పోరాట సన్నివేశాల వెనుక.. భద్రత లేని స్టంట్ బతుకులు!

ఈమధ్య తమిళ్ సినిమా షూటింగ్ లో ఓ స్టంట్ మాస్టర్ మరణం.. వారి జీవితాలెంత భద్రమనే ప్రశ్నను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ముందుంచుతోంది.

వాస్తవికతకు దూరంగా.. డ్యాన్సులు, ఫైట్లుంటేనే సినిమాలు చేస్తామనే సూపర్ స్టార్ కల్చర్ కొనసాగుతున్న రోజుల్లో.. ఆ స్టంట్స్ ఒకదాన్ని మించి ఇంకొకటి ఉండాలన్న తాపత్రయంలో… అదీ వాళ్లు చేయలేనిదాన్ని స్టంట్ మాస్టర్స్ తో చేయిస్తూ సినిమా వెర్రి ప్రేమికుల ముందు హీరోలుగా చలామణి అవుతున్నవారి కాలంలో.. అసలు స్టంట్ మాస్టర్ జీవన భద్రతెంత..?

1980, నవంబర్ 16వ తేదీ.. మళయాళ సూపర్ స్టార్ జయన్ చెన్నై సమీపంలోని షోలవరంలో కోలిలక్కం అనే సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో పాల్గొన్నాడు. గాల్లోకెగురుతున్న హెలిక్యాప్టర్ పై స్టంట్ సీన్ అది. అది ఒకసారి టేక్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నాడు. కానీ, సదరు జయన్ కు అదెందుకో అంతగా తృప్తినివ్వలేదు. రీటేక్ కు వెళ్లాడు. అదే అతని చివరి షూటింగ్ అయిపోయింది. హెలిక్యాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. జయన్ మృత్యువాత పడ్డాడు. అప్పుడు జయన్ వయస్సు 41 ఏళ్లు.

అక్కడ కట్ చేస్తే.. నాల్గు దశాబ్దాల తర్వాత ఈమధ్యే అదే తమిళనాడు నాగపట్నంలో అలాంటి మరో కథే పునరావృతమైంది.

2025, జూలై 13… ఎస్. మోహన్ రాజ్… తమిళ సినీ పరిశ్రమలో ఎస్.ఎం. రాజుగా ప్రసిద్ధి చెందిన స్టంట్ మాస్టర్. పా రంజిత్ తీస్తున్న నూతన చిత్రం వెట్టువం కోసం హై స్పీడ్ కార్ స్టంట్ చేస్తూ అదుపుతప్పి అందని లోకాలకు వెళ్లిపోయాడు. చిత్రీకరణ సమయంలో వాహనం బోల్తా పడితే.. ఆసుపత్రికి తరలించినా రాజు ప్రాణాలకు భరోసా దక్కలేదు.

గత ఏడాది 2024లో బ్రోమాన్స్ అనే సినిమా షూటింగ్ లో అర్జున్ అశోకన్, సంగీత్ ప్రతాప్ గాయాలపాలయ్యారు. అంతేకాదు, అతివేగంగా వాహనం నడిపినందుకు వారిపై ఆర్టీఏ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఇక 2016లో మస్తీ గుడి అనే సినిమా షూటింగ్ సమయంలో ఉదయ రాఘవన్, అనిల్ కుమార్ అనే ఇద్దరు స్టంట్ మెన్ లైఫ్ జాకెట్స్ లేకుండానే హెలిక్యాప్టర్ నుంచి రిజర్వాయర్ లో దూకి మునిగిపోయారు. లైఫ్ జాకెట్ వేసుకుని దూకిన మరో నటుడు మాత్రం బతికి బట్టకట్టాడు.

భారతదేశంలోని బాలీవుడ్ అనే కాదు.. ఇప్పుడు టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని వుడ్లూ కలిసి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను నిర్మించే స్థాయికెదుగవచ్చేమోగానీ… ఇప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్టంట్ కళాకారులు మాత్రం దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు. పైగా వారి భద్రతకు ఎలాంటి భరోసా లేకపోవడం విషాదం.

ఒక రాజో, రాఘవనో, మరో అనిలో ఎవరో ఒకరు చనిపోయిన ప్రతీసారీ ఇలాంటి ప్రశ్నలుద్భవిస్తాయి. కానీ, బాధ్యత వహించేవారెవరు..? ఇలాంటివాటి పట్ల ఇంత సాయం చేయడానికో, లేక ఒక పరిమితితో పనిచేయడానికో చట్టాలెందుకు లేవన్నదీ ప్రశ్నే..? ఈ పరిశ్రమలో ఇలా ఇంకెందరు చనిపోతేగానీ.. ఎంత మంది తమ జీవితాల్ని త్యాగం చేస్తేనేగానీ చర్యలు మొదలైతాయి..? ఇదిగో ఒక క్వొశ్చన్ పేపరే కనిపిస్తుంది.

అయితే, ఈ విషాదాలను, విచారకర ఘట్టాలను ఏ ప్రొడ్యూసర్ కో, దర్శకుడికో మాత్రమే ఆపాదించేవి కావు. సదరు స్టంట్ మాస్టర్స్ కు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏది చేయగలమో, ఏదీ చేయలేమో అంచనా లేకుండా చేస్తూ పోతే.. ఎప్పుడో ఒకప్పుడు ఒక రాజులాగానో, ఓ అనిల్ లాగానో అసువులుబాసి.. ఓ నాల్గు రోజులు చర్చకు తావివ్వడం తప్ప పోయిన విలువైన ప్రాణాలైతే తిరిగిరావు.

దర్శకుడి ఆలోచనల ప్రకారం ప్రొడక్షన్ టీం జస్ట్ ఒక ఐడియా చెబుతుంది. దాన్ని ఎలా చిత్రీకరించడమనేది పూర్తిగా స్టంట్ మాస్టర్ క్రియేటివిటీకి సంబంధించిన విషయం. పని చేసే తమ యూనిట్ కు కావల్సిన బెల్టులు, రోప్స్, క్రాష్ మ్యాట్స్, తాళ్లవంటివన్నీ దాదాపుగా ఆయా స్టంట్ మాస్టర్సే తమ వెంట తెచ్చుకుంటుంటారు.

కానీ, ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్ కు సంబంధించి ఒక ప్రోటోకాల్ లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చెలరేగే ప్రశ్నలకు కారణమంటారు కొందరు స్టంట్ ఆర్టిస్ట్స్, అండ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.

ప్రతీ సినిమాలో ఒక్కో స్టంట్ ఒక్కో విధంగా ఉంటుంది. దాన్ని రిహాల్సల్స్ చేసి నటులకు శిక్షణ ఇచ్చి షూటింగ్ చేస్తుంటారు. కానీ, కొన్ని సీన్స్ లో నటుల స్థానంలో స్టంట్ మాస్టర్సో, వారి అసిస్టెంట్సో డూప్స్ గా పనిచేయాల్సి ఉంటుంది. కొందరు స్టంట్ మాస్టర్ల ఏళ్ల అనుభవం కూడా వారి అతి విశ్వాసానికి దారితీసి ప్రమాదాలకు కారణమవుతున్న దాఖలాలూ ఉన్నాయి. అందుకే, స్టంట్ మాస్టర్స్ ఏ కొత్త స్టంట్ చేస్తున్నా.. అది వారికి కొత్తదే తప్ప.. అనుభవజ్ఞులం కదా అని ఏమరుపాటు ప్రదర్శిస్తే ప్రాణాలకే ప్రమాదం.

పోనీ, స్టంట్ మాస్టర్స్ గా పనిచేస్తున్నవారిని హైర్ చేసుకున్నప్పుడు గాయాలు, ప్రమాదాలేవైనా జరిగితే తమదే బాధ్యత అని అంగీకరిస్తున్నట్టు పత్రాలపై సంతకాలు చేయించే సంస్కృతి ఉందా.. అంటే అది అనైతికమైన చర్య. చట్టబద్ధంగా కూడా అది నిలబడే అవకాశాలు తక్కువ అంటున్నారు కొందరు స్టంట్ మాస్టర్స్.

ఎస్.ఎం. రాజు దుర్మరణం తర్వాత ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. అధిక రిస్క్ షూటింగ్స్ లో పాల్గొనే స్టంట్ మ్యాన్స్ ని, ఇతర సినీ సాంకేతిక నిపుణులు పనిపై ఒక నియంత్రణ ఉండేలా జాతీయ భద్రతా చట్టం కోసం చర్చ జరిపింది. కేంద్ర కార్మిక శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయపై ఒత్తిడి తెచ్చి ఒక చట్టం తేవాలనే యోచన చేస్తోంది.

బీమా దక్కని జీవితాలు!

చాలాకాలంగా చాలా ఇన్స్యూరెన్స్ సంస్థలు స్టంట్ కళాకారులను వారి పని స్వభావం ఆధారంగా బీమా పొందలేనివారిగా లెక్క కట్టాయి.

తమిళనాడులో ఈ ఇష్యూపై ఇప్పటికీ ఎవరైనా గాయపడినా, చనిపోయినా బీమా దక్కేలా సదరు స్టంట్ విభాగంలో పనిచేస్తున్నవారికి ఇన్స్యూరెన్స్ పొందేందుకు పోరాటం కొనసాగుతూనే ఉంది. ఏళ్ల తరబడి వారి పోరాటం కొనసాగుతూనే ఉన్నా.. స్టంట్ మాస్టర్ల కోసం మాత్రమే కేవలం లక్ష రూపాయల వరకు మాత్రమే ప్రమాద బీమా పాలసీ దక్కే అవకాశం లభించింది. ఇక వారి అసిస్టెంట్స్, ఇతర విభాగాల్లో పనిచేసే కార్మికుల సంగతి సరేసరి.

అయితే, ప్రస్తుతం కేరళలో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో బీమా సంస్థలు కూడా పెరగడంతో.. కొన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు స్టంట్ విభాగంలో పనిచేసేవారికి పాలసీలను ప్రారంభించాయి. అయితే, అది సంస్థాగతంగా జరగడం లేదన్నది మరో కంప్లైంట్.

సదరు చిత్ర నిర్మాణ సంస్థలు బీమా చేయకపోతే.. తీవ్రమైన గాయాలైనా, మరణించినా, ప్రమాదాల బారినపడి నెలల తరబడి హాస్పిటలైజ్డ్ అయినా, కుటుంబాలు అప్పులపాలైనా.. ఎంత కష్టం..?

రిహాల్సల్ తప్పనిసరి!

పోరాటాల చిత్రీకరణ ఎల్లప్పుడూ భద్రతనివ్వదు. రిహాల్సల్స్ లోనే ఏదైనా జరుగొచ్చు. పెద్ద పెద్ద పోరాట సన్నివేశాల చిత్రీకరణ.. ముఖ్యంగా ప్రధాన నటులు పాల్గొనే సన్నివేశాలకు ముందు స్టంట్ మాస్టర్ల బృందం వారికి చాలారోజులు శిక్షణనివ్వాల్సి ఉంటుంది. ఇప్పటికీ కొందరు నటులు బేసిక్స్ నేర్చుకోవడానికి అయితే ముంబై, లేదా చెన్నైకి వెళ్తూనే ఉంటారు.

అన్నియన్ షూటింగ్ సమయంలో ఒక తాడు తెగిపడిపోవడంతో రిహాల్సల్ విచారకరంగా మారిపోయింది. తాడు తెగి పడటంతో పాటు స్టంట్ మ్యాన్ ఎత్తునుండి పడిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. వారిలో చాలామందికి దీర్ఘకాలిక చికిత్స అవసరం పడింది

స్టంట్ యూనియన్స్ ఐకమత్యమే వారి బలం!

ఎవరో నియంత్రించే పరిస్థితులు, సాయమందించే అవకాశాలు లేనప్పుడు ప్రాథమిక భద్రతను అందించడానికి స్టంట్ యూనియన్సే పూనుకోవాలి. ఈ విషయంలో మళయాళ సినిమా ఫెఫ్కా స్టంట్ మాస్టర్స్ యూనియన్ చాలా బలంగా పనిచేస్తోంది. కానీ, కొన్ని సినిమాల్లో ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇతర రాష్ట్రాల స్టంట్ బృందాలను కూడా రప్పించే క్రమంలో మళ్లీ అక్కడ చిక్కులెదురవుతూనే ఉన్నాయంటారు కొందరు స్టంట్ మాస్టర్స్.

స్టంట్ మాస్టర్స్ భద్రత కోసం ఉద్యమం!

నేటి భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయికెదిగింది. ఈ సమయంలో స్టంట్ మాస్టర్లకు జరుగుతున్న ప్రమాదాలపై పరిష్కారం చూపేలా తమకు మద్దతునివ్వాల్సిన అవసంర ఆయా ప్రొడక్షన్ హౌజెస్ పై ఉందంటున్నారు కొందరు సీనియర్ స్టంట్ మాస్టర్స్. మేం సినిమా వెనుకే ఉండి నడిపించినా.. సినిమా రక్తికట్టేలా చిత్రీకరించే విషయంలో తాము ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నారు స్టంట్ మాస్టర్స్.

చట్టాలు ఆమోదం పొందే వరకు.. బీమా తప్పనిసరి అయ్యేవరకూ.. సరైన మార్గదర్శకాలు రూపొందేవరకు.. భారత సినీ పరిశ్రమలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భద్రత గాలిలో దీపం లాంటిదే. ప్రేక్షకులకు థ్రిల్ నిచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ వెనుక.. కళాకారుడి కష్టం చాలా ఎంత భయానకంగా ఉంటుందో మనం చెప్పుకున్న ఘటనలే అందుకు బోలెడు ఉదాహరణలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles