ఆయన సినిమాలు చూడకుంటే.. భారతీయ సినిమాని పరిపూర్ణంగా అర్థం చేసుకోనట్టే!

జి_అరవిందన్

———————————————————–

Sai Vamshi… ✍🏻

..‌ ఈ చిత్రంలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టలేదంటే భారతీయ సినిమాని, ప్రత్యేకించి దక్షిణభారత సినిమాలను మీరు మరింత అధ్యయనం చేయాలని అర్థం. ఈయన పేరు జి.అరవిందన్. కేరళవాసి. బతికింది 56 ఏళ్లు. తీసింది 10 సినిమాలు, ఐదు డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్. కానీ ఇవాళ్టికీ మలయాళ సినిమా రంగం ఈయనను మర్చిపోలేదు. ఎన్నటికీ మర్చిపోదు కూడా! అరవిందన్ కేరళ రాష్ట్రంలో ఒకనాటి ప్రసిద్ధ కార్టూనిస్ట్. మాతృభూమి పత్రికలో ‘చెరియ మనుష్యరుం వలియ లోకం'(చిన్న మనుషులు పెద్ద లోకం) అనే కార్టూన్ సిరీస్ ఆయనకు విపరీతమైన పేరు తెచ్చింది.

… తెలుగు వాళ్లం రామాయణం గురించి బోలెడు గొప్పలు చెప్పుకుంటాం. కానీ తరతరాలుగా మగవాడి(రాముడి) దిక్కు నుంచే ఆ కథ చెప్పడం అలవాటు చేసుకున్నాం. కేరళవాళ్ల పద్ధతి వేరు. C.N.శ్రీకాంత నాయర్ అనే రచయిత Feminist Perspectiveలో రామాయణ కథని ‘కాంచన సీత’ అనే నాటకంగా రాస్తే, దాన్ని అరవిందన్ అదే పేరుతో సినిమాగా తీశారు. కేరళ నేలపై అడవులు కరువా? కానీ ఆయన తెలుగు నేలకు వచ్చి గోదావరి ఒడ్డున, వికారాబాద్ అడవుల్లో ఆ సినిమా మొత్తం చిత్రీకరించారు. ఇక్కడి రామచెంచుల్ని(గిరిజనులు) అందులో పాత్రధారులుగా మార్చారు. రామకథకు గిరిజనులు వేషాలేయటమా అని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవాళ ఆ విమర్శలా మిగిలాయి? సినిమా కదా సగర్వంగా తలెత్తుకుని నిల్చుంది. One of the Finest Films in Indian Cinemas.

… మీరు ఆయన తీసిన ‘ఉత్తరాయణం’ చూడాలి. క్లాసిక్. ‘చిదంబరం’ చూడాలి. గ్రేట్ క్లాసిక్. ‘తంపు’ చూడాలి. అల్టిమేట్ క్లాసిక్. ఆయన తీసిన ప్రతి సినిమా నేటికీ మలయాళంలో మరపురాని క్లాసిక్స్. సులభంగా అర్థమయ్యే కమర్షియల్ సినిమాలు కావవి. మనం ప్రయత్నించాలి. కళ్లను దాటి మన మేధకు, మనసుకు కాస్త పని చెప్పాలి. హిందీ నటి స్మితా పాటిల్‌ని తీసుకొచ్చి ‘చిదంబరం’లో ప్రధాన పాత్ర చేయించారు. 1986లో అదొక చర్చనీయాంశం. పల్లెకు తొలిసారి విద్యుత్ సౌకర్యం వస్తే అక్కడి మనుషులు ఎలా మారతారు అనే అంశంపై 1987లోనే ‘ఒరిడత్’ అనే సినిమా తీశారు. ఆ కాలానికి ఎవరైనా ఊహించగలిగే అంశమా అది? తూర్పు బెంగాల్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పెరుగుతున్న వలసల గురించి 1991లో సినిమా తీశారు. అందుకోసం బెంగాల్ వెళ్లారు. ఎక్కడ బెంగాల్, ఎక్కడ కేరళ? ఆయన ఆలోచనా పరిధి అంత విస్తృతం!

… నాలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. బోలెడు బొమ్మలు, కార్టూన్లు గీశారు. పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఏడు జాతీయ పురస్కారాలు, 17 కేరళ రాష్ట్ర పురస్కారాలు ఆయనకు దక్కాయి. మలయాళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ముగ్గురు దర్శకుల్లో ఒకరిగా నిలిచారు.(మిగిలిన ఇద్దరూ జాన్ అబ్రహాం, ఆదూర్ గోపాలకృష్ణన్). 1991లో గుండెపోటుతో మరణించారు.

… నేటికీ Kerala Chalachitra Film Society(KCFS) ఏటా ఆయన పేరు మీద ఒక తొలిచిత్ర దర్శకుడికి పురస్కారం అందిస్తున్నారు. 2019లో ఆ అవార్డు ‘కుంబలంగి నైట్స్’ చిత్ర దర్శకుడు మధు.సి.నారాయణన్‌కి అందించారు.

.. జి.అరవిందన్ గారి సినిమలు చూడకుండా భారతీయ సినిమాని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం అసాధ్యం. YouTubeలో ఆ సినిమాలు English Subtitlesతో అందుబాటులో ఉన్నాయి. తప్పక చూడండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles