THE SUCCESS STORY OF GODREJ INDUSTRY!
ఏ మధ్య తరగతి ఇంటి తలుపు తట్టినా.. ఆ ఇళ్లల్లో కనిపించే వస్తువుల్లో ఓ అల్మరా మనకు దర్శనమిస్తుంది. గేజుల కొలతల్లో భాగంగా ఎవరైనా స్థానికంగా చేయించుకున్నవి మినహా… మనకు కనిపించే ఆ బీరువాలపై రాసుండే పేరు గోద్రెజ్.
మరి ఓ చిన్న షెడ్ నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించి… తన వ్యాపారాన్ని బహుళజాతి సామ్రాజ్యంగా విస్తరించేందుకు ఆ ఆర్దేషిర్ బుర్జోర్జీ సొరాబ్జీ గోద్రెజ్ తన స్వహస్తాలతో రాసిన తన విజయగాధేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ కు స్వాతంత్ర్యం రాకముందే ప్రారంభమై… ఇళ్లల్లో దర్శనమిచ్చిన బ్రాండ్ గోద్రెజ్. ప్రారంభంలో ఉన్నత వర్గాలవారు మాత్రమే ఉపయోగించే గోద్రెజ్.. ఆ తర్వాత మధ్య తరగతి కుటుంబాలకూ వచ్చి చేరింది. రబీంద్రనాథ్ ఠాగూర్, అనీబిసెంట్ వంటివారి పూర్తిస్థాయి సహకారంతో నాడు వేళ్లూనుకుని.. వారి మనన్ననలు పొందింది గోద్రెజ్. ఇంగ్లాండ్ రాణి 1921లో భారత్ పర్యటించినప్పుడు కూడా ఆమె తన పర్యటనలో వార్డ్ రోబ్ గా గోద్రెజ్ బీరువానే వాడారట.
బ్రిటీషర్స్ కాలంలో ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకున్న తాళాల కంటే మెరుగైన తాళాలను తయారు చేయడంతో.. గోద్రెజ్ తాళాలకు మొదట డిమాండ్ ఏర్పడింది. విదేశాల నుంచి భద్రత కోసం దిగుమతి చేసే తాళాలు తరచూ పగిలిపోతుండటం.. లోపలి ఇంటిగ్రేటెడ్ స్ప్రింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడాన్ని గమనించిన ఆర్దేషిర్ గోద్రెజ్… 1897, మే 7వ తేదీన ఓ షెడ్డులో తాళాల తయారీ ప్రారంభించాడు. అలా, విదేశాల నుంచి దిగుమతైన తాళాల కంటే బందోబస్తుగా, చవకగా తాళాలను తయారుచేసి.. ఇండియన్ మార్కెట్ లో తనకంటూ ఓ గుర్తింపు సాధించారు. అంతేకాదు మొట్టమొదట భారత్ లో జరిగిన ఎన్నికల్లోనూ గోద్రెజ్ గ్రూప్ తయారుచేసిన బ్యాలెట్ బాక్సులనే వాడారంటే.. ఆ గ్రూప్ మ్యానుఫ్యాక్చరింగ్ పై ఎంత నమ్మకముండాలి..? తాళాల తయారీతో మొదలైన గోద్రెజ్ ప్రయాణం టైప్ రైటర్స్ మీదుగా.. ఆ తర్వాత ఎలా విస్తరించిందో.. మిగిలింది ఇప్పుడు మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం.

అయితే, మన ఇళ్లల్లో అల్మారాలపై తన పేరు రాసుకోవడంతో పాటు… తన జీవిత తలరాతను కూడా తానే సృజనాత్మకత, శ్రమను జోడించి రాసుకున్న ఆర్దేషిర్ ను… తన జీవితంలో ఎదురైన ఓ అనూహ్య ఘటన మాత్రం విషాదంలో ముంచెత్తింది. ముంబైలోని 85 మీటర్ల ఎత్తులో కనిపించే ది గ్రేట్ రాజాబాయి టవర్ పైకెక్కిన ఆర్ధెషిర్ గోద్రెజ్ భార్య బచుబాయితో పాటు.. ఆయన కజినైన ఫిరోజ్ బాయి కిందపడి చనిపోవడం గోద్రెజ్ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఓ ఇద్దరు అగంతకుల ఆగడాలతోనే ఆ ఇద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా చెబుతుంటారు. అయితే, ఇప్పటికీ రాజాబాయి టవర్స్ పై నుంచి కిందపడి చనిపోయిన గోద్రెజ్ భార్య బచుబాయి, కజిన్ ఫిరోజ్ బాయిది ఆత్మహత్యా, హత్యా, ప్రమాదమా అన్నది వీడని మిస్టరీగా మిగిలిపోయి.. రాజాబాయి టవర్ ట్రాజెడీని ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు.
1868లో ముంబైలోని పార్సీ కుటుంబంలో పుట్టిన ఆర్దేషిర్ గోద్రెజ్… భారత్ లో మొట్టమొదట కెమిస్ట్ షాప్ లో అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఆర్దేషిర్ తన స్నేహితుడి తండ్రి మెర్వాన్జీ కామా అనే పార్సీ వ్యాపారవేత్తను కలవడంతో… తన కొడుకు మాట మేరకు.. ఆర్దేషిర్ కు వ్యాపారం కోసం రుణసాయం చేశారు మెర్వాన్జీ. మరి మీ నాన్నగారే బాగా డబ్బున్నవారు కదా.. ఆయన్నే ఎందుకు డబ్బడగలేదనే ప్రశ్నా మెర్వాన్జీ నుంచి గోద్రెజ్ కు ఎదురైంది. తండ్రి ఇస్తే అది బహుమతవుతుంది.. సో, ఛాలెంజింగ్ గా ఉండదు.. మీ దగ్గరైతే రుణంగా తీసుకోవచ్చు.. దాన్ని తీర్చాల్సిన బాధ్యత నన్ను ఎప్పటికప్పుడూ తరుముతుంటుంది, గుర్తు చేస్తుంటుందన్న గోద్రెజ్ సమాధానంతో మెర్వాన్జీ మాట్లాడకుండా ఆ రుణాన్నిచ్చేశారట. అదిగో అలా ప్రారంభమైంది గోద్రెజ్ తాళాల వ్యాపారం.
గాంధీ సత్యమేవ జయతే అనే సిద్ధాంతాన్ని నమ్మిన గోద్రెజ్!

ఆర్దేషిర్ గోద్రెజ్… మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అమితంగా ప్రభావితమైనవాడు. సత్యాన్ని నమ్మినవాడు. 1894లోనే తన న్యాయవాద చదువును పూర్తి చేసి.. కొన్ని కేసులు వాదిస్తున్న సమయంలో తన స్వభావానికి ఎదురైన విరుద్ధ భావనలతో.. మొత్తంగా న్యాయవాద వృత్తికే స్వస్తి పలికాడు.
బూర్జోర్జీ గూతేరాజీ అన్న ఇంటి పేరును తన తండ్రి గోద్రెజ్ గా మార్చడంతో.. తన మూడేళ్ల వయస్సు నుంచే ఆర్దేషిర్ ఇంటిపేరు గోద్రెజ్ గానే ప్రాచుర్యంలోకొచ్చింది. 1894లో బాంబే సొలిసిటర్స్ అనే సంస్థ తమ కేసును వాదించడానికి ఆర్దేషిర్ ను నియమించుకుని.. జాంజిబార్ కు వెళ్లాలని కోరింది. కానీ, ఆ కేసులో వాస్తవాలను ఫ్యాబ్రికేట్ చేసే అవసరముండటం.. సత్యాన్ని మార్చి చెప్పాల్సిన పరిస్థితులు ఎదురవ్వడంతో.. ఆ కేసు నుంచి వైదొలిగాడు ఆర్దేషిర్. ఈ విషయాన్ని పీటర్ చర్చ్స్ బుక్ ప్రొఫైల్స్ ఇన్ ఎంటర్ ప్రైజ్ అనే పుస్తకంలో.. భారత వ్యాపారుల స్ఫూర్తిదాయక కథగా అభివర్ణించారంటేనే ఆర్దేషిర్ గోద్రెజ్ ఎంత నీతిమంతుడో చెప్పొచ్చు.
గోద్రెజ్ కంపెనీల్లో ఇప్పుడు వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. గోద్రెజ్ సోప్స్ నుంచి మొదలుకుంటే… ఇవాళ అంతరిక్ష కార్యక్రమాలకు కూడా గోద్రెజ్ కంపెనీ ఇంజన్సే ఇంధనంలా పనిచేస్తున్నాయంటే.. ఆ సంస్థ వ్యాపార రంగంలో సాధించిన హైట్స్ అంతరిక్షాన్ని తాకుతున్న ఎత్తంత అని మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మొత్తంగా తాళాల నుంచి మొదలైన గోద్రెజ్ వ్యాపార ప్రస్థానం… సామాన్య, మధ్య, ధనికులన్న తేడా లేకుండా ఎందరి జీవితాలతోనో.. ఏదో ఓవిధంగా ముడిపడి.. భారతీయ దిగ్గజ వ్యాపార సంస్థగా ఎదగడమే.. ఈ ది గ్రేట్ ఆర్దేషిర్ గోద్రెజె సక్సెస్ స్టోరీ.



