పోరాటమంటే ఎలా ఉండాలి..? సాధించుకునేంతవరకూ పట్టు వదలనిదై ఉండాలి.. ఏ సమాజమైతే చూసి నవ్విందో.. ఆ సమాజాన్ని తన దగ్గరకు తెచ్చుకోవాలి. అందుకు ఉదాహరణ గుజరాత్ కు చెందిన గణేశ్ బరైయా.
కేవలం 3 అడుగులు, 72 శాతం వైకల్యం.. మొత్తంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ గణేశ్. సుప్రీంకోర్ట్ వరకూ వెళ్లి తాననుకున్న చదువులు పూర్తి చేసి ఇప్పుడు మెడికల్ ఆఫీసరయ్యాడు.
చిన్నప్పట్నుంచీ నువ్వేం కావాలనుకుంటున్నావంటే.. చాలామందిలాగే డాక్టర్ అని చెప్పేవాడు గుజరాత్ భావానగర్ లోని గోర్టి గ్రామానికి చెందిన గణేశ్.
25 ఏళ్ల యువకుడైన బరైయా పుట్టుకతో పోలియోతో అంగవైకల్యంతో పుట్టాడు. ఎందుకూ సహకరించని తన శరీరం ఓవైపు బాధపెడుతుంటే… సమాజం అనవసర సానుభూతితో అవమానపరుస్తుంటే.. గణేశ్ మాత్రం సంకల్పంతో ఎదిగాడు. తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. తాననుకున్న లక్ష్యంవైపు అడుగులేసి డాక్టరై, ఇప్పుడేకంగా ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ అయ్యాడు.

గణేశ్ బరైయాది ఓ రైతు కుటంబం. 72 శాతం అంగవైకల్యంతోనే న్యాయపోరాటాలు చేశాడు. ఎన్నో సవాళ్లను అధిగమించాడు. అపజయాలు పలకరించిన ప్రతీసారీ విజయం ముందుందన్న విశ్వాసాన్నుంచాడు. చివరకు తన కష్టానికి తగ్గ ఫలితం రానే వచ్చింది. భావానగర్ లోని తాక్తాసింహ్జీ జనరల్ హాస్పిటల్ లో క్లాస్ 2 మెడికల్ ఆఫీసర్ గా పదవనిలంకరించాడు.
తన ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లెదురైనా తన జర్నీ ముందుకు సాగడానికి తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, తన గురువులే కారణమంటున్నాడు ఈ డాక్టర్ గణేశ్. ఇవాళ తాను మెడికల్ ఆఫీసర్ గా ఎదిగానంటే… అందుకు తన మెంటార్ మార్గనిర్దేశనమే కారణమంటాడు. తన విజయాన్ని దల్పత్ కటారియా, నీలకంఠ్ విద్యాపీఠానికి చెందిన రేవత్ సింగ్ సర్వైయాకు, తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు.
కటారియాగారు చెప్పిన మాట నాకింకా గుర్తే. నువ్వు ప్రపంచంలోనే అతి చిన్న డాక్టర్ అయ్యే అవకాశాలున్నాయని ఆయన పదే పదే చెప్పేవారంటాడు డాక్టర్ గణేశ్. భావానగర్ లోని నీలకంఠ విద్యాపీఠంలో 12వ తరగతి వరకూ బైపీసీ చదివి తన లక్ష్యానికి తొలి అడుగులనేర్పర్చుకున్నాడు.
గణేశ్ ఆరాధించే తన గురువు కటారియా మాట్లాడుతూ.. ఒక రైతు కుమారుడు, 72 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదని.. దాని వెనుక ఎంతో కష్టముందంటాడాయన. కలలు నిజమవుతాయంటారు.. అలాంటి తన కలను సాకారం చేసుకున్న వ్యక్తి గణేశ్. స్వప్నాలు నిజమవుతాయంటుంటారు. దాన్ని గణేశ్ నిజం చేసి చూపించాడంటాడు కటారియా.
గణేశ్ తండ్రి విఠల్ భాయ్ బరైయా ఓ రైతు. చిన్నప్పుడు గణేశ్ మరుగుజ్జుతనాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు కొందరు జాదూగర్లు సర్కస్ కు తీసుకెళ్లేందుకు విఠల్ భాయ్ దగ్గరకు వచ్చేవారు. కానీ, విఠల్ భాయ్ నమ్మలేదు. కొడుకును అపహరిస్తే అన్న అనుమానంతో సర్కస్ జాదూగాళ్లను దగ్గరకు రానివ్వడమే మానేశాడు.

9వ తరగతిలో నీలకంఠ విద్యాపీఠంలో చేరాకే.. గణేశ్ బరైయాలో ఎలాగైనా డాక్టర్ కావాలనే ఒక సంకల్పం ఏర్పడింది.
సైన్స్ లో మంచి పెర్ఫార్మర్ గా ఉన్న గణేశ్.. 2018లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గణేశ్ ప్రతిభను పక్కనబెట్టి.. అతడి వైకల్యాన్ని బూచిగా చూపిస్తూ ఎంబీబీఎస్ సీట్ నిరాకరించింది. అయితే, అదే సమయంలో గణేశ్ చదివిన నీలకంఠ విద్యాపీఠం యాజమాన్యమే తన కోసం లీగల్ ఫైట్ కు దిగాలని నిర్ణయం తీసుకుంది. గణేశ్ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంతమాత్రం కావడంతో తొలుత పోరాటంలో కాస్త నీరసపడ్డాడు. కానీ, నీలకంఠ విద్యాపీఠం యాజమాన్యం అన్ని ఖర్చులు తాము చూసుకుంటామన్న భరోసాతో గణేశ్ బరైయా తన పోరాటాన్ని కొనసాగించటాడు.
మొట్టమొదట ఎంసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేశాడు. కానీ, గుజరాత్ హైకోర్ట్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది. దాంతో గణేశ్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. 2018, అక్టోబర్ 22వ తేదీన సుప్రీం తీర్పు వెలువడింది. సుప్రీం తీర్పు గణేశ్ పక్షాన నిలబడింది. వికలాంగుడనే పేరుతో చదువును నిరాకరించడం ఏమాత్రం సమంజసం కాదంది. డాక్టర్లు పరిపాలన, రేడియాలజీ, సైకాలజీ వంటి నాన్ క్లినికల్ విభాగాల్లో కూడా పనిచేస్తారని సుప్రీంకోర్ట్ పేర్కొంది.
సుప్రీం తీర్పుతో భావానగర్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ లో జాయినయ్యాడు గణేశ్. అక్కడికెళ్లిన గణేశ్ పట్టుదలను అభిమానించిన వైద్య కళాశాల ప్రొఫెసర్స్, డీన్స్, విద్యార్థులంతా అతణ్ని లోపలికి ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు.
గణేశ్ ఓవైపు ఎంబీబీఎస్ సీటు కోసం ఎంసీఐపైన న్యాయపోరాటం చేస్తూనే.. ఆ సమయంలో ఖాళీ ఉండకుండా మరోవైపు బీఎస్సీ చేశాడు.
గణేశ్ కు కళాశాలలో స్నేహితులు తోడ్పాటునందించి మొదటి సీట్లల్లోనే తనను కూర్చునిచ్చేవారు. మొదటి సెమిస్టర్ లో గణేశ్ రాయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు తన సీనియర్ డాక్టర్ యాష్ దవే అతడికి ఓ రైటర్ ని కూడా ఏర్పాటు చేశాడు. అలా క్యాంటీన్ సిబ్బంది నుంచి నర్సింగ్ కోర్స్ చేసేవారి వరకూ అందరూ గణేశ్ అంటే ప్రేమ, ఆప్యాయత చూపేవారు.
తన ఎంబీబీఎస్ పూర్తై ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా తనకొచ్చే స్టైపండ్ తో చిన్న చిన్న గిఫ్టులను రోగులకు బహుమతులుగా ఇవ్వడం.. ముఖ్యంగా పెడియాట్రికి రోగులను చూసుకోవడానికి అదనపు సమయం కేటాయించడం వంటివన్నీ అలవాటు చేసుకున్నాడు. ఒక్కసారి కనెక్టైతే చాలు గణేశ్ ను అభిమానించేవారే కనిపించే నడవడిక తన కెరీర్ లో ఉపయోగపడింది.
మెడికల్ ఆఫీసర్ గా గణేశ్ జీవితం!
కొంతమంది రోగులు తనను డాక్టరా అని చూసి ఆశ్చర్యపడుతుంటారంటాడు గణేశ్. కొందరికి అప్పటికే తాను తెలిసి ఉండటం వల్ల చాలామంది సానుకూలంగా తన కెరీర్ నిర్మాణం పట్ల స్పందిస్తారంటాడు. డాక్టరంటేనే సాధారణంగా భయపడే పిల్లలు తనతో కలిసిపోయేంత చనువుగా వ్యవహరిస్తాడని గణేశ్ కు పేరు. భవిష్యత్తులో పెడియాట్రిక్స్, డెర్మటాలజీలో పీజీ పూర్తి చేయాలన్నది గణేశ్ ముందున్న లక్ష్యం. డాక్టర్ గా తను సాధించిన విజయంతో.. తనకు ఎంబీబీఎస్ సీట్ ఇవ్వడానికే నిరాకరించిన ఎంసీఐనే మరుగుజ్జుగా నిలబెట్టి.. ఇవాళ సోషల్ మీడియాలోను స్టార్ అయ్యాడు గణేశ్.



