శబ్దం నిశ్శబ్దంగా.. వెలుతురు చీకటిగా: అందుకే, ఆ ప్రపంచం పేరు బ్లాక్!

ఆ ప్రపంచంలోకి అడుగుపెడితే శబ్దం నిశ్శబ్దంగా మారుతుంది. వెలుతురు చీకటిగా మలుగుతుంది. ఆ ప్రపంచం పేరే BLACK!

…………………………………………………………………………………………………….

Shanthi Ishaan ✍️

కాసేపు చీకటిలో ఉంటేనే తట్టుకోలేం మనం. అలాంటిది మిషెల్ ఎనిమిదేళ్ళుగా చీకటితో పోరాటం చేస్తోంది. చీకటితో మాత్రమేనా? వినికిడితోనూ ప్రతి క్షణం యుద్ధమే! కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. ఏమీ చూడలేనప్పుడు, ఏమీ వినపడనప్పుడు ఏం నేర్చుకోగలుగుతుంది, నోటితో ఏం చెప్పగలుగుతుంది? అందుకే మాటలు కూడా రావు. ఇదీ అని తెలియని అంధకారంలో తన చిట్టి తల్లి కొట్టుమిట్టాడుతుందని ఆ అమ్మకు తెలుసు. బిడ్డను కాపాడుకోవడానికి ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. తండ్రికి మిషెల్ అంటే మమకారమున్నా తల్లికున్నంత ఓర్పు లేదు. ఆ పసిదాని చేష్టలకు విసిగిపోయి జంతువులకు కట్టినట్లు ఓ గంట కడతాడు. చివరి ప్రయత్నంగా తల్లి ఓ టీచర్ ని పిలిపిస్తుంది. అతనే దేబ్రాజ్ సహాయ్! అతను టీచర్ మాత్రమే కాదు. మిషెల్ చుట్టూ ఆవరించిన చీకటి ప్రపంచంలోకి వెలుతురును మోసుకొచ్చిన magician! అతను వచ్చీ రాగానే చేసిన పనేంటో తెలుసా? ఆ చిన్నారి నడుముకి కట్టిన గంట లాగేయడం! తను జంతువు కాదు మనలాంటి మామూలు మనిషే అని నొక్కి చెప్పడం! సరిగ్గా 21 రోజుల తర్వాత మిషెల్ తొలి మాట నేర్చుకుంటుంది. ఆ తర్వాత జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటుంది. ఎంతగా అంటే అన్నీ మరిచిపోయిన గురువుకు తనే గురువయ్యేంతగా!

2005లో రిలీజైన BLACK స్టోరీ ఇది. ఇక్కడ మిషెల్ రాణీ ముఖర్జీ అయితే దేబ్రాజ్ సహాయ్ అమితాబ్ బచ్చన్! ఈ సినిమా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అప్పటికే “హమ్ దిల్ దే చుకే సనమ్”, “దేవ్ దాస్” లాంటి బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి ఈ హడావుడి సినిమాల కంటే ముందే అతను Khamoshi అనే ఓ అందమైన సినిమా తీశాడు. డైరెక్టర్ గా అదే అతని డెబ్యూ. Deaf and dumb తల్లిదండ్రుల కోసం ఓ కూతురు పడే ఆరాటాన్ని ఇందులో చాలా చక్కగా ఆవిష్కరించాడు. భన్సాలీ సినిమాలన్నింటిలోకీ ఈ సినిమా నాకు బాగా నచ్చుతుంది. కానీ ఇది కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కాబట్టే రెండు కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీశాక “బ్లాక్” లాంటి సినిమా తీసి, దాన్ని సూపర్ హిట్ చేసి మరీ భన్సాలీ రివెంజ్ తీర్చుకున్నాడా అని అనిపిస్తుంది నాకు.

The Story of My Life హెలెన్ కెల్లర్ జీవిత కథ. ఇదే BLACKకి ఆధారం. హెలెన్ కెల్లెర్ అమెరికన్ రచయిత్రి. రెండేళ్ళ వయసులో వచ్చిన ఒక జబ్బు కారణంగా చూపు, వినికిడి శక్తి పోగొట్టుకుంటుంది. కానీ కృషి, పట్టుదలతో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. తన లాంటి ఇంకెంతమందికో దారి చూపిస్తుంది. ఒక అమెరికన్ రైటర్ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా కావడం వల్లో లేక ఈ థీమ్ కి అమెరికన్ నేటివిటీ అయితే బావుంటుందన్న ఆలోచన వల్లో లేక హాలీవుడ్ లెవల్ లో బాలీవుడ్ సినిమా తీద్దామన్న భన్సాలీ ఉత్సాహం వల్లో BLACKలో ఇండియన్ నేటివిటీ కనపడదు. షిమ్లాలో ఉంటున్న ఒక ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీ కథ ఇది అని మొదట్లోనే చెప్పి ప్రేక్షకులను ప్రిపేర్ చేసేస్తాడు. సినిమాలో 60 శాతం డైలాగులు ఇంగ్లీషులోనే ఉంటాయి. మిడిల్ క్లాస్ ఇండియన్ ఆడియెన్స్ కి ఈ సినిమా మొదట్లో ఎక్కకపోవచ్చు గానీ కాసేపటికి అన్నీ మర్చిపోయి లీనమైపోతారు.

సంజయ్ లీలా భన్సాలీ అంటేనే కళ్ళు తిరిగే భారీ సెట్లు, కళ్ళు జిగేల్ మనిపించే అందమైన కాస్ట్యూమ్స్, కళ్ళు చెదిరే రంగులు, హంగులు! VFX వాడకుండానే perfect detailing, aestheticsతో విజువల్ వండర్ క్రియేట్ చేయగలిగిన అచ్చమైన ఆర్టిస్ట్ అతను. కవిత్వంలాగా సాగిపోయే కథనం ఆ విజువల్ బ్యూటీకి ప్రాణం పోస్తుంది. భన్సాలీ అప్రోచ్ ఎంత poeticగా ఉంటుందంటే Gangubai Kathiawadi లాంటి raw సినిమా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులోనూ భారీ సెట్లే దర్శనమిస్తాయి. కాకపోతే కలర్ టోన్ మార్చుకుంటాయి. మాటలు పాటల్లా, కవితల్లా సాగిపోతాయి. భన్సాలీ aesthetic senseకి మరో ఉదాహరణ Saawariya. ఈ సినిమా కోసం ఏకంగా ఓ అందమైన ఊరినే క్రియేట్ చేశాడూ భన్సాలీ. Dostoevsky కథ ఆధారంగా తీసిన సినిమా కాబట్టి ఆ ఫీల్ కి తగ్గట్లు production design చేయించాడు. సినిమా ఆసాంతం blue tint వాడాడు. సినిమా ఫ్లాపే గానీ నాకు చాలా అందంగా, aestheticగా అనిపిస్తుంది.

ఎలాంటి కథనైనా అందంగా చెప్పగలగడం, థీమ్ కి తగ్గ కలర్ టోన్, ప్రొడక్షన్ డిజైన్ సెట్ చేయడం భన్సాలీకి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్య బ్లాక్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళు కనిపించని, చెవులు వినిపించని, మాటలు రాని ఒక అమ్మాయి గురించి ప్రేక్షకులకు చెప్పాలంటే స్క్రీన్ ప్లే ఎంత పటిష్టంగా రాసుకోవాలి? పైగా ఇది మామూలు సినిమా కూడా కాదు. చాలా డ్రై సబ్జెక్ట్. లీడ్ రోల్స్ చూడ్డానికి కంటికి నదురుగా ఉండవు. కానీ అలాంటి సబ్జెక్టుని కూడా భన్సాలీ మనసుకు హత్తుకునేలా చెప్పగలిగారు అంటే దానికి స్క్రీన్ ప్లే ఒక కారణమైతే అందమైన సినిమాటోగ్రఫీ మరో కారణం. ఆ ఫ్రేమ్స్ ఏంటండీ బాబూ కాసేపు పెయింటింగ్ లా అనిపిస్తాయి, కాసేపు థియేటర్ స్టేజ్ లా అనిపిస్తాయి. Ace cinematographer రవి. కె. చంద్రన్ తో కలిసి భన్సాలీ ఈ ఎఫెక్ట్ సాధించాడు. Indoors అయితే aesthetic back drops తయారు చేసుకుని స్టేజ్ లైటింగ్ తరహాలో వెలుతురుతో రకరకాల ప్రయోగాలు చేయించాడు. ఇక outdoor visualsని సీజన్ కి తగ్గ tone and tintతో అద్భుతంగా రాబట్టాడు. బ్లాక్ సినిమాకి సగం బ్యూటీ ఈ క్లాసిక్ సినిమాటోగ్రఫీయే. కొన్ని సీన్స్ అయితే ఎపిక్ అనిపిస్తాయి. మిషెల్ కోసం రూం సెట్ చేయించే సీన్ లో పనివాళ్ళు నిలువెత్తు పెయింటింగ్స్ మోసుకెళ్ళడమైతే elite స్టేజ్ ప్లేని గుర్తు చేస్తుంది. మిషెల్ తల్లి దేబ్రాజ్ కి డెడ్ లైన్ అయిపోయిందని చెప్పడానికి వచ్చే సీన్ లో ఫ్రేమ్ చాలా గొప్పగా ఉంటుంది. దేబ్రాజ్ సజెషన్ లో మిషెల్ తల్లి కనిపిస్తుంటుంది. దేబ్రాజ్ మాత్రం తలుపుకున్న అద్దంలో మనకి కనిపిస్తుంటాడు. సీన్ మొత్తం అదే ఫ్రేమ్ తో షూట్ చేశారు. సినిమాలోని క్రియేటివ్ ఫ్రేమ్స్ కి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సీన్స్ బోలెడు.

BLACKకి జీవం పోసిన మరో ఎలిమెంట్ మాంటీ శర్మ మ్యూజిక్. ఇందులో ఉన్నది ఒకే ఒక్క పాట. మిగతా అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోరే. ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నప్పుడు ఒక crescendo వస్తుంది చూశారూ అది ultimate! BLACK అంటే ఈ సిగ్నేచర్ ట్యూనే గుర్తొస్తుంది.

స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ – ఇవన్నీ BLACK సక్సెస్ కి సగానికి సగం దోహదం చేశాయి. మిగతా 50 శాతం సక్సెస్ తెచ్చి పెట్టింది మాత్రం క్యాస్టింగే! టీచర్ దేబ్రాజ్ సహాయ్ గా అమితాబ్ బచ్చన్ పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్ బెస్ట్ లో ఒకటని చెప్పాలి. ఈ సినిమా కోసం అమితాబ్ ఆరేడు నెల్ల ముందు నుంచే డెఫ్ అండ్ బ్లైండ్ స్కూల్స్ తిరిగి వాళ్ళ హావభావాలు అర్థం చేసుకున్నాడు. సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. కాబట్టే ఆ లెవల్ పర్ఫార్మెన్స్! 55, 75, 85 నుంచి 90 ఏళ్ళు- ఇలా మూడు రకాల దశల్లో ఆయన నటన అద్భుతం. స్టూడెంట్స్ కోసం వెర్రిగా తాపత్రయపడే ఒక టీచర్ గా, ఎమోషన్స్ దాచుకోలేని ఒక మనిషిగా ఆయన నటన వేరే లెవల్ లో అనిపించింది. కానీ నేను మాత్రం అమితాబ్ కంటే రాణి ముఖర్జీకే ఎక్కువ మార్కులేస్తాను. బేసిక్ గానే తాను చాలా మంచి నటి. కానీ ఇందులో మాత్రం Deaf and blind క్యారెక్టర్ లోకి తను పరకాయ ప్రవేశం చేసిందా అనిపిస్తుంది. అప్పుడే నవ్వుతుంది. అప్పుడే వెర్రి కోపం చూపిస్తుంది. సంబరమొస్తే తమాషాగా డాన్స్ చేస్తుంది. చేతి కర్ర పట్టుకుని రెండు కాళ్ళూ కాస్త ఎడంగా పెట్టి చార్లీ చాప్లిన్ లా నడుస్తుంది. కానీ ఆయేషా కపూర్ ఈ ఇధ్దరినీ మించిపోయింది. ఎనిమిదేళ్ళ మిషెల్ గా ఆయేషా ఎంత బాగా చేసిందని! అంత చిన్న వయసులో అంత బాగా ఎలా నటించావమ్మా అని అడిగితే ఏమో వాళ్ళు చెప్పింది చేశా నాకేం కష్టమనిపించలేదు అందట ఆ పిల్ల. బహుశా తను born- actress ఏమో. ఇక మిషెల్ అమ్మగా చేసిన Shernaz Patel ఈ ముగ్గురికీ తగ్గకుండానే perform చేసింది.

ఇన్ని అద్భుతాలు ఒకే చోట చేరాయి కాబట్టే BLACK ఒకేసారి 11 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుని అప్పట్లో రికార్డు బ్రేక్ చేసింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో మూడు నేషనల్ అవార్డులు గెలుచుకుంది. అంగవైకల్యం గురించి తీసిన సినిమాల్లో ఇంతకంటే అందమైన సినిమా మరొకటి ఉండదేమో!

****

మిషెల్ ఓ రోజు కాలేజ్ క్యాంపస్ లో బెంచ్ మీద కూర్చుంటుంది. టీచర్ దేబ్రాజ్ ఎప్పట్లానే తన చేతి మీద రాస్తూ పాఠాలు అర్థమయ్యేలా చెబుతుంటాడు. సడన్ గా మిషెల్ చేయి చాపుతుంది. మంచు కురిసేటప్పుడు మాత్రమే తనలా చేస్తుంది. దేబ్రాజ్ మిషెల్ ని తిడతాడు. ఇది మంచు కురిసే టైం కాదు, చదువు తప్పించుకోవడానికి వేషాలా అంటాడు. మిషెల్ పక్కనే ఉన్న గొడుగు తీస్తుంది. అది కూడా లాగేసుకుంటాడు. కానీ మరుక్షణమే మంచు జలజలా రాలుతుంది. మిషెల్ చేయి చాచి ఆ మంచు వానను తనివితీరా ఆస్వాదిస్తుంది. దేబ్రాజ్ ఆశ్చర్యంగా చూస్తుండిపోతాడు.

మిషెల్ లాంటి వాళ్ళకు కొన్ని సెన్సెస్ పని చేయనప్పుడు మిగతా సెన్సెస్ అద్భుతంగా రాణిస్తాయి. అవి ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకునేలా సాయపడతాయి. ప్రకృతితో కనెక్ట్ చేస్తాయి. కల్లా కపటం లేనివాళ్ళకు, ప్రకృతితో మమేకమై బతికే జంతువులకు మాత్రమే ఇది సాధ్యం. ఈ విషయం చెప్పడం కోసమే భన్సాలీ ఈ సీన్ క్రియేట్ చేశాడు.

****

BLACK అంటే చీకటి కాదు, కుమిలిపోవడమూ కాదు. BLACK అంటే విజ్ఞానం! BLACK అంటే గెలుపు! బ్లాక్ అంటే మిషెల్ లాంటి వాళ్ళు ఎన్నో ఏళ్ళు కష్టపడి సాధించుకున్న గ్రాడ్యుయేషన్ కోటు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles