మేల్ ఛావనిజానికి చెంపపెట్టు.. ఆ రిపోర్ట్!

సినిమారంగంలో మేల్‌ ఛావనిజాన్ని బట్టబయలు చేసిన ‘హేమా కమిటీ నివేదిక’

…………………………………………………………………………………………………..

RamaSundari..✍🏻

మలయాళం సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు, జెండర్‌ అసమానత్వం మొదలైన విషయాలను అధ్యయనం చేయటానికి కేరళ ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిన హేమా కమిటీ నివేదిక ఇప్పుడు బయటకు వచ్చింది. జస్టిస్‌ కె. హేమ, సినిమా నటి శారద, విశ్రాంత ఐఏఎస్‌ ఆఫీసర్‌ కేబీ విశాల కుమారిలతో కూడిన ఈ కమిటీ 2019లోనే తమ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాయి. ప్రభుత్వంలో పలుకబడి ఉన్న మలయాళ సినిమా రంగ దిగ్గజులు ఈ నివేదికను అప్పటి నుండి తొక్కి పెట్టి వుంచారు. పెద్ద ఎత్తున వత్తిడి రావటంతో, ఆర్‌ టీఐ చట్టం కింద -ఈ రిపోర్టు ఇప్పుడు వెలుగు చూసింది. 295 పేజీల ఈ నివేదికలో 63 పేజీలను తొలగించి ప్రజలకు అందుబాటులో ఉంచారు. తొలగించిన పేజీలలో ఏమున్నాయో కానీ, బహిర్గత పరిచిన పుటలలో దిగ్భ్రాంతికి గురి చేసే అనేక వాస్తవాలను ఈ నివేదిక బయట పెట్టింది.

2017లో భావన అనే నటిని స్టార్‌ నటుడు దిలీప్‌ కనుసన్నలతో కిడ్నాప్‌ చేసి, ఒక కారులో లైంగిక వేధింపులు జరిపిన నేపథ్యంలో మలయాళ సినిమా మహిళా నటులతో ఏర్పడిన ‘విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ సభ్యులు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన హేమా కమిటీ మలయాళ సినిమా రంగంలో ఉన్న లైంగిక దోపిడి, చట్ట విరుద్ధ బాన్‌ లు, వివక్షలు, మత్తుమందులు, తాగి చేసే అల్లర్లు, వేతనాలలో తేడాలు, అమానవీయ పని పరిసరాలు గురించి వివరంగా చర్చించింది. సినిమా ఆర్టిస్టులకు మరుగు దొడ్లు కూడా లేకపోవటం, చిన్న నటులకు బట్టలు మార్చుకునే సదుపాయాలు కూడా లేకపోవటం లాంటి విషయాలను ఈ నివేదిక ఎత్తి చూపించింది. మలయాళ సినిమా రంగం మాఫియాగా పిలవబడే కొంతమంది దర్శకులు, నటులు, నిర్మాతల ఉక్కు పంజాలో ఉందని ఈ కమిటీ పేర్కొంది. వినోద ప్రపంచంలోని పని స్థలాల్లో మృగ్యమైన నైతిక విలువల గురించి మొత్తంగా ఈ నివేదిక చర్చించింది.

బాధితులు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి కమిటీ సభ్యులు ఈ నివేదికను తయారు చేశారు. ‘స్త్రీవాద పరిశీలనా పద్దతులను’ ఉపయోగించి ఈ నివేదికను తయారు చేశామనీ, చాలామంది బాధితుల ‘నిశ్శబ్దాన్ని’ కూడా పరిగణనలోకి తీసుకున్నామని కమిటీ సభ్యులు తెలియచేసారు. నటులు సిద్దిక్‌, జయసూర్య; దర్శకుడు రంజనిత్‌ బాలకృష్ణన్‌ లాంటి వుద్దండుల పేర్లు ఆరోపణకు గురి అయిన వారిలో ఉన్నాయి. వాళ్లు వెనువెంటనే తాము సభ్యులుగా ఉన్న వివిధ అధికార చలనచిత్ర సంస్థల నుండి రాజీనామా చేశారు. ఈ నివేదిక ఇచ్చిన దన్నుతో నటుడు, సిపియం ఎమ్మెల్యే ముఖేష్‌ మీద కూడా అత్యాచార కేసు వెనువెంటనే నమోదు అయింది. హేమా కమిటీ నివేదికకు బాధ్యత వహిస్తూ అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) నాయకత్వం ఒక్కొక్కరుగా తొలగిపోయారు. అయిష్టంగా తొలగి పోయిన వారిలో అగ్ర నటుడు మోహన్‌ లాల్‌ కూడా ఉన్నాడు.

కేరళ ప్రభుత్వం ఈ నివేదికను తొక్కి పెట్టినా, ఆలస్యంగా ఐదేళ్ల తరువాతనైనా ఈ రిపోర్ట్‌ బయటకు రావటం సంతోషించదగ్గ విషయం. ఈ రిపోర్ట్‌ మలయాళం సినిమాకున్న అభ్యుదయ ముఖాన్ని బట్టబయలు చేసింది. మగవాళ్లు ఎక్కడైనా మగవాళ్లే అని రుజువు చేసింది. అయితే -నటనను ఒక వృత్తిగా, సినిమా రంగాన్ని ఇతర పరిశ్రమల లాగానే ఒక పరిశ్రమగా భావించి, అందులో కెరీర్‌ నిర్మించుకోవాలని వచ్చే వేలాది యువతులకు కొండంత ఊరట కలిగించింది ఈ నివేదిక. గతంలో జరిగిన ‘మీ టూ’ ఉద్యమం, సినిమాల్లో అవకాశం ఇవ్వటానికి సెక్సువల్‌ ఫేవర్‌ అడిగే ‘కాస్టింగ్‌ కౌచ్‌’ పద్దతుల మీద జరిగిన చర్చలు -కొంతవరకు మగ ఆధిపత్యాన్ని నిలదీసాయి. అయితే హేమా కమిటీ నివేదిక మాత్రం ‘రాజుగారి దుస్తుల’ రహస్యాన్ని బట్టబయలు చేసింది.

ఈ కమిటీ వేయటానికి, నివేదిక బయటకు రావటానికి కష్టపడిన 12మంది ‘విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ సభ్యులను అభినందించాల్సిందే. అందులో మహిళా నటులు ఊర్వశి, పార్వతి, రేవతి కూడా ఉన్నారు. వారి పనికి ప్రతిఫలంగా వాళ్లు ఎన్నో వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా ఏళ్లు అప్రకటిత నిషేధాన్ని వారిపై విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ‘విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ సభ్యులు ఛాలంజింగ్‌గా పని చేసారు. యూనియన్లను, అసోసియేషన్లను పెట్టి లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పని స్థలాల్లో అమలు చేయించారు.

మగమహారాజుల సినీరంగ నిరంశకృత్వానికి బలైపోయి ఆత్మహత్యలు చేసుకొన్న నటులు శోభ, స్మితా, ఫటాఫట్‌ జయలక్ష్మీ -ఇంకా తమ కలలు భగ్నం అయి జీవితం నుండీ, సినిమా రంగం నుండి మాయమై పోయిన అనేకమంది మహిళా సినిమా ఆర్టిస్టులకు ఈ నివేదిక నివాళులు అర్పించినట్లైంది. నటి పార్వతి తిరువోతు అన్నట్లుగా మలయాళ సినిమాల గురించి వచ్చిన ఈ నివేదిక, మలయాళ సినిమా కుళ్లిపోయిందని చెప్పటం లేదు. మలయాళం సినిమా ఆ కుళ్లులో నుండి బయట పడగలదని చెబుతోంది.

ఇలాంటి కమిటీలను తమిళ సినీ పరిశ్రమలో కూడా వేయాలని సినీ నటి సమంత కోరారు. తమిళ పరిశ్రమ అనే కాదు దేశవ్యాప్తంగా అన్నీ భాషల సినిమా పరిశ్రమల్లో, ముఖ్యంగా పూర్తి స్థాయిలో కమర్షియలైజ్‌ అయిన బాలీవుడ్‌ లో ఇలాంటి కమిటీలను వేయాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమను ఏలుతున్న మేల్‌ ఛావనిజానికి మంగళం పాడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles