సైన్స్ పాఠాల పట్ల.. చందమామ కథలంత ఆసక్తిని క్రియేట్ చేసిన ప్రొఫెసర్!

పాఠ్యపుస్తకాల్లో ఏది ఉంటే అదే చెప్పడం ఉపాధ్యాయుడి ధర్మం. కాస్తో కూస్తో జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లైతే మరిన్ని కొత్త సంగతులద్ది ఇంకొంత అందంగా కూడా చెబుతుంటారు. యథావిధిగా చెప్పే కొందరు ఉపాధ్యాయుల మొక్కుబడి పాఠాలు అంత రుచించకపోవచ్చు. కొన్ని క్లాసులంటేనే బోర్ ఫీల్ అయిన సందర్భాలు…. దాదాపు విద్యార్థి దశ నుంచి ప్రతీ ఒక్కరికీ అనుభవేద్యమే. అలాగే, తమ క్లాసంటే చెవి కోసుకునేంతగా ఆసక్తీ క్రియేట్ చేసిన ఉపాధ్యాయులూ మన జీవితాల్లో ఎదురై ఉండొచ్చు. అదిగో అలాంటి ఓ ప్రొఫెసర్ పాఠాలే… ఇప్పుడు ఎన్సీఈఆర్టీ బుక్స్ కు ఎక్కాయి.

ఒక పాఠాన్ని మర్చిపోలేనంత బండగుర్తు చేయాలన్నా… అది అర్థమయ్యే రీతిలో అరటిపండు ఒల్చి నోట్లో పెట్టి మెదడుకెక్కించాలన్నా… తరగతి గదిలో అలాంటి ఉపాధ్యాయులు ఎంతో అవసరం. అలాంటి ఓ ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాల కోసం రాసిన సైన్స్ పాఠాలు… ఇప్పుడు మన బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్రల్లోని కథల్లా విలక్షణమైన శైలితో ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్ లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అందుకు, ఆయన ఎంచుకున్న కథా వస్తువు సర్వసాధారణమే అయినా.. ఆయన చెప్పాలనుకున్న సబ్జెక్టుకు ఆ కథావస్తువును అనుసంధానించే తీరు విద్యార్థులకు ఆయన పాఠాలపై ఆసక్తిని, మమకారాన్నీ పెంచుతున్నాయి. పాఠ్యపుస్తకాలను ఆసక్తికర కథల పుస్తకాల్లా విద్యార్థులతో చదివిస్తున్న కేరళ కోజికోడ్ కు చెందిన ఆ ప్రొఫెసర్ కథేంటో ఓసారి చెప్పుకుందాం.

కోజికోడ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీధర్ గూడ.. చంద్రుడిని తన కథావస్తువుగా చేసుకుని… విద్యార్థులకర్థమయ్యే రీతిలో పాఠాలు చెబుతున్నాడు. తరగతి గదిలో ఆయన చెప్పే పాఠాలకు కాసింత ఫన్ యాడ్ చేసి అర్థం చేయించే తీరు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థుల మనస్సులను దోచుకుంటోంది. ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పుకునే తాను.. పాఠ్యపుస్తకాల్లో తన కథాశైలితో ఎందరో విద్యార్థులకు ఇష్టమైన రచయితగా అవతరిస్తానని శ్రీధర్ కూడా ఊహించలేదు. కానీ, ఇప్పుడు స్టోరీస్ ఆఫ్ చందమామ: లెజెండ్ ఆఫ్ ది మూన్ తో చంద్రుడిని కథావస్తువు చేసుకుని సజీవత ఉట్టిపడేలా కూసింత ఫన్ తో ఆయన రాసిన కథలు.. ఆయన కథల్లోని పాత్రలు… సైన్స్ కు కొత్త రూపునిచ్చి ఆయనకు పేరు తెస్తున్నాయి.

ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని, మెదడుకెక్కని సూత్రాలు, ఫండమెంటల్స్ తో బుర్ర బద్ధలు కొట్టుకోకుండా.. ప్రొఫెసర్ శ్రీధర్ గూడ ఎంచుకున్న మార్గం ఇప్పుడు ఆకట్టుకుంటోంది. పిల్లలెప్పుడూ పాఠ్యపుస్తకాల కంటే కూడా కథలనే ఎక్కువ గుర్తుంచుకుంటారన్న ఒక లాజికల్ కన్క్లూషన్ తో శ్రీధర్ గూడ ఈ మార్గాన్నెంచుకున్నారు.

ఆకాశంలో ఎక్కడో కనిపిస్తూ ఎన్నో ఉహలకు, ఎన్నో కథలకు, ఇస్రో, నాసా వంటి సంస్థల ఎన్నో ప్రయోగాలకు కేంద్రబిందువుగా మారిన చందమామ.. ఓ పాత్రగా మారితే.. ఓ పాట పాడితే.. అవి పిల్లల్ని మరింత ఆకట్టుకుని మర్చిపోకుండా, ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేయొచ్చనేది ప్రొఫెసర్ శ్రీధర్ గూడ ఆలోచన.

శ్రీధర్ గూడ రచనాశైలిలో.. సాహసాలు, ఖగోళ రహస్యాలతో సజీవంగా ఉండే కామిక్ స్టైల్ ప్రత్యేకమైంది. ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ శ్రీధర్ గూడ రచనాశైలిని మెచ్చి.. ఇలాంటి రచనా విధానం విద్యార్థులకెంతో ఉపయోగకరమని నమ్మింది. అలా ఎన్సీఈఆర్టీకి చెందిన ప్రణీతా గోపాల్ నుంచి శ్రీధర్ గూడకు ఆహ్వానమందింది. లూనార్ మూన్ పై ప్రచారంలో భాగంగా రూపొందించిన పాఠ్యాంశాలు.. భారత్ ఆన్ ద మూన్ లో భాగస్వామి కావాలన్నది ఆ ఆహ్వానం. అలా ప్రొఫెసర్ ప్రణీత.. తనను సంప్రదించినప్పుడు అది సరదా ప్రాజెక్టేం కాదని… అంతకంటే ముఖ్యమైందని తాను నమ్మానంటారు గూడా.

పదో తరగతి వరకు పిల్లలకు ఖగోళ శాస్త్రాన్ని సమర్థవంతంగా చెప్పేందుకు.. సరళంగా పురాతన కథలతో మిళితం చేసి అర్థం చేయించేందుకు ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ గూడాకు దక్కిన అవకాశం ప్లస్ సవాల్ అది.

ఎన్సీఈఆర్టీ ప్రణీత గోపాల్ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు.. ప్రొఫెసర్ శ్రీధర్ గూడా.. తన మిషన్ లో సపర్య సురేష్, సూర్యప్రకాష్ పాటి అనే మరో ఇద్దరితో జతకట్టాడు. గతంలో కొన్ని అకడమిక్ బుక్స్ రూపొందించిన అనుభవమున్న ఈ ముగ్గురూ కలిసి మేథోమథనమే చేశారు. పురాణాలు, జానపద కథలు, విజ్ఞానశాస్త్రాన్ని మిళితం చేసి విద్యార్థులకు కథల రూపంలో ఎలా చెప్పడమనేదే ఆ మథనం.

శ్రీధర్, సపర్య, సూర్యప్రకాష్ ముగ్గురూ కూడా చిన్ననాటి నుంచి మనందరిలాగే జంతువులు, సూర్యచంద్రుల కథలు విన్నవాళ్లే. కాబట్టి… ఆ ప్రేరణే వారిని పదో తరగతి పిల్లలకు మంచి కథలను తయారుచేసి పాఠ్యపుస్తకాల వైపు మళ్లించింది. అలా ఎన్సీఈఆర్టీ ఏదైతే భావించిందో.. అంతకుమించి ఊహించినదానికంటే భిన్నంగా, బ్యూటీగా కార్టూన్స్ తో ఆ పాఠ్యాంశాలను కథలుగా మార్చింది ప్రొఫెసర్ శ్రీధర్ గూడ త్రిసభ్య బృందం.

రీతి సరళం.. ఫలితం ప్రభావవంతం!

శ్రీధర్ గూడ, సురేష్, సూర్యప్రకాష్ బృందం ఎంచుకున్న విధానం సరళమైందీ.. అదే సమయంలో అంతే ప్రభావవంతమైంది. యువ విద్యార్థులను సాంకేతిక వివరాలతో ముంచెత్తడానికి బదులుగా.. వారిలో సహజంగానే ఉత్సుకతను రేకెత్తించేవిధంగా కథలుగా పాఠాలను మల్చారు వీరు. వింతలను వివరించడానికి ఎన్నో సైన్స్ పుస్తకాలు ఇప్పటికే మార్కెట్ లో ఉన్నాయి. కానీ, అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని.. కథల ద్వారా సైన్స్ ను చెప్పడం.. అవసరమైనవి ప్రాక్టికల్ గా చూపించడం అనే పద్ధతిలో వీరి పాఠ్యాంశాలు ఇప్పుడు మిగిలిన ప్రపంచాన్ని ఎన్సీఈఆర్టీ బుక్స్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు పురిగొల్పుతున్నాయి.

చంద్రుడి కథలను కామిక్ స్టోరీస్ గా మల్చి.. తద్వారా సైన్స్ పాఠాలను రంగురంగుల పేజీల్లో మల్చి ఆకట్టుకునేలా ఉన్నాయి తాజా ఎన్సీఈఆర్టీ పాఠాలు. వారు ప్రస్తావించే కథలు వింటూ నవ్వుల్లోకి జారుతూ.. ఖగోళశాస్త్రాన్ని మర్చిపోని విధంగా మెదడుకెక్కించే తీరు దేశంలోనే నూతన విద్యావిధానంలో ఓ విప్లవంగా మారింది. పుస్తకాలు చూస్తే అబ్బా అనుకునే పిల్లలు అమితాసక్తిగా పుస్తకాలను తిరగేయడం కదా అసలైన విప్లవమంటే అన్నది ఇప్పుడు చాలా మంది విద్యావేత్తలను అబ్బురపరుస్తున్న విషయం.

ఐఐఎం కోజికోడ్ లో కూడా ప్రొఫెసర్ శ్రీధర్ గూడ రూపొందించిన పాఠ్యాంశాలపై పెద్ద చర్చే జరిగింది. ఆయన్ను ప్రశంసించనివారు లేరు. ఇనిస్టిట్యూట్ డైరెక్టరైన దెబాశిష్ ఛటర్జీ.. విద్యకు సృజనాత్మకమైన మార్గాన్ని శ్రీధర్ గూడ కనిపెట్టారాని అభినందించారు.

భారత్ వంటి దేశాల్లో ఎందరికో చదువులపై ఆసక్తి ఉన్నా… వాటిని అందరికీ అర్థమయ్యేలా మల్చి చెప్పడంలో ఎక్కడో ఏదో లోటు ఉందనే విషయం ఇప్పటికే ప్రచారంలో ఉంది. అలాంటి లోటును ఇప్పుడు ఐఐఎం కోజికోడ్ ప్రొఫెసర్ అయిన శ్రీధర్ గూడ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ బృందం తీర్చడంతో.. వీరు రూపొందించిన ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని పాఠాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles