బాలీవుడ్ సెన్సేషన్.. 30 ఏళ్ల రంగీలా!

బాలీవుడ్ రంగుల లోకాన్ని షేక్ చేసిన.. 30 ఏళ్ల రంగీలా!

రాంగోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్!

1995 బాలీవుడ్ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన సంత్సరం. అప్పటివరకూ ఉన్న ట్రెండ్ ను బద్ధలు కొట్టి సినిమాకు ఓ కొత్త నిర్వచనమిచ్చిన చిత్రం రంగీలా!

విడుదలై 3 దశాబ్దాలైనా.. ఇప్పటికీ ఆ చిత్రానికి మాత్రమే ప్రత్యేకమైన గ్లామర్, హ్యూమర్, రొమాన్స్ వంటివాటితో భారతీయ సినీ ప్రపంచంలో మాడర్న్ ఏజ్ చిత్రమెలా ఉంటుందో చూపింది. సంప్రదాయవాదులు కాస్త ముఖం చిట్లించినా…

1990-2000 మధ్య కాలంలో హిందీ సినిమా ఒక క్రాస్ రోడ్డులో నిల్చుంది. ఓ సందిగ్ధావస్థను ఎదుర్కొంటోంది. ఆ సందర్భంలో రంగీలా ఓ పెను సంచలనమై తెరపైకొచ్చింది. ఫ్యామిలీ మెలోడ్రామాల రొడ్డకొట్టుడుకు బ్రేకప్ చెప్పాలనే సంకేతాన్నిచ్చింది. కేబుల్ టీవీల విప్లవం… ఎంటీవీ వంటి ఛానల్స్ వల్ల వచ్చిన గ్లోబలైజ్డ్ కల్చర్ కు ఆకర్షితులవుతున్న యువత సినీదాహాన్ని తీర్చిన ప్రియమైన సినిమా రంగీలా.

మారుతున్న కాలానికి ప్రతిబింబంగా.. దాన్ని మరింత క్రియాశీలకంగా చూపించడంలో వర్మ ప్రయత్నం విజయవంతమైంది. వర్మ టేకింగ్ బాలీవుడ్ ను ఆధునికత వైపు అడుగులు వేయించింది.

పైకి చూస్తే ఓ ముక్కోణపు ప్రేమ కథ రంగీలా. స్టార్ డమ్ కోసం కలలు కనే ఓ మధ్య తరగతి అమ్మాయి, ఆమె చిన్ననాటి స్నేహితుడు, ఒక సినీ సూపర్ స్టార్ హీరో మధ్య నెలకొనే సంఘర్షణ. కానీ, దాన్నే రంగు రంగుల్లో చిత్రీకరించి.. రంగీలా పేరుకు శాశ్వతత్వం ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. కథ కన్నా కూడా కథనానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వర్మ.. అలాంటి టేకింగ్ తోనే.. స్టైల్, ఎనర్జీ అనే ఫ్లేవర్స్ ను రంగీలాకు అదనపు ఆకర్షణలు చేశాడు. ఆధునిక రొమాంటిక్ లవ్ మూవీ ఏ విధంగా తీయాలో తక్కిన సినీ ప్రపంచం ఆలోచించేలా చేశాడు.

నగరాల్లో ఉండే అధివాస్తవికతను కళ్లకు కట్టాడు. సినిమాలో మెలోడ్రామా ఉన్నా దాన్ని ఎంతవరకో అంతే పరిమితం చేశాడు. ఆ మెలోడ్రామాలోనే ముంచి వీక్షకుణ్ని సినిమాను లాగించి, బోర్ తెప్పించే సంస్కృతిని తిరస్కరించాడు. ఒక కొత్త సినిమాటిక్ భాషను బాలీవుడ్ కు పరిచయం చేశాడు. అప్పటివరకూ చూడని స్క్రీన్ ప్రెజెంటేషన్ తో.. ముంబై థియేటర్లు రంగీలాను కళ్లకు అద్దుకున్నాయి. ఓ దక్షాణాది చిత్ర దర్శకుడు రూపొందించిన చిత్రానికి పెరుగుతున్న ఆదరణతో విస్తుపోయాయి.

వర్మ టేకింగ్.. తన ఆలోచనలను ప్రస్ఫుటించే స్క్రీన్ ప్రెజెంటేషన్ కు తోడు… ఏ. ఆర్. రెహ్మాన్ తోడయ్యాడు. నేరుగా బాలీవుడ్ లో అడుగుపెట్టడం.. వర్మే ఊహించని రీతిలో సంగీతాన్నందించడంతో రంగీలా ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. అప్పటికే రోజా, దొంగ దొంగ వంటి హిట్స్ తో ఊపు మీదున్నాడు రెహమాన్. తన ఆరంగేట్రమే బాలీవుడ్ ను షేక్ చేసి పడేసింది. అప్పటివరకూ కొనసాగుతున్న బాలీవుడ్ మూస తరహా పాటలకు భిన్నంగా రంగీలా ట్యూన్స్ వినిపించాయి. సంగీతంలోని ఆ సౌండ్స్ మెస్మరైజ్ చేసింది. రెహమాన్ పాటలొక వైపు… వర్మ టేకింగ్ ఇంకోవైపు రెండూ పోటీ పడి ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. థియేటర్ల బాట పట్టించాయి.

కామవర్ధిని రాగంలో అందుకునే హాయ్ రామా వంటి క్లాసికల్ టచ్ ఉన్న సంగీతం, చిత్రీకరణ.. బాలీవుడ్ అప్పటివరకూ చూడని దృశ్యశ్రవణంగా నిల్చింది. తన్హా తన్హా వంటి ఉత్సాహభరితమైన రొమాంటిక్ సాంగ్స్ ను అసలు అలా చిత్రీకరిస్తారనే కనీసం అంచనా కూడా వేయలేని సామాన్యుడికి.. హాలీవుడ్ ను తలపించే నయనానుభూతితో పాటు.. శ్రవణానందాన్నిచ్చింది. ఆరోజుల్లో ఏ కేసెట్స్ షాప్స్ కు వెళ్లినా రంగీలా ముందు కనిపించాల్సిందే. ఎక్కడికెళ్లినా ఎక్కడో ఓ చోట రంగీలా పాట మోగాల్సిందే. ప్రతీ కాలేజ్ ఫెస్ట్ లో ఆ పాటలుండాల్సిందే. ఓవరాల్ గా ఎంటీవీ పాప్ గ్లోబల్ కల్చర్ కు ఏ మాత్రం తగ్గకుండా వర్మ కొరియాగ్రాఫర్స్ తో చేయించిన మాంటేజ్ లు జనాల్ని వెర్రెక్కించాయి.

1995లో విడుదలైన అనేక ప్రధాన చిత్రాల మధ్య కేవలం రంగీలాలో మాత్రమే విభిన్నమైన సంగీతం వినిపించింది. ఆ విభిన్నత కూడా ఆకట్టుకునేలా ఉండటంతో.. జనం అంతకంతకూ ఆదరించారు. దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, బాంబే, అకేలే హమ్ అకేలే తుమ్, బర్సాత్ వంటివెన్నో విడుదలైన నాటి రోజుల్లో.. వాటన్నింటికీ భిన్నంగా రంగీలా సంగీతం నిల్చింది. వర్గాలు, వయస్సన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. సంగీతంలో రెహమాన్ చూపించిన కొత్తదనం.. అప్పటివరకూ విన్నపాటల నుంచి వేరు చేసి తాజాదనాన్నందించింది. అలా బాలీవుడ్ సౌండ్ స్కేప్ నే పునర్నిర్వచించిన చిత్రం రంగీలా.

నాస్టాల్జియాగా ఆశా గొంతులో తన్హా తన్హా!

60 ఏళ్ల వయస్సులోనూ ఆశాభోంస్లే తన్హా తన్హా పాటలో చూపించిన ఉత్సాహం కుర్రకారును మత్తెక్కించింది. ఇప్పటికీ ఆ పాట ఎందరి ప్లే లిస్టుల్లోనో నాస్టాల్జియా. రెహమాన్ తన పాటలతో ఆ చిత్రానికి ఊపిరి పోస్తే.. ఊర్మిళా మతోంద్కర్ రంగీలా ముఖచిత్రమైంది. రంగీలా గర్ల్ గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నటనలో ఆమె ఈజ్, సెన్సిటివిటీ బాలీవుడ హీరోయిన్ ను రీడిఫైన్ చేసింది.

అప్పటికింకా ఓ అనామకుడైన మనీష్ మల్హోత్రా రంగీలాతో బాలీవుడ్ లోనే టాప్ ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగాడు. వర్మ కోరుకున్న విధంగా, ఊర్మిళా మతోంద్కర్ డ్రెస్ డిజైన్స్ చేశాడు. దుస్తుల నుంచీ క్రాప్ టాప్స్, పై వైస్ట్ స్కర్ట్స్, బాడీ హగ్గింగ్ డ్రెస్సెస్ వంటివాటితో ఊర్మిళను ఆధునికకాలపు యువతిగా మార్చి ఐకానిక్ డిజైన్స్ తో అలరించాడు. ఆత్మవిశ్వాసంతో కనిపించే ఒక క్యారెక్టర్ కు గ్లామర్ ను అద్దాడు. ఆ సమయంలో అమ్మాయిలంతా ఊర్మిళలా ఉండాలని కోరుకునేలా తయారుచేశాడు. రంగీలా రే పాటలో ఊర్మిళ వేసిన దుస్తులు, షూస్ ఆ తర్వాత ముంబై గర్ల్స్ ఎందరో విధిగా ఫాలో అయ్యారంటే మనీష్ గ్రూమింగ్, డిజైనింగ్ ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. మనీష్ మల్హోత్రా అనే వ్యక్తి టాప్ మోస్ట్ గా ఎదిగేందుకు రంగీలా ఓ లాంచ్ ప్యాడ్ అయింది.

ఊర్మిళ చుట్టే కథ తిరిగినా… మున్నాగా అమీర్ ఖాన్ చేసిన పాత్ర చిత్రాన్ని హ్యూమర్ గా నడిపించింది. వీధి భాష, ఓవర్ సైజ్డ్ షర్ట్స్ తో కాస్తా పోకిరీలా కనిపించే అమీర్ ఖాన్ వేషధారణ కూడా రంగీలాలో ప్రత్యేకం. అప్పటివరకూ చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో ఉన్న అమీర్ దాన్నుంచి బయటపడటానికి కెరీర్ లో రంగీలా ఒక కొత్త అవకాశంగా అందివచ్చింది.

రాజ్ పాత్రలో జాకీ ష్రాఫ్ ఒక సూపర్ స్టార్ ఎలా ఉండాలో సరిగ్గా అతికాడు. తక్కువ మాటలు, డేగ చూపులతోనే జాకీష్రాఫ్ పాత్రను వర్మ డిజైన్ చేసిన తీరు కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. విలన్ అనే క్యారెక్టర్ ప్రత్యేకంగా అక్కర్లేకుండానే… త్రికోణపు ప్రేమలోనే కలిగే వేదనలు, అలకలు, అపార్థాలు, సంక్లిష్ఠతలనే విలనిజంలా వర్మ రాసుకున్న స్క్రీన్ ప్లే అద్భుతంగా పండింది.

ఆర్టిస్టులకు తోడు వర్మ దిశానిర్దేశంలో హ్యాండ్ హెల్డ్ కెమెరాల పనితనం, డైనమిక్ ట్రాకింగ్ షాట్స్ చిత్రీకరణ వల్ల రంగీలా ఒక లైవ్లీనెస్ ను సంతరించుకుంది. బాలీవుడ్ అప్పటివరకూ యోచించని రీతిలో ఆధునికతను సినిమాటిక్ గా మల్చడంలో వర్మ రంగీలాతో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.

రంగీలాలో నటులే కాదు.. ముంబై పరిసరాలను కూడా పాత్రధారుల్లా మల్చాడు వర్మ. ఊర్మిళ క్యారెక్టరైన మిలి అనే ఓ అనామక యువతి స్టార్ డమ్ అందుకునే ప్రయాణంలో నేపథ్యంగా నిల్చిన ప్రతీ వీధి, ప్రతీ నేపథ్యం కొత్తగా కనిపించాయి. అప్పటివరకూ స్టూడియో సెట్లపైన ఆధారపడుతున్న బాలీవుడ్ కు.. ఔట్ డోర్ యూనిట్లలో రంగీలా చిత్రీకరణతో ఓ కొత్త మార్గాన్ని ముందుంచాడు వర్మ.

1995, సెప్టెంబర్ 8వ తేదీన రంగీలా విడుదలైనప్పుడు అదొక హిట్ట్ మాత్రమే కాదు.. కల్చరల్ రీసెట్. ఫ్యాషన్ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన సినిమా. కొత్తతరం దర్శకులను ఆకట్టుకునేందుకు వర్మ శైలి ఒక ఇన్స్పిరేషన్. అందుకే రంగీలా బెస్ట్ స్టోరీ, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ కొరియోగ్రఫీ సహా.. ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెల్చుకుంది. ఊర్మిళ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మణిరత్నం చొరవతో మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఏ. ఆర్. రెహ్మాన్.. ఆ తర్వాత జాతీయరత్నమయ్యాడు. మనీష్ మల్హోత్రా బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్స్ కి స్టైలిస్ట్ డిజైనరయ్యాడు.

రంగీలాతో చరిత్ర సృష్టించిన వర్మ.. ఆ తర్వాత మాత్రం తన ట్రెండ్ మార్చాడు. బాలీవుడ్ పై రంగీలాతో తన మార్క్ సిగ్నేచర్ చేసి.. సత్య, కంపెనీ వంటి మాఫియా నేపథ్యమున్న సినిమాలవైపు ప్రయాణించాడు. వర్మ కెరీర్ లో ఒక రంగుల కలలా గీసిన చిత్రం రంగీలా.

యారో సున్ లో జరా, మంగ్తా హై క్యా పాటలు ఇప్పటికీ వినండి.. ఓసారలా 90ల్లోకి మళ్లీ పయనిస్తున్నామేమో అన్నట్టుగా వినిపిస్తాయి ఆ సౌండ్ ట్రాక్స్.

బాలీవుడ్ పరిశ్రమ దిశనే మార్చేసిన సినిమాగా.. రంగీలా ఎప్పటికీ చెరిగిపోని ఓ రికార్డ్ అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles