రాజేశ్ ఖన్నా సినిమాల్లో ఆనంద్ ఎంత పెద్ద హిట్టో చాలామందికి తెలిసిందే. అయితే, ఒక సూపర్ స్టార్ గా ఎదిగి.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సమయంలో రాజేశ్ ఖన్నా.. ఆనంద్ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే నటించారు. కానీ, ఆ తర్వాత ఆయన తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ ను మించి ఆ సినిమా అతడికి సంపదనిచ్చింది. ఆనంద్ సినిమా విషయంలో అసలేం జరిగింది..?
సూపర్ స్టార్ డమ్ అంటే ఏంటనేది.. భారతీయ చలన చిత్రసీమకు చూపించిన హీరోల్లో మొదటివరుసలో ఉండే పేర్లలో రాజేశ్ ఖన్నా పేరొకటి. తనకు దక్కిన అభిమానుల ఫాలోయింగ్, ప్రజాదరణ భారతదేశపు మొదటి సూపర్ స్టార్లలో రాజేశ్ ఖన్నాను ఆ వరుసలో నిలబెట్టింది. 1970 నుంచి 1987 వరకు ఓ సినిమా హీరో అత్యధిక పారితోషికం అందుకున్న నటుల్లో వినిపించే మొదటి పేరు నాడు రాజేశ్ ఖన్నాదే. అమితాబ్ రాక తర్వాత.. తన కెరీర్ అనూహ్యంగా పతనం అంచులకు చేరేవరకూ కూడా వరుసగా 15 హిట్ సినిమాలనందించి రికార్డ్ సృష్టించాడు రాజేశ్ ఖన్నా. అలాంటి సూపర్ స్టార్ గా.. సుప్రీంహీరోగా వెలుగు వెలిగిన రాజేశ్ ఖన్నా ఆనంద్ సినిమాకు మాత్రం పారితోషికంగా ఒక్క రూపాయి తీసుకోలేదు.

అయితే, ఆనంద్ పంపిణీ హక్కులు రాజేశ్ ఖన్నాకు లాభాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రికతో చరిత్రకారుడు దిలీప్ కుమార్ షేర్ చేశారు. తాను తీసుకునే పారితోషకాన్ని మించి.. శక్తిరాజ్ ఫిల్మ్ పేరిట రాజేశ్ ఖన్నా తీసుకున్న ఆ పంపిణీ హక్కులతో.. ఆ సినిమా హిట్టుతో ఖన్నాకు పదిరెట్ల లాభం ఒనగూరిందట.
అయితే, ఆనంద్ సినిమా దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ ముందుగా ఖన్నా పాత్ర కోసం కిషోర్ కుమార్.. అలాగే, ధర్మేంద్రల్లో ఎవర్నైనా తీసుకోవాలని భావించారట. ఆ క్రమంలో ఓసారి చెన్నై నుంచి ముంబైకి ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ధర్మేంద్రకు కథను కూడా వినిపించారట ముఖర్జీ. కానీ, ఆ పాత్రకు రాజేశ్ ఖన్నాను అనుకున్నానని నర్మగర్భంగా చెప్పడంతో ధర్మేంద్ర కొంత ఇబ్బంది పడ్డారట. దాంతో ఖన్నా కోసం ప్లాన్ చేసిన సినిమా తనకెందుకన్నట్టుగా ఆయన తిరస్కరించడంతో.. మళ్లీ హృషీకేశ్ ముఖర్జీ రాజేశ్ ఖన్నాను సంప్రదించారట.
ఆ సమయంలో సూపర్ స్టార్ గా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇస్తూ షెడ్యూల్స్ ఏమాత్రం ఖాళీ లేని సమయంలో రాజేశ్ ఖన్నా బిజీబిజీగా గడుపుతున్నారు. కానీ, ముఖర్జీ పట్టుపట్టడం.. పట్టు వదలకపోవడంతో ఒకటే విడతలో డేట్లు ఇవ్వలేనని.. అలా తన తేదీలు కూడా ఖాళీ లేవన్నారట రాజేశ్ ఖన్నా. కానీ హృషీ దా గట్టిగా పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర సినిమాల కాల్షీట్స్ సర్దుబాటు చేసుకుని ఏకంగా బల్క్ డేట్స్ ఇచ్చారు రాజేశ్ ఖన్నా. అలా ఏకబిగిన సాగిన ఆనంద్ షూటింగ్ ను 28 రోజుల్లో పూర్తి చేశారు ముఖర్జీ.
రాజేశ్ ఖన్నాతో పాటు.. అమితాబ్, సుమితా సన్యాల్ వంటివారు నటించిన ఆనంద్ లో జిందగీ బడీ హోనే చాహియే, లంబీ నహీ వంటి డైలాగ్స్… సలీల్ చౌదరి సంగీతం వహించిన జిందగీ కైసీహై పహేలీ వంటి మన్నా డే పాడిన పాటతో పాటు.. మైనే తేరే లియే హై సాత్ రంగ్ కే సప్నే వంటి పాటలెంత ఎంత సెన్సేషనల్ హిట్టో రెస్టాఫ్ హిస్టరీ.
అయితే, రూపాయి పారితోషికం తీసుకోకున్నా… ఒక కల్ట్ క్లాసిక్ గా నిల్చిపోయిన ఆనంద్ పంపిణీ హక్కులతో రాజేశ్ ఖన్నా తన పారితోషికానికి మించి పది రెట్లు సంపాదించాక అనుకున్నారట.. అన్నీ సమయాల్లో పారితోషికం కోసమే పట్టుబట్టకూడదని.
ఆ తర్వాత మరింత నమ్మకం కుదిరిన రాజేశ్ ఖన్నా… హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో బావర్తి, నమక్ హరామ్, నౌక్రి వంటి సినిమాలు చేయగా.. నౌక్రి మినహా.. మిగిలిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే మరి!



