భారత్ లో రాచరిక వ్యవస్థ పోయి.. ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుని దశాబ్దాలు గడుస్తున్నా… కొన్నిచోట్ల మాత్రం కొన్ని రచరిక వంశాలు అదే వైభవంతో తులతూగుతున్నాయి. అలాంటి కొన్ని రాజవంశాలు, రాచరిక వైభవ ప్రసాదాలెక్కడెక్కడ ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి.
భారత్ లో ప్రస్తుతం ఏడు రాజరిక వంశాలు ఇంకా ఆ వైభవంతోనే దర్పాన్ని నిలబెట్టుకుంటున్నాయి. మేవార్, గ్వాలియర్, బరోడా, మైసూర్, జైపూర్, బికనేర్, ట్రావెన్ కోర్ ఇలా దక్షిణాదిన కేరళ నుంచి ఉత్తరాదిన రాజస్థాన్ వరకూ అలాంటి రాజప్రసాదాల కథ కచ్చితంగా భిన్నమైనదీ, మరింత ఆసక్తికరమైనది.

1971లోనే భారత్ అధికారికంగా రాజరిక పదవులను పూర్తిగా రద్దు చేసింది. కానీ, అక్కడితో కథనైతే ముగియలేదు. రాజస్థాన్ ఎడారుల నుంచి కేరళ కొబ్బరి తోటల వరకూ మహల్ లు… దక్కన్ పీఠభూమిపై విస్తరించిన ఇంపీరియల్ స్టైల్ రాజ ప్రసాదాలు పర్యాటకులను పలకరిస్తూనే ఉన్నాయి. పూర్వీకులు విడిచివెళ్లిన ఆ తీపి గుర్తుల్లోనే ఇంకా కొందరు జీవిస్తున్నారు. వాటిని హోటల్స్ గా, ప్యాలెసులుగా, పర్యాటక క్షేత్రాలుగా మల్చి.. మరోవైపు ఆ రాజ ప్రసాదాల్లోనే నివశిస్తున్నవారూ ఉన్నారు. అదే సమయంలో తమ పూర్వీకుల చారిత్రక కళాసంపద, వాస్తుశిల్పం, సాంస్కృతిక పురా జ్ఞాపకాలను కాపాడే యత్నం చేస్తున్నారు.
ఇప్పటికీ మేవార్, గ్వాలియర్, బరోడా, మైసూర్, జైపూర్, బికనేర్, ట్రావెన్ కోర్ వంశాలకు సంబంధించిన వారసత్వ సంపద నాటి చరిత్రను మ్యూజియాలుగా, అందమైన హోటళ్లుగా, వ్యక్తిగత నివాసాలుగా ఎందరో పర్యాటకులకు సజీవంగదా కళ్ల ముందుంచుతోంది. ఆయా రాజవంశాలకు చెందిన వారసుల్లో ఇప్పుడు పలువురు రాజకీయ నాయకులు, పోలో క్రీడాకారులు, రెస్టారెంట్స్, హాస్పిటాలిటీని అందించే యజమానులు, ఆయా రాజప్రసాదాల సంరక్షకులుగా నేటి సోషల్ మీడియాలోనూ ఆధునిక రాయల్ చిహ్నాలుగా నిలుస్తున్నారు. అయితే ఆ మెరుగుల వెనుక గత కాలపు చరిత్ర మనల్ని పలకరిస్తూ ఉంటుంది.
మేవార్…
దక్షిణ రాజస్థాన్ లోని మేవార్ రాజ ప్రసాదానిది 14 వందల ఏళ్ల చరిత్ర. సరస్సులు, కోటలతో తులతూగుతూ ఇక్కడి రాజభవనం ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతి ప్రాచీన రాజవంశాల్లో ఒకటి మేవార్ రాజవంశం. బప్ప రావళి కాలం వరకూ కూడా 14 వందల ఏళ్ల చరిత్ర కల్గి ఉంది ఈ రాజస్థానం. రెండో రాజు ఉదయ్ సింగ్ 1550ల్లో నిర్మాణం ప్రారంభించిన ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ చూడతరం కాదన్నట్టుగా మనల్ని రారమ్మని పిలుస్తుంటుంది. ఇక్కడి పిచోలా లేక్ మనల్ని కళ్లు తిప్పుకోనివ్వని ప్రకృతి సౌందరాన్ని కళ్లకు కడుతుంది. అద్దాల మంటపాలు, శిల్పకళా నైపుణ్యం, ఆయుధ గ్యాలరీలు.. మహారాణా ప్రతాప్ వంటి యోధులు తొక్కిన ప్రతీ మెట్టూ మనల్ని ఇక్కడ పలకరిస్తూ మేవార్ రాజవంశం చారిత్రక గొప్పతనాన్ని చెబుతుంటాయి.
