ఆమె జీవనసంధ్యకు ఆయనో వెలుగైతే.. ఆయన సినిమాకు ఆమె ఆత్మైంది. సంధ్యా శాంతారామ్.. బాలీవుడ్ పై అభినయం, నృత్యంతో చెరగని ముద్రవేసి సుమారు 87 ఏళ్ల వయస్సులో దివికేగిన తార. ఆమె విజయం వెనుక ప్రముఖ నటుడు, దర్శకుడు శాంతారామ్ ఉన్న సంగతి తెలిసిందే అయినా.. ఆయన తనకిచ్చిన గుర్తింపును మించి తనను తాను నిలబెట్టుకున్న మహానటి. ఆయన్ను పెళ్లి చేసుకుని మూడో భార్యగా జీవిత భాగస్వామి కూడా అయి తన సర్వస్వంగా మారిన కృతజ్ఞురాలు. అందుకే.. సంధ్యా, శాంతారాం లవ్ స్టోరీ సమ్థింగ్ స్పెషల్.

1951లో మరాఠీ చిత్రం అమర్ భూపాలితో సంధ్యా, శాంతారాం జంట మధ్య పరిచయం బలపడింది. సరిగ్గా ఐదేళ్లు తిరిగేసరికి వారి సినీ ప్రయాణం కాస్తా ప్రేమయాణంగా మారి 1956లో వివాహం కూడా చేసుకున్నారు. అప్పటికే శాంతారాం ఇద్దరిని పెళ్లాడాడు.
సంధ్య సినిమా జీవితానికి బ్యాక్ అప్ శాంతారమే. అమర్ భూపాలి సినిమాలో కొత్త ఫేస్ కోసం ఆయన వెతుకుతున్న సమయంలో సంధ్య తారసపడింది. ఆమె వ్యక్తీకరణ, అభినయ పద్ధతి చూసి ముచ్చటపడ్డ శాంతారాం ఆ సినిమాకు ఆమెనే ఎంపిక చేసినప్పట్నుంచీ వారి సీనీ ప్రయాణానికి బీజం పడింది. శాంతారాం పరిచయమే సంధ్య వృత్తి జీవితాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ నడిపించే ప్రేరణైంది.
శాంతారామ్ మూడో భార్యగా సంధ్య!
శాంతారాం నటుడు, దిగ్దర్శకుడిగానే కాకుండా.. సినీ నిర్మాతగా కూడా ప్రముఖుడు. రాజ్ కమల్ కళామందిర్ అనే ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. శాంతారాం మొదటి భార్య విమల మైని కాగా.. ఆ తర్వాత నటి జయశ్రీ కముల్కర్ ను పెళ్లి చేసుకున్నాడు. సంధ్య శాంతారామ్ కు మూడో భార్య. సంధ్య కంటే శాంతారామ్ వయస్సెక్కువే అయినా.. సంధ్య కూడా శాంతారామ్ ను ఇష్టపడే పెళ్లి చేసుకుంది. శాంతారామ్ సృజనాత్మకతతో పాటు.. వారిమధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారిన క్రమంలో విడదీయలేని భావోద్వేగ బంధం ఏర్పడింది. ఓవైపు శాంతారామ్ తన చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తుంటే.. భావోద్వేగపరమైన, అమాయకపు, లోతైన పాత్రలకు శాంతారామ్ కు ప్రేరణై నిలుస్తూ వచ్చింది సంధ్య. సంధ్య పరిచయం తర్వాత శాంతారామ్ మరిన్ని గొప్ప సినిమా స్క్రిప్ట్స్ తయారుచేసుకోగల్గాడంటుంటారు.
అందుకు 1955లో వచ్చిన ఝనక్ ఝనక్ పాయల్ బాజేను ఓ ఉదాహరణగా చెబుతుంటారు. అందులో సంధ్య క్లాసికల్ డ్యాన్స్ తో అదరగొట్టింది. నేషనల్ అవార్డ్స్ తో పాటు, ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డును కొల్లగొట్టింది ఆ సినిమా. ఇక 1957లో వచ్చిన దో ఆంఖే బరా హాత్ సినిమా ఆమె ప్రశాంతమైన, నిర్మలమైన పాత్రకు ప్రతీకగా నిల్చింది. నవరంగ్ చిత్రంలో ఓ కలలు కనే యువతిగా ఆమె అభినయనానికి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక అక్కడి నుంచి ఆమె నటనా మరో లెవల్ కి వెళ్లిపోయింది. పింజర (పంజరం) అనే హిందీలో కూడా అనువదించిన మరాఠీ సినిమాలో.. మహారాష్ట్ర తమాషా ఫోక్ ట్రూప్ లో లీడ్ రోల్ లో నర్తకి పాత్రలో సంధ్య నటన ఆమెను తారాస్థాయికి చేర్చింది. ఆమెకు పలు సత్కారాలను కట్టబెట్టింది.
శాంతారామ్ మరణంతో ఒంటరిదైపోయిన సంధ్య!
శాస్త్రీయ నృత్యంలో ఎలాంటి శిక్షణ లేకుండానే… ఝనక్ ఝనక్ పాయల్ బాజేలో ఆమె చేసిన నృత్యం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇక నవరంగ్ సినిమాలోనూ ఆరే జా రే నత్ ఖత్ అనే గీతానికి భారీ వినాయకుడి ముందు మేల్ అండ్ ఫిమేల్ క్యారెక్టర్స్ లో తానే మెరుస్తూ చేసిన జానపద నృత్యం ఆమె ప్రతిభను కళ్లకు కట్టేది. కానీ, శాంతారాం మరణంతో ఆమె బయటకు రావడానికి ఇక ఇష్టపడలేదు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించింది. తనకు వృత్తిగతంగా, వ్యక్తిగతంగా జీవితాన్నిచ్చిన భర్త జ్ఞాపకాల్లో గడిపింది. మొత్తంగా సంధ్య అంటే వి. శాంతారామ్ సినిమాల ఆత్మగా పేరు సంపాదించింది.
అలాంటి మహానటికి నాల్గు మాటల అక్షరనివాళిది!


