Padmaja Suraparaju… ✍🏼
ఆదుర్దాగా వడివడిగా నడుస్తూ ఒక నడివయసామె మొదలుపెడుతుంది సినిమాను. గబగబా ఇంట్లోకి వచ్చి నాన్నా ఎక్కడ నీవు అంటూ వస్తుంది. నీవేం చేస్తున్నావ్ ఈ వేళప్పుడు ఇక్కడ అంటూ ఆ తండ్రి చెవులకున్న హెడ్ఫోన్స్ తీస్తాడు. అప్పటివరకూ మెల్లగా మొదలై పెరుగుతూ పెరుగుతూ మన గుండెల్ను హోరెత్తించిన సంగీతం ఆగి వెనక్కుపోతుంది హెడ్ఫోన్స్ వైర్లలోకి.
ప్రశాంతంగా సోఫా పైన వాలి కూర్చున్న నాన్న కు గానీ ఆయనతో ఆ కూతురికిగానీ ఎన్ని సమస్యలో మనకు ఊహకూడా తెలియదు మొదటి మూడు నిమిషాలు.
ఇక మెల్లగా ఊబిలోకి దిగుతున్నాం అని తెలియకుండా దిగుతారు వాళ్ళతోపాటు చూసేవాళ్ళు కూడా సినిమా లోకి.

వాచీ వెతుక్కోవటం, అది ఎవరో దొంగిలించారని అనుకోవటం, నాన్నా నీవే దాచిపెట్తుంటావు కదా ఒక దాపుడు చోట్లో అని కూతురు అంటే మండిపడటం ముసలాయన దినచర్య. ఒకసారి కాదు, రోజుకు వీలైనన్నిసార్లు ఇదే వెతుకులాట ఆయన తన వాచ్ కోసం.
“టైమెంత అయింది?” వృద్ధుడి నిత్య నిరంతర ప్రశ్న.
“It’s time!” ఆయన్ను హెచ్చరిస్తూ మందులేసుకోమనీ, పడుకోమనీ, డ్రెస్ చేసుకోమనీ, తినమనీ ఇవతలి వాళ్ళ రిమైండర్స్.
జీవితకాలమంతా మనిషి ఒక్కో వయసులో ఒక measure తో తన కాలాన్ని కొలుస్తుంటాడు; కాఫీ స్పూన్ల తో, డిన్నర్ ప్లేట్లతో, మెడిసిన్ ఔన్స్ గ్లాసులతో. భూతభవిష్యవర్తమానాలు అలుక్కుపోయి తారుమారయి కలిసిపోయి వస్తూ పోతుంటాయి వృద్ధాప్యపు మెదడుకు. ఆయన స్మృతులేవో, కల్పనలేవో, వాస్తవాలేవో, తోస్తున్న భవిష్యసూచనలేవో తెలియకుండానే మనకు కథ మెల్లిగా తెలుస్తుంటుంది.
కన్నీళ్ళపర్యంతమీ కథ.
ఆయన దఃఖపడతాడు, తనను ప్రాణంగా చూసుకునే కూతుర్నీ దుఃఖపెడతాడు.
హారర్ అంటే దయ్యాలు, భూతాలు, అవి ఆవహించిన మనుషులూ, హాంట్ చేసే పాత ఇళ్ళు అని ఎందుకంటారో?
The real horror is here, now, in and around the still living.
Yes, one still appears to be living, just barely.
ముసలితనం వాతబడిన తల్లిదండ్రులను కాపాడవలసి రావటం ఇప్పుడు నడివయసు మనుషులను ఎక్కువగా తినేస్తున్న సమస్య.
వాళ్ళకు వృద్ధులైన అమ్మో, నాన్నో, ఇద్దరూనో, ఒకవైపు, మరో కొసన టీనేజ్ సమస్యలతో సతమతం అవుతూ, తమనూ అవస్థ పెట్తున్న తమ పిల్లలు. ఒక్కొక్కసారి లేట్ ముప్పైల్లో ఉండి ఇంకా వీళ్ళే తమ పెళ్ళి, విడాకులు, వేరే రిలేషన్స్ లో ఊపిరాడక గింజుకుంటున్న అయోమయ స్థితి.
ఏది ముఖ్యం, ఎవరికి ప్రాముఖ్యం ఇవ్వాలి? తమ సమయంలో, సౌకర్యంలో , తమ ఆదాయం భాగాలు వేయటంలో, అనే సమస్యలే ప్రాణాంతకంగా ఉంటున్నప్పుడు ఇక తల్లిదండ్రులకు తీవ్ర ఆరోగ్యసమస్య వచ్చి మీద పడిందంటే వాళ్ళ కేర్ తీసుకోవలసిన పిల్లల గతి చెప్పలేం.
ఇవి పిల్లల సమస్యలు.
వాళ్ళకు సమస్య అవుతున్న ముసలివాళ్ళు ఎన్నిరకాల పోరాటాలు (అన్నీ లోపలే, బయటి పోరాటాలు చేసే శక్తి ఉడిగిపోయినవాళ్ళు కాబట్టి) చేయవలసివస్తోందో మనకప్పుడే తెలీదు.
“why do you talk to me as to a retard?” అల్జీమర్స్ స్టేజ్ దాటిపోయి స్కీజోఫ్రీనియా లెవల్ కు వస్తున్న తండ్రి కోపం కూతురి మీద.
ఆత్మన్యూనతాభావం, అందులోంచి కోపం, అపకారం చేస్తారేమోననే అనుమానం, ఎవరిమాటైనా ఎందుకు వినాలి నేను అనే పంతం … పెద్దతనం లక్షణాలు.
తనను ఆదివారపు సాయంత్రాలు అప్పుడప్పుడూ వచ్చి చూసేది నీ కూతురు అంటుందేంటి ఈ నర్సు? తన అమ్మ కదా వస్తోంది తన కోసం పాపం! చిట్టచివరకు వచ్చాక మొట్టమొదటి బంధమే గుర్తుంటుందేమో.
తన ఇల్లో, కూతురి ఇల్లో, ముసలోళ్ళను పడేసే హోమో తనకు ఏదీ తెలియటం లేదు. ఏదీ బాగాలేదు. ఏదీ వద్దనపిస్తున్నది.
కూతురు వంటింట్లోకి వెళ్ళగానే తన చెంపలు పగలకొట్టింది అల్లుడా, మేల్ కేర్ టేకరా?
అసలు అది చెప్పినా కూతురు నమ్ముతుందా? తనేడుస్తుంటే తనూ ఏడుస్తోంది కానీ, ఆమె ఇంతింత పెద్ద కళ్ళు చెరువులవుతుంటే.
తనకు ఇప్పుడు నిజాలు తెలీదు. వద్దు కూడా. భయాలొకటే తన తోడు. అందులో కూతురు మరొక పెళ్ళి చేసుకుని శాశ్వతంగా తనను వదిలించుకుని పారిస్ పోతుందని కూడా. అది నూరుశాతం నిజం కావచ్చు, యాభై శాతం అతని అపోహ కావచ్చు.
అది ఎంత నిజమో తెలియకుండానే, అసలు అల్లుడు ఇంకా ఉన్నాడో విడాకులిచ్చి వెళ్ళిపోయాడో కూడా తెలియకపోయినా వాడికి ఈ గాసిప్ చెప్పేంత naughty wicked dad ను నేను అని అతనికి ఊహామాత్రంగా కూడా తెలియదు.
ఇక కూతురు, ఈ తండ్రిని చూసుకుంటుందా? చేయక తప్పని ఉద్యోగం చేస్తుందా? భర్త తో తెగతెంపులు చేసుకుంటుందా తండ్రి కోసం, లేక వాడి కోసం ఈయనను హోమ్ లో పెడుతుందా?
ఒజూ తీసాడు ఈ సమస్యలను సినిమాగా; కూతురి పెళ్ళితో అనాధలయ్యే తండ్రుల కథలను.
‘vertigo’ అనే సినిమాలో అల్జీమర్స్, ముసలితనం, ఒంటరితనం, ఎనభై వచ్చినా వదలలేని రకరకాల వ్యామోహాలు, తీవ్ర అశాంతి, నిస్సహాయ శోకం, భయానకమైన ఊబి వంటి దుఃఖం అది.
ఇప్పుడు ఈ ‘The Father’.
Anthony Hopkins తండ్రిగా, Olivia Colman కూతురిగా, చూసినవాళ్ళు జన్మలో మర్చిపోని నటన.
చివరకు తన తల వాల్చగల ఒక భుజం కావాలి. తను ఎంత అది అబద్ధం అంటున్నా “ఏం ఫర్లేదు, ఇప్పుడేమయిందని, ఊరుకో. ఏడ్వకు.” అని చెప్పే ఒక మనిషి కావాలి. తను ఎవరైతే నీకేంటి? అమ్మేనో, కూతురేనో, నర్సేనో.
ఆమె నిన్ను ఓదారుస్తూ అంటున్న మాటలకు మంత్రశక్తి ఇవ్వదలిచి దీక్షగా కళ్ళు మూసి నీ కోసం ప్రార్థించే తోటి మనిషి; అది ఎవరైతే ఏంటి?
మతి నీ స్వాధీనం తప్పేలోపల, మతిని స్వాధీనంలో పెట్టుకునే విద్య కంపల్సరీ చెయ్యాలి సిలబస్ లలో అని వేడుకుంటాం ఇటువంటివి చూశాక.
Florian Zeller డైరెక్టర్, తనే రాసిన French play ‘Le Père’ నే సినిమా గా తీసాట్ట.
స్క్రీన్ ప్లే కూడా he co authored, మరో playwright Christopher Hampton తో కలిసి. Background score సినిమాకు ప్రాణం.



