భారతీయ సంప్రదాాయానికి పాప్, జాజ్, ఫంక్ అద్దితే… పంచమ్!
భారతీయ సినీతెరపై అప్పటివరకూ వినిపించని శబ్దతరంగాలను పరిచయం చేసిన శబ్ద శాస్త్రజ్ఞుడు. ఇండియన్ నేటివిటీకి పాప్, జాజ్, రాక్, బ్లూస్, ఫంక్ ప్రాశ్చాత్య పోకడలద్ది సంగీతానికి కొత్త రూపునిచ్చాడు. రాహూల్ దేవ్ చిన్ననాట ఏడుస్తున్నప్పుడు సప్తస్వరాల్లోని ప అనే పంచమ స్థాయిలో పలుకుతున్నప్పుడు.. నవజాత శిశువు ఏడుస్తున్న ధ్వని గోచరించడం వల్ల ఆయన్ను.. అప్పటి నటుడు అశోక్ కుమార్ పంచమ్ దా అని ముద్దుగా పిల్చుకున్నాడట. అలా బాలీవుడ్ తో పాటు… ఇండియన్ సినిమా మ్యూజికల్ జర్నీలో పంచమ్ దాగా తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్ చేసిన రాహూల్ దేవ్ బర్మన్ వర్ధంతి నేడు జనవరి 5. ఆ సప్తస్వరాల వెనుకున్న స్పూర్తేంటో తెలుసుకోవాలంటే.. మనం ఓసారి చైతన్య పడుకునె అనే జర్నలిస్ట్ రాసిస ఆర్డీ బర్మానియా అనే పుస్తకంలోని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ బుక్ కొత్త విషయాలను రివీల్ చేస్తుంది. అంతేకాదు.. ఆ ఆర్డీ బర్మానియా బుక్ లో… పంచమ్ ఎంత బోల్డ్ గా ఉండేవారో కూడా అద్భుతంగా పోర్ట్రే చేశారు చైతన్య పడుకునె.

అది 1983.. చైతన్య పడుకునె మిడ్-డే కోసం బర్మన్‌ను ఇంటర్వ్యూ చేశారు. చైతన్య అప్పటికే పంచమ్ కు వీరాభిమాని. చైతన్య ఎన్నో ప్రయత్నాల తర్వాత ఫోన్ లైన్ లో అందుబాటులోకొచ్చిన ఆర్డీ బర్మన్.. ఎందరో జర్నలిస్టులుంటే.. వారంతా నన్నడుగుతుంటే.. నేనెందుకు మీకు మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వాలనడిగారట. ఇటువైపు నుంచి నేను మీ అభిమానినన్నది చైతన్య సమాధానం. మీరు నా అభిమానైతే ఇంటర్వ్యూనే అవసరం లేదు. అటువైపు నుంచి బర్మన్ కౌంటర్ అటాక్. చైతన్య రిక్వెస్ట్ కు ఏమనిపించిందో, ఏమో.. కాస్త కరిగిన ఆర్డీ బర్మన్.. ఒక హార్డ్ కోర్ విమర్శకుడిగా వస్తే ఇంటర్వ్యూ ఇస్తానన్నారట. ఆ ఇంటర్వ్యూ అనంతరం ఆర్డీ. బర్మన్, జర్నలిస్ట్ చైతన్య మంచి స్నేహితులుగా మారడమన్నదిక.. వారి వేవ్ లెంగ్త్ ను కలిపిన ఫ్రీక్వెన్సీ మ్యాటర్.
పంచమ్ దా గానం, సంగీతశైలికి ప్రధానంగా అమెరికన్ జాజ్ లెజెండ్ లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ మెయిన్ ఇన్స్పిరేషన్. అందుకే తన గాత్రం కూడా విలక్షణంగా ఉండాలని… తన పాటల్లోనూ అది స్ఫురించాలని కోరుకునేవారు ఆర్డీ. ప్రకృతంతా సంగీతమే… ప్రతీ దాంట్లోనూ సంగీతముంటుందనే శోధనతోనే పంచమ్ ఆలోచించేవాడంటాడు చైతన్య పడుకునె. ఇప్పటికీ యువతను ఉర్రూతలూగిస్తున్న యాదోంకీ బారాత్ లోని ‘చురా లియా హై ‘ పాటలో.. చెంచాలతో గ్లాస్ పై కొట్టే ఒర్జినల్ ధ్వనులను ఉపయోగించారు పంచమ్. పలువురు ప్రాశ్చాత్య సంగీత దర్శకుల నుంచి తానెలా ప్రేరణ పొందిందీ.. ఆయనే నిక్కచ్చిగా వెల్లడించారని రాసుకొచ్చారు చైతన్య.
బొజౌరా బెల్జియం సాంగ్ ‘ఇఫ్ ఇట్స్ ట్యూజ్ డే’ పాటలోని ఓపెనింగ్ మ్యూజికల్ బార్సుని… చురా లియా పాటలో వచ్చే ఓపెనింగ్ నోట్స్ ను పోల్చుకున్నప్పుడు ఆ టింజ్, ఆ మూలాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. షోలేలోని ‘మెహబూబా మెహబూబా’ పాటకు డెమిస్ రూసోస్ రూపొందించిన సాంప్రదాయ సైప్రస్ ట్యూన్ ‘సే యు లవ్ మీ’ ప్రేరణైంది. రిషీకపూర్ హమ్ కిసిసే కమ్ నహీ సినిమాలోని ‘మిల్ గయా హమ్కో సాతి’ అనే పాటకు అబ్బా ఆల్బంలోని ‘మమ్మా మియా’ గిటార్ బిట్స్ స్ఫూర్తి కల్గించాయి పంచమ్ కు.
చలన చిత్ర సంగీతం ద్వారానే భారతీయులకు పరిచయమైన పంచమ్… అమెరికన్ హెవీ మెటల్ బ్యాండ్‌తో కలిసి.. ల్యాటిన్ అమెరికన్ సంగీతాన్ని రాక్, జాజ్, ఫంక్ ఛాయలతో మేళవించి.. 1987లోనే పాంటేరా అనే ల్యాటిన్ అమెరికన్ ఆల్బమ్ ను రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్ల్ లో 1983 -84 లో రికార్డ్ చేసిన ఆ ఆల్బమ్ ఎన్నో ఆపసోపాల కారణంగా.. 1987 లో విడుదలైంది. తానెంతో ఆసక్తిగా రూపొందించిన ఆ ఆల్బమ్.. భారతీయుల హృదయాలను గెల్చుకోలేకపోయిందని.. కానీ అందులోని ఓ సాంగ్ స్ఫూర్తితో రూపొందించిన జాకీష్రాఫ్ నటించిన గార్డిష్ సినిమాలోని రంగ్ రంగేలి రాత్ పాట మాత్రం ప్రేక్షకాదరణ పొందడం సంతృప్తిని మిగిల్చినట్టుగా పంచమ్ చెప్పుకొచ్చాడు. దీవార్ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో పాడుకునే ఇంగ్లీష్ పాట కోసం రాహూల్ దేవే లిరిక్స్ రాశారట. కలలో కూడా సంగీతాన్నే శ్వాసించిన ఆర్డీ బర్మన్ వంటి సంగీత దర్శకులు కూడా.. అవసరమైనప్పుడు ప్రాశ్చాత్య సంగీతంలోని స్ఫూర్తితో కూడా పలు పాటలు చేశారనడానికి ఇవన్నీ బోలెడన్ని ఉదాహరణలు. అయితే, మక్కీకి మక్కీ అనుకరణ కాకుండా… అనుసరణ వరకే పరిమితమవుతూ.. కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగం మాత్రమే. అదే, పంచమ్ దా వంటి సృజనశీలురు నాల్గుకాలాలపాటు సంగీతరంగాన్నేలి ఖ్యాతి సంపాదించేందుకు కారణం.
జర్నలిస్ట్ చైతన్య పడుకునే బుక్ రూపంలో తీసుకొచ్చిన ఆర్డీ బర్మన్ యాది.. సంగీతంలో ఆయన అనుసరించిన విధానాలు, ఆయనకు స్ఫూర్తినిచ్చిన ప్రాశ్చాత్య సంగీతకారులు, వెస్ట్రన్ మ్యూజిక్ ప్రేరణతో తయారైన బాలీవుడ్ సూపర్ హిట్స్ ఇలా ఎన్నింటినో మనకు ఓ పొట్లం కట్టి అందిస్తుంది.



