ఇప్పుడు ఫ్లై దుబాయ్ ఫ్లైట్ హైజాక్ ఇష్యూ ఓ హాట్ టాపిక్. అందులోనూ స్మిత్ మచ్చర్ గురించీ.. అలాగే, ఇజ్రాయెల్ కు చెందిన ప్లంబర్ యానివ్ హయన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే, ఇలాంటి హైజాక్స్ ను చరిత్ర చాలానే చూసింది. అలాంటి ఓ సందర్భంలో ఓ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగి, 23 ఏళ్ల యువతి తెగింపు, త్యాగం గురించి మళ్లీ ఓసారి మాట్లాడుకునే సందర్భమిది. భారత ప్రభుత్వం ఆమె మరణానంతరం అశోక చక్ర అవార్డుతోనూ సత్కరించుకుని ఆ పురస్కారానికే ఓ గౌరవం కల్పించింది.
ఎవరా మహిళ..?
చుట్టూ ఉగ్రవాదులు, చేతుల్లో తుపాకులు, పేలుడు పదార్థాలు. బయటకు వెళ్లే మార్గం లేదు. విమానంలో ఉన్న వందలాది మంది ప్రయాణీకుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అలాంటి సమయంలోనే ఓ 23 ఏళ్ల యువతి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉగ్రవాదుల నుంచి 379 మంది ప్రాణాల్ని కాపాడింది. ఆమే నీర్జా భనోట్.
నీర్జా భనోట్ పాన్ ఆమ్ ఎయిర్ లైన్స్ లో సీనియర్ ఫ్లైట్ పర్సర్. 1963, సెప్టెంబర్ 7న చండీగఢ్ లో జన్మించిన నీర్జా… ముంబైలో పెరిగింది. ప్రఖ్యాత సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదివింది. పాన్ ఆమ్ లో చేరేకంటే ముందు మాడల్ గా కూడా పనిచేసింది.

మాడలింగ్ లో నీర్జా కెరీర్!
ముంబైలో చదువుకుంటున్న సమయంలోనే నీర్జాకు మాడలింగ్ అవకాశం వచ్చింది. సుమారు 18 ఏళ్ల వయసులో స్నేహితురాలితో కలిసి కళాశాల బయట ఉన్నప్పుడు.. ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను గమనించి ఓ ఫోటో తీశాడు. బాంబే మ్యాగజైన్‌లోని The Girl Next Door పేరిట ఆ ఫోటో ప్రచురితమైంది. అదే ఆమెకు మాడలింగ్ రంగంలో బ్రేక్ ఇచ్చింది. తర్వాత పవిల్లే అనే రిటైల్ సంస్థ నుంచి ఆమెకు తొలి మాడలింగ్ ఆఫర్ వచ్చింది.
ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లు ఆమె వివిధ ప్రకటనల్లో మాడల్‌గా కనిపించింది. ఛార్మిస్ కోల్డ్, క్రాక్ జాక్, అమూల్ చాకోలెట్ వంటి ప్రకటనల్లో కనిపించింది. బినాకా, పిల్లల ఉత్పత్తులైన బెంజర్, చిరాగ్ దిన్ వంటి బ్రాండ్స్, రిటైల్ సంస్థల ప్రకటనల్లో ఆమె మెరిసింది. పత్రికల కవర్ పేజీలపై కూడా ఆమె తళుక్కుమంది.
ఆమె మాడలింగ్ కేవలం గ్లామర్ కోసం చేయలేదు. నాడు ఆమెకు అదో ఆదాయ వనరు. స్వతంత్రంగా నిలబడేందుకు నీర్జా అనే యువతి ఎంచుకున్న ఒక మార్గం. అలా నీర్జా సుమారు 90కి పైగా మోడలింగ్ అసైన్మెంట్స్ చేసింది.
మాడలింగ్ నుంచి విమానయానం వైపు!
1980లలో మోడలింగ్ చేస్తున్నప్పుడే నీర్జా పాన్ ఆమ్లోకి వెళ్లింది. పాన్ ఆమ్ భారతీయ సిబ్బందితో ప్రత్యేక క్రూ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు.. నీర్జా దరఖాస్తు చేసింది. సుమారు 10 వేల మంది దరఖాస్తు చేస్తే.. 80 మందిని ఎంపిక చేసింది పాన్ ఆమ్ సంస్థ. అందులో నీర్జా ఒకరు. ఆమెకు అప్పటికే మాడలింగ్ అనుభవం ఉండటంతో మేకప్, హెయిర్ స్టైల్, పబ్లిక్ ప్రెజెన్స్ విషయంలో సహజమైన నైపుణ్యం ఉంది. దాంతో పాన్ ఆమ్ విమానయాన సంస్థలో ఆమెకు ఉద్యోగం లభించింది. .
ఓసారి చరిత్ర తలుపులు తడదాం!
