ఒకే పదం.. రెండు అర్థాలు: త్యాగరాజువారి భాషాపటిమ!

విశీ… ✍️✍️

త్యాగరాజయ్యవారు తన కృతుల్లో వాడిన భాష గురించి ఎంత చెప్పినా తక్కువే! ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చు. అంతటి భాష ఆయనకు ఎలా వచ్చిందా అని తల్చుకుంటే భలే ఆశ్చర్యం నాకు! వారి పూర్వీకులది ప్రకాశం జిల్లా కంబం ప్రాంతం కావడం కారణమా, ఆయన పుట్టి, పెరిగిన తమిళనాడులోని తిరువరూర్ కారణమా? ఆయన 24 వేల పాటలు రాశారని ఒక మాట. కానీ లభ్యమయ్యేవి 720. మొత్తం దొరికి ఉంటే ఎన్ని గొప్ప గొప్ప మాటలు, పాటలు మన చెవినపడేవో!

ఆయన గళం నుంచి వచ్చిన ‘తెలిసి రామచింతనతో’ అనే కృతి చూడండి. నిండా ఎంత మేలిమి భాష దాగి ఉందో! ఇందులో ఎంత సంస్కృతం, ఎంత తెలుగు కలగలిసి ఉందో తెలియదు కానీ, Same term with different Meanings (ఒకే పదానికి ఉన్న భిన్న అర్థాలు) గురించి ఈ పాటలో ఎంత బాగా చెప్పారో! ఒకే పదానికి రెండు అర్థాలు ఉన్నప్పుడు బుద్దిమంతుడు ఏ అర్థాన్ని తీసుకోవాలో చక్కగా వివరించారు.

తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా
తలపులన్ని నిలిపి నిమిషమైన
తారక రూపుని నిజ తత్వములను
తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా

రామాయన చపలాక్షుల పేరు
కామాదుల పోరు వారు వీరు
రామాయన బ్రహ్మమునకు పేరు
ఆ మానవ జననార్తులు తీరు
తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా

అర్కమనుచు జిల్లెడు తరు పేరు
మర్కట బుద్ధులెట్టు తీరు
అర్కుడనుచు భాస్కరునికి పేరు
కుతర్కమనే అంధకారము తీరు
తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా

అజమనుచు మేషమునకు పేరు
నిజ కోరికలేలాగీడేరు
అజుడని వాగీశ్వరునికి పేరు
విజయము కల్గును త్యాగరాజ నుతుని
తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా

అర్థం: ఓ మనసా! శ్రీరాముని స్మరించే ముందుగా రామ అనే పదానికి అర్థం తెలుసుకో! నీ తలపులన్నీ ఒక నిమిషం పక్కన పెట్టి, శ్రీరాముని నిజతత్వం తెలుసుకొని అప్పుడు రామనామాన్ని స్మరించు.

‘రామా’ అనే పదానికి స్త్రీ అని అర్థం ఉంది. అదే అర్థమని భావించేవారు కాముకులు. భక్తులు కారు. ‘రామ’ అనగా పరబ్రహ్మకు పేరు. ఇది తెలిసి స్మరించేవారు వేదాంతులు.

‘అర్కము’ అంటే జిల్లేడు మొక్క. అయితే సూర్యుడికీ ‘అర్కుడ’నే పేరుంది. సూర్యుణ్ని ఆరాధించేవారు జిల్లేడు మొక్క గురించి ఆలోచించరు. అట్లా ఆలోచించేవారిది కోతి బుద్ధి.

‘అజ’ అనే పదానికి బ్రహ్మ అనే అర్థంతోపాటు మేక అనే అర్థం కూడా ఉంది. బుద్ధిమంతుడు, జ్ఞాని అయినవాడు సరైన అర్థం తెలుసుకొని, మార్గంలోనే పయనిస్తాడు.

PS: ఈ పాటను మీరు మల్లాది బ్రదర్స్(మల్లాది శ్రీరాం ప్రసాద్, మల్లాది రవికుమార్)ల గొంతులో వినాలి. మధ్యలో చిట్టస్వరం వేసి, చాలా అద్భుతంగా పాడారు. ఆ పాట యుట్యూబ్‌లో ఉంది.. ఇక్కడ ఆ లింక్ కూడా చూడొచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles