సానుకు వణుకు పుట్టించిన పంచమ్! ఆ హిట్స్ వెనుక ఓ ఆసక్తికర ముచ్చట!!

జైసే ఖిల్తా గులాబ్.. జైసే షాయర్ కా ఖ్వాబ్.. జైసే బన్ మే హిరన్.. ఇలా ఎక్కడికక్కడ జైసే అనే హంటింగ్ పదాన్ని ఎన్ని రకాలుగా పాడగలవో అన్ని రకాలుగా పాడితేనే.. మన పాట హిట్టవుతుంది. లేకపోతే.. నేను కష్టపడి చేసిన ట్యూన్ ఎందుకూ కాకుండా పోతుంది. ఇదీ ప్రముఖ సంగీత దర్శకుడు పంచమ్ దా.. గాయకుడు కుమార్ సానుకు చెప్పిన ముచ్చట.

ఇక ఈ పాట ఏ సినిమాలోదో ఇప్పటికే మీకర్థమై ఉంటుంది. 1942 ఏ లవ్ స్టోరీ!

నౌషాద్, ఎస్డీ బర్మన్, ఓ. పీ. నయ్యర్ వంటివారి తర్వాత బాలీవుడ్ ను.. తన స్ట్రింగ్స్ మ్యాజిక్ తో ఒక మలుపు తిప్పిన మ్యూజిక్ డైరెక్టర్ పంచమ్ దా. నైన్టీస్ లో.. పాడిన ప్రతీ పాట హిట్ సాంగ్ గా నిల్చి.. ప్రత్యేకంగా నదీమ్ శ్రావణ్, అనూమాలిక్, జతిన్ లలిత్ వంటివారి కాంబినేషన్ లో ఒక వెలుగు వెలిగిన సింగర్ కుమార్ సాను. ఈ ఇద్దరూ కలిసి పెద్దగా పనిచేసిన కాంబినేషన్స్ ఎక్కువ లేవనే చెప్పాలి. కానీ, ఈ ఇద్దరూ కలిసి పూర్తి స్థాయిలో పనిచేసిన 1942 ఏ లవ్ స్టోరీ మాత్రం ఓ బ్లాక్ బస్టర్. చాలాకాలం పాటు ఇండియన్ చార్ట్ బస్టర్ పాటల్లో ఏక్ లడ్కీకో దేఖాతో పాటది నంబర్ వన్ స్థానం.

ఇదంతా పక్కనబెడితే.. 1942 ఏ లవ్ స్టోరీకి సంబంధించిన రికార్డింగ్ థియేటర్ లో ఆర్డీ బర్మన్, కుమార్ సాను మధ్య నెలకొన్న సంభాషణ, నాటి స్టూడియో ముచ్చట్లు ఒకింత ఆసక్తికరం.

విధూ వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, జాకీష్రాఫ్, మనీషా కోయిరాలా, అనుపమ్ ఖేర్, డ్యానీ వంటి స్టార్స్ నటించగా.. సూపర్ హిట్టైన పాటలన్నీ జావేద్ అక్తర్ రాశారు.

పాటలెవరితో పాడించాలనే చర్చ వచ్చినప్పుడు కొంత కొత్తగా, సూతింగ్ గా సాగే మెలోడీ వాయిస్ కోసం చర్చలో అప్పటికే బాలీవుడ్ ను తన పాటలతో ఊపేస్తున్న కుమార్ సాను పేరు వచ్చింది.

అప్పటివరకూ ఆర్డీ బర్మన్, కుమార్ సాను పెద్దగా కలిసి పనిచేసిన దాఖలాలు కూడా లేవు. కుమార్ సాను తను టాప్ సింగర్ గా కొనసాగుతున్నప్పటికీ.. ఆర్డీ బర్మన్ సంగీతంలో తనకు ఆఫర్ రావడం సాధారణంగా సంతోషంతో పాటు.. ఇంకొంచెం టెన్షన్ ను కూడా క్రియేట్ చేసింది. పైగా ఆర్డీ బర్మన్ కాస్త డిఫరెంట్ మూడ్స్ ఉండే వ్యక్తి. కొన్నిసార్లు పూర్తి మూడీ. అలాంటి ఆయన్ను పూర్తిగా అర్థం చేసుకున్నవాళ్లు మినహా.. మిగిలినవాళ్లు ఆయనతో అంత త్వరగా కలిసిపోవడం కూడా ఒకింత కష్టం.

అలాంటి పరిస్థితుల్లో విధూవినోద్ చోప్రా ప్రొడక్షన్ నుంచి వచ్చిన కాల్ తో కుమార్ సాను రికార్డింగ్ స్టూడియోకు వెళ్లాడు. ఆర్డీ బర్మన్ ను కలిశాడు. కానీ, పంచమ్ దా అప్పటికప్పుడు రికార్డింగ్ కాదు కదా.. కనీసం రిహాల్సల్స్ కు కూడా ఒప్పుకోలేదు. కారణం.. కుమార్ సాను నెరిసిన గడ్డంతో.. డ్రెస్సింగ్ స్టైల్ కూడా పంచమ్ దాకు నచ్చని తీరులో ఉండటమే. అదే మాట కుమార్ సానుకు పంచమ్ చెప్పేశాడు. దాదా.. గడ్డానికి, గొంతుతో పాడే పాటకు ఏం సంబంధమన్నది అని కుమార్ సాను ప్రశ్న..? ప్రతిగా.. దాదాపు నేను రెండునెలల నుంచి కష్టపడి ఈ ట్యూన్స్ చేశాను. సో… నా పాటలో హీరో ఎలా ఉంటాడో దర్శకుడి ఆలోచనలకనుగుణంగా ట్యూనింగ్ జరిగింది. గొంతులోని మెలోడీకి తగ్గట్టుగా హీరో రూపం ఉంటుంది. కాబట్టి, రేపు కాస్త నీట్ గా తయారై వస్తే రిహాల్సల్స్ చేసి పాట రికార్డ్ చేద్దామని చెప్పారు పంచమ్. అప్పుడు కుమార్ సానుకు కూడా అనిపించిందట.. ఒక సంగీత దర్శకుడు తాను ట్యూన్ చేసి అందించే పాట పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాడని!

కట్ చేస్తే తెల్లవారి రికార్డింగ్ కు వచ్చిన కుమార్ సానుతో.. ఆర్డీ చెప్పిన మాటేంటంటే.. జైసే గురించి. ఏక్ లడ్కీకో దేఖాతో పాటలో.. జైసే అనే పదం పదే పదే హంటింగ్ గా పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ జైసేను ఎన్ని విధాలుగా.. ఎన్ని రకాల గమకాలతో పలికితే అంత మధురంగా పాట పండుతుంది. ఆ వేరియేషన్ చూపించగల్గితే మన పాట హిట్.. లేకుంటే, ఫట్. పంచమ్ దాకరాఖండీగా చెప్పేశాడు సాను దాదాతో. పంచమ్ చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకున్న కుమార్ సాను సైతం.. అంతే శ్రద్ధగా ఆ పాటలో ప్రతీసారీ పలకాల్సిన జైసేను తనకు సాధ్యమైనంత రీతిలో మాడ్యులేట్ చేసి పలకగా.. ఆ పాట రికార్డింగ్ పూర్తైంది.

ఒక్కసారి కుమార్ సానును హగ్ చేసుకున్న ఆర్డీ బర్మన్.. తన నుదుటిపై ఓ కిస్ చేసి… ఆ తర్వాత కాస్తా కటుకుగా తిట్టడం మొదలెట్టాడట.

దాంతో అంతలోనే సంతోషపడ్డ కుమార్ సాను.. ఇదేంటి ఇంతలోనే తిడుతున్నాడీయన అని ఖంగుతిన్నాడు. దాంతో పక్కనున్న ఆర్కెస్ట్రా వారినడిగితే.. ఆయన ఆనందంలో అలాగే ఉంటారు. మీ పాటపైన ఆయన సంతృప్తి చెందారని చెప్పారు. అప్పుడుగానీ కుమార్ సాను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోలేకపోయాడట.

ఇదే సినిమాలో కుఛ్ నా కహో పాట విషయంలోనూ మరో సన్నివేశం కూడా కుమార్ సాను, ఆర్డీ బర్మన్ మధ్య ఆసక్తికర సంభాషణకు తెరలేపింది.

కుమార్ సాను కుఛ్ నా కహో పాట రిహాల్సల్స్ లో భాగంగానే ఓవైపు రికార్డింగ్ కూడా చేస్తున్నారు. కొన్ని టేకులు తీసుకున్నాక.. రీటేక్స్ కూడా ఐపోతున్నాయి. ఆ తర్వాత తాను పూర్తి స్థాయిలో ప్రిపేరయ్యాయనన్న నమ్మకం కల్గాక కుమార్ సాను పంచమ్ దగ్గరకు వచ్చి.. కాసింత భయం భయంగానే దాదా నేను రెడీ పాట పూర్తిగా రికార్డ్ చేద్దామని అడిగాడట. దానికి సాను.. నువ్వింకా ఇక్కడే ఎందుకున్నావ్…? వెళ్లిపో అన్నాడట పంచమ్. దాంతో మళ్లీ ఏమైందన్న టెన్షన్ మొదలైందట కుమార్ సానులో. కానీ, ఎదురు ఏం మాట్లాడాలో తెలియక.. ఆ పాట తాను పాడితే పంచమ్ సంతృప్తి చెందలేకపోతున్నాడా అనే ఒకింత అనుమానంతో.. స్టూడియోలో బయటకొచ్చి కూర్చున్నాడు కుమార్ సాను. ఇదంతా పంచమ్ ఆస్థాన ఆర్కెస్ట్రా గ్రూప్ గమనిస్తుంది. అందులో ఒకరు లేచి బయటకు వచ్చి.. సాను మీరు ఇంటికి వెళ్లండి. మీ పాటపైన పంచమ్ చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పారట. కానీ, నమ్మకం కుదరని సాను మళ్లీ లోపలికి వెళ్లి నేను ఇంకా ఈ పాటను బాగా పాడగలనంటే.. పంచమ్ అవసరం లేదని గట్టిగా చెప్పారట. చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఏంటి ఇట్లా గట్టిగా శబ్దం చేసుకుంటూ వెళ్తున్నారంటే.. ఆయనంతే, ఆయనకు ఇష్టమైనప్పుడు కూడా అలాగే ఉంటారని.. ఆయన స్వభావమే అంత అని ఆర్కెస్ట్రా బృందం వారు చెప్పడంతో ఒకింత కన్ఫ్యూజన్ లోనే ఇంటిబాట పట్టాడు కుమార్ సాను.

ఆర్డీ బర్మన్ చివరగా సంగీతమందించిన చిత్రం 1942 ఏ లవ్ స్టోరీ పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. ఆ సినిమాలో రిమ్జిమ్ రిమ్జిమ్, రూత్ న జానా వంటి పాటలన్నీ కుమార్ సానునే పాడటం.. ఆ సినిమాకు కుమార్ సాను ఫిల్మ్ ఫేర్ అవార్డందుకోవడం రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles