టెన్నిస్ ప్రపంచమంటే మనవాళ్లెందరున్నా… ప్రాశ్చాత్య ప్రపంచంలో వారిముందు దిగదుడుపే. ఇదే పచ్చి నిజం. ఎందుకంటే, మన దేశంలో క్రికెటే సర్వస్వం. మిగిలిన క్రీడలకు ఆదరణ క్రికెట్ తో పోలిస్తే చాలా తక్కువే. అయినప్పటికీ ఓ రమేష్ కృష్ణన్, ఓ ఆనంద్ అమృత్ రాజ్, ఓ రమేష్ భూపతి, ఓ రోహన్ బోపన్న, ఓ సానియామిర్జాలాంటివారు రాణించినా… అది ప్రపంచ స్థాయిలో ఓ పీట్ సంప్రాస్, ఓ ఫెదరర్, ఓ నాదల్, ఓ జెకోవిచ్, ఓ మార్టినా హింగిస్, ఇంకో స్టెఫీగ్రాఫ్ తరహాలో రాణించేవారి సంఖ్య వేళ్లమీద లెక్కించేదే. ఈ క్రమంలో నాదల్ స్కూల్లో ట్రైన్ అప్ అవుతూ ఓ భారతీయ యువతి ఇప్పుడు క్లేకోర్ట్ రారాజు నాదల్ నే ఆకట్టుకుంటోంది. తన ఆటను తదేకంగా పరిశీలిస్తూ నాదల్ నిలబడ్డి ఓ ఫోటో ఇప్పుడు ఇన్ స్టాలో తెగ వైరలవుతోంది.

ఆమే మాయా రాజేశ్వరన్. భారత్ నుంచి ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా ఎదగాలన్న తపన, కసితో స్పెయిన్ బాట పట్టింది. అక్కడ రఫా అలియాస్ రఫెల్ నాదల్ మల్లోర్కా ఐల్యాండ్ లోని మనకోర్ లో ఏర్పాటు చేసిన తన రఫానాదల్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
రఫా అకాడమీలో పలువురు కోచెసే మొత్తం శిక్షణంతా చూసుకుంటుంటారు. వారందరికీ ఇప్పుడు అప్ కమింగ్ ఫేవరేట్ టెన్నిస్ క్రీడాకారిణుల్లో మన మాయా రాజేశ్వరన్ ఒకరు. అంతలా ఆమె ఆ అకాడమీలో సుశిక్షితురాలవ్వడంతో.. ఏకంగా రఫానే ఆమె ఆటను చూడటానికి ఓ సెషన్ కు హాజరయ్యాడు.
ఇదే విషయాన్ని రఫానాదల్ టెన్నిస్ అకాడమీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. రఫా మాయా రాజేశ్వరన్ ఆడుతున్న తీరును ఎంత నిశితంగా పరిశీలిస్తున్నాడో వెనుకనుంచి ఆ ఫోటోలో కనిపిస్తుంది. ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. very special spectator అన్న క్యాప్షన్ తో వరల్డ్ టెన్నిస్ అకాడమీ పోటీల్లో సెమీఫైనల్స్ కు చేరుకున్న జస్ట్ 15 ఏళ్ల మాయా రాజేశ్వరన్ ను అభినందించే ఫోటో అది. ఆమె ఆడుతున్న తీరు చూస్తే ఆసాంతం ఎక్కడా మిస్ కాకుండా చూసేలా ఉందన్న అర్థంతో ఆ ఇన్ స్టా పోస్ట్ మాయా రాజేశ్వరన్ ప్రతిభకు ప్రతిబింబంగా నిల్చింది.
మాయా రాజేశ్వర్ ది కోయంబత్తూర్. ఈనెల ఫిబ్రవరి ప్రారంభంలో ముంబైలో జరిగిన WTA 125 ఈవెంట్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఎలాగైనా అర్హత సంపాదించాలన్న కసి, తపనతో ఆడిన మాయ… నిజంగాగానే మాయ చేసింది. అలా ఐదు ఈవెంట్లలో ది బెస్ట్ గా నిల్చి WTA 125 కు అర్హత సాధించి తన కల నెరవేర్చుకుంది.
నాదల్ కూడా తన వ్యక్తిగత ఇన్ స్టా అకౌంట్ పై కళ్లల్లో లవ్ సింబల్ ఎమోజీతో స్పందించడంతో.. మాయ ఆట రఫాను ఎంత మాయ చేసిందో చెప్పింది ఆ ఇన్ స్టా పోస్ట్. గతేడాది చివర్లో డేవిస్ కప్ తో తన కెరీర్ నుంచి విరమణ తీసుకున్న నాదల్.. స్పానియార్డ్ మల్లోర్కాలోని ఇంట్లో ఎక్కువ సమయమిప్పుడు కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాడు. అదే సమయంలో అప్పుడప్పుడూ అకాడమీలో యువ ఆటగాళ్లను గుర్తించి తీర్చిదిద్దుతున్నాడు.
మాయ కూడా ఇప్పుడు మరో ఏడాది పాటు రఫా అకాడమీలో శిక్షణ పొందనుంది. ఆమె ఆటను గుర్తించి వంద శాతం స్కాలర్ షిప్ తో ఇప్పుడు రఫానాదల్ అకాడమీ ఆమెకు టెన్నిస్ లో శిక్షణనిస్తోంది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సెమీఫైనల్స్ లో ఆమె స్విస్ క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైనప్పటికీ… మరో ఛాంపియన్, టాప్ హండ్రెడ్ టెన్నిస్ క్రీడాకారిణుల్లో ఒకరైన జిల్ టీచ్మాన్ పైన మాయ కనబర్చిన బలమైన ప్రదర్శనతో మాయా రాజేశ్వరన్ భారత్ నుంచి యువ ట్రెండింగ్ టెన్నిస్ క్రీడాకారిణిగా రఫా వంటివారి దృష్టిలో పడింది.
రాబోయే రోజుల్లో గ్రాండ్ స్లామ్ జూనియర్స్ పోటీల్లో తన ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది మాయ. పూర్తిస్థాయిలో రఫానాదల్ అకాడమీలో ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ గా తయారయ్యేలా శిక్షణ పొందుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త టెన్నిస్ క్రీడాకారిణుల్లో టాప్ – 700 లిస్టులో ఉన్న మాయా రాజేశ్వరన్.. ముందుగా తాను గ్రాండ్ స్లామ్ జూనియర్స్ పోటీల్లో రాణించాలనుకుంటున్నట్టు కొన్ని ఆన్ లైన్ మీడియా సంస్థలకు వెల్లడించింది. అలా తను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మహిళా విభాగంలో ఆడి.. ఆ తర్వాత వేగంగా తాను నిర్దేశించుకుని కలలు కన్న లక్ష్యాలను చేరుకునేలా కసరత్తు చేస్తున్నానంటోంది ఈ తమిళ అమ్మడు. మరి మనదేశం నుంచి రఫా వంటివారి దృష్టినే ఆకర్షించిన మాయ రాజేశ్వరనైనా.. టెన్నిస్ లో మాయ చేసి భారత్ కీర్తిపతాకను ఆ రంగంలో మరింత పెంచాలని ఆశిద్దాం.



