“లాంగేవాలా బోర్డర్- 7”
………………………………………………………………………………………………..
పూదోట శౌరీలు, టీచర్, ట్రావెలర్…✍️
చరిత్ర పాఠాలు చదివే రోజుల్లో కళింగ, పానిపట్టు, తళ్ళికోట, ప్లాసి యుద్ధమంటూ అనేక యుద్ధాల గురించి.. యుద్దభూముల్లో జయాపజయాలు, జయస్తంభాల గురించి చదివాము. ఆ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం గురించి గూడా విన్నాము. కానీ నేనింతవరకూ ఏ యుద్ధభూమినీ గానీ, ఇండియా – పాకిస్తాన్ సరిహద్దును గానీ చూడలేదు.

నేను బోధన్ దగ్గర రుద్రూరులో టీచర్ గా 4 పాఠశాలల్లో 10 ఏళ్లు పనిచేశాను. ఆరోజుల్లో నా విద్యార్థులు గైని సాయిలు, పోశెట్టి అనే అన్నదమ్ములిద్దరూ BSFలో పనిచేసేవాళ్ళు.
వాళ్ళు ఏడాదికోసారి సెలవులకు ఇంటికి వచ్చేవాళ్ళు. పెద్ద ట్రంకుపెట్టె,హోల్డాలు( బెడ్డు) మిలటరీ డ్రస్ లో ఇంటికి చేరేవాళ్ళు. ఇంటికి వెళ్లి, వెంటనే మా స్కూల్ కి వచ్చేవాళ్ళు. ఇద్దరూ బూట్లు టకటకకలాడించుకుంటూ, మార్చ్ ఫాస్ట్ చేస్తూ వచ్చి, నాకు మిలటరీ సెల్యూట్ చేసేవాళ్ళు. నేను వాళ్లకు ప్రియమైన టీచర్ ని. అది వాళ్ళు నాకిచ్చే గౌరవం.. దానికి నేనెంతో మురిసిపోయేదాన్ని. తరగతిగదిలో పిల్లలందరూ బిత్తరపోయి చూసేవాళ్ళు.

వాళ్ళు ఉన్నన్ని రోజులూ.. రోజూ బడికి వచ్చి, బోర్డర్ లో పనిచేసేటపుడు వాళ్ల అనుభవాలను పిల్లలకు చెప్పమనేదాన్ని. నేనూ ఎంతో ఉత్కంఠతో వినేదాన్ని.
సాయిలు ” లే లడాక్” లో పనిచేసినప్పుడు.. గడ్డ కట్టుకుపోయే మంచులో వారెన్ని భాధలు పడేది, వారానికి ఒకసారి వచ్చే హెలికాప్టర్ కోసం ఆ ఐస్ అంతా ఎత్తిపోసి చదునుచేయటం,హెలికాప్టర్ లో వచ్చే ఆహారపదార్థాలు, మందుల కన్నా, ఇంటి దగ్గర నుండి వచ్చే ఉత్తరాల కోసం తానెంత ఆతృతతో ఎదురుచూసేది చెప్తుంటే నాకు కన్నీరాగలేదు. ఒకే ఒక్కసారి మాత్రమే నేను రాసిన ఉత్తరాన్ని తానెంత పదిలంగా దాచుకున్నదీ చెప్పాడు. ఉద్యోగమే అయినా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, దేశాన్ని కాపాడుతున్న ఆ వీర సైనికులకు మా పిల్లలు లేచి,సెల్యూట్ చేశారు.
నా రాజస్థాన్ యాత్రలో భాగంగా నేను లాంగేవాలా బోర్డర్ చూడటానికి వెళ్ళినపుడు.. ముందుగా నాకు నాప్రియమైన విద్యార్థి సైనికులే నా కళ్లముందు కదలాడారు.
థార్ ఎడారి నుండి 110 కి.మీ దూరంలో వున్న ఇండియా పాకిస్థాన్ బోర్డర్ లాంగేవాలాకి బయలుదేరాము.దారంతా ఎడారి, ఇసుకతిన్నెలే. చిన్న చిన్న పల్లెలుగూడా లేవు. రోడ్డు చాలా బాగుంది.. బారులు తీరి వెళ్తున్న ఒంటెలు, మేకలు, గొర్రెలు అక్కడక్కడ ఆవులు.. వాటిని కాసే మనుషులు.. అంతే. లాంగేవాలా యుద్ధభూమికి వార్ మెమోరియల్ కి చేరుకున్నాము.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం ఈ లాంగేవాలా యుద్ధం. అవి 1971, బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం ,ఇండియా – పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న రోజులు. సైన్యమంతా అక్కడ మోహరించి వుంది. ఈ బోర్డర్ లో కేవలం 120 మంది సైనికులు మాత్రమే వున్నారు.
అప్పుడే పాకిస్థాన్ ఒక ప్లాన్ ప్రకారం.. ఈ బోర్డర్ నుండి రాజస్థాన్ లోకి ప్రవేశించి.. రాజస్థాన్ ను ఆక్రమించి.. అటునుండి పంజాబ్, ఢిల్లీలను గూడా ఆక్రమించాలనుకున్నది.
అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలు,1971, డిసెంబర్ 4 తేదీ. మెల్లిగా మన భూభాగం వైపుకు పాకిస్తాన్ సైన్యం కదులుతూవుంది. వాళ్ళు మొత్తం 3 వేల మంది సైనికులు. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, తుపాకులతో వస్తూ వున్నారు.
అప్పుడు మన లాంగేవాలా బోర్డర్ లోని” మేజర్ కుల్దీప్ సింగ్ చాన్పురి” ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సంకటస్థితి.

120 మంది సైనికులతో పాకిస్థాన్ తో యుద్ధం చేయటమా.? లేదా వెనుదిరగటమా.?
మేజర్ కుల్డీప్ ధైర్యంగా యుద్ధరంగంలోకి అడుగిడటానికే నిర్ణయించాడు. తెల్లవారితేగాని యుద్దవిమానాలు, తగిన వాయుసైన్యం రాని పరిస్థితి. ఆ రోజుల్లో మన యుద్దవిమానాలకు నైట్ విజన్ లేదు. దాదాపు ఆరుగంటలపాటు 120 మంది సైనికులు.. 3 వేల మంది పాకిస్థాన్ సైనికులతో తలపడాల్సిన ఆందోళనకర స్థితి. అయినా మన సైనికులు మేజర్ కుల్దీప్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ముందుకురికారు.
పాకిస్థాన్ సైన్యంలోని లోటుపాట్లు పట్టుకుని.. తగిన సూచనలు ఇస్తూ.. తానే ముందుండి యుద్ధం చేస్తూ.. సైన్యాన్ని ముందుకురికించాడు మేజర్ కుల్దీప్.
ఆరుగంటల సమయం అంటే తెల్లవారే వరకూ.. వాళ్ళు మన భూభాగం మీద అడుగు పెట్టకుండా.. మన సైనికులు తమ ప్రాణాలొడ్డి పోరాడారు.
తెల్లవారేసరికి మన వాయుసైన్యం యుద్దభూమిలోకి అడుగుపెట్టింది. వాటి ధాటికి ఆగలేక పాక్ సైన్యం వెనుదిరిగింది.
ఈ యుద్ధంలో పాకిస్థాన్ 200 మంది సైనికులను,37 యుద్ధ టాంక్ లను,500 వాహనాలను నష్టపోయింది.
ఈ యుద్ధంలో ఇద్దరు భారత సైనికులు, ఆరు ఒంటెలు ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధంలో పాల్గొన్నది 23 ఇండియన్ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్.
భారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం”మహావీర్ చక్ర” మేజర్ కుల్ దీప్ ను వరించింది.
ఈ లాంగేవాలా యుద్ధం మీదనే ఇక్కడే ” బోర్డర్” సినిమా తీశారు. సన్నీడియోల్, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్, సునీల్ షెట్టి, టబు వంటి స్టార్స్ నటించిన హిట్ సినిమా. యూ ట్యూబ్ లో కూడా వుంది. కావాలంటే మీరూ చూడొచ్చు.
ఇక్కడ వార్ మెమోరియల్ లో ఆనాడు యుద్ధంలో వాడిన, ఫిరంగులు, తుపాకులు, తూటాలు, యుద్దవిమానాలు, యుద్ధ ట్యాంకులు, ఎన్నో ఆయుధాలు ప్రదర్శనకుంచారు. ఫోటోలున్నాయి. యుద్ధంలో మరణించిన వారి సమాధులు, వారి వివరాలు చెక్కిన శిలాఫలకాలు వున్నాయి. అదే ఆవరణలో ఓడిపోయిన పాకిస్థాన్ వారి యుద్ధ ట్యాంకులు కూడా ఉంచారు. ఇక్కడే మా తెలుగు మాటలు వింటున్న భూమేష్ అనే BSF జవాన్ కలిశాడు. అతనిది హైదరాబాద్ లోని కూకట్ పల్లి. అతను మాకు చాలా విశేషాలు చెప్పాడు.
ఇక్కడ బంకర్ లో ఈ యుద్ధం మీద తీసిన డాక్యుమెంటరీ, బోర్డర్ సినిమా నుండి కొన్ని ఘట్టాలు చూపించారు.
అక్కడి నుండి మేము ఇండో – పాక్ బోర్డర్ కి వెళ్ళాము. యుద్ధం జరిగిన ప్రాంతాలవి. దూరంగా కనపడుతున్న పాక్ బోర్డర్, వారి జవాన్లు కనిపించారు.
ఇలా మొదటిసారి బోర్డర్ ను చూసిన ఆనందంతో నా స్నేహితులతో కలిసి వెనుదిరిగాను.



