జీవితాల్ని సుసంపన్నం చేసిన భాష: ముచ్చటగా మూడూళ్ల కథ!

వారు ఆ భాషలను భుజానికెత్తుకున్నారు! ఇప్పుడా భాషలే వారిని సుసంపన్నుల్ని చేశాయి!!

ఏ భాషైనా దానికది గొప్పదే. ఒక్కో భాషలో ఒక్కో మాధుర్యం కట్టిపడేస్తుంది. అలాంటి భాషల్లో ఉర్దూ ఒకటి. శాయరీలు, గజల్స్, కవ్వాలీ పాటలు విన్నప్పడు ఆ మాధుర్యమేంటో ఆ భాషనెరిగిన వాళ్లకు అర్థమైతుంది… ఒక్కమాటలో చెప్పాలంటే వారిని మైమరిపిస్తుంది. అలాంటి ఉర్దూ భాషకు ఓ గ్రామం మొత్తం ఇప్పుడు కేరాఫ్ గా మారింది. అయితే, ఆ ఊరు ముస్లిం ప్రభావిత ప్రాంతమేమాత్రం కాదు. ఆ ఉర్దూ మాట్లాడేవాళ్లు… ఆ ఉర్దూతో ఉపాధి పొందుతున్న వారంతా హిందువులే!

అదే రాజస్థాన్ లోని సిద్రా గ్రామం. సిద్రా కథ వింటే… మరో రెండు గ్రామాల కథలు కూడా కళ్ల ముందు కదులుతాయి. అందులో తెలంగాణాలోని జగిత్యాల జిల్లా ధర్మపురి ఒక్కటైతే… కర్నాటక షిమోగా జిల్లాలోని మట్టూరు మరొకటి!

ముందు మనం రాజస్థాన్ లోని సిద్రా నుంచి మొదలెట్టుకుంటే… అసలు ఆ గ్రామం ఉర్దూకు ఎందుకు కేరాఫైంది.. కారణమేంటో తెలుసుకుంటే.. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లో సిద్రాతో పోలి ఉన్న కథలేంటో కూడా చెప్పుకోవచ్చు.

అసలు సిద్రా సాధించిందేంటి…?

పెరుగుతున్న జనాభాకనుగుణంగా ఉపాధి కరువవ్వడం ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీంతో నిరుద్యోగిత అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఏ సబ్జెక్టును ఎంచుకుంటే ఉపాధి పొందొచ్చు, ఉద్యోగం సంపాదించొచ్చో ఆలోచించడం ఇప్పుడు వివేకవంతుల లక్షణం.

అలా ఆలోచించారు గనుకే సిద్రా ఇప్పుడు వార్తల్లోని గ్రామం. రాజస్థాన్ టోంక్ జిల్లాలోని సిద్రాలో… క్లాసులో నాల్గు వందల మంది ఉంటే.. అందులో 300కు పైగా ఉర్దూను ఔపోసన పడుతున్నవారే. ఎందుకంటే రాజస్థాన్ లోని పలు పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులతో పాటు.. కళాశాలల్లో ప్రొఫెసర్స్ పోస్టులు కూడా ఉండటంతో… సిద్రా మొత్తం ఉర్దూపై ఫోకస్ చేసింది. అలా ముస్లిమ్స్ అక్కడో, ఇక్కడో మైనార్టీగా ఉండి.. హిందువుల సంఖ్యే అధికంగా ఉన్న సిద్రా ఇప్పుడు ఉర్దూ భాషకు ఓ ప్రధాన కేంద్రంగా మారింది. కేవలం తరగతి గదుల్లో నేర్చుకున్నది.. ఉర్జూ ఉపాధ్యాయులుగా మళ్లీ తరగతి గదుల్లో బోధించేవరకే పరిమితం కాకుండా… ఇప్పుడు ఊళ్లో మాట్లాడేందుకూ ఓ ప్రధాన అధికార భాషయ్యేంతగా ఉర్దూ సిద్రాను ప్రభావితం చేసింది

2022లో కల్పనామీనా అనే 12వ తరగతి విద్యార్థిని ఉర్దూ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఉర్దూకు ఒక ఊపు తీసుకొచ్చింది. అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతోపాటే, ఉర్దూను అధికారిక భాషగా పాఠశాలల్లో ప్రవేశపెట్టాక… ఉర్దూను తమ థర్డ్ లాంగ్వేజ్ గా చేసుకుని చదివినవారిలో సుమారు వందమంది సిద్రా అనే చిన్న గ్రామం నుంచి ఉర్దూ ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్స్ గా ఉద్యోగాలు సంపాదించారు. వీరంతా ఇప్పుడు రాజస్థాన్ వ్యాప్తంగా పని చేస్తున్నారు.

నిరుద్యోగిత పెరిగిపోయి ఉపాధి లేక డిప్రెషన్ కు లోనయ్యే తరుణంలో ఉర్దూ భాష మా ఊరి యువతకు తలుపులు తెరిచింది, బతుక్కో ఊతమైందంటారు సిద్రా గ్రామసర్పంచ్ రాంసాయి మీనా. ఉర్దూను మూడో భాషగా కంపల్సరీ చేయడం వల్ల ఉద్యోగాలు సాధించాలన్న తపనతో.. ఆ భాషలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఎందరో ఉర్దూ పండిట్స్ గా ఉద్యోగాలు సంపాదించడంపై ఆ గ్రామ సర్పంచ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సిద్రా విద్యాలయాల్లో ఉర్దూను అధికారికంగా ప్రవేశపెట్టిన్నాట్నుంచి.. డ్రాపవుట్స్ తగ్గి.. విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఉపాధి లభిస్తుందన్న భరోసానే అందుకు ప్రధాన కారణమంటారు ఓ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు బీర్బల్ మీనా. గతంలో పదో తరగతి వరకు మాత్రమే చదివి.. ఇక చాలని చదువులాపేసిన వారంతా ఇప్పుడు ఉన్నత చదువులు చదివి.. ఉర్దూ పండిట్స్ గా రాణిస్తున్నారంటారాయన.

గతంలో ముస్లిం రాజుల పాలనా ప్రభావం కూడా అధికంగా కనిపించే సిద్రాలో.. మెజార్టీ ప్రజలు హిందువులే అయినప్పటికీ ఉర్దూ భాషా సాహిత్యం, కవిత్వ పోకడల్లో కూడా ఈ గ్రామం పేరు రాజస్థాన్ లో ఇప్పుడు మార్మోగుతోంది. 1990 దశకంలో ఉర్దూను ఐచ్ఛిక భాషగా పాఠశాలల్లో ప్రవేశపెట్టిన్నాట్నుంచీ… మహ్మదీయులు అధికంగా కనిపించే ప్రాంతాలతో సరి సమానంగా ఇక్కడ ఉర్దూ దినదినాభివృద్ధి చెందడం ఓ విశేషం.

2022లో రాజస్థాన్ లో నిర్వహించిన డీఎస్సీలో మొత్తం 800 వంది ఉపాధ్యాయ పోస్టుల్లో… 40 మంది సిద్రా నుంచే ఉర్దూ పండితులుగా ఎంపికయ్యారు. ఇంకా కూడా ఉపాధ్యాయుల డిమాండ్ చాలా పాఠశాలల్లో ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ సర్కార్ చొరవ చూపితే ఆ పోస్టులను భర్తీ చేసినట్టవుతుందని.. అలాగే, ఆ పోస్టుల్లో తమ సిద్రా గ్రామ ప్రజలే మరిన్ని ఉద్యోగాలు సంపాదించే అవకాశముందంటున్నారు అక్కడివారు.

అయితే, ఇప్పుడు ఉర్దూ శాయరీలు, గజల్స్, కవ్వాలీ పాటలు, కవితలు, వచన సాహిత్య సభలతో సిద్రా రాజస్థాన్ లో ఓ ప్రత్యేకతను సంతరించుకోవడంతో… మతపరమైన సరిహద్దులను చెరేపేసేలా ఉర్దూ భాష విస్తరిస్తున్న తీరు.. సిద్రా వంటి గ్రామంలోని యువతకు ఉద్యోగాలు వస్తున్న రీతి.. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉర్దూపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణమవుతోంది.

ఇక తెలంగాణా రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురి కూడా ఈ కోవలో చెప్పుకునే ఓ గ్రామం.

మరి ధర్మపురి ప్రత్యేకతేంటి..?

రాజస్థాన్ సిద్రాలో ఉర్దూ పండిట్స్ ఎలాగో… తెలంగాణా ధర్మపురిలో ఇంటికొక్కరి చొప్పున తెలుగు పండితులు కనిపిస్తారు. దాదగారి కిషన్ రావు అనే ఓ వ్యక్తి సంకల్పంతో ధర్మపురిలో ఏర్పాటు చేసిన బీవోఎల్ కళాశాల పెట్టిన భిక్షకు నిలువెత్తు సాక్ష్యంగా.. ఇవాళ ఎందరి జీవితాలో ధర్మపురిలో సుసంపన్నంగా మారాయి. హిందూ , ముస్లిం అన్న తేడా లేకుండా సమ్మిళితంగా తెలుగు పండితులుగా స్థిరపడటం ఇక్కడ కనిపించే మరో విశేషం. అలా ఇంటికొక్కరే కాకుండా.. భార్య, భర్తలిద్దరూ ప్రభుత్వ తెలుగు పండితులుగా సెటిలై రెండు రెళ్ల నాల్గు చేతులా సంపాదిస్తూ… ఒకనాడు బతకడానికి బడి పంతులుగా ఉన్న నినాదాన్ని కాస్తా పూర్తగా మార్చేశారు. ఇవాళ బాగా బతకాలంటే బడి పంతులు కావల్సిందేనన్న రీతిలో… ఒక తరం జీవితకాలంలో జరిగిన ఓ ట్రాన్స్ ఫార్మేషన్ గా చెప్పుకోవచ్చు.

ఇక్కడా తెలుగుతో పాటు.. సంస్కృతం.. మరీ ముఖ్యంగా వేదం, సంగీతం, సాహిత్యం, నాటకం వంటివి వర్ధిల్లుతున్న ప్రాంతం. అమృత తుల్యమైన భాషతో పాటు… కళల కాణాచిగా ధర్మపురి పేరు ఇప్పటికే సుస్థిరం. ఒక్క శేషప్ప శతకం చాలు.. ఈ ఊరి గొప్ప గురించి గొప్పగా చెప్పాలంటే!

ఇక ఇదే పద్ధతిలో మనం చెప్పుకోవాల్సిన మూడో పేరు మట్టూరు. కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలోని మట్టూరు ఊరు ఊరంతా సంస్కృతమే మాట్లాడతారంటే వినడానికి ఈరోజుల్లో కాస్త వింతగానే వినిపిస్తుండొచ్చు. కానీ, అక్కడికెళ్లి చూస్తే కనిపించే దృశ్యం మాత్రం అదే!

ఎందుకు మట్టూరు సంస్కృత సంప్రదాయ నిలయమైంది..?

సంస్కృత భాషపైన ఎవరి అభిప్రాయాలెలా ఉన్నా… అలాగే, సనాతన ధర్మాలపైన భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా.. తాము నమ్ముకున్న ఓ సిద్ధాంతానికి కట్టుబడి సనాతన సంస్కృతిని సంస్కృత భాషతో కలిపి మట్టూరును ఓ ప్రత్యేకతగా నిలబెట్టిన ఘనత అక్కడి ప్రజలది. అన్ని భాషలకు తల్లి భాషగా చెప్పబడే సంస్కృతాన్ని సర్ విలియమ్ జోన్స్ వంటివారే కొనియాడారు. సుప్రీం కోర్టు జడ్జ్ గా పనిచేసిన.. వివిధ భాషలపై అధ్యయనం చేసిన విలియమ్ జోన్స్ సంస్కృతం, గ్రీక్, ల్యాటిన్ భాషల మూలాలన్నీ ఒకే తీరుగా ఉన్నాయనే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 1784లోనే కలకత్తాలో యూరోపియన్-ఇండియన్ లాంగ్వేజెస్ పై రీసెర్చ్ చేసే క్రమంలో ది ఏసియాటిక్ సొసైటీని స్థాపించారు. ఆ క్రమంలో సంస్కృత భాష ఔన్నత్యం, విస్తృతిని ఇతర విదేశీ యూనివర్సిటీలకు పరిచయం చేశారు.

బైకుపైన ఇద్దరు యువకులు వెళ్లుతూ మాట్లాడుకునే భాష సంస్కృతం.. ఇద్దరు ఆడపడుచులు కలిసి సంభాషించుకునే భాష సంస్కృతం.. కూరగాయల వ్యాపారికీ, కొనుగోలుదారుడికీ మధ్య జరిగే బేరం సంస్కృతం… నదీ తీరంలో వేద బ్రాహ్మణులు వేద పఠనమనంతరం కలిసి చేసే చర్చ సంస్కృతం.. ఇలా మట్టూరు కూడా సంస్కృత భాషతో పరిఢవిల్లుతున్న గ్రామంగా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. మట్టూరు వేద పండితులకు ఆలవాలం. ఆ సంస్కృతి పరిరక్షణలో భాగంగా తమ వాడుక భాషగా సంస్కృతాన్ని ఎంచుకుని… తమ ఉపాధికి ఆ వేదంతో పాటు.. సంస్కృత నాదాన్ని జతచేసిన గ్రామం మట్టూరు.

ఇదండీ మొత్తంగా ఈ మూడు భిన్న రాష్ట్రాలు, భిన్న సంస్కృతులు, విభిన్నమైన ప్రజల ఆచార, వ్యవహారాల్లో.. మూడు భాషలతో ముచ్చట గొలిపే ఊళ్ల కథ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles