Shanthi Ishaan ✍️
Aaj jaane ki zid na karo
ఈవేళ వెళ్ళిపోతానని పట్టుబట్టకు
Yoohin pehloo mein baithe raho
ఊరకే అలా వచ్చి నా పక్కన కూర్చుండిపో
ఫరీదా ఖానుమ్ గొంతు నుంచి జాలువారే ఈ ఘజల్ వినని సంగీతప్రియులు ఉండరేమో! పాకిస్తాన్ లో పుట్టి ఫ్రపంచమంతా మార్మోగుతున్న ఈ ఘజల్ కళలకు, ప్రత్యేకించి సంగీతానికి ఎల్లలు లేవని నిరూపిస్తూ వస్తోంది. పాకిస్తానీ కవి ఫయ్యాజ్ హష్మి రాసిన లలితమైన పదాలకు సొహైల్ రానా హృద్యమైన బాణీలు కట్టారు. తొలి రోజుల్లో హబీబ్ వాలీ అహ్మద్ ఈ పాటకు ప్రాచుర్యం కల్పించారు. 1973లో వచ్చిన “బాదల్ ఔర్ బిజిలీ” అనే సినిమా కోసం ఆయనే ఈ పాటను మరోసారి పాడారు. 1993 నుంచి ఫరీదా ఖానుమ్ ఈ పాటను తన ప్రతి సంగీత కచేరీలో పాడుతూ జనం గుండెలకు చేరువ చేశారు. ఆ తర్వాత ఆశా భోస్లే మొదలుకొని ఎ. ఆర్. రెహమాన్, అరిజీత్ సింగ్, పపోన్ వరకు చాలా మంది ఈ పాట పాడారు. ఆశా తాయీ పాడిన వర్షన్ ని మీరా నాయర్ Monsoon Weddingలో ఓ సీన్ లో BGMగా వాడుకున్నారు. Aye Dil Hai Mushquil సినిమా కోసం ప్రీతమ్ శిల్పా రావుతో ఈ పాట పాడించారు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏదో ఒక సినిమాలోనో, సీరియల్ లోనో ఈ ఘజల్ అడపా దడపా వినిపిస్తూనే ఉంటుంది. నా మటుకు నేనీ పాటను ఇంటర్ లో ఉన్నప్పుడు “ఇతిహాస్” అనే దూర్ దర్శన్ సీరియల్ లో మొదటిసారి విన్నాను. అప్పటి నుంచి రకరకాల వర్షన్స్ వింటూ వస్తున్నా. కానీ ఫరీదా ఖానుమ్ వర్షన్ నా మనసుకు చాలా దగ్గర. ఆ తర్వాత పపోన్ వర్షన్ నచ్చుతుంది. పపోన్ చేసిన improvisations చాలా గొప్పగా అనిపిస్తాయి. అరిజీత్ సింగ్ వర్షన్ కూడా మనసును తాకుతుంది. కానీ MTV Unplugged కోసం రహమాన్ పాడిన వర్షన్ మాత్రం నన్ను చాలా నిరాశపరిచింది.
అసలు ప్రపంచంలో ఎన్నో ఘజల్స్ ఉండగా ఇది మాత్రమే ఎందుకు ఇంతగా శ్రోతలను ఆకట్టుకుంటోంది, ఎందుకు ఎప్పటికప్పుడు కొత్త గొంతుకల్లో కొత్త పోకడలు పోతోంది. బహుశా ఫయ్యాజ్ హష్మీ పదాల్లో నిండిన ప్రేమ, కాంక్షలే శ్రోతలను కట్టిపడేస్తున్నాయోమో! పైకి సరళంగా కనిపించినా ఈ పదాల్లో చాలా లోతైన అర్థమే ఉంది. వినేవాళ్ళు ఈ బాధలో తమ బాధను వెతుక్కుంటారు.
Aaj jaane ki zid na karo
Yoohin pehloo mein baithe raho
ఈవేళ వెళ్ళిపోతానని పట్టుబట్టకు
ఊరికే అలా వచ్చి నా పక్కన కూర్చుండిపో
Haye mar jayenge
Hum tho lut jayege
Aisi baatein kiya na karo
నువ్వు వెళ్ళిపోతానన్న మాట ఎత్తావంటే
నేను ప్రాణాలు వదిలేస్తాను
ఇక్కడే శిథిలమైపోతాను
ఈ పదాలు పలికేటప్పుడు ఫరీదా ఖానుమ్ గొంతులో మన ప్రాణాలు తోడేసేంత ఆర్ద్రత పలుకుతుంది.
