ఆమెకు ఏజ్ ఒక నంబర్ మాత్రమే !
SHE IS VOICE OF RURAL INDIA!
అందరికీ ఆదివారం సెలవు. కానీ, ఆమెకు మాత్రం పనిదినం. ఎందుకంటే, ఆడా, మగా, పిల్లా, పాప అంతా సెలవు దినాన ఇళ్లల్లో ఉంటారు గనుక! అంతేకాదు, ఉపాధిహామీ పథకం కింద పనిచేసే మహిళలకు కూడా ఆరోజు సెలవు కావడంతో వారినీ అక్షరాస్యులుగా చేసే ఓ సామాజిక బాధ్యతను ఆమె భుజాన వేసుకుంది. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అంటే…? రిటైర్డ్ ఏజ్ లో అక్షరజ్ఞానాన్ని పెంచేందుకు బయల్దేరిన ఓ వాకింగ్ లైబ్రేరియన్ గురించి! ఆ నడిచే గ్రంథాలయం కథ తెలుసుకునేందుకు మనమూ ఓసారి కేరళ వరకూ వెళ్లొద్దాం పదండి!

విశ్రాంతి అనే మాట ఎరుగకుండా పనిలోనే తృప్తిని వెతుక్కుంటున్నారు కేరళకు చెందిన రాధామణి. వాయినాడ్ ప్రతిభా పబ్లిక్ లైబ్రరీలో పనిచేసిన రాధామణి.. ఇప్పటికీ 69 ఏళ్ల వయస్సులోనూ వాకింగ్ లైబ్రేరియన్ గా పనిచేస్తూనే ఉన్నారు. వాయిస్ ఆఫ్ రూరల్ ఇండియా పేరుతో ఆమె మళయాళంలో రాసిన తన లైఫ్ జర్నీ పుస్తకాన్ని గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది.
మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవడానికి వాకింగ్ బెటర్ అని డాక్టర్స్ చెప్పినా.. ఇంకెన్నింటికో సమయం దొరుకుతూ.. నడకకు మాత్రం సమయం దొరకడం లేదనే ఏవో కారణాలు వెతుక్కుంటాం. అలాంటివారెందరో ఉన్న సమాజంలో.. రోజూ సామాజిక బాధ్యతను భుజానికెత్తుకుని.. దానికి తోడు ఓ పుస్తకాల సంచీనీ మోస్తూ రాధామణి బయల్దేరడం వాయినాడ్ చుట్టుపక్కల పల్లెల్లో కనిపిస్తుంది.
కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో జగమంతా లాక్ డౌన్ అయి భయపడుతుంటే.. రాధామణి మాత్రం లైబ్రేరియన్ గా తన పని ఆపలేదు. రాధామణి అలవాటు చేసిన పుస్తక పఠనంతో.. ఇళ్లను విడిచి బయటకు రాలేని నాటి సమాజం.. రాధామణిని సంప్రదించి వారాలకు సరిపడా పుస్తకాలు తీసుకెళ్లేవారు. అలా కోవిడ్ సమయంలోనే 102 మంది ఆమె పనిచేస్తున్న ప్రతిభా పబ్లిక్ లైబ్రరీలో కొత్తగా సభ్యత్వం తీసుకోగా.. అందులో 94 మంది మహిళలే కావడం మరో విశేషం.
ప్రారంభంలో సభ్యత్వం తీసుకున్న మహిళలు కూడా మంగళం, మనోరమ పత్రికలు మాత్రమే చదివేవారట. ఆ తర్వాత మెల్లిగా నవలలు, ట్రావెలాగ్స్ వంటివాటితో పాటు, ఎన్నో ఇతర అంశాల పట్ల కూడా అభిరునేర్పర్చుకున్నారంటుంది రాధామణి. ఆ తర్వాత తాను చదవనివాటి గురించి.. తన సభ్యులెందరో చెప్పిన కొన్ని నవలలు, పుస్తకాల గురించి విని వాటిని చదవాలన్న ఆసక్తి తనకూ పెరిగిందంటారామె.
రాధామణి వాకింగ్ లైబ్రేరియన్ గా మారడం వెనుక.. కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ చొరవ ఉంది. నిరక్షరాస్యులైన మహిళలతో పాటు.. ఎంతో కొంత చదువుకున్నవారికి ఇళ్లకే పుస్తకాలను తీసుకెళ్లాలన్న కౌన్సిల్ ఆలోచనను తన భుజానికెత్తుకుని కార్యరూపమిచ్చింది. దీన్ని కేరళో వనితా వాయన పద్ధతి (WOMEN’S READING PROJECT)గా పిలుస్తారు. దాన్నే ఇప్పుడు వనితా వయోజక పుస్తక వితరణ పద్ధతి (BOOK DISTRIBUTION PROJECT FOR WOMEN AND ELDERLY)గా పిలుస్తున్నారు.
2012 నుంచి రాధామణి వాకింగ్ లైబ్రేరియన్ గా మారారు. అంతకుముందు పలు ఉద్యోగాలు చేసిన రాధామణి.. వాకింగ్ లైబ్రేరియన్ గా మారాక వివిధ ఊళ్లల్లో మహిళా సమాజంతో కలిసేది. ముఖ్యంగా మహిళా సంఘాలతో భేటీ అయ్యేది. పుస్తక పఠనంపై అవగాహన కల్పించే స్థాయి నుంచి.. తానొక నడిచే గ్రంథాలయమై పుస్తక పఠనాన్ని అక్కడి సమాజంలో ఒక అలవాటుగా మార్చారామె. ఆ క్రమంలో రోజుకు కనీసం ఆరేడు కిలోమీటర్ల మేర ఆమె కాలినడకన ప్రయాణిస్తూ.. సమాజాన్ని చైతన్యపర్చేందుకు కంకణం కట్టుకోవడం ఆమె నిస్వార్థసేవకు నిదర్శనం.

చిన్నప్పట్నుంచీ పఠనాసక్తి ఉన్న రాధామణి తండ్రి ఓ రైతు. చదువుకోని నిరక్షరాస్యుడు. రాధామణే వార్తాపత్రికలు తన తండ్రికి చదివి వినిపించేది. అలాగే, నాన్న డిక్టేట్ చేస్తుంటే ఉత్తరాలు కూడా తానే రాసేది. తాను చదువుతుంటే ఒక్కోసారి నాన్న అలాగే నిద్రపోయేవాడట.
రాధామణి కుటుంబం అంతకుముందు కొట్టాయం జిల్లా వజూర్ అనే ఓ పట్ఠణంలో ఉండేది. ఆ తర్వాత వాయనాడుకు వలస వెళ్లారు. తల్లీ, తండ్రి రాధామణితో సహా మరో ముగ్గురు పిల్లు. అందరికీ వివాహాలైపోయాయి. 1977లో రాధామణి పెళ్లైంది. ఆ సమయంలో వాయినాడ్ లో ప్రతిభా పబ్లిక్ లైబ్రరీని కొత్త భవనంలో ప్రారంభించారు. అదిగో అప్పుడు మొట్టమొదటిసారిగా తన చెల్లెలితో కలిసి ఆ గ్రంథాలయానికి వెళ్లింది రాధామణి. 1961 నుంచే ఉన్న ప్రతిభా పబ్లిక్ లైబ్రరీని నూతన భవనంలోకి మార్చకముందెప్పుడూ రాధామణి అక్కడి వెళ్లేది కాదు. అప్పుడామె ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచ్ స్కీమ్ కింద షెడ్యూల్ తెగల పిల్లలకు.. మరో 24 ఏళ్ల పాటు బాలవాడి ఉపాధ్యాయురాలిగా బోధన చేసింది.
ఆమె లైబ్రేరియన్ గా చేరినప్పుడు కూడా మరి కొన్ని బాధ్యతలతో నిత్యం బిజీబిజీగా గడిపేది. మహిళల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. రాష్ట్ర పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కార్యక్రమమైన కుటుంబశ్రీలోనూ ఆమె కీలకంగా వ్యవహరించేవారు. కొంతకాలం పర్యాటకశాఖలోనూ గైడ్ గా ఉద్యోగం చేశారు. అదే సమయంలో ఫ్రెంచ్, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. గైడ్ గా పనిచేసే సమయంలోనే కొండలపైకి ట్రెక్కింగ్ చేయడం రాధామణికి అలవాటైపోయింది. అయితే, వాకింగ్ లైబ్రేరియన్ గా మారాక.. ఒకేసారి యాభయ్యేసి పుస్తకాలు తీసుకెళ్లడం ఒక్కోసారి బరువనిపించేదని.. అందుకే, ఆ పుస్తకాల సంఖ్యను కేవలం 25కు కుదించానంటారు రాధామణి.
ఒక వాకింగ్ లైబ్రేరియన్ గా కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ.. నిరక్షరాస్యుల్లో అవగాహన కల్పిస్తూ.. మరోవైపు ఎవరెవరు ఏ పుస్తకాలను తీసుకున్నారో రిజిస్టర్ లో నమోదు చేసుకుంటూ.. మళ్లీ ఇంటిపనులు, వంటపనుల్లోనూ రాధామణి చురుకుగా ఉంటారంటే ఆమె పనినెప్పుడూ ఓ భారంగా ఆలోచించలేదు. అందుకే సోమరితనం ఏనాడూ ఆమె దరి చేరలేదు. పైగా తన భర్త నిర్వహిస్తున్న చిన్నపాటి దుకాణంలోనూ ఆయనకు సాయపడ్తారు రాధామణి. ఉదయం ఐదున్నరకే తన జీవితాన్ని ప్రారంభించి.. ఇంటిపని త్వరగా ముగించుకుని ఈ నడిచే గ్రంథాలయం కాలిబాట పడుతుంది. సాయంత్రం మాత్రం అలసిసొలసి ఇంటికి చేరే రాధామణి.. ఆ తర్వాత పుస్తక పఠనం, టీవీ వంటివాటితో సేద తీరుతానంటోంది. అయితే, రాధామణిని ఈమధ్యకాలంలో బెన్యామిన్ రాసిన ఆడుజీవితం బాగా ఇన్స్పైర్ చేసిందట.
అసలు పుస్తకాలు చదవడమే గగనమైపోతున్న రోజుల్లో.. డిజిటల్ మీడియా మానవ సమాజాన్ని ఆక్రమించిన కాలంలో… రాధామణి ప్రయత్నం ఆకట్టుకునేది. తనకాసక్తి ఉంటే తాను చదివితే సరిపోయేదానికి.. ఇతరులతో.. అదీ మారుమూల గ్రామాల్లో మహిళల్లో, పిల్లల్లో చైతన్యం నింపే దిశగా రాధామణి ఓ వాకింగ్ లైబ్రరీగా మారి చేస్తున్న సేవ కొనియాడిదగింది! కొందరు రచయితలు ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని తమ రచనల్లో చెప్పే తీరు.. మనం ప్రత్యక్షంగా చూసినవాటికంటే కూడా ప్రభావవంతంగా ఉంటాయని.. అందుకే ప్రథమంగా తానో చదువరినంటోంది. పల్లె జనంలోనూ ఆ చైతన్యం తెచ్చేందుకే తన తపన అనేది రాధామణి మాట!



