రాకాసి ‘అల’జడి నుంచి బయటపడ్డారు! కాలపరీక్షలో నెగ్గారు!!

వారు ముగ్గురూ మృత్యుంజయులు. కానీ, కుటుంబీకులందర్నీ కోల్పోయిన అనాథలు. భయంకరమైన సునామీ విషాదం నుంచి బతికి బట్టకట్టి అభం శుభం తెలియని వయస్సులో ప్రభుత్వ శిశు సంక్షేమ గృహానికి చేరుకున్నారు. చదువుకుని బాగు పడటం మినహా వారి ముందు ఇంకో అవకాశమేమీ లేదు. గూడు, కూడు, గుడ్డ మాత్రమే దొరికాయి తప్ప… నా అన్నవారెవ్వరూ లేరు. అలాంటి విషాదం నుంచి ఇప్పుడా ముగ్గురు జీవితమనే ప్రయాణంలో విజయం సాధించారు.

ఎవరా ముగ్గురు..?

సౌమ్య, మీనా, తమిళరసి.. ఈ ముగ్గురూ… పీడకలలాంటి నిజమైన సునామీ దృశ్యంతో కుటుంబాలనే కోల్పోయారు. ఇప్పటి 24 ఏళ్ల సౌమ్య వయస్సు నాడు 4 ఏళ్లైతే.. నాటి 3 ఏళ్ల మీనా వయస్సు ఇవాళ 23 ఏళ్లు. సునామీ మిగిల్చిన బీభత్సానికి కుటుంబాలను కోల్పోయిన ఈ ఇద్దరు చిన్నారులు తమిళనాడు నాగపట్నంలోని అన్నైసత్య చిల్డ్రన్స్ హోమ్ కు తరలించబడ్డారు.

రోజులు గడుస్తున్న కొద్దీ సునామీ మిగిల్చిన విషాదం నుంచి కొద్దికొద్దిగా తేరుకుంటున్నకొద్దీ.. ఎవరో కొందరు రావడం తమ తోటి పిల్లల్ని చిల్డ్రన్స్ హోమ్ నుంచి తీసుకెళ్లడం పరిపాటిగా మారిపోయింది. కానీ, సౌమ్య, మీనా కోసం మాత్రం ఎవ్వరూ రాలేదు. అప్పుడు నాగపట్నం కలెక్టర్ జే. రాధాకృష్ణన్ ఈ ఇద్దరు అమ్మాయిల పరిస్థితి చూసి చలించిపోయాడు. ఆయనే వీరికి గాడ్ ఫాదరయ్యాడు. ఆ సమయంలోనే సౌమ్య, మీనా మధ్య స్నేహం కుదిరింది.

ఆ సమయంలోనే తమ జీవితాల్లో మున్ముందు వెలుగులు నిండాలంటే విద్యే శరణ్యమని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నిత్యం వెళ్లడం ఓ ఆహ్లాదకర జ్ఞాపకంగా ఉండేదనే ఈ ఇద్దరు స్నేహితురాళ్లు.. నర్సింగ్ వరకూ చదివారు.

చిన్నప్పట్నుంచీ తమకెందరో సాయం చేస్తేనే తాము పెరిగాం. కాబట్టి, మా మీది నుంచి అయినంత చేయాలనేదే మా సంకల్పం. అందుకే ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫరీ చదివానంటోంది మీనా. స్వతంత్ర మహిళగా బతకాలన్నదే తన కోరిక అంటుందామె.

18 ఏళ్ల వరకూ కూడా సౌమ్య, మీన ఇద్దరూ కూడా అనాథాశ్రమంలోనే పెరిగారు. 2020లో మలర్విజి, మణివణ్నన్ దంపతులు వీరిని దత్తత తీసుకున్నారు. సౌమ్యకు 2022లో వివాహం కూడా చేసేశారు. ఇప్పుడు సౌమ్య రెండేళ్ల సారాకు తల్లి. చిన్ననాటే తల్లిదండ్రులను కోల్పోయి.. సునామీ మిగిల్చిన విషాదంతో తెలిసీ తెలియని వయస్సులో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో పెరిగిన తను.. తన బిడ్డకు మాత్రం అలాంటి లోటుండకుండా పెంచాలనుకుంటోంది సౌమ్య. అందుకోసం తాను కచ్చితంగా ఉద్యోగం చేస్తానంటోంది.

ఇక మీనా 2025లో పెళ్లి చేసుకోబోతోంది. మీనాది ఉమ్మడి కుటుంబం. కానీ, సునామీ ఉత్పాతం అంత పెద్ద కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. అందుకే పెళ్లికి సిద్ధమైన మీనా కూడా పక్కా ప్రణాళికలు రచించుకుంది. పెళ్లైనాక కొంత కాలం ఉద్యోగం చేసి… మరికొంత కాలానికి ఓ బిడ్డను దత్తత తీసుకోవడంతో పాటు.. తనలాగే పెరుగుతున్న ఎందరో పిల్లలకు తనవంతు సాయమందించాలనుకుంటోంది మీనా.

ఇక మూడో అమ్మాయి.. ఇప్పుడు 35 ఏళ్ల తమిళరసి కూడా తన తల్లిని కోల్పోయాక.. తండ్రి, తన ఐదుగురు అక్కాచెల్లెళ్లను వదిలి అనాథ పిల్లల ఆశ్రమానికే చేరుకుంది. పుస్తకాలే తమిళరసికి మంచి స్నేహితులుగా మారాయి. చదువే తన గాయాలకు మందులా పనిచేసింది.

తన తండ్రిని, ఐదుగురు అక్కాచెల్లెళ్లను తన పై చదువులకు ఒప్పించిన తమిళరసి.. ఎంసీఏ పూర్తి చేసింది. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం వివాహమై ఇద్దరు పిల్లల తల్లైన తమిళరసి ప్రస్తుతం నాగపట్నం సమీపంలోని వేలంకన్నిలో నివసిస్తోంది. చిల్డ్రన్స్ హోమ్ లో పిల్లలకు తాను చెప్పేదొక్కటేనంటోంది… ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంపై ఆశను కోల్పోవద్దు… కాలమే అన్నింటికి పరిష్కారం చూపిస్తుందనేది తమిళరసి మాట.

మొత్తంగా సునామీ మిగిల్చిన విషాదం నుంచి కొత్త జీవితాల్ని శ్వాసిస్తున్న ఈ ముగ్గురు మహిళల కథ సవాళ్లనెదుర్కోలేక సమతమతమయ్యేవారెందరికో ఓ దారిదీపం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles