చిన్నకార్లతో రోడ్డెక్కాడు! ఆటోమోబైల్ మార్కెట్ దుమ్మురేపాడు!!

భారత ఆటోమోబైల్ రంగంపై చెదిరిపోని సంతకం.. ఒసాము సుజుకీ!

ఒసాము సుజుకీ… 94 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన ఈ జపాన్ వాసి గురించి కాస్త తెలుసుకోవాలి. సుజుకీ అంటే తెలియనివారు ఇండియాలో కూడా ఉండరు. కాదు కాదు అసలు భారతదేశంలో ఆటోమోబైల్ రంగ అభివృద్ధిలో కీలకపాత్రధారే ఒసాము సుజుకీ అని మీకు తెలుసా..? ఏంటా బిజినెస్ టైకూన్ కథ..?

డబ్బు విలువ తెలిసినవాడు, డబ్బును పొదుపుగా వాడేవాడు.. మధ్యతరగతి పొదుపరితనం నాడీ తెలిసినవాడు.. అందుకే ఆటోమోబైల్ రంగంలో ఒక పెను సంచలనమయ్యాడు. నాల్గు దశాబ్దాలకు పైగా ఆటోమోబైల్ రంగంలో నాయకుడై నిల్చిన ఒసాము సుజుకీ సరిగ్గా క్రిస్ట్ మస్ రోజు డిసెంబర్ 25, 2024న అస్తమించాడు. ఆదర్శ కుటుంబాలకు చిన్న వాహనాలు ముద్దని నమ్మి మార్కెట్ ను క్యాప్చర్ చేసిన తెలివైన వ్యాపారి ఒసాము సుజుకీ.

జపాన్ లో బాక్సీ పేరుతో 660 సీసీ ఇంజన్ సామర్థ్యంతో బాక్సులాంటి చవకైన కార్లను ప్రవేశపెట్టి అక్కడి ప్రభుత్వాల నుంచి పన్ను మినహయింపు పొందినవాడు. ఆటోమోబైల్ రంగంలో పన్నుల బెడద ఎలా ఉంటుందో తెలిసే.. పన్నుపోటు నుంచి తప్పించుకునేలా, మధ్యతరగతికి అనువుగా ఉండేలా కార్ల డిజైన్ చేయించాడు ఒసాము సుజుకీ. ఆ స్ఫూర్తితోనే మన దేశంలో నానో కార్లకు బీజం వేశాడు టాటా.

ఒసాము సుజుకీ ఆటోమోబైల్ రంగంలో ఎంత ఎత్తుకెదిగాడో.. డబ్బుకంత విలువ ఇచ్చేవాడు. తన ఫ్యాక్టరీల సీలింగ్ తగ్గించమని ఆదేశించాడు. ఎందుకంటే ఎయిర్ కండిషన్ కూలింగ్ వృథా కాకుండా… ఆదా కావాలనే ఓ యోచన అందులో ఉంది. తనతో సహా, తన కంపెనీ ఉద్యోగస్థులెవ్వరు ఫ్లైట్ లో ప్రయాణించినా ఎకనామిక్ క్లాసులకే పరిమితం చేశాడు. దాంతో ఆ సుజుకీ ఆటోమోబైల్స్ కంపెనీ ఉద్యోగులు చాటుకు ఒసామును పిసినారిగా అభివర్ణిస్తూ.. జోక్స్ కట్ చేసుకుంటూ పురాణాల్లా ఆయన పొదుపు కథలు చెప్పుకునేవారట. 1970-80ల కాలంలో సుజుకీలో కీరోల్ ఒసాము సుజుకీదే.

బ్యాంకర్ గా పనిచేసిన ఒసాము సుజుకీ.. 1958లో తన తాత స్థాపించిన కంపెనీలో చేరాడు. రెండు దశాబ్దాలనంతరం కంపెనీ ప్రెసిడెంటయ్యాడు.

1970వ దశకంలో ఉద్గార వాయు నిబంధనలకనుగుణంగా ఆటోమోబైల్ వాహనాల తయారీ చేయాల్సి ఉండగా.. సుజుకీ మోటార్స్ ఆ సమయంలో ఒడిదుడుకులెదుర్కొంది. పతనం అంచుకు చేరిన ఆ కీలక సమయంలో తమ కంపెనీకి ఇంజన్స్ ని సప్లై చేయడానికి అప్పటికే ఆటోమోబైల్ రంగంలో వరల్డ్ క్లాస్ లీడర్ గా ఉన్న టయోటా మోటార్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికింకా సుజుకీ మోటార్స్ కంపెనీ అంతగా అభివృద్ధీ చెందలేదు, ప్రాచుర్యాన్నీ సంపాదించలేదు.

1979లో జపాన్ లో ఒక రెవల్యూషన్ జనం కళ్లముందు నిల్చింది. ఆ దృశ్యమే రయ్ రయ్ మని దూసుకుపోయే బుల్లి ఆల్టో కారు. ఆ విజయం ఇచ్చిన ఊపుతో టయోటా మోటార్స్ వంటి కంపెనీలూ ఆల్టో గురించి మాట్లాడుకోక తప్పని పరిస్థితి 1981లో జనరల్ మోటార్స్ తో కొలాబ్రేట్ అయ్యాక.. ఆటోమోబైల్ వాహన రంగంలో సుజుకీ తిరుగులేని శక్తిగా ఎదిగింది.

భారత్ తో బంధం!

మారుతి సుజుకీ బంధంతో మారుతి 800 కార్లు సరిగ్గా 1983వ సంవత్సరంలో భారత్ రోడ్లపైకొచ్చాయి. అందుకోసం ఒసాము సుజుకీ నేతృత్వంలోని సుజుకీ కంపెనీ.. తన వార్షికాదాయం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఇండియాలో కార్ల కంపెనీని పెట్టాలని నిర్ణయించుకుంది. అదో సాహసోపోతమైన వ్యక్తిగత నిర్ణయం. కానీ, ఒసాము తలచిందే జరిగింది. తన సంకల్పం నెరవేరింది. ఇండియన్ మార్కెట్ పై మారుతి సుజుకీ 800 కారు బలమైన ముద్రవేసింది. ఎక్కడికెళ్లినా నంబర్ వన్ గా నిలవాలన్న ఒసాము తలంపు ఎంత బలమైందో చెప్పింది. ఇక ఆ తర్వాత ఆల్టో, స్విఫ్ట్ ఇలా వరుసబెట్టి కార్లు ఇండియన్ మార్కెట్ లో హాట్ కేక్స్ లా మారాయి. 2006 నుంచి ఆల్టో కార్ల సేల్స్ అమాంతం పెరిగిపోయింది. డిమాండ్ పెరిగి వచ్చిపడుతున్న ఆర్డర్లతో ఏకంగా పదిలక్షల కార్ల తయారీ చేయాల్సి వచ్చింది.

అప్పటివరకూ దేశంలో కేవలం ఏడాదికి 40 వేల కార్ల విక్రయాలకంటే తక్కువ ఉన్న నేపథ్యమది. పైగా అప్పటికి బ్రిటన్ కు చెందిన కార్లకే విలువెక్కువ. 1971లో అప్పటి ప్రధాని ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెట్ ప్రాజెక్టుగా భావించే మారుతిని ప్రభుత్వం జాతీయం చేసింది. ఆ సమయంలో సంజయ్ గాంధీకి మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులో ఉండే ధరల్లో ఓ చిన్న కారును రోడ్లపైకి తీసుకురావాలన్న ఆకాంక్ష బలంగా ఉండేది. కానీ, మారుతి అలాంటి కార్లను రోడ్లపైకి తేవాలంటే ఓ విదేశీ కార్ల తయారీ సంస్థ సహకారం తప్పనిసరైంది. రెనాల్ట్ కంపెనీతో ఒప్పందం కుదిరినా.. సెడాన్ కార్లు కొంత ధర ఎక్కువగా కావడంతో పాటు, ఇంధన సమస్యలు కూడా ఉండటంతో ఆ కోలాబ్రేషన్ కాస్తా బ్రేకైంది.

ఆ సమయంలో చిన్న కార్లను భారత్ లో తీసుకురావడానికి ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్న మారుతి.. విదేశీ భాగస్వామ్య సంస్థల కోసం ఫియట్, సుబారుతో పాటు, సుజుకీ తలుపులూ తట్టింది. కానీ సుజుకీతో సహా అంతా మారుతి ప్రతిపాదనలను తిరస్కరించినవాళ్లే.

కానీ, ఓ ఫైన్ మార్నింగ్ సుజుకీ మోటార్స్ డైరెక్టర్… జపనీస్ కంపెనీ డైహాట్స్ తో భారత్ కు చెందిన మారుతి సంస్థ చిన్నకార్లను తీసుకొచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోబోతోందన్న ఓ వార్తా కథనాన్ని చూశాడు. వెంటనే ఆ విషయం ఒసాముకు చేరింది. ఇంకేం ఆ డైరెక్టర్ భారత్ లోని మారుతి హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేశారు. జపాన్ కు రావాలని కోరాడు. తమనుంచి తిరస్కరణ ఎదురైన మాట వాస్తవమే.. రెండో అవకాశమనుకుని మాతో చేతులు కలపాలని కోరాడు. ఇంకేం, నెల రోజుల్లోపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఇరు కంపెనీలు సంతకాలు చేశాయి. ఆ ఇరు కంపెనీలు కుదుర్చుకున్నప్పుడు చేసిన ఆ సంతకమే.. ఇవాళ భారత కార్లమార్కెట్ లోని మధ్య తరగతి హృదయాల్లో నిల్చిపోయే సిగ్నేచర్ గా మారిపోయింది.

1983లో మొట్టమొదట భారత ప్రభుత్వ సహకారంతో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించింది. అలా మారుతితో జత కట్టి సుజుకీ మోటార్స్.. మారుతి 800తో ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అలా ప్రారంభమైన జర్నీ.. తన కార్లలాగే రయ్ రయ్ మంటూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పుడు భారతదేశంలోని కార్ల విక్రయాల వాటాలో 40 శాతం అమ్మకాలతో ఓ విప్లవాన్నే సృష్టించింది సుజుకీ మోటార్స్.

మారుతి-సుజుకీ ఆటోమోబైల్ సంస్థలు క్రమశిక్షణకు కేరాఫ్ లా కనిపిస్తాయి. వర్క్ ప్లేస్ లో సమానత్వం, చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ ఒకే క్యాంటీన్, ఎక్కడైనా పద్ధతిగా క్రమశిక్షణను కనబర్చేలా క్యూ లైన్స్, వర్కర్స్, ఎగ్జిక్యూటివ్స్ ఇలా ఎవరివివారికి యూనిఫామ్స్ తో ఒక హార్మోనీ కనిపించేలా కంపెనీ విధానాలను తీర్చిదిద్దింది సుజుకీ.

విజయాలే కాదు.. వైఫల్యాలూ తప్పలేదు!

ఒసాము సుజుకీ 80వ జన్మదినోత్సవం రోజు అంటే 2009 డిసెంబర్ లో ఫోక్స్ వ్యాగన్ తో బిలియన్ డాలర్స్ టైఅప్ పెట్టుకుంది. కానీ అది నిలవలేదు. సుజుకీ మోటార్స్ ఫియట్ నుంచి డీజిల్ ఇంజన్స్ ను కొనడాన్ని ఫోక్స్ వ్యాగన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ భారీ ఒప్పందం కాస్తా విఫలమైంది. అదే సమయంలో తమ ఒప్పందంలోని భాగస్వామ్యంపై అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఫోక్స్ వ్యాగన్ ను నిలబెట్టింది సుజుకీ. సరిగ్గా రెండేళ్ల వ్యవధిలోనే.. ఆ కంపెనీకి అంతకుముందు విక్రయించిన తన 19.9 శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయడంలోనూ విజయం సాధించింది సుజుకీ.

తన ఆరోగ్య రహస్యానికి గోల్ఫ్ ఆడటం, ఎప్పుడూ తన పనిలో నిమగ్నమవ్వడమే కారణమనేవాడు ఒసాము సుజుకీ. 2016లో తన కుమారుడు తోహిషిరోకు సీఈవోగా బాధ్యతలనప్పగించిన ఒసాము.. 91 ఏళ్ల వరకూ కూడా సుజుకీ మోటార్స్ సలహాదారుడిగా కొనసాగి తన అమూల్యమైన సేవలతో సుజుకీని ఆటోమోబాల్ రంగంలో రారాజుగా తీర్చిదిద్దాడు.

2016 నుంచి వరల్డ్ ఫేమస్ కార్ల సంస్థైన టయోటాతో ఒప్పందం కుదుర్చుకున్న సుజుకీ సంస్థలో.. 2019లో టయోటా 5 శాతం వాటా కొనుగోలు చేసింది. టయోటా కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి… వచ్చే ఏడాది 2025 నుంచి సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది మారుతి సుజుకీ.

సుజుకీ ఒసామును..టయోటా చైర్మన్ అకియో టయోడా తండ్రిలా భావిస్తానంటాడు. మినీ వాహనాలకు ఒసాము సుజుకీని ట్రయల్ బ్లేజర్ గా అభివర్ణిస్తాడు.

జపాన్ లో ప్రజలందరి ఆదరణ చూరగొనేలా KEI వంటి మినీకార్ల తయారీకి తండ్రిలాంటివాడిగా ఒసాము సుజుకీ పేరు.. కార్ల ప్రపంచమున్నంత కాలం అంతర్జాతీయంగా వినిపిస్తూనే ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles