సింగ్ ను రాజకీయాల్లోకి లాక్కొచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్: ఏంటా కథా..?

అది జూన్ 1991.. నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన మన్మోహన్ సింగ్ తిరిగి ఢిల్లీకి చేరుకుని అప్పుడే అలసిసొలసి పడుకున్నారు. ఆ రాత్రి సింగ్ కు ఫోన్ కాల్ వచ్చింది. సింగ్ అల్లుడు విజయ్ టంఖా ఫోన్ ఎత్తాడు. అటువైపు ఫోన్ చేసింది… పి.వి.నరసింహారావు సన్నిహితుడైన పి.సి.అలెగ్జాండర్. మన్మోహన్ లేపండి ఏం పర్లేదన్నాడు అలెగ్జాండర్. అల్లుడు విజయ్ మామ మన్మోహన్ ను లేపి ఫోన్ అందించాడు.

సింగ్ అలెగ్జాండర్ చెప్పింది విన్నాడు. అప్పుడు మన్మోహన్ యూజీసీ చైర్మన్ పదవిలో ఉన్నాడు. పీవీసాబ్ ప్లాన్ గురించి చెప్పుకొచ్చాడు అలెగ్డాండర్. తనకు రాజకీయ అనుభవం లేకపోవడంతో అలెగ్జాండర్ చెప్పినదాన్ని విన్నాడేగానీ, అంత సీరియస్ గా తీసుకోలేదు మన్మోహన్ సింగ్. కానీ, కొన్ని గంటల తర్వాత మన్మోహన్ అలెగ్డాండర్ ను, ఆ తర్వాత పీవీనీ కలిశాడు.

1991 జూన్ 21వ తేదీన మన్మోహన్ సింగ్ యూజీసీ చైర్మన్ గా తన కార్యాలయంలో ఉన్నాడు. ఇంటికెళ్లి దుస్తులు మార్చుకురమ్మని కబురొచ్చింది. ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలన్న ఆదేశమది. ప్రమాణ స్వీకారానికి హాజరుకావల్సిన కొత్త సభ్యుల జట్టులో ఎలాంటి రాజకీయానుభవం లేని సింగ్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారట. తన పోర్ట ఫోలియో కూడా తర్వాతే నిర్ణయించబడిందిగానీ.. అంతకుముందే పీవీ నర్సింహారావు మీరే కాబోయే ఆర్థికమంత్రి అని చెప్పేశాడు సింగ్ కి. ఈ విషయాలు మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన strictly personal, manmohan and gurusharan అనే పుస్తకంలో పేర్కొంది.

కేంద్ర ఆర్థికమంత్రిగా ప్రధాని పీవీ క్యాబినెట్ లో మన్మోహన్ నియామకం దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేసింది. అప్పటివరకూ అతి తక్కువ వృద్ధిరేటుకు కేరాఫ్ గా ఉన్న భారత్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ఎదగడంలో మన్మోహన్ విజన్ ప్రధాన కారణం.

ఓవైపు కాంగ్రెస్ లోని అంతర్గత అసమ్మతివాదులు.. ఇంకోవైపు కాంగ్రెస్ వెలుపల ప్రతిపక్షాల నుంచి మాటల దాడులను ఎదుర్కొంటున్న సంక్షోభ సమయం 1991 ప్రాంతం. ఫారెక్స్ నిల్వలు 2 వేల 500 కోట్లకు పడిపోయాయి. కేవలం రెండంటే రెండే వారాల దిగుమతులకు కూడా సరిపోని పరిస్థితి. ప్రపంచ బ్యాంకులేవీ రుణాలివ్వడానికి నిరాకరించిన సమయం. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అదిగో అలాంటి సమయంలో పీవీతో కలిసి మన్మోహన్ సంస్కరణల రూపశిల్పిగా భారత ఆర్థికవ్యవస్థకు కొత్త రూపునిచ్చాడు.

మన్మోహన్ క్యాబినెట్ లోకి అడుగుపెట్టేనాటికే సమస్యలేంటో తెలుసు… వాటికి పరిష్కారాలేంటో కూడా ఆయన మస్తిష్కంలో ఆలోచించే పెట్టుకున్నాడు. ఒక నెల తర్వాత జరిగిన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించాడు. అప్పటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రంగరాజన్ తో కలిసి తగ్గిన రూపాయి మారకంపై దృష్టి పెట్టాడు. అప్పటి వాణిజ్య మంత్రిగా ఉన్న చిదంబరంతో కలిసి ఎగుమతి నియంత్రణలను తొలగించాడు.

తన మొదటి బడ్జెట్ లోనే 1991, జూలై 24న లైసెన్స్ – పర్మిట్ రాజ్ కు స్వస్తి పలికాడు. బడ్జెట్ కు కొన్ని గంటల ముందు పీవీ నర్సింహారావు ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. చంద్రశేఖర్ నేతృత్వంలోని సంకీర్ణంలో అంతకుముందు కూడా మన్మోహన్ సింగ్ అడ్వైజర్ గా పనిచేశాడు. ఆర్థిక సలహాదారు రాకేష్ మోహన్ రూపొందించిన నివేదిక ఆధారంగా 18 రంగాలు మినహా.. మిగిలిన అన్ని రంగాల్లో లైసెన్స్ రాజ్ ను రద్దు చేసి.. 51 శాతం విదేశీ ఈక్విటీతో పెట్టుబడులను ప్రోత్సహించే కొత్త విధానానికి తెరలేపాడు. అలా 34 ప్రధాన పరిశ్రమల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆస్కారం కల్పించాడు.

సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI ఏర్పాటు చేసి… అప్పటివరకు భారతీయ కంపెనీలు నిధులు సేకరించే మార్గానికి ఉన్న ఇబ్బందులను తొలగించాడు. అనవసర వృథా ఖర్చుల తగ్గింపుతో పాటు.. నూతన ఆర్థిక విధానాలపై దృష్టి సారించాడు మన్మోహన్.

ప్రధానంగా తన బడ్టెట్ లో భారత పారిశ్రామిక రంగానికి ఊతమయ్యే విధానాలను దృష్టిలో పెట్టుకున్న మన్మోహన్.. అనిశ్చితిని ఎదుర్కొంటున్న ధరల పెరుగుదలపై కూడా ఫోకస్ చేశారు. దిగువ మధ్యతరగతి పడుతున్న బాధలు.. రెండంకెల స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణం ఆందోళన కల్గిస్తున్న నేపథ్యంలో మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు భారత వ్యవస్థను ఒకింత స్థిమితం చేశాయి. 1991 మార్చి 31 వరకు టోకు ధరల సూచీ 12.1 శాతంతో పెరుగుతుంటే… ఇక వినియోగదారుల సూచీ 13.6 శాతం నమోదు చేసింది. అలా నిత్యావసర వస్తువులపై అమిత ప్రభావం చూపిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో నాడు మన్మోహన్ విజయం సాధించాడు. అదే సమయంలో కార్పోరేట్ వ్యవస్థ నుంచీ విమర్శలెదుర్కొన్నాడు. నాడు బాంబే క్లబ్ గా ఏర్పడ్డ కార్పోరేట్ సెక్టార్ కు అది రుచించలేదు. కానీ ఆ పరిణామాలే నాడు ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాకులోకి తీసుకొచ్చాయి.

మన్మోహన్ సింగ్ ఓ సభలో మాట్లాడుతున్నప్పుుడు ఆయన విజన్ విన్న పీవీ నర్సింహారావుకు ఆయనపై అప్పుడే గురి కుదిరిందట. దాని పర్యవసానమే రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని మన్మోహన్ కేంద్ర ఆర్థికమంత్రిగా పగ్గాలు చేపట్టడం!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles