సినిమా + రాజకీయం – తమిళనాడు
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నమైనవి. సినిమాతో మిళితమైన రాజకీయం తమిళనాడుది. అన్నాదురై నుంచి ఎంజీఆర్ వరకూ.. జయలలిత నుంచి విజయ్ వరకూ ఆ లోతైన అనుబంధాన్ని మనం గమనించొచ్చు. గత డెబ్బై ఏళ్లుగా తమిళనాడులో సినీతారలే రాజకీయ నాయకులుగా మారి అధికార శిఖరాలను అధిరోహిస్తున్న సందర్భాలే అనేకం. అదే సమయంలో బాక్సాఫీస్ స్టార్ డమ్ ప్రతీసారీ ఓటు బ్యాంకుగా మారదనే ఉదాహరణలూ రుజువయ్యాయి. ద్రవిడ ఉద్యమం ప్రజా మాధ్యమాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది.
రాజకీయ సాధనంగా సినిమా మాధ్యమం!
తమిళనాడులోని ద్రవిడ రాజకీయాల రూపకర్తలు… భావజాలాలు, మేనిఫెస్టోలు, బహిరంగ సభల కంటే కూడా వినోదమే రాజకీయాల్లో రాణించేందుకు చోదకశక్తి అనే ఒక మౌలిక సత్యాన్ని గ్రహించారు. మొదట వీధి నాటకాలతో ప్రారంభమైన ద్రవిడ రాజకీయ నాయకుల ప్రచారశైలి.. ఆ తర్వాత జనాన్ని మరింతగా చేరుకునేందుకు సినిమా మాధ్యమాన్ని ఎంచుకుంది. అందుకు డీఎంకే స్థాపకుడు సీఎన్ అన్నాదురై తొలిబాటలు వేశాడు.

ప్రసంగకర్తగా, స్క్రీన్ రైటర్ గా తనకున్న నైపుణ్యంతో, తార్కికవాదంతో.. కుల వ్యతిరేకత, స్వాభిమాన భావనలను ప్రధాన తమిళ సినిమాల్లో భాగం చేసి ప్రభావితం చేశాడు. అలా ఆ తర్వాత ఆ సినిమానే మళ్లీ ప్రచార సాధనంగా మార్చాడు. ఆ తర్వాత కరుణానిధి ఆ వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలుపర్చాడు. 1952లో వచ్చిన పరాశక్తి అనే సినిమా స్క్రీన్ ప్లే కేవలం వినోదంగా మాత్రమే పరిమితం కాలేదు.. అది కుల వ్యవస్థను ప్రశ్నించింది, మత ఆచారాలను సవాల్ చేసింది. ద్రవిడ ఆశయాలను ధైర్యంగా వ్యక్తీకరించింది. వెయ్యి సభల కన్నా ఒక్క మంచి సినిమా సామాజిక చైతన్యాన్ని తెస్తుందని కరుణానిధి నిరూపించాడు.
పవర్ ఫార్మూలా రూపకర్త ఎంజీఆర్!
ఎంజీ రామచంద్రన్ సినిమా పాత్రలు, రాజకీయ జీవితం మధ్య గీతను చెరిపేసి.. సినిమా వేదికగా రాజకీయాలను విప్లవాత్మకం చేశాడు. నీతిమంతుడిగా, అవినీతికి అతీతుడిగా, పేదజనం రక్షకుడిగా ఆయన తెరపై పోషించిన పాత్రలు ప్రజల దృష్టిలో ఆయన స్వరూపాన్నే మార్చేసి ఆయనకో క్రేజీ ఇమేజ్ ను తీసుకొచ్చాయి.
అప్పటికే కాంగ్రెస్, డీఎంకేల్లో అనుభవం సంపాదించిన తర్వాత 1962లో శాసనసభ్యుడిగా పనిచేసిననంతరం… ఏఐఏడీఎంకేను స్థాపించాడు ఎంజీఆర్. ఆయన తన సినిమాల ప్రజాదరణను రాష్ట్రవ్యాప్త గుర్తింపుకు.. అలాగే, జనంతో ఓ భావోద్వేగ బంధానికీ ఉపయోగించుకుని… సినిమాల్లోని ఆయన హీరోయిక్ పాత్రే నిజజీవితంలోనూ తమకు తారసపడితే ఎలా ఉంటుందన్న ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఖాళీని పూరించాడు. ఆ తర్వాత సినిమా మాధ్యమం ద్వారా రాజకీయాల్లో వచ్చేవారికి ఎంజీఆర్ ఓ నమూనా మాడల్ గా మారాడు. తెరపై ఆకర్షణను రాజకీయ మూలధనంగా మార్చేశాడు. ఆయన ప్రేరణ కొంతమందిని అదే దారిలో నడిపిస్తే.. మరికొందరు మాత్రం బోల్తా పడ్డారు.
విప్లవాన్ని స్క్రీన్ ప్లే చేసిన కరుణానిధి!
సినిమాను రాజకీయాలకు ఎంజీఆర్ ఎలాగైతే వాడుకున్నారో… కరుణానిధి తన భావజాల ఆయుధంగా సినిమాను వాడుకున్నారు. పరాశక్తి అనే సినిమాలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, మతోన్మాదాన్ని సవాల్ చేస్తూ, ద్రవిడ ఉద్యమాల ఆగ్రహానికి తెరరూపమిచ్చారు. భావోద్వేగంతో కూడిన కథనంతో… జనం ఆలోచనల్లోకి ఎంత లోతుగా చొచ్చుకెళ్లొచ్చో కరుణానిధి పసిగట్టారు. అలాగే, సరైన కథలనెంచుకుని వాటిని అస్త్రాలుగా మల్చినవారు మాత్రమే ప్రజర ఊహాశక్తిని అంచనా వేయగలరని.. ఓటు బ్యాంకునూ నియంత్రించగలరనీ కరుణానిధి నిరూపించాడు.
జయలలిత – పురుషాధిక్య రాజకీయాల్లో ఓ విప్లవ కెరటం!
జయలలిత రాజకీయ బాట ఎంజీఆర్ ను పోలినట్టే కనిపించినా… ఆమె దారి కాస్త డిఫరెంట్ గానే సాగింది. ఆమె సినిమాల్లో గౌరవం, విద్య, స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చే పాత్రలు పోషించినా… రాజకీయాల్లోకొచ్చేసరికి ఆమెకు ఎదురైన సవాళ్లతో ఒక కఠినమైన, ఆధిపత్య భావజాలం కల్గిన నాయకురాలిగా ఎదిగారు. లింగవివక్షతో కూడిన దాడులు ఎదురైనా కూడా ఆమె తన రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోకుండా.. దశాబ్దాల పాటు తమిళనాడును ఏలిన తెలుగు మహిళగా గుర్తింపు పొందారు. జయలలిత విజయం అసాధారణమైంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా నటిగా ఎదిగి.. అంతకుమించి తమిళనాడు వంటి వైవిధ్యమైన రాజకీయాల్లో ఆమె ఎదిగిన తీరు మరే మహిళకూ ఇప్పటివరకూ సాధ్యపడలేదు.
శివాజీ గణేశన్ – ఓ ఫెయిల్యూర్ స్టోరీ!
అన్నాదురై నుంచి సినిమా సంబంధీకులు సాధిస్తున్న విజయాలను పరిశీలించినప్పుడు.. జయలలిత దాకా సక్సెస్ కనిపిస్తే… మరో ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ ది మాత్రం ఓ ఫెయిల్యూర్ పొల్టికల్ స్టోరీ. నటన అనే ప్రతిభతో మాత్రమే ఎన్నికల్లో విజయాలు సాధించలేరని శివాజీ గణేశన్ రాజకీయ జీవితం నిరూపించింది. సినిమా పాత్రలతో కళాత్మకంగా ఆకట్టుకున్నప్పటికీ.. ప్రజా రాజకీయాల్లో మాత్రం ఆయన సందేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 1988లో ఆయన స్థాపించిన తమిళిగ మున్నేట్ర మున్నానీ పార్టీ… 1989 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోకపోవడంతో ఆయన శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి పలికారు.
ప్రత్యామ్నాయం కాలేకపోయిన విజయకాంత్!
జయలలిత అనంతర కాలంలో విజయకాంత్ అత్యంత విజయవంతమైన నట రాజకీయ నాయకుడనే చెప్పుకోవాలి. ఆయన హీరోగా వచ్చిన కెప్టెన్ సినిమా ఇమేజ్ రాజకీయాల్లో విజయ్ కాంత్ రాకకు ఓ గ్రీన్ కార్డుగా ఉపయోగపడింది. దేశీయ మురుపోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పార్టీని స్థాపించి.. అప్పటికే వేళ్లూనుకున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి తాత్కాలికంగా సవాల్ విసిరాడు విజయ్ కాంత్. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన కీలకపాత్రనే పోషించినప్పటికీ… ముందు మనం చెప్పుకున్న ఓ ఎంజీఆర్, జయలలిత తరహాలో ఆయన రాజకీయ ప్రస్థానం సాగలేకపోయింది. ఆయన మరణానంతరం కూడా ఇప్పటికీ ఆ పార్టీ కొనసాగుతున్నప్పటికీ.. బలహీనపడిపోయిందనే చెప్పాలి.
శరత్ కుమార్ ఎంట్రీ ఏం చెప్పింది..?
విజయ్ కాంత్ తో పాటు శరత్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశం కూడా తమిళనాడులో చర్చనీయాంశమైంది. కానీ, శరత్ కుమార్ అనుభవం రాను రాను తమిళ రాజకీయాల్లో గత వైభవంలాగా కాకుండా.. సెలబ్రిటీల ప్రభావం క్రమంగా తగ్గుతోందనే సంకేతాన్నిచ్చింది. 2007లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీని స్థాపించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించినా.. పార్టీని మాత్రం గ్రాస్ రూట్స్ లోకి తీసుకెళ్లలేకపోయారు. 2024లో ఏకంగా ఆయన పార్టీ బీజేపీలో విలీనం చేయడంతోనే.. ఆ వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నట్టైంది.
దేశవ్యాప్త గుర్తింపున్నా… రాజకీయాల్లో కమల్ గుండుసున్నా !
అధికారంలో ఉన్న పార్టీల పాలనా నైపుణ్యాల ఆధారంగా రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలనుకున్నాడు కమల్ హాసన్. మక్కల్ నీధి మయ్యం పేరిట.. ప్రజా ప్రభుత్వాల పాలసీలు మార్చాలనుకున్నాడు. సంస్కరణలు తీసుకురావాలనుకున్నాడు. కానీ, ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. ఆయన మేథ, అంతకుమించిన నటన ఆయనకు గౌరవాన్ని, దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఇమేజ్ ను తీసుకొచ్చినా.. భారీ ప్రజామద్దతును కూడాగట్టడంలో మాత్రం కమల్ హాసన్ ఓ పొల్టికల్ ఫెయిల్యూర్ స్టోరీ.
ఇక సూపర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడూ ఓ బ్రహ్మపదార్థమే!
2017లోనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన ఓ పెద్ద సంచలనం సృష్టించింది. కానీ, అనారోగ్య కారణాల పేరిట ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కూడా ఆయన ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నారని.. బీజేపీ వెంట నడుస్తారని రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ, ఆధునిక రాజకీయాల్లో కేవలం సినీ గ్లామర్ సరిపోదని.. అంతకుమించిన వ్యూహచతురత, పార్టీకి సంస్థాగతంగా బలమైన నిర్మాణాలుండాలని తెలుసుకున్న ఆయన మళ్లీ రాజకీయాలవైపు చూడటం లేదు.
భిన్నపంథాలో కరుణానిధి వారసత్వం
ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కే. స్టాలిన్ పూర్తిగా సినిమాలకు దూరంగానే ఉన్నారు. పార్టీ వ్యవస్థపైనే దృష్టి పెట్టారు. ఆయన కుమారుడు ఉదయనిధి మాత్రం సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించాడు. తర్వాత రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పార్టీ మద్దతు.. సినిమా ఈ రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని అండగా ఉంటే గనుక రాజకీయాల్లో రాణించొచ్చు అనేందుకు మళ్లీ ఉదయనిధి స్టోరీ ఓ ఉదాహరణ.
వివక్షను ఎదుర్కొంటూ విజయాలు అందుకోవడం అంత సులువేం కాదు!
తమిళ లేడీ సూపర్ స్టార్స్ లో ఖుష్బూ, గౌతమి వంటి మహిళా నటీమణులు ఎంతో కొంత రాణించినప్పటికీ.. వాళ్లు పార్టీలో ప్రచారానికే పరిమితమయ్యారు. తప్ప స్వతంత్రంగా నిర్ణాయక శక్తులుగా ఎదగలేకపోయారు. లింగ వివక్ష, ఆడవాళ్లుగా ఎదుర్కొనే సవాళ్లను అధిగమించే విషయంలో.. వీరెవ్వరూ కూడా జయలలిత స్థాయిని అందుకోలేకపోయారు. ఇప్పటికీ జయలలిత భవిష్యత్ పాత్రధారులెవ్వరా అనే చర్చ ఇంకా తమిళ పాలిటిక్స్ లో జరుగుతుండటం ఆమె సాధించిన విజయం.
విజయ్ రాజకీయ ప్రవేశంతో… సినీ నటుల చరిష్మాపై మరోసారి చర్చ!
తలపతిగా తమిళ సినిమాల్లో సూపర్ స్టార్ అయిన విజయ్ రాజకీయ ఆరంగేట్రంతో తమిళ రాజకీయాల్లో మరోసారి సినీ నటుల ప్రభావంపై పెద్ద చర్చే జరుగుతోంది. 2026లో ఎన్నికలకు ముందు విజయ్ రాజకీయ ప్రవేశం ఉత్కంఠ కూడా రేపుతోంది. నేటి భిన్నమైన మీడియా, సోషల్ మీడియా వ్యవస్థల కాలంలో ఆయనను జనం ఎలా ఆదరిస్తారనే ఒక క్యూరియాసిటీ కనిపిస్తోంది. పాలన, అవినీతి, విద్య వంటి అంశాలను తన సినిమాలకు కథావస్తువులుగా చేసుకుని ఎదిగిన విజయ్… రాజకీయంగా వేస్తున్న అడుగుల్లో ఆయనకు యువత మద్దతు లభిస్తోంది. అయితే, అదే సమయంలో ఆయన పార్టీ భావజాలం, పార్టీ నిర్మాణం వంటివన్నీ ఇంకా పలు ప్రశ్నలను ముందుంచతున్నాయి.
ఎంజీఆర్, జయలలిత కాలంతో పోలిస్తే… సినిమాలు, రాజకీయాల మధ్య విడదీయలేని అవినాభావ సంబంధం కాస్త మెల్లిమెల్లిగా మసకబారుతోందనిపిస్తోంది. డిజిటల్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఆ రొడ్డకొట్టుడు ఫార్మూలాల ప్రభావానికి చెక్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడలో జరుగబోయే 2026 ఎన్నికలు ప్రస్తుత కాలంలో సినిమా, రాజకీయాల అనుబంధమే స్థాయిలో ఇంకా కొనసాగుతోంది, సెలబ్రిటీలు, నటుల తెరమీది ఇమేజ్ అధికారిక రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పబోతున్నాయి.



