ఆయన ఒకే ఒక్క సినిమా చేశాడు. కానీ, ఆ ఒక్క సినిమాకే రెండు అవార్డులు సాధించాడు. ఇదో గొప్ప విశేషమైతే… ఆయన ఆ అవార్డ్ ప్రకటించేకంటే ముందే అసువులు బాయడం తీవ్ర విషాదం. ఇంకో మూడు, నాల్గు స్కిప్ట్స్ తన చేతుల్లో పెట్టుకుని సిద్ధంగా ఉన్న ఆయన మరణం ఇండస్ట్రీని కలిచివేస్తే.. ఆయన కుటుంబాన్ని ఆర్తనాదాలు పెట్టించింది. ఎవరాయన..?

అవతార్ క్రిషన్ కౌల్. 1939లో శ్రీనగర్ లో జన్మించాడు. కానీ, కొద్దిరోజులకు వారి కుటుంబం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. దుర్మార్గుడైన తండ్రి క్రూరత్వం, వేధింపులు తట్టుకోలేక… సంపాదన కోసం చిన్న వయస్సులోనే ఓ టీ హోటల్ లో పనిచేశాడు. తండ్రి కోపంతో ఇంటి నుండి బయటకు తోసేసి, తిరిగి రావొద్దని హెచ్చరించాడు. అటువంటి సమయంలో ఎటువంటి ఆశ్రయం దొరక్కపోవడంతో అవతార్ ఢిల్లీ రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే చాలాకాలం పడుకోవాల్సి వచ్చింది. చివరికు తనను తాను నిలబెట్టుకోవడానికి స్థానిక టీ విక్రేత బన్సీ అనే చాయ్ వాలా వద్ద పనికి కుదిరాడు. అవతార్ కౌల్ ఆ సమయంలో ఓ అస్థిపంజరంలా తయారయ్యాడు. కానీ, క్రూరమనస్తత్వం కల్గిన తండ్రిని ఎదురించే సాహసం చేయలేక.. తిరిగి ఇంటికి వెళ్లలేకపోయాడు. ఓవైపు కష్టపడి పనిచేస్తూనే మరోవైపు చదువుకున్నాడు. అలాగే ఉన్నత చదువులూ పూర్తి చేశాడు. తన అర్హతలకు ఆయనకు ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వశాఖలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత న్యూయార్క్ లో పోస్టింగ్ కోసం అక్కడికెళ్లాల్సి వచ్చింది. అదిగో అక్కడే సినిమా నిర్మాణం నేర్చుకున్నాడు. అసోసియేటెడ్ ప్రెస్ లో కాపీ రైటర్ గా పనిచేశాడు. ఓరోజు ఆయన పనిచేస్తున్న సంస్థలో అక్కడి ఎడిటర్.. అవతార్ కౌల్ ఆర్థర్ కోస్ట్లీ రాసిన డార్క్ నెస్ ఎట్ నూన్ అనే పుస్తకం చదువుతూ కంటపడ్డాడు. అవతార్ మంచి చదువరి అనే విషయం ఆ ఎడిటర్ కు అర్థమైపోయింది. దాంతో ఇంకొంచెం ప్రమోట్ చేస్తూ అవతార్ కు న్యూస్ బ్రీఫ్ రైటర్ ఉద్యోగాన్నిచ్చాడు. అవతార్ 1964 వరకూ కూడా ఆ ఉద్యోగంలో కొనసాగాడు. ఆ తర్వాత న్యూయార్క్ లోని బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో చేరాడు.
ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో.. దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, చైనా, ఇరాన్‌లోని చిత్ర దర్శకులే తనకు ప్రేరణ అని చెప్పుకొచ్చాడు. వారిపై ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించినా వారు తమకిష్టమైన సినిమాను మాత్రం వదల్లేదన్నారు. అలాగే, వయసు పెరిగే కొద్దీ తమను తాము అధిగమించే కొరియన్లు కూడా తనకు స్ఫూర్తి అంటాడు అనురాగ్ కశ్యప్. అదే సమయంలో ఆయన భారతీయ సమాంతర సినిమా ఉద్యమంలో అవతార్ క్రిషన్ కౌల్ ను కూడా ఓ ఉదాహరణగా కొనియాడాడు. అయితే, అదే సమయలో సమాంతర సినిమా ఉద్యమంలో ఆయనకు తన సమకాలీనులైన మణి కౌల్, మృణాల్ సేన్ వంటివారికి దక్కిన ప్రాధాన్యత దక్కకపోవడాన్నీ ఆయన ఎత్తిచూపాడు.
1970లో మర్చంట్-ఐవరీ ప్రొడక్షన్స్ ద్వారా అవతార్ క్రిషన్ కౌల్ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. బాంబే టాకీ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఆయనకు దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. అలా 27 డౌన్ అనే సినిమాకు డైరెక్టర్ గా మెగాఫోన్ చేతబట్టాడు. ప్రముఖ హీరోయిన్ రాఖీ, ఎం.కే రైనా ప్రధాన పాత్రధారులు కాగా.. రమేష్ బక్షి రాసిన అథారా సూరజ్ కే పౌదే అనే నవల ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. బాంబే నుంచి వారణాసికి వెళ్లే ట్రైన్ లో హీరో సంజయ్ (ఎం.కే. రైనా) ఫ్లాష్ బ్యాక్ కథను చెబుతూ.. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ ఉద్యోగిణైన షాలినీతో అక్కడ పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత వారిద్దరూ లవ్ లో పడటం.. ఆ విషయం తెలిసిన సంజయ్ తండ్రి అతడికి మరో అమ్మాయితో వివాహం నిశ్చయం చేయడం ఆ స్టోరీ లైన్. ఆ చిత్రానికి హరిప్రసాద్ చౌరాసియా, భువనేశ్వర్ మిశ్రా సంగీతం అందించారు. నిర్మాణ రూపకల్పనలో సత్యజిత్ రే సహకారి అయిన బన్సీ చంద్రగుప్తా తోడుగా నిల్చారు. అలా ఒక అత్యుత్తమ చిత్రంగా నిల్చిన 27 డౌన్.. హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
అవతార్ క్రిషన్ కౌల్ ఎన్ని కష్టాలెదురైనా.. కుటుంబాన్ని బాగా చూసుకున్నవాడు. సాటి మనుషుల పట్ల ప్రేమ, దయ కల్గి ఉండేవాడని ఆయన కుటుంబీకులు చెప్పే మాట. వారి కుటుంబ సభ్యులు, బంధువులెవ్వరైనా సరే నావకు లంగర్ లా.. సాయం చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉండేవాడంటారు. అలాంటి అవతార్ కౌల్ 35 ఏళ్ల చిన్నవయస్సులో… సినిమా రంగంపై ఆసక్తితో అడుగిడి మొదటి సినిమా పూర్తి చేసి, దానికి నేషనల్ అవార్డ్ కూడా సాధించి, ఆ తీపి వార్త కూడా వినకుండానే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేకెత్తించంది. అతడి తల్లి బాధైతే వర్ణనాతీతం. అవతార్ కౌల్ కు సినిమా నిర్మాణంలో సాయమందించడంలో వైమానిక దళంలో పనిచేసిన అతడి తమ్ముడి పాత్ర కూడా కీలకం.
న్యూయార్క్ లో తనకు విదేశాంగ శాఖలో వచ్చిన ఉద్యోగాన్ని ఓవైపు చేస్తూనే.. మరోవైపు, సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకం, భారతీయ సంస్కృతిపై ఫోకస్ చేసి.. మొత్తంగా తాననుకున్న వెండితెర మాధ్యమంపై ఒక సిసలైన స్వరంగా అవతార్ కౌల్ అవతరించాడని వెల్లడించాడు ఆయన ఒకే ఒక్క సినిమా హీరో అయిన ఎం.కే. రైనా. అవతార్ క్రిషన్ కౌల్ మరణించేనాటికి ఆయన చేతిలో అప్పటికే మరో మూడు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ, ఆయనే గనుక బతికుండి ఆ స్క్రిప్ట్స్ కు తెరరూపమిస్తే మరింత ప్రభావవంతమైన దర్శకుడిగా బాలీవుడ్ లో ఓ చెరగని ముద్ర వేసేవాడనేది ఆయన్నెరిగినవారి మాట.
అవతార్ క్రిషన్ కౌల్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా అయిన 27 డౌన్.. 1974లో లోకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవతార్ కౌల్ కు బెస్ట్ డైరెక్టర్ గా ప్రైజ్ ఆఫ్ ది ఎక్యుమెనికల్ జ్యూరీ అవార్డునందించింది. అదే సంవత్సంలో నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా.. అలాగే, సినిమాను తన కెమెరాతో మెస్మరైజ్ చేసిన అపూర్వ కిషోర్ బిర్ కు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా రెండు నేషనల్ అవార్డ్స్ నూ దక్కించుకుంది 27 డౌన్ చిత్రం.



