రెండో వ్యోమగామిగా అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్నందుకు మనం శుభాంశ్ శుక్లా గురించి మాట్లాడుకుంటున్నాం. 40 ఏళ్ల క్రితమే ఆ ఫీట్ సాధించి అంతరిక్షయాన చరిత్రలో భారత్ కు వన్నె తెచ్చిన రాకేష్ శర్మ గురించీ మాట్లాడుకున్నాం. కానీ, మరో అన్ సంగ్ హీరోను మాత్రం మర్చిపోయాం. దాదాపు ఆయనా అంతరిక్షంలోకి అడుగుపెట్టే వరకూ జర్నీ చేశాడు. కానీ, అవకాశం మాత్రం రాకేష్ శర్మనే వరించింది. మరి ఆ అన్ టోల్డ్ హీరో ఎవరు..?
రవీష్ మల్హోత్రా. వింగ్ కమాండర్ రాకేష్ శర్మతో పాటే అప్పటి సోవియెట్ యూనియన్ లో శిక్షణ తీసుకున్న సుశిక్షుతుడైన ఎయిర్ కమోడర్ రవీష్.

వాస్తవానికి రవీష్ ఎప్పుడూ ఆకాశంలో ఎగరాలనే కలలేం కనలేదు. తన లక్ష్యం నావికాదళం. కానీ, రవీష్ కంటిచూపు నావికాదళ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం.. అదే సమయంలో, ఇండియన్ ఆర్మీకి వైమానిక క్యాడెట్ల కొరత ఉండటంతో వారి సూచన మేరకు ఆయన ఎయిర్ వింగ్ వైపు అడుగులేశాడు. అలా సుశిక్షితుడైన కమోడర్ గా ఆ తర్వాత కాలంలో యుద్ధవిమానాలనూ నడపాడు. అన్ని ఎయిర్ క్రాఫ్టులను నైపుణ్యంతో నడపగల్గే వేళ్లమీద లెక్కించే పైలట్స్ లో రవీష్ ఒకరు.
ఉక్కునరాల యుద్ధవీరుడు రవీష్!
1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో మల్హోత్రా ఫైటర్ పైలట్ గా పనిచేశాడు. పశ్చిమ పాకిస్థాన్ లోని చాంబ్- జౌరియన్ సెక్టార్ లో యుద్ధ విమానాన్ని నడుపుతున్నప్పుడు యుద్ధట్యాంకుల నుంచి దూసుకువచ్చే కాల్పుల్లో తృటిలో తప్పించుకుని బయటపడ్డాడు. కాక్ పిట్ లో మీరు ధడ్ ధడ్ ధడ్ అనే శబ్దాలు విని ఉండొచ్చునుగానీ.. కానీ, అంత భారీ విస్ఫోటనాలు, కాల్పుల్లో నాకేమీ జరగలేదంటే నేను అదృష్టవంతుణ్నని తోటి సైనిక సిబ్బందితో ఆరోజు అన్నట్టు ఓసారి ఆ తర్వాత రవీషే గుర్తు చేసుకున్నారు.
రవీష్ కనబర్చిన పనితీరు, నైపుణ్యమే చివరకు ఆయనకు అరుదైన అవకాశాలను కల్పించింది. అలాంటి అద్భుతమైన అవకాశమే అంతరిక్షంలోకి వెళ్లే ఛాన్స్.
రాకేష్ శర్మతో కలిసి ఇంటర్ కాస్మోస్ ప్రయాణానికి ఎంపిక!
ఇండియా పాక్ యుద్ధం తర్వాతనే నిపుణులైన పైలట్స్ ను ఎంపిక చేసి భారత్ సోవియట్ ఇంటర్ కాస్మోస్ ప్రోగ్రామ్ లో చేరాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒక భారతీయుణ్ని అంతరిక్షంలోకి పంపాలని యోచించింది. అలాంటి ఫైటర్ పైలట్స్ ను జల్లెడ పట్టినప్పుడు ఒక 20 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అందులోంచి మరో నల్గురిలో… రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా ఇద్దరు మాత్రమే చివరి పరీక్ష వరకూ నెగ్గి సోవియట్ ఇంటర్ కాస్మోస్ శిక్షణకు ఎంపికయ్యారు. అలా యూఎస్ఎస్ఆర్ కు పయనమయ్యారు.

రష్యాలో శిక్షణ!
ఇంటర్ కాస్మోస్ లో భాగంగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే క్రమంలో… రెండేళ్లపాటు రాకేష్ శర్మ రవీష్ మల్హోత్రా ఇద్దరూ శిక్షణ పొందారు. భాష, యోగా అంతరిక్షంలోకి వెళ్లాక ఉండే పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన అంశాలతో పాటు.. అసలేమాత్రం రాని రష్యన్ భాష మాట్లాడటం, రాయడంపైనా పట్టు సాధించారు. మైక్రో గ్రావిటీలో యోగాతో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో, ఎలాంటి పరిస్థితులనెదుర్కోవచ్చో అభ్యసించారు.
మరి అంతరిక్షంలోకి ఎగిరేదెవరు..?
రాకేష్ శర్మకు ఏమాత్రం శిక్షణలో తక్కువ కాకుండా రవీష్ మల్హోత్రా కూడా శిక్షణ పొందాడు. కానీ, అంతరిక్షంలోకి ఒకే ఒక్కరికి వెళ్లే అవకాశం మాత్రమే ఉంది. చివరకు అవకాశం మాత్రం రాకేష్ శర్మనే వరించింది. దాంతో రాకేష్ శర్మ సోయుజ్ టీ – 11లో ఏప్రిల్ 3న బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు, రవీష్ మల్హోత్రాను బ్యాకప్ ఆస్ట్రోనామర్ గా స్పేర్ లో ఉంచారు.
ఆ సమయంలో తాను చాలా నిరాశ చెందానని మల్హోత్రా గతంలో చెప్పుకొచ్చారు. కానీ, మిషన్ ముందుకు సాగాలి కాబట్టి వారితో అంగీకరించి నిశ్శబ్దమైపోయినారు. రాకేష్ శర్మ కక్ష్యలోకి ప్రవేశించి.. ప్రధాని ఇందిరాగాంధీతో లైవ్ లో సంభాషిస్తూ సారే జహా సే అచ్చా అనే ఇక్బాల్ పంక్తులను వినిపిస్తున్నప్పుడు వెనుకే ఉండి అదంతా వీక్షిస్తున్నాడు రవీష్ మల్హోత్రా.
మల్హోత్రాకు మరి దక్కిన గుర్తింపేంటి..?
తాను రాకేష్ శర్మతో కలిసి అంతరిక్షంలోకి ఎగురకపోయినా.. అంతరిక్షయానం తర్వాత శర్మతో కలిసి భారత్ అంతటా పర్యటించాడు. భావిభారత విద్యార్థులను కలిశాడు. నవతరం యువతను కలలు కని సాకారం చేసుకునేలా ప్రేరేపించారు రవీష్.
అన్ సంగ్ హీరో రవీష్!
తెరపైకొచ్చినవారి చరిత్రలకు దక్కినంత ఆదరణ.. తెరవెనుక కనుమరుగైనవారికి ఎప్పుడూ కనిపించదు. ఇది సర్వసాధారణం. అంతరిక్షయానానికి ఒక్క అడుగు దూరంలో నిల్చిపోయిన యుద్ధవీరుడు, నేషనల్ హీరో రవీష్ మల్హోత్రా. అంతేకాదు, గగన్ యాన్ పేరిట భారత్ మానవ అంతరిక్ష ప్రయాణానికి మిషన్ ను సిద్ధం చేస్తే.. అందుకు సంసిద్ధత వ్యక్తపర్చి, మిషన్ సమర్థవంతంగా నిర్వహించేందుకు వెనుకాడని నిపుణుడు రవీష్.
భారత అంతరిక్ష యాత్రాచరిత్రలో రవీష్ మల్హోత్రా పేరు నేటి శుభాంశు శుక్లాలానో.. నాటి రాకేష్ శర్మలానో తెరపైన కనిపించకపోవచ్చు.. కానీ, రవీష్ మల్హోత్రా వారిద్దరికీ కూడా ఏమీ తక్కువ కాదు. తనకు రావల్సిన అవకాశం ఇంకొంకరికి వచ్చినా.. భూదేవంత ఓపికతో దేశం కోసం మిషన్ కోసం త్యాగం చేసిన ఫైటర్ పైలట్ రవీష్. అందుకే, అలాంటి వ్యక్తిని ఓసారి గుర్తు చేసుకోవడమంటే.. చరిత్రలో వారికీ సముచిత ప్రాధాన్యతనివ్వడమే మరి.