ప్రస్తుతం అరివింద్ సింగ్ మేవార్ ఈ ప్యాలెస్ ను కల్చరల్ హాస్పిటాలిటీ సెంటర్ గా మార్చేశారు. పిచోలా సరస్సు పక్కనే ఉన్న ఫతే ప్రకాశ్, శివ్ నివాస్ వంటి ప్యాలెస్ లను హెరిటేజ్ హోటళ్లుగా తీర్చిదిద్దారు. మహారాణా ఆఫ్ మేవార్ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. గతకాలపు స్క్రిప్ట్ రైటింగ్స్, కుడ్య చిత్రాలు, యుద్ధ కవచాలు, నాటి రాజవంశీకులు ధరించిన వస్త్రాలతో ఈ మేవార్ ప్యాలెస్ చూపు తిప్పుకోనివ్వదు. ప్రస్తుతం అరవింద్ సింగ్ కుమారుడైన లక్ష్యరాజ్ సింగ్ మేవార్ వారసత్వానికి కాపలాదారుగా ఉన్నాడు. దెబ్బ తిన్న శిల్పకళను పునర్నిర్మాణాలు చేస్తూ.. పర్యాటకం, సామాజిక కార్యక్రమాల్లో నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం పర్యాటకులకు మాత్రమే పరిమితమైంది కాదు.. ఇంకా లక్ష్యరాజ్ సింగ్ కుటుంబం ఈ ప్యాలెస్ లోనే నివశించడమేదైతే ఉందో.. పరిరక్షణతో పాటు, రాజరిక ప్రసాదాల చరిత్ర ఇంకా సజీవంగా ఉన్నదనడానికి ఓ సంకేతం.
గ్వాలియర్…
గ్వాలియర్ అంటే గుర్తుకొచ్చేది సింధియాలు. సింధియా వంశం యుద్ధం, రాజకీయం ఈ రెండింటి మిళితంగా శక్తివంతమైంది. అయితే, వీరి వారసత్వానికి ప్రతీకగా జై విలాస్ ప్యాలెస్ మహల్ మనల్ని పలకరిస్తుంది. పైకప్పుపైన ఏనుగులు నడవడం చూడాలంటే… గ్వాలియర్ జై విలాస్ ప్యాలెస్ కు వెళ్లాలి. అక్కడి క్రిస్టల్ షాండ్లియర్స్ ఆ ప్యాలెస్ కు మెరుపులద్దే మరో అదనపు ఆకర్షణ. 1874లో నిర్మించిన ఆ ప్యాలెస్ పూర్తిగా యూరోపియన్ శైలితో పాటు… ఇటాలియన్, టస్కన్, కొరింథియన్ శిల్పకళలతో పాటు…మరాఠా వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఒక మిశ్రమ వాస్తు కళాఖండలా మెరుస్తుంది.

ఇక్కడి దర్బార్ హాల్ భారతదేశంలోనే పేరెన్నికగన్న ఓ నిర్మాణం. మూడు టన్నుల బరువున్న రెండు భారీ షాండ్లియర్స్ వేలాడుతూ ఉండటానికి.. పైకప్పును అంత బలంగా నిర్మించారు. అవి అంత బలంగా ఉన్నాయా, లేదా పరీక్షించేందుకు నాటి ఇంజనీర్లు పైకప్పుపై ఏనుగులతో నడిపించి టెస్ట్ చేయించారట.
ఇక్కడి జియాజీరావ్ సింధియా మ్యూజియం చూపరులను ఆకట్టుకునేది. ఇక్కడే ఈ సింధియా కుటుంబీకులు మరో పక్కన ప్యాలెస్ లో ఇప్పటికీ నివశిస్తుండటంతో ఈ ప్రాంతం నివశిత ప్రాంతంగానూ, పర్యాటక ప్రాంతంగానూ ఉంది. ప్రస్తుత ఈ కుటుంబ పెద్దగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాదే ప్రధాన బాధ్యత. ఇక్కడ దసరా సమయంలో జరిగే యుద్ధస్మృతి, శమీపూజ వంటివి ప్రత్యేకం.
బరోడా…
గైక్వాడ్ల ఆస్థానం ఇది. భారతదేశంలోనే అతిపెద్ద వ్యక్తిగత నివాసంగా కూడా రికార్డుకెక్కిన రాజప్రసాదం ఈ భవనం.
1890ల కాలంలో లక్ష్మీవిలాస్ ప్యాలెస్ ను నిర్మించారు. ఇప్పటికీ కూడా బరోడాలోని ఈ ప్యాలెస్ బకింగ్ హమ్ ప్యాలెస్ కంటే నాల్గు రెట్లు పెద్దదని చెబుతుంటారు. స్టెయిన్డ్ గ్లాస్ ఆర్ట్ వర్క్, అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ , ఓపేరా హౌజ్ స్టైల్ లో దర్బార్ హాల్ ఇవన్నీ బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ప్రత్యేకతలు.
ఇక్కడి నుంచి పాలన నడిపించిన మూడో రాజైన శాయాజీరావ్ గైక్వాడ్ ఆధునిక ప్రగతిశీలవాది. ఇక్కడి చుట్టుపక్కల ప్రజలకు ఉచిత విద్య, రైల్వే ప్రయాణ సౌకర్యం, మహిళల పట్ల వివక్షకు తావులేని సంస్కరణలతో పేరు పొందారు. భారతీయ ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మకు ప్రోత్సాహం అందించాడు. ఈ ప్యాలెస్ కు సంబంధించి వారసత్వ వివాదాలు వార్తల్లోకెక్కాయి. దశాబ్దాల పాటు ఆ వివాదాలు కొనసాగినా.. ప్రస్తుతం సమర్జిత్ సింగ్ గైక్వాడ్ రాధికా రాజే కుటుంబం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లోని ప్రధాన నివాసంలో జీవిస్తున్నారు. ఈ ప్యాలెస్ వద్ద గోల్ఫ్ కోర్సులు, మ్యూజియాలతో ఇక్కడి రాజసంపద ఇప్పుడు వ్యాపార, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతున్నది.

మైసూర్…
ఇదో వెలుగుల రాజప్రసాదం. దసరా వచ్చిదంటే చాలు సరదాకు ప్రతీకలా కనిపించే రాజభవనం. భారతదేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన రాజభవనంగా కూడా మైసూర్ ప్యాలెస్ కు పేరు. 1900 సంవత్సరంలో ఈ రాజభవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కొంత పునర్నిర్మాణం చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నవరాత్రుల్లో లక్ష బల్బుల వెలుగులతో దేదీప్యమానంగా కనిపిస్తుంది.
వాడేయార్ రాజ కుటుంబీకులు ఇప్పటికీ ఈ మహల్ లోనే నివశిస్తున్నారు. ప్రస్తుతం యధ్వీర్ వాడేయర్ ఇక్కడి బాధ్యతలు చూస్తున్నారు. బెంగళూర్ లో ఉన్న ప్యాలెస్ కూడా ఈ కుటుంబానికి చెందిన ఆస్తే. కానీ, దాని చుట్టూ కొన్ని న్యాయ, చట్టపరమైన పోరాటాలు నడుస్తున్నాయి. రాజవంశాల మధ్య కూడా వారసత్వాల గొడవ ఎంత సంక్లిష్ఠంగా కొనసాగుతాయో బెంగళూర్ ప్యాలెస్ వివాదం చెబుతుంది.
జైపూర్…
జైపూర్ సిటీ ప్యాలెస్.. ఇప్పటికీ లివింగ్ ప్యాలెసే. ఇక్కడ పర్వదినాల్లో కళ్లు చెదిరేలా వేడుకల నిర్వహణ ఉంటుంది. ప్రదర్శనలు, టూరిజంతో పాటు.. ఇక్కడి చంద్ర మహల్‌లో రాజ కుటుంబం ఇప్పటికీ నివసిస్తోంది. మిగతా భాగం మాత్రం మ్యూజియంగానూ, ఈవెంట్స్ స్పేస్‌గానూ నడిపిస్తున్నారు.
రాణీ పద్మినీ దేవి, రాజకీయ నేత దియా కుమారి, పోలో క్రీడాకారుడు, ఫ్యాషన్ ఐకాన్ అయిన పద్మనాభ్ సింగ్.. ఇలా ఈ ముగ్గురూ కలిసి మూడు తరాల జైపూర్ రాజవంశాన్ని ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్నారు. ఇక్కడి రాంబాగ్ ప్యాలెస్ భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ ప్యాలెస్ హోటళ్లలో ఒకటి. ఇక్కడి రాజవంశపు ఆభరణాలు, ఫోటోలు, తోటలు నాటి గతకాలపు పురాతన చరిత్రను గుర్తు చేస్తాయి. సోషల్ మీడియా స్టార్‌లుగా కూడా మారిన ఆధునిక రాజవంశీకులు వీరు.
బికనేర్…
ఎర్ర రాళ్ల కళాఖండాలంటే గుర్తొచ్చే పేరు బికనేర్. భారతదేశంలోని అతి పెద్ద ప్రైవేట్ లైబ్రరీల్లో ఒకటి ఇక్కడి ప్యాలెస్ లోనే కొలువై ఉంది. జునాగఢ్ కోటతో ప్రారంభమైన బికనేర్ వారసత్వం.. 1992లో నిర్మించిన లాల్ గఢ్ ప్యాలెస్ తో కొత్త దశలోకి అడుగిడింది. పూర్తిగా ఎర్ర రాయితో ఇండో-సరసేనిక్ శైలిలో.. పొడవైన కారిడార్లు ఈ మహల్ కు వన్నె తెచ్చాయి.
ఇప్పుడీ మహల్ ను మూడు భాగాలుగా విభజించారు. ఒకటి హోటల్ గా, ఇంకోటి మ్యూజియంగా, మరొకటి నాటి రాజవంశపు వారసుల నివాస స్థలంగా మార్చేశారు. ఇక్కడ నెలకొల్పిన గ్రంథాలయం భారతదేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ లైబ్రరీల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇది వెడ్డింగ్ హాట్ స్పాట్ గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ జరిగే పెళ్లిళ్లు నాటి రాజరిక కాలాన్ని గుర్తు చేసేలా డిజైన్ చేస్తారు ఇక్కడి ఈవెంట్ మేనేజర్స్.

ట్రావెన్ కోర్…
దక్షిణాదిలో కేరళ కొబ్బరి తోటల సాక్షిగా అబ్బురపర్చే ఈ రాజస్థానం నాటి రాజరిక వారసత్వం కంటే.. ఆధ్యాత్మిక సంరక్షణనే ఎక్కువ ప్రతిబింబిస్తుంది. 1750లో ఇక్కడి రాజు మార్తాండ వర్మ ఇక్కడి రాజ్యం మొత్తాన్ని పద్మనాభస్వామికి అంకితం చేశాడు. తనను తాను దేవుడికి దాసుడిగా ప్రకటించాడు. దాంతో ఇప్పటికీ ఈ ట్రావెన్ కోర్ రాజస్థానం దేవుడి ఖజానాగానే గుర్తించబడుతోంది.
తిరువనంతపురంలోని కోవడియార్ ప్యాలెస్ అత్యంత రహస్యమైన మహల్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రాజవంశస్థుడైన శ్రీమూలం తిరునాళ్ రామవర్మ నేతృత్వంలో ప్రస్తుతం ఇక్కడి పద్మనాభస్వామి ఆలయ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ నిర్వహణపై నెలకొన్న వివాదంపై సుప్రీం కోర్ట్ కూడా ట్రావెన్ కోర్ సంస్థానాధీశులదే తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత అని గతంలోనే తేల్చి చెప్పింది.
అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగల్లో ఏముందోనన్న క్యూరియాసిటీ ఇప్పటికే పెద్దఎత్తున నెలకొన్న నేపథ్యంలో.. ఇక్కడ బంగారం, రత్నాలు, విలువైన పంచలోహ విగ్రహాలు, ఇంకా ఎన్నో అమూల్యమైన వస్తువులు దాగి ఉన్నాయనే వాదన ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖజానాల్లో ఒకటిగా ఈ ట్రావెన్ కోర్ సంస్థానానికి పేరు. ఇప్పటికీ ఒక్క నేలమాళిగను కూడా ఓపెన్ చేయలేదిక్కడ. ఇక్కడి ధనమంతా రాజకుటుంబానికి కాకుండా.. నాటి రాజు మార్తాండవర్మ ప్రకటనతో దేవుడి సంపదగా మారిపోయింది. ఆయన వంశస్థులు కేవలం ఇక్కడి ట్రస్టులో కీలకపాత్రధారులు, సంరక్షకులు మాత్రమే.
ఇలాంటివి ఇంకా అక్కడక్కడా భారతదేశంలో మనకు కనిపించినా.. ఈ ఏడు మహల్స్ చరిత్ర మాత్రం ఇప్పుడున్నవారికి నాటి రాజుల్లా కిరీటాలు చూపించలేకపోయినప్పటికీ.. ఆ రాయల్టీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
అయితే ఒకనాడు రాజులు, రాణులు మాత్రమే ఈత కొట్టిన కొలనుల్లో.. నేడు సందర్శకులకు కూడా అనుమతి దక్కుతోంది. ఏనుగుల బలం పరీక్షించిన పైకప్పుల కింద దర్బార్ రాజమహల్స్ లో పర్యాటకులు మంచి విందు భోజనం చేసే అవకాశం దక్కుతోంది. నాటి చరిత్ర గతిని మార్చిన గదుల్లో నేటి పర్యాటకులు నిద్రిస్తున్నారు. మొత్తంగా రాజ్యాలు, రాజరికం పోయినా.. వారి వారసత్వం, ఆ వారసత్వ కట్టడాలు ఇంకా మనకు చరిత్రను గుర్తు చేస్తున్నాయి.



