కోహినూర్ వజ్రం గురించి ఇప్పటికీ దేశంలో అప్పుడప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. బ్రిటీషర్స్ చేతిలో పడ్డ ఆ కోహినూర్ వజ్రం వెనుక ఓ పెద్ద కథే ఉంది. అసలు అది ఎలా దొంగిలించబడింది..? 11 ఏళ్ల యువరాజును కూడా ఆ కిరీటంతో పాటే.. బ్రిటీష్ వారు ఎందుకు పట్టుకెళ్లారు..? అందుకోసం నాటి పంజాబ్ రాజ్యంపై ఎలా దండయాత్ర జరిగింది..? రక్తం ఏరులై ఎలా పారింది.. ? 5 ఏళ్ల ప్రాయంలోనే మహారాజుగా అవతరించిన యువరాజు దులీప్ సింగ్ ను.. ఎందుకు బంధీ చేశారు..? ఏకంగా తనను ఓ ఆంగ్లేయుడిలా ఎలా మార్చారు..? ఇదిగో చూచాయగా కొందరికి తెలిసిందే కావచ్చు.. చాలామందికి తెలియనిదే కావచ్చు.. ఓసారి విందాం రండి.

ముస్సోరి అంటే పచ్చదనం.. చుట్టూ కొండలు.. ఇంకోవైపు లోయలతో ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ మాత్రమే కాదు.. ఓ యువరాజు సింహాసనంతో పాటు, వజ్రాల్లోనే రారాజని చెప్పుకునే కోహినూర్ దొంగతనానికీ, ఓ యువరాజు తన గుర్తింపునే కోల్పోవడానికి కూడా ఓ చిరునామా.
పంజాబ్ చివరి సిక్కు పాలకుడు, పంజాబ్ షేర్ గా గుర్తింపు పొందిన మహారాజా రంజిత్ సింగ్ కుమారుడైన మహరాజా దులీప్ సింగ్ కథ ఇది. వాస్తవానికి కోహినూర్ కు నిజమైన వారసుడు దులీప్ సింగే. కానీ, ఆ తర్వాత అది క్వీన్ విక్టోరియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వ కబంధ హస్తాలకు చిక్కి వారి నిఘాలోనే దులీప్ సింగ్ కూడా తన జీవితాన్ని గడపాల్సి వచ్చింది.
1849లో ఆంగ్లేయులు- సిక్కుల మధ్య రెండుసార్లు భీకర యుద్ధం జరిగింది. రెండోసారి యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ ను స్వాధీనపర్చుకుంది. కేవలం 11 ఏళ్లున్న దులీప్ సింగ్ నుంచి బ్రిటీష్ వాళ్లు ఆ సమయంలో కోహినూర్ ఉన్న కిరీటంతో పాటు, అతడి సింహాసనాన్నీ కొట్టేశారు. అప్పుడు పంజాబ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైపోయింది. ఆ తర్వాత దులీప్ సింగ్ ను బంధించిన బ్రిటీషర్స్.. ఉత్తరప్రదేశ్ లోని ఫతేఘర్ కు తరలించారు. అక్కడ సిక్కు మతస్థుడైన దులీప్ సింగ్ ను క్రైస్తవ మతంలోకి బలవంతంగా మార్చి బాప్టిజం ఇప్పించారు బ్రిటీష్ కరడుగట్టిన పాలకులు. అలా బాప్టిజం తీసుకున్న తర్వాత దులీప్ సింగ్ ను ముస్సోరికి తిరిగి పంపించారు. కానీ, ఏ గెస్ట్ గానో కూడా కాదు.. ఓ ఖైదీగా బంధించి కఠినమైన సైనిక నిఘాలో పంపించారు.
దులీప్ సింగ్ నివాసం ముస్సోరీలోని బార్లోగంజ్ లో ఉంది. అతను బస చేసిన ప్రదేశం ప్రస్తుతం గ్రాండ్ జేపీ మనోర్ హోటల్ గా రూపాంతరం చెందింది. ఆ రోజుల్లో యువరాజు బస చేసిన నాటి నివాసమైన ప్రస్తుత హోటల్ నుంచి సస్పెన్షన్ బ్రిడ్జ్ ద్వారా సెయింట్ జార్జ్ కళాశాలకు రూట్ ఉండేది. ఆ తర్వాత 1936 వరకూ యువరాజు బంధించబడిన నివాసం ఓ మఠంగా అవతరించింది. భవిష్యత్ రాజుగా అవతరించాల్సిన దులీప్ సింగ్ కలలను కల్లలు చేసిన రాజసౌధం.. ఇప్పుడు ఓ హోటల్ గా అతిథులను ఆకర్షిస్తోంది.
యువరాజును ఆంగ్లేయుడిలా పెంచాలన్నదే బ్రిటీషర్స్ ఎజెండా!
బాలుడైన యువరాజు దులీప్ సింగ్ సంరక్షణను స్పెన్సర్ లాగిన్, అతడి భార్యకు అప్పగించారు బ్రిటీష్ పాలకులు. అతడికి ఆంగ్లభాషలో విద్యతో పాటు.. వారి అలవాట్లను నేర్పించే పనిని అప్పగించారు. స్పెన్సర్ లాగిన్ భార్య తన పుస్తకంలో యువరాజు దులీప్ సింగ్ క్రికెట్ ఇష్టపడేవారనీ రాశారు. అందుకోసం అతడికి ఓ ప్రత్యేక మైదానాన్నే ఏర్పాటు చేసివ్వగా.. అదిప్పుడు ప్రస్తుతం ముస్సోరీలోని సెయింట్ జార్జ్ కళాశాల ఎస్టేట్ లో భాగమైపోయింది. ఆ తర్వాత దులీప్ సింగ్ లండన్, ప్యారిస్ లోనే పెరిగి పెద్దయ్యాడు.
ఆంగ్లేయ బాలుడిలా తయారైన దులీప్ సింగ్!
పంజాబ్ ను ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నాక 11 ఏళ్లకే బ్రిటీష్ వారి కంబంధ హస్తాల్లో చిక్కి.. ఆ తర్వాత వారి వద్దే పెరగడంతో.. దులీప్ సింగ్.. ముస్సోరీలోని మెడాక్ స్కూల్ లో చదివాడు. అదిప్పుడు సావోయ్ హోటల్ గా అక్కడ ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ అధికారుల పిల్లలతో కలిసి చదవడం, ఆడటంతో అతడు కూడా అచ్చం ఆంగ్లేయుల మాదిరిగానా తయారయ్యాడు.
దులీప్ సింగ్ ఆహార అలవాట్లను కూడా బ్రిటీషర్స్ మెల్లిమెల్లిగా మార్చేశారు. కొంతకాలం అతడి అభిరుచి ప్రకారం పంజాబీ ఆహారాన్నందించినా.. రానురాను తన టేస్ట్ మారిపోయింది. అలా, ఆంగ్లేయుల వంటకాలకు దులీప్ సింగ్ మెల్లిగా అలవాటు పడిపోయాడు. అంతేకాదు, తన స్వేచ్ఛకు పరిమితులుండేలా.. తనను తాను మోనార్క్ గా ఫీలయ్యే అవకాశం లేకుండా పెంచారు. స్థానికంగా జరిగే ఉత్సవాలకుగానీ, బహిరంగ సమావేశాలకుగానీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడికీ అనుమతించేవారు కాదు. కొన్ని అనుమతించబడిన విహారయాత్రలు, క్రికెట్ మ్యాచులు, విలువిద్య, పిక్నిక్ స్పాట్స్ తో పాటు.. సైనిక బ్యాండ్ వద్దకు, కవాతులకు మాత్రమే పంపించేవారు.
భారతీయ యువరాజును.. ఆంగ్లేయుడిగా మార్చే పథకం!
1853లో ముస్సోరీలో ఆయన బస చేసిన సమయంలో యువరాజు కోసం ఒక 20 లెక్చర్స్ ను తయారుచేశారు. మత బోధనలు, సైన్స్ నుంచి మొదలుకుంటే సమాజం వరకూ వివిధ అంశాలపై బ్రిటీష్ అధికారులు, వారి మిషనరీ సంస్థలు, స్కాలర్స్ కలిసి వాటిని యువరాజుకు బోధించేవారు. రానురాను దులీప్ సింగ్ తానో ఇండియన్ నని మర్చిపోయేంతగా వాటిని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అలా భారతీయ యువరాజును బ్రిటీష్ ఆలోచనలతో పెంచాలనుకున్న వారి హిడెన్ ఎజెండాను దులీప్ సింగ్ పసిగట్టేంత వయస్సు లేకపోవడంతో.. ఆ తర్వాత దులీప్ సింగ్ ఆలోచనా సరళే పూర్తిగా ఆంగ్లేయుల మాదిరిగా మారిపోయింది.
ఈ విషయాలను ప్రఖ్యాత చరిత్రకారుడు గోపాల్ భరద్వాజ్ వెల్లడించారు. నేటి పర్యాటకులు జేపీ మనోర్ హోటల్ అందాల్ని ఆస్వాదిస్తున్నారుగానీ.. అది ఒకప్పుడు యువరాజు దులీప్ సింగ్ బందీగా ఖైదు చేయబడిన విషాద ప్రదేశమంటారాయన. తన రాజ్యాన్ని కోల్పోయిన ఓ యువరాజు తన అస్తిత్వాన్నే కాదనుకుని పెరిగిన ప్రదేశం ముస్సోరి. ఇప్పటికీ నాటి యువరాజ్ దులీప్ సింగ్ తన రాజరిక జీవితానికి దూరం జరిగిన ఆవేదన, అతడికి దక్కాల్సిన రీతిలో దక్కని గౌరవం, కోల్పోయిన బాల్యం ఇవన్నీ ఈ ముస్సోరీ కొండల్లో ప్రతిధ్వనిస్తుంటాయంటారు గోపాల్ భరద్వాజ్.
ముస్సోరీ కొండలు ఎన్నో కథలను భద్రపర్చినప్పటికీ.. యువరాజు దులీప్ సింగ్ కథ మాత్రం వెంటాడేది. కోహినూర్ కు వారసుడైన యువరాజు.. బ్రిటీషర్స్ చేతుల్లో ఓ బందీగా మారి.. ఓ పావుగా తన బాల్యజీవితాన్ని గడిపిన కథ మిగిలిన కథలకంటే విచారకరమైంది, విషాదమైంది.



