రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో… ఓటర్లకు బాధ్యతను తెలియపర్చేందుకు అక్కడి డాక్టర్లంతా ర్యాపర్లుగా మారారు. అవునూ, తమిళనాడులో ఇప్పుడా ర్యాపర్స్ బృందం తమ ర్యాప్ బృందగానంతోనూ, నృత్యాలతోనూ ఆకట్టుకుంటోంది.

చెన్నైలో నేత్ర వైద్య నిపుణుడైన డాక్టర్ మురుగానంత్ సభాపతి, డాక్టర్ అనంత కృష్ణన్, డాక్టర్ అనిరుధ్ రాజ్ కుమార్ కలిసి సృష్టించిన.. వా ఓట్ పోడు అనే తమిళ రాక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ముఖ్యంగా జెన్ జీ యువతతో పాటు.. మధ్యవయస్కులనూ ఆలోచింపజేసేలా పాటకు రూపకల్పన చేశారు. ఓటర్లలో ఓటు హక్కు పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తగ్గించి… పౌర సమాజంలో పౌరుల బాధ్యతను గుర్తు చేసేలా సాగింది ఆ పాట.
ఎంతసేపు హాస్పిటల్.. పేషంట్స్.. లేదంటే ఫ్యామిలీ… అంతకుమించి డాక్టర్ దోస్తులతో మాత్రమే కలిసే వైద్యులు ఇలా ఒక విస్తృతమైన సామాజికాంశాన్ని ఎంచుకుని అవగాహన కల్పించే కొత్త ప్రయత్నం చేయడం తమిళనాడుతో పాటు, యావత్ భారతాన్నీ ఆకర్షిస్తోంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… వా ఓట్ పోడు అనే పాట తయారు చేయగా ఈ పాటలో ఎక్కువ భాగం ర్యాప్ స్టైల్ లోనే కొనసాగడం విశేషం. వీరంతా ఇలా జట్టు కట్టి ఏ టీవీల్లోనో, రేడియోల్లోనో ప్రకటనలివ్వడమే.. లేక, వేదికలెక్కి పాడటమో చేయడం లేదు. కానీ, ఓటర్లలో సామాజిక స్పృహ కోసం వీరు పాడిన పాట మాత్రం వైరల్ మారి.. ఇప్పుడు తమిళనాడులో నాయకుల ప్రసంగాలను, వాగ్ధానాలను, హామీలను మించి చర్చల్లోకొచ్చింది.
వైద్యుల్లో ఈ ఆలోచనకు ఎలా బీజం పడింది..?
నేత్ర వైద్యుడైన మురుగానంత్ సభాపతి.. తన స్నేహితుడైన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనంత కృష్ణన్ తో ఓ సమావేశంలో కలిసి మాట్లాడుతుండగా.. ఈ మెరుపు ఆలోచన ఈ ఇద్దరు డాక్టర్లకూ తట్టిందట. తమిళనాడులో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో.. ఇంకా పౌరసమాజంలో చాలామంది ఎందుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు.. ఎందుకు, ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకుంటున్నారనే చర్చ జరిగిందట ఈ ఇద్దరు మిత్రుల మధ్య. జెన్ జీ నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల వరకూ ఓటు హక్కు వినియోగంపైన తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతున్నారన్నదే ఈ ఇద్దరు వైద్యుల్లో వ్యక్తమైన బాధ. దాంతో అందుకు తమవంతు బాధ్యతగా ఏం చేయాలా అన్న యోచనలో పడ్డారు ఈ ఇద్దరు స్నేహితులు.
ఒక శక్తివంతమైన పాటతో ఓటు వినియోగంపై మంచి ప్రచారం కల్పించవచ్చు. సమస్యను అధిగమించవచ్చనే ఆలోచనతో ఈ ఇద్దరు వైద్యులు కలిసి.. మరికొందరు తమ మిత్రులతో తమ ఆలోచనల్ని పంచుకున్నారు.
పైగా ఈ ఇద్దరు డాక్టర్లకీ కాస్త పాటలు పాడే అలవాటు, అంతో ఇంతో సాహిత్య సృజనతో పాటలు రాయగల్గే ప్రతిభ కూడా ఉండటంతో.. ఇద్దరూ కలిసి పాటకు రూపకల్పన చేశారు. వీరితో మరికొందరు డాక్టర్లు కూడా జత కలవడంతో ఒక ర్యాప్ సాంగ్ తయారైంది.
గుర్తుండిపోయేలా సంస్కృతికి దగ్గరగా పాట రూపకల్పన!
మొట్టమొదట తమ మోటో విజయవంతం కావాలంటే పాట గుర్తుండిపోవాలి. అందుకోసం సులభమైన పదాలను ఎంచుకుని పాట రాశారు. ఆ పాట రచన సులభంగానే ఉన్నా.. ట్యూన్ క్యాచీగా ఉన్నప్పుడే పాట క్లిక్కై జనం నోళ్లల్లో ఆడే అవకాశముంటుంది. అలా జనం నోళ్లల్లో ఆడినప్పుడు పాట హిట్టై.. తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇదే ఆలోచనతో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లేలా పాటను ర్యాప్ సాంగ్ గా తీర్చిదిద్దారు. ఓవైపు ర్యాప్ తరహా సంగీతానికి తోడు.. మరోవైపు, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా కోలాటం శైలి వాద్యాలను మిళితం చేయడంతో వా ఓట్ పోడు సాంగ్ తమిళనాడు గల్లీగల్లీలో వినిపిస్తోంది.
ముఖ్యంగా జెన్ జీ యువతను ఆకట్టుకునేందుకు ర్యాప్ సంగీతంలో పాటను ట్యూన్ చేసినట్టు చెప్పారు డాక్టర్ సభాపతి. రాజకీయ, సామాజిక సందేశాన్ని కవితాత్మకంగా వినసొంపుగా చెప్పడం వల్ల తామనుకున్న లక్ష్యం నెరవేరందన్నది డాక్టర్ల బృందం అభిప్రాయం.
ముగ్గురు డాక్టర్ల కలయిక వెనుక!
డాక్టర్ మురుగానంత్ సభాపతి, డాక్టర్ అనంత కృష్ణన్, డాక్టర్ అనిరుధ్ రాజ్ కుమార్ వీరు ముగ్గురూ కూడా ఒకే కళాశాలలో చదివిన స్నేహితులు. సభాపతి సంగీతం సమకూర్చి పాట పాడితే.. అనంత కృష్ణన్ పాట రాసి, ఈ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. ఇక అనిరుధ్ రాజ్ కుమార్ ర్యాప్ పాడటంతో పాటే, మ్యూజిక్ ను ఎనర్జిటిక్ గా మార్చే విషయంలో తనవంతు పాత్ర పోషించారు. అనిరుధ్ రాజ్ కుమార్ కు ఇప్పటికే సంగీతంలో ప్రవేశం ఉండటంతో… ర్యాప్ భాగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
పాట నేపథ్యానికి అవసరమేంటి..?
ఒక ఓటు విలువ ఎంత ఉంటుందో చెప్పడమే పాట రూపకల్పనకు కారణం. చౌకగా వస్తుందని కొందరు అనధికారిక చికిత్సలు చేయించుకుంటారు. ఆ తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యలతో తమ దగ్గరకు వస్తారు. ఆరోగ్య రంగం చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. యువ ఓటర్లు ఆరోగ్య రంగాన్ని రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని పట్టించుకోకపోవడం కూడా ఆందోళనకు కారణమంటారు డాక్టర్ సభాపతి.
అలాగే, ఓటింగ్ ను వ్యక్తిగత బాధ్యతగా ఓటర్ల మస్కిష్కానికెక్కించడం, పౌర సమాజ బాధ్యత ప్రతీ పౌరుడూ పాటించాల్సిందేనని చెప్పడమే పాట వెనుక ప్రధాన ఉద్దేశంగా ఈ వైద్యుల బృందం పేర్కొంటోంది. 20 రోజుల్లోనే ప్రజలకు తామనుకున్న భావాలను చేరవేయాలంటే పాట ఒక్కటే మార్గమనే భావనతో ఈ ముగ్గురు డాక్టర్లూ కలిసి ఓటు హక్కుపై వా ఓట్ పోడు ర్యాప్ సాంగ్ ను విడుదల చేసి ఇప్పుడు వార్తల్లో ర్యాప్ సింగర్సయ్యారు.
డాక్టర్లు ముగ్గురూ ఈ పాట పాడటం విశేషం. క్రమశిక్షణకు ప్రతీకగా చూసే డాక్టర్ల తెల్లకోటు.. ఇప్పుడు సృజనాత్మకంగా పాటలో మిళితమై ఓటు హక్కుపై కాస్త కొత్త తీరులో సందేశమిస్తోంది.
రాజకీయాలపై పలు అభిప్రాయాలు వెలిబుచ్చేవారు, చర్చించేవారు, మంచి అవగాహన కల్గి ఉన్నవారు కూడా ఓటు హక్కు వినియోగానికి వచ్చేసరికి మాత్రం సోమరితనాన్ని ప్రదర్శించడమే ఈ వైద్యుల బృందాన్ని బాధించిన విషయం. ఆ ఖాళీని పూరించడమే ఈ డాక్టర్ల ర్యాప్ సాంగ్ లక్ష్యం.
పాటలోని సందేశం ఎలా ఉంటుందంటే..?
కొన్ని ముఖ్యమైన పంక్తులు…
మక్కలిన్ ఆచ్చి – ప్రజాపాలన
వావా ఓట్ పోడు – ఇది నీ హక్కు, రా ఓటు వేయ్
మొత్తంగా ఓటింగ్ ను ఓ కర్తవ్యంలా కాకుండా.. వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలనే మోటో ఈ వా ఓట్ పోడు పాట వెనుక కనిపిస్తోంది.
పెద్ద మార్పు కోసం డాక్టర్ల చిన్న ప్రయత్నం!
ఇప్పటికే ఓటు హక్కు వినియోగంపైనా చాలా పాటలే వచ్చి ఉండొచ్చు. అవగాహన కల్గించి ఉండొచ్చు. ఈ వైద్యుల ఆలోచనా సర్వసాధారణమైనదే అయి ఉండొచ్చు. కానీ, వైద్యులిలాంటి ఆలోచన చేసి తమకు తెలిసిన మార్గంలో సమాజంలో మార్పు కోసం యత్నించడం.. అదీ రొటీన్ వారి వృత్తికి భిన్నంగా ర్యాప్ సాంగ్ తో అలరించడం విశేషం. సంప్రదాయ ప్రచారాల బదులు.. ఒక్క పాటతో, సంగీతంతో ప్రజలను సులభంగా చేరుకునే విధానంలో వైద్యుల ఆలోచన కనిపిస్తోంది.
ఈ వైద్యుల బృందం చేసిన ఈ ర్యాప్ సాంగ్ ప్రయోగం, ప్రయత్నం రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను పెంచుతుందా, లేదా తెలీదుగానీ.. ఈ పాటతో మరోసారి ప్రజలకు తమ ఓటు హక్కు బాధ్యతను మాత్రం గుర్తు చేస్తోంది. అందుకు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఈ పాట లక్ష్యం నెరవేరిందనడానికి నిదర్శనం.