1986, సెప్టెంబర్ 5వ తేది. ముంబై నుంచి ఫ్రాంక్ ఫర్డ్ మీదుగా పాన్ యామ్ 73 అనే బోయింగ్ విమానం న్యూయార్క్ వెళ్తోంది. పాకిస్థాన్ కరాచీ విమానాశ్రయంలో ఆగింది. విమానంలో సిబ్బంది, ప్రయాణీకులంతా కలిసి 379 మంది ఉన్నారు. అక్కడే నల్గురు సాయుధులైన ఉగ్రవాదులు విమానంలోకి చొరబడ్డారు.
వాళ్ల మొదటి లక్ష్యం కాక్ పిట్!
కానీ, నీర్జా వెంటనే పైలట్లను అప్రమత్తం చేసింది. పైలట్స్ కాక్ పిట్ నుంచి బయటపడ్డారు. దాంతో హైజాకర్లకు విమానాన్ని తీసుకెళ్లే అవకాశం లేకపోయింది. విమానం నేలపైనే అలాగే ఉండిపోయింది. కానీ, ఉగ్రవాదులు ఊరుకోరుగా..? ప్రయాణీకుల పాస్పోర్ట్స్ పరిశీలించడం ప్రారంభించారు. వాళ్ల టార్గెట్ అప్పుడు అమెరికన్స్. ఆ విషయం గమనించిన నీర్జా అమెరికన్స్ నుంచి మెల్లిగా ఒక్కొక్కరి దగ్గరకూ వెళ్లి వారి పాస్పోర్ట్స్ దాచేసింది.
ఆ పాస్పోర్ట్స్ దొరికుంటే అమెరికన్ సిటిజెన్స్ ను ఉగ్రవాదులు చంపే అవకాశముండేదని తర్వాత అమెరికా న్యాయశాఖ కూడా పేర్కొంది.
ఓవైపు విమానంలో గంటల తరబడి పాస్పోర్ట్స్ అప్పజెప్పాలని ఉగ్రవాదులు బెదిరిస్తుంటే భయానక పరిస్థితి నెలకొంది. కానీ, ఎవ్వరూ ధైర్యం కోల్పోకుండా నీర్జా అందరి దగ్గరకు వెళ్లుతూ కాస్త ఓపిక పట్టాలని చెబుతూ.. పిల్లలకు నీళ్లందించడం చేస్తోంది. అలాగే, అవసరమైనప్పుడు ఎలా బయటపడాలో వన్ టూ వన్ ఒక్కో ప్రయాణీకుడి దగ్గరకు వెళ్లినప్పుడు మెల్లిగా సూచనలు చేస్తోంది. అలాంటి సమయంలో విమానంలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. కేబిన్ మొత్తం చీకటైపోయింది.
అదే సమయంలో ఓపిక నశించిన హైజాకర్స్ ఇక రెచ్చిపోయారు. కాల్పులు జరిపారు. గ్రెనేడ్స్ విసిరారు. ప్రయాణీకులంతా ఎక్కడివారక్కడ భయంతో పరుగులు తీస్తున్నారు. అప్పుడు నీర్జా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అత్యవసర ద్వారం వైపు ప్రయాణీకులందరినీ మళ్లించింది. ఆమె కూడా బయటపడగల్గేది. కానీ, అక్కడే చిక్కుకుపోయిన కొందరు పిల్లల్ని గమనించి వాళ్లను కాపాడటానికి మళ్లీ లోనికి వెళ్లింది. అప్పుడే ఓ ఉగ్రవాది ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ నీర్జా మరణించింది.
23 ఏళ్ల యువతి ధైర్యంతో పోరాడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 379 మంది పిల్లలు, పెద్దల ప్రాణాలు కాపాడి తన ఆయుష్షంతా వారికి పోసింది. అమెరికా న్యాయశాఖ కూడా పాన్ యామ్ సిబ్బంది, ప్రయాణీకులను కాపాడటంలో నీర్జా భనోట్ పాత్రను గొప్పగా పొగిడింది.
భారత్ ఆమెకు మరణానంతరం అశోక చక్ర పురస్కారం అందించగా.. పాకిస్థాన్, అమెరికా కూడా ఆమె ధైర్యాన్ని గౌరవించాయి.
అందుకే నీర్జా కథ ప్రత్యేకం!
చేతిలో తుపాకీ లేదు. ప్రత్యేక శిక్షణ పొందిన కమాండో కాదు. ఆమె దగ్గర ఉన్నవల్లా రెండే. సాటి మనుషుల ప్రాణాలు కాపాడాలన్న మానవత్వం.. అంతకుమించిన ధైర్యం. అందుకే నీర్జా భనోట్ పేరు విమానయాన చరిత్రలోనే ధైర్యానికి ఓ సంకేతంగా నిల్చింది.
40 ఏళ్ల తర్వాత, 2026లో ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ కథతో.. ఇప్పుడు నీర్జా భనోట్ పేరు మళ్లీ ప్రస్తావనలోకి వచ్చింది. ఇద్దరి ఘటనలు వేర్వేరైనా, తీవ్రమైన విమాన అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకు.. తమను తాము ముందుండి పోరాడిన వ్యక్తులుగా వీరి కథల్లో సారూప్యం కనిపిస్తుంది.


