ప్రజాస్వామ్య చైతన్యగీతం.. శ్యాంశరణ్ నేగీ!

తూటా కంటే కూడా ఓటే గొప్పదని భావించి.. సాయుధులైనవారూ ఆయుధాలను, అరణ్యాలను వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటే.. ఓటు విలువేంటో మనందరికీ తెలిసిందే. అలాంటి ఓటు కోసం ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు, ఎన్నికల కమిషన్ ఇలా అందరూ కలిసి ఎంతగా అవగాహన కల్పిస్తున్నారో.. ఎంతలా ప్రచారం చేస్తున్నారో కూడా చూస్తూనే ఉన్నాం. అయినా, ఇప్పటికీ ఓటు వేయడానికి బద్ధకించేవారు ఓసారి శ్యామ్ శరణ్ నేగీ కథ వినాల్సిందే!.

శ్యామ్ శరణ్ నేగీ.. భారతదేశంలో అసలు ఎన్నికల ప్రక్రియ మొదలైన 1951 నుంచే ఆయన ఓటు వేస్తూ వస్తున్నారు. 105 ఏళ్ల పాటు సంపూర్ణ ఆయుష్కుడిగా బతికినంత కాలం… బయట కాలు అడుగు పెట్టేందుకు వీల్లేని పరిస్థితుల్లోనూ.. ఆయన తన ఓటు హక్కును మాత్రం వినియోగించుకున్నాడు. ఎవరా శ్యామ్ శరణ్ నేగీ…? ఇప్పుడెందుకు ఆ నూటా ఆరేళ్ల వృద్ధుడి కథ..?

2024లో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొత్తం సుమారు 97 కోట్ల మంది ఓటర్లున్నట్టు.. అందులో 1 కోటి 82 లక్షల మంది కొత్త ఎన్ రోల్ అయినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాలు. భారతదేశ జనాభా పరంగా చూస్తే సుమారు 140 కోట్ల మంది. ఇందులో ఓటర్లు నమోదుకాని వారితో పాటు… ఓటర్లుగా నమోదై కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా నిర్లిప్తత వహించేవాళ్లందరికీ ఇప్పుడు శ్యామ్ శరణ్ నేగీ కథ ఓ స్ఫూర్తిపాఠం.

శ్యామ్ శరణ్ నేగీ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా. పదవీ విరమణ చేసిన శ్యామ్ శరణ్ నేగీ… 1951లో ఎన్నికలు ప్రారంభమైన్నాట్నుంచీ తన ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నాడు. ఏనాడూ.. ఏ పోనీలే.. ఈ ఒక్కసారికి ఓటు వేయకపోతే ఏమవుతుందనే నిర్లిప్తత ప్రదర్శించలె.

ఈ విషయం శ్యామ్ శరణ్ నేగి కొడుకు చందర్ ప్రకాష్ మరోసారి ఓ మీడియా సంస్థతో వెల్లడించడంతో.. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న ఈ వేళ.. మరోసారి చర్చకు వచ్చింది పద్మశ్రీ శ్యామ్ శరణ్ నేగి ఓటు కథ.

శ్యామ్ శరణ్ నేగీకి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నిక్లలో పోలింగ్ డ్యూటీ పడింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక.. 1952 ఫిబ్రవరిలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే, హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు ప్రాంతంలో ఆ సమయానికి పోలింగ్ స్టేషన్స్ కు చేరుకోవడం ఓటర్లకు అసాధ్యం. దాంతో కొద్దిగా ముందుగానే.. అంటే, నాల్గు నెలల ముందే 1951 అక్టోబర్ లోనే ఎన్నికలు జరిగాయి. శ్యామ్ శరణ్ నేగీకి ఎన్నికల డ్యూటీ పడటమే కాకుండా.. ఆయనే అక్కడ ఉన్న పోలింగ్ బృందానికీ నాయకత్వం వహించాడు. ఆ పోలింగ్ నిర్వహణకు సుమారు పదిరోజుల సమయం పని చేయాల్సి ఉండగా.. శ్యామ్ శరణ్ నేగీ బృందం వెళ్లాల్సిన పోలింగ్ కేంద్రాలన్నీ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన కొండ ప్రాంతాలు. దాంతో నేగీ తనకు ఓటు హక్కున్న షోంతోంగ్ పోలింగ్ స్టేషన్ లో.. మొట్టమొదటి ఓటు తానే వేస్తానని అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ని రిక్వెస్ట్ చేస్తే.. ఆయన దానికి ఒప్పుకోవడంతో.. భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా 1951, అక్టోబర్ 25 మొట్టమొదటి ఓటు వేసిన వ్యక్తిగా కూడా శ్యామ్ శరణ్ నేగి రికార్డుకెక్కాడు.

ఎన్నికల ప్రక్రియపై శ్యామ్ శరణ్ నేగీ ముద్ర!

సిస్టమ్యాటికి ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (SVEEP) పేరిట ప్రతీ ఏటా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రక్రియను చైతన్యవంతం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా.. ఈ ప్రచారానికి తమ బ్రాండ్ అంబాసిడర్ గా శ్యామ్ శరణ్ నేగీనే ఈసీఐ ప్రచారానికి ఉపయోగించుకోవడం.. ఒక మొట్టమొదటి ఓటర్ కు దక్కిన ఓ గొప్ప గౌరవం.

1951 అక్టోబర్ లో జరిగిన భారతదేశ తొలి సాధారణ ఎన్నికల్లో మొదటి ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగీ… గత 2022, నవంబర్ 12వ తేదీన జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో తన 105 ఏళ్ల వయస్సులోనూ ఓటు వేసేందుకు సిద్ధం కాగా.. సరిగ్గా 2022, నవంబర్ 5వ తేదీన కన్నుమూశాడు. ప్రజాస్వామ్య ప్రక్రియలో సిసలైన ఓటర్ గా నిల్చిన శ్యామ్ శరణ్ నేగీకి… భారత ప్రభుత్వం పూర్తిగా అధికారిక లాంఛనాలతో తన అంత్యక్రియలను నిర్వహించింది.

నేగీ కోరిందేంటి..?

దేశానికీ, మీ ప్రాంతాలకు ఏ నాయకుడైతే ఉపయోగపడగలరనుకుంటారో… మీరు నిత్యం వారిని గమనిస్తున్న క్రమంలో ఎవరైతే బెటరనుకుంటారో.. ఎవరైతే మీ ప్రాంతాన్ని అభివృద్ధిపర్చగలరని విశ్వసిస్తారో.. అదిగో అలాంటి నేతలను మీరు ప్రజాప్రతినిధులను చేయడంటూ పిలుపునిస్తుండేవాడు నేగీ. దేశాన్ని, మీ ప్రాంతాలన్ని సమ్మిళిత అభివృద్ధితో పాటు.. ఒక మంచి సమాజాన్ని తయారుచేసే బాధ్యత కల్గినవారిని ఎన్నుకోండంటూ.. తాను బతికున్నంత కాలం.. ముఖ్యంగా యువ ఓటర్లను చైతన్యపర్చేవాడు.

ప్రజాస్వామ్యంలో ఓ ఓటర్ కు దక్కిన పద్మశ్రీ!

ప్రజాస్వామ్యం పట్ల శ్యామ్ శరణ్ నేగీ అంకితభావానికి పార్టీలకతీతంగా అందరు నాయకులూ సెల్యూట్ కొట్టారు. ఒక నిబద్ధత కల్గిన ఓటర్ అంటే ఎలా ఉంటాడంటే.. శ్యామ్ శరణ్ నేగీలా అనేలా ఓ మాడల్ అయ్యాడు. అందుకే అతణ్ని 2010లో భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటైన పద్మశ్రీతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

అయితే, చాలా మంది ఓటు వేయడాన్ని ఓ హక్కుగా మాత్రమే గుర్తిస్తున్నారని.. కానీ, మన పూర్వీకుల కష్టం, పోరాటంతో మనకు ప్రసాదించిన ఓ కర్తవ్యమంటాడు నేగీ. అతి పెద్ద ప్రజాస్వామ్యంగా పేరు బడ్డ భారత్ లో.. ఎంతటివారినైనా దించేలా.. ఎవరినైనా అందలమెక్కించేలా చేయగల మహిమాన్విత శక్తి ఒక ఓటర్ కు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఓటుకు నోటును పక్కనబెట్టి… శ్యామ్ శరణ్ నేగీలా ఆలోచిస్తే.. మళ్లీ మన మూలాల్ని మనం పొందొచ్చేమో! అందుకే ఈ ఎన్నికల వేళ… ఆ మొట్టమొదటి ఓటర్ కూ.. బతికున్నంతకాలం ఓటు హక్కును వినియోగించుకున్న స్పూర్తిప్రదాతకు మనమూ ఓ సెల్యూట్ చేద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles