నమ్మకమే పెట్టుబడి. నమ్మకం మీదే ప్రపంచం ఆధారపడి ఉంది. కానీ, ఆ నమ్మకాన్నే వమ్ము చేసే కిలాడీ వాడు. మోసాన్ని మోసమని తెలియకుండానే మోసగించగల్గే నయా వంచకుడు. అలాంటి నేరస్థుడే ఇదిగో ఈ ధృవదత్ శర్మ. ఇంతకీ ఏం చేశాడీ కిలాడీ..?
గురుగ్రామ్ లో ఈ మధ్య ఓ భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకొచ్చింది. ఒక్క ఫ్లాట్ ను ఇద్దరికో, ముగ్గురికో అమ్మడం.. అవి వివాదాల్లో చిక్కుకుని ఎటు కాకుండా కోర్ట్ కేసుల్లో మునిగిపోవడం.. ఏళ్లకేళ్లు ఎటూ తేలకుండా విచారణలు నడుస్తుండటం ఇలాంటి కేసులు బోలెడన్ని విని ఉంటాం. కానీ, ధృవదత్ శర్మ ఒకే ఫ్లాట్ ను ఏకంగా 25 మందికి అమ్మేసి బురిడీ కొట్టించాడు. ఏకంగా 500 కోట్ల రూపాయల వరకూ మోసాలకు పాల్పడ్డాడు.

తన సహచరులతో కలిసి గుర్ గ్రామ్ సెక్టార్ 15లోని మైల్ స్టోన్ బిల్డింగ్ లోని ఓ ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టాడు. మొదటి అంతస్థులోని 3 వేల చదరపు అడుగుల యూనిట్ 24ను ఓ వ్యక్తికి అమ్మేశాడు. సదరు కొనుగోలుదారుడి నుంచి రెండున్నర కోట్లు తీసుకున్నాడు. కానీ, ఆ ఫ్లాట్ ను సదరు కొనుగోలుదారుడి కంపెనీ పేరుపైన రిజిస్ట్రేషన్ చేయాలని కోరినా చేయలేదు. పైగా అదే ఫ్లాట్ ను 2022 నుంచి 23 మధ్యలో ఏకంగా మరో 25 మందికి అమ్మేశాడు.
ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి గత నెల జనవరి 2వ తారీఖున అపరా మోటెల్స్ పై ఫిర్యాదు చేశారు. అది ప్రస్తుతం 32 మైల్ స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉంది. 2021లో రెండున్నర కోట్లు వెచ్చించి యూనిట్ 24ను కొనుగోలు చేసినప్పటికీ.. కన్వేయన్స్ డీడ్ తన పేరుపై మార్చలేదని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసినా, నోటీసులిచ్చినా ఆ కంపెనీ తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయలేదన్నది ఫిర్యాదుదారు పోలీసులకు చెప్పిన మాట.
దాంతో కేసును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు టేకప్ చేసి సాంకేతిక సమాచారం, డాటా విశ్లేషణల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సివిల్ లైన్స్ కంపెనీ పేరిట మోసాలకు పాల్పడుతున్న 34 ఏళ్ల ధృవదత్ శర్మను గుర్తించారు. అతడిని ఫిబ్రవరి ఆరో తారీఖున గోల్ఫ్ కోర్స్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో శర్మ ఒకే యూనిట్ ను భాగాలుగా విభజించి పలువురికి విక్రయించి.. తన సంస్థైన గ్రోట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పలువురికి లీజుకు కూడా ఇచ్చినట్టు పోలీసుల ముందు అంగీకరించాడు.
ఇప్పటికే ధృవదత్ శర్మను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. కస్టడీ రిమాండ్ కోరారు. దాంతో ధృవదత్ శర్మ వెనుక ఇంకా ఎంతమంది ముఠా సభ్యులన్నారో గుర్తించడం, మోసపోయిన మొత్తాల్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకోవడం, మరిన్ని మోసాలేం చేశారో తెలుసుకోవడం వంటివి దర్యాప్తులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.