Tum bhi socho zara
Kyo na roke tumhe
Jaan jaati hai jab
Uthke jaate ho tum
నేను నిన్ను ఎందుకు ఆపకూడదో
నువ్వే కాస్త చెప్పు
నువ్వు లేచి వెళ్ళిపోతుంటే
నా ప్రాణం పోతుంది మరి!
నిజమే! ప్రాణానికి ప్రాణమైనవాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతుంటే ప్రాణం విలవిల్లాడిపోదూ!
Tumko apni kasm jaane jaa
Baat itni meri maan lo
ఓ నా ప్రియా! నా ఈ ఒక్క విన్నపాన్ని మన్నించు
లేదంటే నా మీద ఒట్టే
ఇలాంటి విన్నపాలతో ముందరి కాళ్ళకు బంధాలు వేస్తే ఇంకెలా కదులుతారు ఎవరైనా?
తర్వాతి చరణంలో కొంత తాత్విక చింతన కనపడుతుంది. దొరికిన ఆ నాలుగు క్షణాలనే ఆస్వాదించమని కవి చెప్పుకొస్తారు.
Waqt ki kaid mein zindagi hai magar
Chand ghadiya yahi hai jo aazad hai
కాలపు ఖైదులో జీవితం బందీగా మారిపోయింది
ఈ కాసిని క్షణాల్లోనే కాసింత స్వేచ్ఛ దొరికేది
Inko kho kar meri jane-jaa
Umr bhar na taraste raho
ప్రియతమా! ఈ అపురూప క్షణాలను పోగొట్టుకుని
జీవితాంతం కుమిలిపోకు
కొందరంతే! చేతికి అందివచ్చిన మధుర క్షణాలను జారవిడుచుకుని ఆ తర్వాత జీవితాంతం బాధపడిపోతుంటారు. అలా కాక ఈ క్షణంలో బతుకుతూ ఈ క్షణాలను ఆస్వాదించాలన్నది కవి ఉద్దేశం.
Kitna masoom rangeen hai yeh sama
Husn aur ishq ki aaj meraj hai
సౌందర్యం, ప్రణయం గొప్పగా కలిసిపోయిన ఈ ఘడియల్లో ఎంతటి అమాయకత్వమో, ఎన్నెన్ని రంగులో! Meraj అంటే ఉచ్ఛ స్థితి. ఇస్లాం ప్రకారం మొహమ్మద్ ప్రవక్త స్వర్గానికి చేరుకునే ప్రయాణాన్ని meraj అంటారు. ఇప్పుడు సొగసు, ప్రేమ రెండూ కలగలిసిపోయి అంతటి ఉన్నతమైన స్థితిని చేరుకున్నాయనడంలో కవి వాటికి ఆపాదించిన ఉదాత్తత అర్థమవుతుంది.
Kal ki kisko khabar jane jaan
Rok lo aaj ki raat ko
Aaj jane ki zid na karo
Yoohin pehlu mein baithe raho
రేపటి సంగతి ఎవరికి ఎరుక
వీలైతే ఈ రాత్రిని ఆపేసెయ్యి
ఈవేళ వెళ్ళిపోతానని మొండిపట్టు పట్టకు
ఇలా వచ్చి నా పక్కన ఊరికే కూర్చుండిపో
అవును. ఈ క్షణమే మనది. మరుక్షణం ఏమవుతుందో ఎవరికి తెలుసు. అందుకే ఈ క్షణంలోనే బతికెయ్యి అని కవి ఈ పదాల్లో చెప్పకనే చెబుతున్నారు.
ఈ ఘజల్ దక్షిణాసియాలోనే ఒక క్లాసిక్ గా మిగిలిపోవడానికి సొహైల్ రానా స్వర రచన కూడా ఒక కారణం. యమన్ కళ్యాణ్ రాగంలో కూర్చిన ఈ మెలోడీ గుండెను కోసేస్తుంది. ఎంతమంది సంగీతకారులు ఎన్ని గమకాలు వేసినా, ఎంతగా మార్చి పాడినా ఆత్మ మాత్రం అలానే ఉంటుంది. కొన్ని కోట్ల ఆత్మలను ప్రేమగా తాకుతుంది.
(Note: Translation యథాతథంగా చేయలేదు. సందర్భాన్ని బట్టి కొంత improvise చేశాను).


