ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తు వేసే క్రమంలో.. శత్రుశేషం లేకుండా చేయడం కోసం.. ప్రత్యర్థి అమాయకత్వాన్ని, ప్రత్యామ్నాయాల్ని ఆసరా చేసుకుని టార్గెట్ చేయడంలో మొస్సాద్ ను మించిన ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఉండదేమో బహుశా! అందుకు తాజాగా జరిగిన పేజర్ పేలుళ్లే ఓ పెద్ద ఉదాహరణ!!
అసలు కోవర్ట్ ఆపరేషన్స్ అంటే ఇంత భయంకర వ్యూహాలతో అమలవుతాయా అనే విషయం.. లెబనాన్ పేలుళ్ల విధ్వంస ఘటన లోకానికి చూపెట్టింది. హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ మొత్తం మొస్సాద్ ట్రాప్ లో పడిపోయింది. మోబైల్ ఫోన్స్ అయితే హ్యాకింగ్ కు గురవుతాయన్న ఉద్ధేశంతో.. ఎప్పుడైతే హెజ్బుల్లా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందో.. అదిగో అప్పుడే మొస్సాద్ ఆ విషయాన్ని గమనించింది.

ప్రత్యర్థి ప్రత్యామ్నాయానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయింది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి పేజర్ అయితే బెటర్ అనే ఆలోచన హెజ్బొల్లాలో కల్గించిందీ మొస్సాదే. ఆ పేజర్లనే ట్రోజాన్ హార్స్ గా వాడి తమ ఆపరేషన్ ను సక్సెస్ చేయడానికి మొస్సాద్ వేసిన రెండేళ్ల క్రింది ప్లాన్ ఫలితమే.. 2024, సెప్టెబర్ 17న లెబనాన్ లో పేలిన పేజర్ల విధ్వంసం.
పేజర్ల పేలుళ్లల్లో హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగలింది. చాలామంది నాయకులు చనిపోయారు. మరెంతో మంది ఇకముందు గతంలా పనిచేయలేనంత తీవ్రంగా గాయపడ్డారు. అలా శత్రువును కుప్పకూల్చేందుకు AR934 మాడల్ పేజరైతే బెటర్ ఆప్షన్ అని భావనను హెజ్బొల్లా కొనేలా ప్రచారం చేసింది. ఆ పేజర్లలో శత్రువులు అమితంగా ఆసక్తి కనబర్చేలా.. నెలల తరబడి వాడినా స్విచ్ ఆఫ్ కాని బ్యాటరీ బ్యాక్ అప్, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ వంటి అద్భుతమైన ఫీచర్స్ అమర్చింది.
అలా మొస్సాద్ కనుసన్నల్లో.. ఒక్కమాటలో చెప్పాలంటే మొస్సాద్ పూర్తి స్థాయి పర్యవేక్షణలో తయారైన పేజర్స్ ను హెజ్బొల్లా 2023లో పెద్దమొత్తంలో కొనుగోలు చేసేలా ప్రణాళికలు రచించింది. మొస్సాద్ ఇంటలిజెన్స్ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేసే.. మోబైల్స్ వాడొద్దని తీర్మానించుకున్న హెజ్బొల్లా.. పేజర్స్ తయారీ వెనుక కూడా మొస్సాద్ హస్తముందనే విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయింది.
కానీ, పేజర్లను పెద్దమొత్తంలో తయారుచేయించి హెజ్బొల్లాను బురిడీ కొట్టించి వారిచే కొనిపించిన ప్రతీ పేజర్ లో పేలుడు పదార్థాలను అమర్చింది మొస్సాద్. జస్ట్ ఒక్క రిమోట్ క్లిక్కుతో విధ్వంసాన్ని సృష్టించే టెక్నాలజీతో తాననుకున్న లక్ష్యాన్ని రీచై.. హెజ్బొల్లాలో గందరగోళాన్ని సృష్టించింది. 2024, సెప్టెంబర్ 17న జరిగిన పేలుళ్లలో.. ఏకంగా 3 వేల మంది హెజ్బొల్లా సైనిక సిబ్బందితో పాటు.. సాధారణ పౌరులు కూడా పలువురు మృత్యువాత పడటం, తీవ్రగాయాలవ్వడంతో హెజ్బొల్లా ఊపిరి పీల్చుకోలేకపోయింది. ఈ ఘట్టం ఇటీవలి చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన, ఇంటలిజెంట్ నిఘా ఆపరేషన్ గా రికార్డుకెక్కింది.
2022లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా నుంచి బెదిరింపులను ఎదుర్కోవాల్సిన వచ్చిన సమయంలోనే.. హెజ్బొల్లా భరతం పట్టేందుకు కొత్తమార్గాలను అన్వేషించింది. అలా మొస్సాద్ బ్రెయిన్ నుంచి పుట్టుకొచ్చిన చైల్డే.. లెబనాన్ పేజర్ల పేలుడు విధ్వంసం.
హెజ్బొల్లాకు ఏమాత్రం అనుమానం రాకుండా పేజర్లను మార్కెటింగ్ చేసింది. మేడ్ ఇన్ తైవాన్ బ్రాండ్ నేమ్ తో ఆ పేజర్లను.. కనీసం మొస్సాద్ ఉద్ధేశాలేవీ బయకు పొక్కకుండా.. ఓ సిసలైన గూఢచారి సంస్థెలాగుండాలో తెలియపర్చేలా.. వాటిని హెజ్బొల్లాతో కొనిపించింది.. శత్రువును మట్టుబెట్టే ఒక భయంకరమైన ఎత్తుగడతో మొస్సాద్ ఆలోచనల పరంపర ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటింది. శత్రువు ఊబి నుంచి తప్పించుకుంటూనే.. ఆ శత్రువునే మట్టుబెట్టే సమాచార వ్యవస్థ కోసం హెజ్బొల్లా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నామనుకుందేగానీ.. ఆ శత్రువు వద్దే తమ వినాశనానికి కారణమయ్యే పేజర్ల రూపంలో ఉన్న బాంబులను కొనుగోలు చేస్తామని కలలోనైనా ఊహించలేకపోయింది.
ఆ పర్యవసానమే సెప్టెంబర్ 17న హెజ్బొల్లా మిలిటెంట్స్ ఎన్ క్రిప్టెడ్ మెస్సేజెస్ ను తెరిచి చూసేందుకు యత్నిస్తున్న క్రమంలో.. భారీ పేలుళ్లకు దారి తీసింది. అన్ ఎన్ క్రిప్టెడ్ ను ఎన్ క్రిప్ట్ చేసి సమాచారాన్ని డీకోడ్ చేసే క్రమంలో మరోసారీ భారీ విధ్వంసంతో హెజ్బొల్లాపై కోలుకోలేని దెబ్బ పడింది. అలా మరో రోజు మొస్సాద్ సేమ్ టూ సేమ్ పేజర్ల తరహాలోనే ఎక్స్ ప్లోజివ్స్ ను అమర్చిన వాకీటాకీలను పేల్చడంతో.. ఏకంగా పశ్చిమాసియాలో ఇప్పుడు ఓ ఆరని చిచ్చుకే తెరలేపింది.
మొత్తంగా మొస్సాద్ రహస్య కోవర్జ్ ఆపరేషన్ల దెబ్బకు హెజ్బొల్లా కోలుకోలేకపోతోంది. ఇప్పుడు హెజ్బొల్లా కమ్యూనికేషన్ నెట్ వర్క్స్ అన్నీ ఎక్కిడకక్కడ చెల్లాచెదురయ్యాయి. ఇదే తరుణంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇజ్రాయెల్ హెజ్బొల్లాను తుడిచిపెట్టే ప్రణాళికలో భాగంగా బీరుట్ పై కురిపిస్తున్న నిప్పుల వర్షం.. మరోవైపు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ గా మారిన యుద్ధవాతావరణం.. ఇప్పుడు పశ్చిమాసియా దాయాదుల మధ్యనే కాదు… అంతర్జాతీయ సమాజాన్నీ ఎప్పుడేం జరుగుతుందోనన్న ఒకింత ఉత్కంఠకు గురిచేస్తోంది.
మొత్తంగా ఈ అనూహ్య దాడులతో ఇజ్రాయెల్ తానెంతకైనా తెగిస్తానని తెగించి చెబుతోంది. అంతేకాదు, తమ ఇంటలిజెన్స్ వ్యవస్థైన మొస్సాద్ బలాన్నీ పశ్చిమాసియాలోని తన శత్రుదేశాలతో పాటు.. అంతర్జాతీయ సమాజం ముందుంచే ప్రయత్నమూ చేసింది.



