నాడు మర్ఫీ రేడియో అంటే.. నేటి ఐఫోన్ అంత క్రేజ్!

రేడియో & రేడియో సిలోన్ ………

…………………………………………………………………

సుబ్రహ్మణ్యం వల్లూరి… ✍️

21వ శతాబ్దంలో పుట్టినవారు వినడానికే ఆశ్చర్య పోయే విషయం ఇది. వాళ్ల తాతాముత్తాతలకు ఉన్న ఏకైక వినోదం రేడియో , ఆ రేడియో కొనుక్కునే స్థోమత 1950 లలో అతి తక్కువమందికి ఉండేది. ఒకవేళ కొనుక్కుంటే రేడియో వాడడానికి ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు కట్టి వాడుకొనేవారు. ఆ లైసెన్స్ ఫీజు కట్టకపోతే జరిమానా విధించేది ప్రభుత్వం. వార్తలు, నాటకాలు, పాటలు వినడానికి పోస్ట్ ఆఫీసులో కొన్ని ఫారాలు నింపి సంవత్సర రుసుము చెల్లిస్తే ఒక చిన్న పుస్తకం ఇచ్చేవారు.

అన్ని ఫారాలు నింపడం , లైసెన్స్ పొందడం ఒక హోదా ఆ రోజుల్లో. మా ఇంట్లో రేడియో ఉంది అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉండేది. కొనుక్కోలేనివారు నగరాల్లో అయితే దగ్గరలోని పార్క్ వెళ్ళి సాయంకాలం పూట వార్తలు ఇతరత్రా ప్రసారమయ్యే కార్యక్రమాలు విని వొచ్చేవారు. చిన్నఊర్లలో అయితే పంచాయితీ ఆఫీస్ దగ్గర రేడియో వినేవారు. అవికూడా ఎక్కువగా వార్తల ప్రసారానికే ఉపయోగపడేవి.

అప్పట్లో రేడియో ధరలు చాలా ఎక్కువుగా ఉండేవి. ఒక రేడియో ధర మూడువందల రూపాయల పైనే ఉండేది. ఆ రోజుల్లో ఆ డబ్బుకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక ఐదు వందల గజాల ఇంటి స్థలం వొచ్చేది అంటే ఈ కాలం పిల్లలు నమ్మరు.

దశాబ్దాల పాటు రేడియో ఒక్కటే వినోద సాధనం. పొద్దున్న రాత్రి వార్తలు వినడం , ప్రపంచంలో, దేశంలో జరిగే పరిమాణాలు తెలుసుకోవడం వాటిని తరువాతి రోజు వొచ్చే వార్తాపత్రికల వార్తలతో పోల్చుకుని సాయంకాలం నలుగురిని కలిసినప్పుడు చెప్పుకోవడం పెద్ద కాలక్షేపం.

1952 లో భారత దేశ ప్రభుత్వం సినిమా పాటల ప్రసారం నిషేధించింది , అశ్లీలత, పాశ్చాత్య ప్రభావం ఉంటుంది , యువత తప్పు బాట పడుతుంది అన్న ఒక కుంటిసాకు కారణం చెప్పి.

ప్రస్తుతం తాతలు అయిన వారినడిగితే ఆ రోజుల్లో రేడియోలో వొచ్చే చాలా కార్యక్రమాల కన్నా రేడియో సిలోన్ వారం వారం ప్రసారం చేసే బినాకా గీత్ మాల కార్యక్రమం గురించి , ఎంతో మధురంగా , చక్కటి కంఠ స్వరంతో ప్రసంగించే అమీన్ సయాని గారి గురించి మొదట చెప్తారు. ఈ కార్యక్రమం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే , ముప్పైఏళ్ల క్రితం దూరదర్శనంలో రామనంద్ సాగర్ గారి ప్రసారమైన రామాయణ్, ఆ తర్వాత వొచ్చిన మహాభారతంతో పోల్చవచ్చు. కారణం రేడియోలో విశేష స్పందన వొచ్చిన బినాకా గీత్ మాల ప్రసారం వినే వారి గణాంకాలు లేవు కనుక. ఈ బినాకా పాటల కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఆ రోజుల్లో.

మొదట్లో వాల్వ్స్ ఉన్న రేడియోలు వొచ్చేవి, చాలా దశాబ్దాల పాటు అన్ని కంపెనీలు ఇవే తయారు చేసేవి. రేడియో ఆన్ చేసిన తరువాత వాల్వ్స్ వేడెక్కిన తరువాత కానీ రేడియో పనిచేసిది కాదు. 1960లలో రేడియో తయారీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వాల్వ్స్ బదులు ట్రాన్సిస్టర్స్ , మదర్ బోర్డులతో రేడియోల లభ్యత ప్రారంభం అయింది. ఇవన్నీ కూడా కరెంటు తోనే పనిచేసివి. ఆ తరువాత ట్రాన్సిస్టర్ రేడియోలు బ్యాటరీలతో పనిచేసివి అమ్మేవారు. ధరలు బాగా తగ్గి ప్రతి ఇంట్లో రేడియో ఉండడం సామాన్య విషయం అయిపోయింది.

మొదట్లో Grundig, ఫిలిప్స్, నేషనల్-ఎకో లాంటి విదేశీ బ్రాండ్లతోపాటు టాటా వారి Nelco కూడా దొరికేది. రతన్ టాటా గారికి Nelco అప్పచెప్పారు టాటా యాజమాన్యం. నేను 1991/2 లో అనంతపూర్ ఉన్న మా స్నేహితుని రేడియో షాప్ కు Nelco డీలర్ షిప్ తీసుకున్న గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రతన్ టాటా వొచ్చినప్పుడు ఆయన్ను కలవడం జరిగింది.

ఎన్నో బ్రాండ్ల రేడియోలు ఉన్నా ఒక బ్రాండ్ గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మర్ఫీ రేడియో కావాలని ప్రతిఒక్కరి కోరిక. మర్ఫీ రేడియో అంటే నేటి ఐఫోన్ అంత అభిమానం ప్రజలకు అప్పట్లో. ఆ తరువాతి స్థానం ఫిలిప్స్ రేడియో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles