర్ దా ప్రభ వెలిగిపోవడంతో ఇక రఫీ గొంతు పోయిందని.. రాబోయే శకమంతా కిషోర్ దేనంటూ ముమ్ముర ప్రచారం రఫీని బాధించింది. 1975లో అమర్ అక్బర్ ఆంథోనితో తిరిగి వచ్చిన రఫీ ఆ తర్వాత అదే కిషోర్ కుమార్ తో పాటు, మరో సమకాలీనుడైన ముఖేష్ తో కలిసి హమ్ కో తుమ్ సే హో గయా హై ప్యార్ లో పాటలను పాడాడు. అలా అంతవరకూ ఒకిన్నిరోజులు మధ్యవర్తుల దుష్ప్రచారాలతో తమ మధ్య నేరుగా ఎలాంటి బేధాభిప్రాయాల్లేకున్నా రఫీ మనసులో ద్వేషాన్ని నింపిన కాలం నుంచీ.. ముగ్గురు బాలీవుడ్ స్టార్ మేల్ సింగర్స్.. మరో ఫీమేల్ సింగరైన లత మంగేష్కర్ తో కలిసి హమ్ కో తుమ్ సే హో గయా హై ప్యార్ తో కలుసుకోవడంతో తుపాన్ చల్లారింది.



