పాక్ కు వెళ్లనని భీష్మించిన మిల్కాసింగ్ ను.. నాడు నెహ్రూ ఎలా ఒప్పించాడు..?

ఇండియా – పాక్ విభజన తర్వాత దేశం గర్వించదగ్గ ఓ ప్రఖ్యాత అథ్లెట్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మధ్య ఏం జరిగింది..? మిల్కాసింగ్ ను బలవంతంగా పాకిస్థాన్ కు వెళ్లాలని నాటి ప్రధాని నెహ్రూ ఎందుకు ఒత్తిడి చేశాడు…? ఇండియా – పాక్ ద్వైపాక్షిక సంబంధాలకు నెహ్రూ క్రీడలను ఎలా ఉపయోగించుకున్నాడు..? ఈ విషయాన్ని భాగ్ మిల్కా భాగ్ సినిమాలో నెహ్రూ పాత్రధారి దలీప్ తాహిల్ ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించడాడు. మిల్కాసింగ్, నెహ్రూకు మధ్య ఏం జరిగింది.. దలీప్ తాహిల్ కు, మిల్కాసింగ్ ఏం చెప్పాడసలు..?

రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర భాగ్ మిల్కా భాగ్ లో నెహ్రూగా యాక్ట్ చేసిన దలీప్ తాహిల్, మిల్కాసింగ్ ఓసారి కలుసుకున్నారు. మిల్కాసింగ్ తనతో ఏమన్నాడో దలీప్ రెడ్ ఎఫ్ఎం పాడ్ కాస్ట్ షోలో షేర్ చేసుకున్నారు.

జవహర్ లాల్ నెహ్రూను కలిసిన అనుభవమున్న అథ్లెట్ గా మిల్కా సింగ్ ను భాగ్ మిల్కా భాగ్ కు ముందు ఒకసారి కల్పించాలని సినిమా బృందాన్ని, ముఖ్యంగా దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రానూ కోరాడట దలీప్. మిల్కాతో మాట్లాడితే తను పోషించబోయే క్యారెక్టర్ కు మరింత న్యాయం చేయొచ్చనే భావన దలీప్ ది. ఆయన కోరినట్టుగానే సినిమా బృందం మిల్కాసింగ్ తో దలీప్ భేటీకి ఏర్పాటు చేసింది. మిల్కా జీవితంలో నెహ్రూదీ కీలకపాత్ర అని ఆయన్ను కలుసుకున్న తర్వాతే తాను తెలుసుకున్నట్టు చెప్పాడు దలీప్.

పాక్ నుంచి మిల్కాకు ఆహ్వానం!

1960లో లాహోర్ కేంద్రంగా జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో 200 మీటర్ల ఈవెంట్ లో పాల్గొనడానికి మిల్కాసింగ్ కు ఆహ్వానం అందింది. కానీ, ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ లో జన్మించిన మిల్కాసింగ్.. దేశ విభజన సమయంలో జరిగిన దారుణాలను తాను కళ్లారా చూశాడు. ఆనాటి మారణకాండలో మిల్కాసింగ్ తల్లిదండ్రులు, తోబట్టువులతో సహా కుటుంబమంతా అసువులు బాసింది. ఆ ఘటన జరిగిన 13 ఏళ్లనంతరం మిల్కాసింగ్ కు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనాలనే ఆహ్వానం పాక్ నుంచి అందింది. కానీ, తాను కళ్లారా చూసిన నాటి విభజన నెత్తుటి జ్ఞాపకాలతో మిల్కాసింగ్ కు పాకిస్థాన్ కు వెళ్లబుద్ధి కాలేదు. దాంతో ఏకంగా పాకిస్థాన్ ఆహ్వానాన్నే తిరస్కరించాలని మిల్కాసింగ్ నిర్ణయించుకున్నాడు.

అదిగో ఆ సమయంలోనే నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ… మిల్కాసింగ్ తో భేటీ అయ్యాడు. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఉద్రిక్తతలను తగ్గించాలంటే.. తిరిగి ఒక సుహృద్భావ వాతావరణం నెలకొనాలి. నీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తల్చుుకుని నీలో నీవు కుములుతూ ఆవేదనతో వెళ్లకపోవడం కంటే కూడా.. శాంతిని నెలకొల్పే విశాల, సమతా భావనతో ఆలోచించాలి. ఇరుగుపొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయాలి. అందుకు నువ్వు వెళ్లి తీరాలని నెహ్రూ మిల్కాను ఒప్పించాడు. ఇదే విషయాన్ని మిల్కాసింగ్.. భాగ్ మిల్కా భాగ్ సినిమాకు ముందు తనతో వెల్లడించినట్టు తాహిల్ షేర్ చేసుకున్నాడు.

మిల్కాసింగ్ జీవితాన్నే మార్చేసిన నెహ్రూ ఆలోచన!

అసలు జవహర్ లాల్ నెహ్రూ తన జీవితాన్నే మార్చేశాడని మిల్కాసింగ్ దలీప్ తో చెప్పుకొచ్చాడట. మిల్కాసింగ్ తో తాను సినిమాకు ముందు నాల్గు గంటల సేపు భేటీ అయ్యానని.. నెహ్రూ గురించి చాలా విషయాలు చెప్పాడంటాడు దలీప్. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పాల్సిన ఓ సంధి సమయంలో క్రీడల ద్వారా ఆ అవకాశం రావడం… ఏ రాజకీయ నాయకుణ్నో సయోధ్య కోసం పంపకుండా.. తననెంచుకోవడం ఒకింత ఆశ్చర్యపర్చిందంటాడు. అదే సమయంలో నాటి చేదు జ్ఞాపకాలతో ఆవేదనతో రగిలిపోతున్న తనలో భిన్నరకాల ఆలోచనలకు నెహ్రూ ప్రతిపాదన తెరతీసింది. ప్రధానంతటివాడు దేశం కోసం కోరినప్పుడు తాను కాదనలేకపోయానన్నాడు. తాను పాకిస్థాన్ కు వెళ్లాక, తనకు ఆ దేశంపైన ముద్రపడిన అభిప్రాయానికి భిన్నంగా నాడు తనను బాగా చూసుకున్నట్టు మిల్కా దలీప్ తో షేర్ చేసుకున్నారట.

పాకిస్థాన్ లో అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్న మిల్కాసింగ్ పతకం కూడా సాధించి ఇండియాకు విజయంతో తిరిగి వచ్చాక.. ప్రధాని నెహ్రూ నీకేం బహుమతి కావాలని అడిగాడు. దానికి మిల్కాసింగ్ నుంచి ఓ చురకలాంటి సమాధానం ఎదురైంది నెహ్రూకి. ఆకులు కావాలని అడిగాట మిల్కా. అంటే, చేతులు కాలాక పట్టుకోవడమే కదా అనే కోణంలో ఆ చురకంటించాడు మిల్కా. ఒకవేళ నాడు మిల్కాగనుక ఓ వంద ఎకరాల భూమి అడిగి ఉంటే… మేం మంచి భూస్వాములుగా ఉండేవాళ్లమంటూ మిల్కా భార్య కూడా గుర్తు చేసుకుందట నాటి ఉదంతాన్ని. మొత్తంగా తనకు పాక్ పైనున్న కోపాన్ని మాయం చేసి.. జవహర్ లాల్ నెహ్రూ తన జీవితాన్నే మార్చేశారని మిల్కా దలీప్ తో చెప్పిన విషయాలను ఆయన పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles