చుట్టపు చూపుగా వచ్చింది . భారతదేశ వైవిధ్యమైన వాతావరణంతో ప్రేమలో పడిపోయింది. ఇక్కడే స్థిరపడింది. 84 ఏళ్ల వయస్సులో భారతదేశ పౌరసత్వాన్నీ పొందింది. దేవభూమి ఆడబిడ్డగా గుర్తింపు పొందిన ఆ భారతీయ దత్తపుత్రికే పెపిటా సేథ్.
ఇవాళ ప్రపంచమొక కుగ్రామంగా మారిన కాలంలో అవసరాల రీత్యా మనిషి ఎక్కడైనా బతుకొచ్చు. అలా వలసలు వెళ్లి ఉద్యోగాలు చేసుకునేవారినీ.. ఇతర ప్రాంతాల్లో స్థిరపడే వారినీ చూస్తూనే ఉన్నాం. కానీ, సందర్శనకై వచ్చి.. ఓ ప్రాంతంతో ప్రేమలో పడి.. అక్కడే ఉండిపోవాలనుకునేవారు మాత్రం అరుదు. ఆ అరుదైన వ్యక్తే పెపిటా సేథ్.

దేవభూమిగా పిల్చుకునే కేరళ అందాలకు ఎవరైనా ఫిదా కావల్సిందే..వారిలో కొందరు ఫోటోలు తీసుకుని వెళ్లతారు. కొంతకాలం అక్కడే స్టే చేసి మానసిక ప్రశాంతత పొందుతారు. ఇంకొందరు అప్పుడప్పుడూ సందర్శిస్తూ ఆ ప్రాంతంపైనున్న మక్కువను తమ పర్యటనలతో సంతృప్తి పర్చుకుంటారు. కానీ, కేరళకు వచ్చిన ఓ విదేశీయురాలైన పెపిటా సేథ్ మాత్రం.. ఇక కేరళే తన ఇల్లని, సర్వస్వమనీ అనుభూతి చెంది ఇప్పుడేకంగా ఇండియన్ సిటిజెన్ షిప్ సంపాదించారు.
యూకేకు చెందిన పెపిటా సేథ్ భారత్ యాత్రకు వచ్చినప్పుడు కేరళలో పర్యటించారు. కొన్నేళ్ల క్రితం కేరళను సందర్శించిన సేథ్ కు ఇక జీవిస్తే కేరళలోనే జీవించాలనిపించింది. అలాంటి అనుభూతినిచ్చింది ఆ యాత్ర. అప్పటికింకా ఆమెలో కేరళలో ఉండిపోవాలన్న ఎలాంటి ప్లాన్స్ కూడా లేవు. కానీ, కేరళెందుకో పెపిటా సేథ్ ను ఆకర్శించింది. అక్కడి ప్రజలు, సంప్రదాయాలు, రోజూవారీ జీవన విధానం అన్నీ బాగా నచ్చాయి. దాంతో కేరళతో ప్రేమలో పడింది. 50 ఏళ్ల నుంచీ ఆమె ఇక యూకేకు వెళ్లకుండా.. కేరళనే తన స్వస్థలంగా మార్చుకుంది. ఇప్పుడు 84 ఏళ్ల వయస్సులో భారత పౌరురాలిగా గుర్తింపు సంపాదించింది. అయితే, భారతదేశం పట్ల.. ముఖ్యంగా కేరళ పట్ల ఆమెకున్న ప్రేమకు.. ఆమెకింకెప్పుడో సిటిజెన్ షిప్ వచ్చి ఉండాల్సిందనే భావనా కొందరి నుంచి వ్యక్తమవుతోంది.
ఇప్పుడు కేరళలోని త్రిసూరే ఆమె ఇల్లు. ఐదు దశాబ్దాల కాలం నుంచీ కేరళలోనే జీవిస్తోంది. 2024లో ఆమె భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 2026 ఈనెల ఫిబ్రవరిలో ఆమెకు జిల్లా కలెక్టర్ అర్జున్ పాండ్యన్ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. కేరళ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ పెపిటా జీవన ప్రయాణం సాగింది. ఆ సేవలను గుర్తు చేసుకుంటూ.. ఆమెకు పౌరసత్వాన్నందించిన కలెక్టర్ ఆ క్షణాల్ని ఎంతో అరుదైనవిగా పేర్కొన్నారు.
భారత పౌరసత్వ ధృవీకరణ పత్రం రూపంలో ఉండొచ్చునేమోగానీ… ఓ విదేశీయురాలిగా, పరాయి మహిళగా కాకుండా భారతీయురాలిగా జీవించాలన్నది ఆమె చాలా కాలంగా కోరుకున్న ఆశ. కేరళ ప్రజలు కూడా ఆమెను తమ రాష్ట్ర దత్త పుత్రిక అని పిల్చుకుంటారు. ఆ పిలుపును నిజం చేసేలా ఆమె అక్కడ నివశించడమే కాదు.. ఆ నేలలో, సంస్కృతిలో, జీవన విధానంలో భాగమై, అందరి తల్లో నాలుకైపోయింది.
కేరళకు ఓ పర్యాటకురాలిగానే వచ్చినా.. ఆ ప్రాంతంతో ఆమె అనుబంధం అంతకుమించింది. కథకళి ప్రదర్శనలంటే ఇష్టపడే పెపిటా.. అక్కడి ఆలయాలు, ఉత్సవాలు, మేళతాళాలు, ఒక హార్మనీ క్రియేట్ చేసే కోలాహలాన్ని ఆస్వాదించింది. తాను చూసిన ప్రతీదాన్నీ ఫోటోలు, రచనల రూపంలో నిశితంగా నమోదు చేసింది. పండుగల్లో అక్కడ ప్రత్యేకంగా కనిపించే ఏనుగులు, ఆచారాలు, వారి జీవనవిధానాన్ని క్యూరియాసిటీతో ఫోటోలు, రచనల్లో డాక్యుమెంట్ చేసింది.
ఆమె తీసిన ఛాయాచిత్రాలు కొన్ని భారత్ దాటి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా కాళియట్టంగా పిల్చుకునే తెయ్యంపై ఆమె చేసిన పని అక్కడి శక్తివంతమైన ఆచార, సంప్రదాయాల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాయి. కళలు, సంస్కృతికి ఆమె చేసిన సేవలకుగాను ఆమెను భారత ప్రభుత్వం 2012లోనే పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది. అలా ఓ విదేశీ వనిత సాంస్కృతిక పరిశోధకురాలిగా, ఫోటోగ్రాఫర్ గా, రచయిత్రిగా.. దేశం కాని దేశంలో మన్ననలందుకుంది.
ఆసక్తికరమైన విశేషమేమంటే.. ఆమె భారత్ కు రాకముందే ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాలపై ఒక అవగాహన కల్గి ఉంది. బ్రిటీష్ సైన్యంలో పనిచేసిన తన తాత డైరీ.. అందుకు ఉపయోగపడింది. ఆ మక్కువతో భారత్ బాట పట్టిన పెపిటా సేథ్.. కేరళ సంప్రదాయలతో లవ్ లో పడి తన జీవన ప్రయాణాన్నే అక్కడ ఓ వేడుకలా మార్చుకుంది.
ఇప్పుడు పెపిటా సేథ్ కు భారత పౌరసత్వం కూడా అధికారికంగా లభించింది. ఇంతకాలం తాను మాత్రమే ఇల్లుగా భావించిన దత్తపుత్రికను.. నువ్వు ఈ ఇంటి ఆడబిడ్డవేనంటూ భారత్ ఆదరించడం ఆమెకు అత్యంత సంతోషాన్నీ, సంతృప్తినీ కల్గించిన క్షణం.



