ముంబైకి కూతవేటు దూరంలో.. కానీ, నిత్యం నిఘా నీడలో!

అమ్చీ ముంబై… విభిన్న ప్రాంతాలవారితో, భిన్న సంస్కృతులతో దేశ ఆర్థిక రాజధాని. కానీ, దాని సమీపంలోనే ఓ ప్రాంతం ఇప్పుడు నిత్యం కేంద్ర నిఘా సంస్థల పర్యవేక్షణలో ఉంటోంది. ఎందుకు ఎప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల టార్గెట్ గా మారుతోంది ఆ ప్రాంతం…? యాంటీ టెర్రర్ దాడుల హబ్ గా ఎందుకు పేరు తెచ్చుకుంది…? ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ ప్రాంతమెందుకు సేఫ్..?

సరిగ్గా ముంబై నుంచి 53 కిలోమీటర్ల దూరం.. మహారాష్ట్ర థానే జిల్లా.. బోరివలి పాడ్ఘా అనే సముద్ర తీరం. ఈ ప్రాంతం ఆది నుంచీ సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. కొన్ని దశాబ్దాలుగా కేంద్ర పరిశోధనా, భద్రతా దళాలు ఈ ఏరియాపై ఫోకస్ చేశాయి. ఈ వారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు పలుచోట్ల దాడులు చేసిన క్రమంలో.. ఈ బోరివలి పాడ్ఘాపై కూడా విరుచుకుపడ్డారు.

ఈడీ సుమారు ఏకకాలంలో 40 చోట్ల దాడులు చేస్తే.. అందులో ఈ బోరివలి పాడ్ఘాలో కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం ఇప్పుడు మహారాష్ట్రలో ఐసిస్ కార్యకలాపాలకు ఒక అడ్డాగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పూణే కేంద్రంగా ఉన్న కొందరు నిందితులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు.. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వంటి సంస్థలు కొన్ని కేసులు నమోదు చేశాయి. వాటికి అనుబంధంగా మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఇప్పుడు ఈ బోరివలి పాడ్ఘా మరోసారి చర్చల్లోకొచ్చింది.

అయితే ఈమధ్య జరిగిన దాడులు మాత్రమే కావివి. గత రెండేళ్లల్లో బోరివలి పాడ్ఘాలో వివిధ ప్రాంతాల్లో ఎన్ఐఏ, ఈడీ, ఏటీఎస్, థానే రూరల్ పోలీసులు కలిసి పలుమార్లు జల్లెడ పట్టారు. అసలీ గ్రామాన్ని ఇంతగా నిరంతర పరిశోధనలో ఉంచడానికి గల కారణాలేంటి..?

బోరివలి పాడ్ఘాకు గొప్ప చరిత్ర – కానీ, ఇప్పుడు ఉగ్రవాదుల అడ్డా!

బోరివలి పాడ్ఘాకు గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి శిలాహార వంశంపై చరిత్రలోకి తొంగిచూస్తే కొన్ని కథలు కూడా మనం తెలుసుకోవచ్చు. వారు కన్నడం మాట్లాడే జైన మతస్థులు. అధికారాన్ని వికేంద్రీకరించి పాలన చేసిన మాడల్ వారిది. కొంకణ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో వారి శిల్పకళా నైపుణ్యం, శిలా శాసనాల ఆనవాళ్లున్నాయి. అయితే, 12వ శతాబ్దంలో బోరవలి పాడ్ఘాకు అరబ్ వ్యాపారులు రావడం మొదలెట్టారు. వారి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతమంతా సాధారణంగా వారి కమ్యూనిటీ పెరగడంతో ముస్లిం భూస్వాములకు కేరాఫ్ గా మారింది. కలప వ్యాపారులకు ఆర్థికంగా బలమైన గ్రామంగా కూడా ఈ బోరివలి పాడ్ఘాకు పేరు. 2011 జనగణన ప్రకారమే 5 వేల 780 మంది జనాభాలో ఇక్కడ 83 శాతం ముస్లిం కమ్యూనిటీనే. ఇప్పుడా జనాభా ఇంకా పెద్ద మొత్తంలో పెరగడంతో కూడా ఇక్కడ కార్యకలాపాలపై అనుమానపు నీడలు అంతకంతకూ ముసురుకున్నాయి.

స్వదేశీ ఉద్యమం వంటి పలు రాజకీయ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్న చరిత్ర ఉన్న గ్రామం బోరివలి పాడ్ఘాది. కానీ, ఆ తర్వాత ఇక్కడ వామపక్ష ఉద్యమాలు, ఇస్లామిక్ విద్యార్థీ రాజకీయాలతో పాటు.. రాను రాను సిమి వంటి సంస్థల కార్యకలాపాలూ పెరిగిపోయాయి. నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ చాలా చురుకుగా పనిచేసేదని.. దేశవ్యాప్త కార్యకలాపాలకు బోరివలి పాడ్ఘాను ఓ హబ్ గా తయారు చేసినట్టు నిఘా వర్గాల పరిశోధనలో తేల్చాయి.

ముంబై సీరియల్ బ్లాస్ట్స్ తో సంబంధం!

2002-03లో ముంబైలో జరిగిన సీరియల్ బ్లాస్ట్స్ కేసుతో ఈ బోరివలి పాడ్ఘా సంబంధాలు బట్టబయలు కావడంతో ఈ గ్రామంపై నిఘా వర్గాల ఫోకస్ మరింత పెరిగింది. దాంతో ఇది ఓ ఫోకల్ పాయింట్ గా మారిపోయింది. ఐదుగురు గ్రామస్థులు ఆ బ్లాస్టింగ్స్ లో ఆరోపణలెదుర్కోవడంతో… ఈ గ్రామం పేరు ముమ్మురంగా ప్రచారంలోకొచ్చింది. సాకిబ్ నచాన్ అనే సిమీ మాజీ జనరల్ సెక్రటరీతో పాటు.. మరికొందరు అక్రమాయుధాల కేసుల్లో దోషులుగా కూడా తేలారు. ఇంకొందరు తీవ్రవాద ఆరోపణలెదుర్కొన్నప్పటికీ.. ఆ కేసుల నుంచి విముక్తులయ్యారు. అయినప్పటికీ ఈ బోరివలి పాడ్ఘాపై అతివాద అనుబంధ గ్రామంగా ఒక ముద్ర పడిపోయింది.

ఎవరీ సాకిబ్ నచాన్..?

సాకిబ్ నచాన్ ఈ మధ్యే జ్యుడీషియల్ కస్టలో ఉంటూ జైల్లోనే మరణించాడు. కానీ ఆయన నీడ మాత్రం ఇంకా భయపెడుతూనే ఉంది. బోరివలి పాడ్ఘా కథను సాకిబ్ నచాన్ పేరు లేకుండా చెప్పుకోలేం. మంచి పేరు గల కుటుంబంలో పుట్టిన సాకిబ్ ఆ తర్వాత.. సిమీలో కీలక స్థాయికెదిగాడు. మెల్లిగా పాకిస్థాన్- ఆప్ఘనిస్తాన్ మిలిటెంట్ గ్రూపులతో కలిసి సంబంధాలనేర్పర్చుకున్నట్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శోధనలో తేలింది.

1992లో సాకిబ్ నచాన్ పై సీబీఐ పేలుడు పదార్థాల శిక్షణనివ్వడంలోనూ, ఐఎస్ఐ కు మద్దతుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న అభియోగాలతోనూ కేసులు నమోదు చేసింది. 2001లో సాకిబ్ తన గ్రామం బోరివెలి పాడ్ఘాకు తిరిగి వచ్చాడు. 2002-03 బాంబు పేలుళ్ల తర్వాత మళ్లీ అరెస్టయ్యాడు. 2017లో విడుదలయ్యాక… 2023 వరకూ కూడా ఒకింత ప్రశాంతంగానే సాకిబ్ జీవితం సాగింది. 2023లో ఎన్ఐఏ దృష్టి సారించిన ఐసిస్ నెట్వర్క్ దర్యాప్తులో భాగంగా సాకిబ్ పేరు వినిపించడంతో అతడు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. అప్పట్నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సాకిబ్ ఈ ఏడే ఢిల్లీలో మరణించాడు.

లిబరేటెడ్ జోన్ గా బోరివలి పాడ్ఘాకు పేరు – అందుకే కట్టుదిట్టమైన పర్యవేక్షణ!

2023లో సాకిబ్ అరెస్ట్ తో మళ్లీ బోరిలి పాడ్ఘా వార్తల్లోకెక్కింది. జాతీయ భద్రతా సంస్థలు నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి. పూణేలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐసిస్ స్లీపర్ సెల్స్ తో సంబంధాలు కల్గి ఉన్నాడని.. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ తయారీ, వాటి అక్రమరవాణాలో కీలక పాత్రధారి అని ఎన్ఐఏ గుర్తించింది.

భయంకరమైన ఆరోపణేంటంటే…?

ఐసిస్ తో సంబంధాలు పెట్టుకున్న సాకిబ్ ముఠా బోరివలి పాడ్ఘాను లిబరేటెడ్ జోన్ గా మార్చే కుట్రకు తెరలేపిందన్నది ఓ సంచలనమైన ఆరోపణ. అక్కడి నుంచే మహారాష్ట్రతో పాటు, దేశం మొత్తం దాడులకు ప్లాన్ చేస్తోందని విచారణ సంస్థలు పేర్కొన్నాయి. సిమి కాలం నాటి సిద్ధాంతాలు, నెట్వర్క్ ఇంకా పూర్తిగా కనుమరుగైపోలేదన్నది ఇప్పటికీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానం. గతంలో సిమీ కేసుల నుంచి మొదలుకుంటే తాజాగా ఐసిస్ కేసుల విషయం వరకూ బోరివలి పాడ్ఘా గ్రామస్థుల పేర్లు ఆయా కేసుల్లో వినిపిస్తుండటంతో.. కేంద్ర భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని కీన్ గా పర్యవేక్షిస్తున్నాయి.

రోజూ ఇక్కడ పోలీసుల పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు సర్వసాధారణం. ఎప్పుడైనా ఏ దాడైనా జరుగొచ్చన్న ఒక ఆందోళనకరమైన భావన కూడా ఈ గ్రామంలో ఇప్పుడు నెలకొందనేది అక్కడి కొందరు స్థానికులు చెప్పే మాట. దీంతో మొత్తంగా ఇప్పుడు బోరివలి పాడ్ఘా తీర ప్రాంతం హై సెక్యూరిటీ జోన్ గా వార్తల్లోకెక్కుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles