నెహ్రా గురుదక్షిణకు ఫిదా అయిన కోచ్: ఓ పాడ్ కాస్ట్ లో ఓ కామెంటేటర్ వెల్లడి!

ఆశిష్ నెహ్రా.. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్ గురించి అంతా చూసిందే. 2017లో తను రిటైర్మెంట్ అయ్యేవరకూ కూడా సుమారు 13 ఏళ్ల పాటు భారత్ కు ప్రాతినిథ్యం వహించిన బౌలర్. 2003 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ తో కేవలం 23 పరుగులకే 6 వికెట్లు తీసి ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ కు తెరతీశాడు.

అయితే, ఇప్పుడెందుకు ఆశిష్ నెహ్రా గురించి అంటే… ఆయన తన గురువుకిచ్చిన గురుదక్షిణ గురించి ఓసారి చెప్పుకోవాలి కాబట్టి. ఒక గురువుకెందరో శిష్యులుండొచ్చు. అందులో కొందరు అత్యుత్తమ ప్రదర్శనకారులు కావచ్చు. కానీ, గురువును సమయం మీద, అవసరం మీద ఆదుకునే శిష్యులెందరుంటారు..? కానీ, అలాంటి కోవలో వ్యక్తి కాబట్టే క్రికెటర్ ఆశిష్ నెహ్రా గురించి ఓసారి చెప్పుకుంటున్నాం.

తారక్ సిన్హా. ఈయనే ఆశిష్ నెహ్రా కోచ్. ఒక్క ఆశిష్ నెహ్రా ఏంటీ.. 1969లో ఢిల్లీలో సోనెట్ క్లబ్ స్థాపించిన తారక్ సిన్హా కోచింగ్ లో ఒక వీరేంద్ర సెహ్వాగ్, ఒక ఆకాశ్ చోప్రా, మరో శిఖర్ ధావన్, ఇంకో అంజుమ్ చోప్రా, ఓ ఆశిష్ నెహ్రా ఇలా ఎందరో మేటి క్రికెటర్స్ రాటుదేలారు. కానీ, తారక్ సిన్హా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడని తెలిసి.. అదీ తన ఇంటికోసమని తెలిసి ఆశిష్ నెహ్రా ఆ తర్వాత తన మెంటార్ కు ఏకంగా ఓ ఇల్లే కొనిచ్చాడు. పదమ్ జీత్ సెహ్రావత్ అనే కామెంటేటర్ ఓసారి షేర్ చేసుకోవడంతో ఆశిష్ నెహ్రా తన గురుదక్షిణగా కోచ్ తారక్ సిన్హాకు బహుమతిగా ఇచ్చిన ఇంటి విషయం వెలుగులోకొచ్చింది.

రోజూలాగే సోనెట్ క్రికెట్ క్లబ్ లో శిక్షణ పొందుతున్నప్పుడు కోచ్ తారక్ సిన్హా కాస్తా ఆలస్యంగా నెట్స్ కి వచ్చాడు. అప్పుడు నెహ్రా.. కోచైన మీరే ఇంత ఆలస్యంగా వస్తే.. ఇక విద్యార్థులకేం చెబ్తారంటూ తనకున్న చనువుతో కాస్త ఆటపట్టిస్తూ గురువునడిగాడట. నువ్వంటే క్రికెటర్ వీ… బంగ్లాలో నివసించగలవు.. నేను ఓ సాధారణ కోచ్ ని, అద్దె ఇంట్లో నివశిస్తున్నాను… రెండురోజుల్లో ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని మా ఓనర్ ఓ నోటీస్ పంపించాడు.. అందుకే, కొత్త ఇల్లు వెతకడానికి వెళ్లడంతో ఆలస్యమైందని నెహ్రాతో చెప్పాడు కోచ్ తారక్ సిన్హా. ఈ విషయాన్ని ఆ పాడ్ కాస్ట్ లో సెహ్రావత్ వెల్లడించాడు.

ఆ తర్వాత తీవ్ర వర్షంతో ఓ రెండురోజుల పాటు క్లబ్ మూసేశారు. క్రికెట్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా నడవలేదు. మూడోరోజు ఆశిష్ నెహ్రా క్లబ్ కు అంతకుముందు గురువులాగే ఆలస్యంగా వచ్చాడు. సుమారు 3 గంటల ఆలస్యంగా రావడంతో.. తారక్ సిన్హా సేమ్ అంతకుముందు ఆశిష్ నెహ్రా తననెలాగైతే ఆలస్యంగా వచ్చినందుకు ఆటపట్టించాడో, అదేవిధంగా నెహ్రాను ప్రశ్నించాడు. దాంతో అవును.. నేనో కొత్త ఇంటిని కొన్నాను. ఆ ఇల్లు కొనుగోలు చేసి వచ్చేసరికి ఆలస్యమైందని చెప్పి.. కోచ్ తారక్ సిన్హా చేతిలో ఆ ఇంటి తాళంచెవి పెట్టాడు. ఆ ఘటనతో కోచ్ సిన్హా నోట మాట రాలేదు.

2001 నుంచి 2002 వరకు భారత మహిళా జట్టుకు తారక్ సిన్హా ప్రధాన కోచుగా పనిచేశాడు. ఆ తర్వాత 2018లో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డుతోనూ ఆయన్ను సత్కరించింది. సిన్హా 2021లో కన్నముశాడు. ఆయన బోధనలోనే ఆరితేరిన లేటెస్ట్ ట్రెండింగ్ క్రికెటర్ రిషబ్ పంత్. అలాంటి గురువు బాధను విని ఆశిష్ నెహ్రా ఇచ్చిన బహుమతి.. గురుదక్షిణగా నెహ్రాకెంత గుర్తుందో తెలియదుగానీ.. గురువు తారక్ సిన్హా మాత్రం తను బతికనంత కాలం గుర్తుంచుకున్నారట.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles