నీటిలోనే జననం, నీటిలోనే మరణం.. ఆ నీటిలోనే నట్టనడుమ బతుకు నాటకం… ఇదంతా ఏ చేపలో, మొసళ్ల గురించో.. లేక, ఇంకేవైనా జలాచరాల గురించో అనుకుంటున్నారా..? కాదు, మనం మాట్లాడుకుంటున్నది మనుషుల గురించి. ఇంకా నవ నాగరికతకు మైళ్ల దూరంలో ఉన్న కొన్ని తెగల గురించి. అలాంటి బజావు తెగ జీవన విధానమే మనమిప్పుడు చెప్పుకోబోతున్నాం.
ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక తెగలు ప్రస్తుత ఆధునిక నాగరికతకు ఇంకా దూరంగా బతుకుతున్నాయనే విషయం ఎందరికి తెలుసు..? ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి తీరప్రాంతాల్లో చాలామందిది ఇప్పటికీ సముద్ర జీవనమేనంటే నమ్మగలరా..? జీవితమంతా నీటిపైనే.. ఎప్పుడోగానీ భూమ్మీదకు కనీసం ఓ అడుగు పెట్టని ప్రత్యేకమైన సమాజమే ఆ బజావు తెగ.
సముద్రాల్లో డైవింగ్ సాహసంతో కూడింది. గజ ఈతగాళ్లు, స్కూబా డైవింగ్ ప్రాక్టీషనర్స్ కు మాత్రమే సాధ్యమయ్యే పని. అప్పుడప్పుడు సాహస క్రీడల్లో భాగంగానో, సంద్రాల దగ్గరకు పర్యాటకంగా వెళ్లినప్పుడు అలాంటి ఫీట్స్ చేస్తున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది ఎలాంటి నేటి సమాజపు ఆధునిక డైవింగ్ గేర్ ను ఉపయోగించకుండా… సముద్రం లోపల 20 నుంచి 30 అడుగుల మీటర్ల లోతులో డైవ్ చేయగలరు ఈ బజావు తెగవారు. కనీసం ఐదు నుంచి 13 నిమిషాల వరకూ కూడా వారు ఊపిరి బిగపట్టి శ్వాసను ఆపుకోగలరు. అసలిది చెప్పడానికి, వినడానికే నమ్మశక్యంగా లేదు కదా..? కానీ, బజావు తెగ ప్రజలకు.. సాధారణ ప్రస్తుత నాగరిక ప్రపంచం వారితో పోలిస్తే 50 శాతం పెద్దవిగా స్ప్లీన్స్ అంటే ఉదరం పైభాగంలో ఉండటమే కారణమంటున్నారు వీరిపై పరిశోధన చేసిన వైద్యులు. రక్తాన్ని జల్లెడ పట్టి, పాత ఎర్ర రక్త కణాల్ని నిర్మూలించడం, షాక్ కు గురైన అత్యవసర సమయాల్లో శరీరానికి కావల్సిన రక్తాన్ని ప్రసరణ చేసుకునేందుకు నిలువ చేసుకునే ఓ వ్యవస్థనే స్ప్లీన్స్ అనంటారు. దీనివల్లే బజావు తెగవారు ఎక్కువ సమయం డైవ్ చేయడానికి వీలుంటుందనీ వారు చెప్పే మాట. ఇదో జన్యువైవిధ్యంగా కూడా పలువురు శాస్త్రవేత్తలు గుర్తించారు.

బజావు తెగ పిల్లలు బాల్యం నుంచి ఈత కొట్టడం, డైవ్ చేయడం నేర్చేసుకుంటారు. సముద్రమే అది వారికి నేర్పిస్తుంది. వారి జీవనోపాధంతా సముద్రం పైనే. అంతకన్నా, సముద్రంతో వారిది విడదీయరాని అవినాభావ సంబంధం. సంప్రదాయ చెక్క కళ్లజోళ్లను ఉపయోగిస్తూ, తామే స్వయంగా తయారు చేసుకున్న ఈటెల వంటివాటిని పట్టుకుని సముద్రంలో డైవింగ్ కు దిగుతారు. చేపలు, ఆక్టోపస్, సంద్రపు జలాల్లో లభించే దోసకాయలను వారి ఆహారం. వారి వెంట పెట్టుకునే ఈటెలతో వాటిని వేటాడి తినడం వారి ఆహార విధానం. బజావు తెగ వారి జీవనమంతా వారు లెప లెప అని పిల్చుుకునే చెక్క పడవల్లో సాగుతుంది. వారి ఇల్లైనా, ప్రయాణ సాధనమైనా అన్నీ ఆ లెపా లెపా అనే చెక్క పడవే వారి గూడు నీడ. కాలానుగుణంగా వారి జీవన విధానం కనిపిస్తుందు. రోజూవారీ అవసరాల కోసం సంద్రంపై ఆధారపడటంతో పాటు.. వాతావరణ పరిస్థితులను బట్టి దీవుల మధ్య గడుపుతుంటారు.
ఈ బజావు తెగ జీవనాధారం ప్రధానంగా చేపల వేటే. వీరి సాంస్కృతిక వారసత్వానికి బలమైన ప్రతిబింబంగా వీరంతా కలిసి సామూహికంగా ఈ ఫిషింగ్ కార్యకలాపాల్లో కలుసుకుంటుంటారు. దీంతో వీరి సామాజిక బంధాలను ఒకరికొకరు బలపర్చుకుంటారు. వీరిని సీ జిప్సీస్ అని కూడా పిలుస్తారు.
బజావు తెగ సవాళ్లేంటి..? వారి సంరక్షణెలా..?
ఇలాంటి జీవవైవిధ్యం కనిపించే తెగలపైన ఇప్పటికీ పలు పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. బజావు తెగలోని కొందరు ఇప్పటికే తీరం వెంబడి ఉన్న స్టిల్ట్ ఇళ్లల్లో.. అంటే నీటిపైనే తేలియాడే ఇళ్లల్లో జీవిస్తున్నారు. అయితే, రానురాను ఈ తెగల జీవన విధానానికే ముప్పు వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. పర్యాటక రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, సంద్ర తీరాల్లో పెరుగుతున్న పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలు అభివృద్ధి పేరిట తీసుకుంటున్న చర్యల వల్ల.. ఇలాంటి వైవిధ్యమైన తెగల బతుకుచిత్రమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా సంప్రదాయ ఫిషింగ్ పద్ధతులు పోయి.. డైనమైట్ ఫిషింగ్ వంటి హానికరమైన పద్ధతులతో సముద్ర పర్యావరణ వ్యవస్థే ఛిన్నాభిన్నమైపోతోంది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో బజావు తెగ తమ జీవన విధానాన్నే ఇంకా కొనసాగిస్తుండటం విశేషం. అదే సమయంలో, కాలానుగుణ మార్పులు కావాలనే అవగాహన ఈ తెగలో బలపడుతోంది. అందుకు బజావు తెగ నాయకత్వం కూడా వారి తెగలోని యువతను ఆధునిక అనుసరణల వైపుకు వెళ్లాలని ప్రోత్సహిస్తోంది.
అసలు ఇన్ని ఆధునిక సౌకర్యాలుండి కూడా ఎప్పుడూ ఏదో మనశ్శాంతి కోల్పోయినట్టు బతుకుతున్న నేటి ఆధునిక సమాజానికి బజావు తెగ ఓ స్ఫూర్తి ప్రేరకం. నీలం రంగు జలాలపై చెక్క పడవల్లోనూ.. పగడపు దిబ్బల్ల దగ్గర పిల్లల డైవింగ్ లోనూ.. సంప్రదాయ నృత్యాలతో అలరించే వారి ఆరిందతనంలోనూ.. చేపలు పట్టే సామూహిక ఆనందంలోనూ.. వారి ప్రత్యేకమైన, వైవిధ్యమైన జీవినశైలి ఆధునిక మానవుడికి ఏం కోల్పోతున్నామో తెలియజెప్పుతుంది.
అయితే ఈ బజావు తెగవారు ఆధ్యాత్మికవాదులు. ఇస్లాం, ఆనిమిస్టిక్ సంప్రదాయాల మిశ్రమంగా వీరు ఆచారాలను పాటిస్తారు. ఉంబో తుహానో అంటే సముద్ర దేవుడు.. అలాగే, దయాంగ్ మంగిలై అంటే అడవి దేవతను పూజిస్తారు. ఉభయచరాలంటామే.. అలా, ఎక్కువ సమయం నీటితోనూ.. అప్పుడప్పుడూ భూమితోనూ బంధాన్ని కల్గి ఉన్న ఒక వైవిధ్యమైన సంచార జాతి ఈ బజావు తెగ.



