తండ్రి కోరిక నెరవేర్చిన తనయుడు! ఫ్యూజన్ కు కొత్త నడకలు నేర్పిన పద్మవిభూషణుడు!!

జస్ట్ ఒక పక్క వాద్యంగా.. సహవాద్యంగా ఉన్న వాయులీనాన్ని సోలోగా మార్చి సోల్ నింపిన వాయిలనిస్ట్ ఎల్. సుబ్రహ్మణ్యం.

ఎందుకంటే ఆ వాయులీనం తీగలపై ఆయన వేళ్లు పడితే… ఆ వాయువుకు కూడా ఓ పోటీదారుడెదురైనట్టే.

అలాంటి ఒక వయోలినిస్ట్ పద్మవిభూషణ్ దక్కడం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. తాజాగా మోడీ ప్రభుత్వం ఆయనకు ఆ అవార్డును ప్రకటించడంపై సుబ్రహ్మణ్యం అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే, దేశం కాని దేశంలో తన ఫ్యూజన్ మ్యూజిక్ తో అంతర్జాతీయస్థాయి సంగీతకారుడిగా గుర్తింపు పొందినా.. ఇంట గెల్చి రచ్చ గెలవాలన్న నానుడి ప్రకారం తన మాతృదేశంలో తనను గుర్తించినందుకు ఆయన సంతోషం మాటలకందనిది. పక్కవాద్యంగా ఉన్న వాయులీనాన్ని సోలోగా మార్చాలన్న తన తండ్రి తపనకు తగ్గట్టు ఎన్నో కష్టాలనుభవించి ఈ స్థాయికెదిగాను. ఇలా ఒక వయోలినిస్టుకు పద్మవిభూషణ్ మొట్టమొదటిసారి దక్కడమంటే.. మానాన్న కల నెరవేరినట్టే. అదే నాకు ఇప్పుడు అన్నింటినీ మించిన ఆత్మసంతృప్తి అంటారు సుబ్రహ్మణ్యం. ఈ నేపథ్యంలో ఓసారి సుబ్రహ్మణ్యం జర్నీ గురించి కాస్త ముచ్చటించుకుందాం.

born 23 July 1947

యెదూహీ మెనూహిన్ వంటి ప్రముఖ ప్రాశ్చాత్య వయోలినిస్టంటే అభిమానించే తన తండ్రి, సంగీతకారుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అయ్యర్ మార్గదర్శకత్వంలో పడిన అడుగుులు సుబ్రహ్మణ్యానివి.

ఒక సహవాద్యంగా మాత్రమే ఉన్న వయోలిన్ ను ఒక సోలో వాద్యంగా మార్చాడు. ప్రపంచస్థాయిలో తన వయోలిన్ కు ఒక డిమాండ్ క్రియేట్ చేయడంతో పాటు.. ఆహూతుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలన్న తన తండ్రి కోరిక మేరకు.. వాయులీనాన్ని సోలోగా ఒక సోల్ తో ఈ ప్రపంచానికి వినిపిస్తున్న కళాకారుడు సుబ్రహ్మణ్యం.

లక్ష్మీనారాయణ అయ్యర్ ముగ్గురు కుమారులైన ఎల్. వైద్యనాథన్, ఎల్. సుబ్రహ్మణ్యం, ఎల్. శంకర్ ముగ్గురూ ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళాకారులుగా ఎదగడం.. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎల్. సుబ్రహ్మణ్యం కుటుంబమంతా తాత, తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తుండటం విశేషం.

తాను యూఎస్ వెళ్లినప్పుడు… అప్పటికే వాయులీనంలో మంచి ప్రవేశమున్న సుబ్రహ్మణ్యానికి.. తన తండ్రి లక్ష్మీనారాయణ ఏం చెప్పేవాడంటే…? మోనూహిన్ వంటివారి కాన్సర్ట్స్ కు వెళ్లు.. అక్కడి పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలను విను. ప్రధానంగా రాయల్ ఆల్బర్ట్ హాల్, కార్నెగీ హాల్, లింకన్ సెంటర్, సిడ్నీ ఒపెరా హౌజ్ వంటివాటిలో నిర్వహించే కార్యక్రమాలను వింటూ.. అక్కడ నువ్వు వాయించగల్గే స్థాయికి రా.. అలా ఇండియన్ క్లాసికల్ వయోలిన్ ను ప్రపంచ వేదికపై నిలబెడితే సరేసరి… లేదంటే, నీ మెడిసిన్ కాగానే తిరిగి వచ్చి ఇక్కడే ఇండియాలో ప్రాక్టీస్ చేయ్. ఇదీ సుబ్రహ్మణ్యంకు తండ్రి లక్ష్మీనారాయణ అయ్యర్ గట్టిగా చెప్పిన మాట.

ఇక అదే థాట్ ప్రాసెస్ సుబ్రహ్మణ్యాన్ని 1980ల నుంచి మనసున పట్టనివ్వలేదట. అలా తన వయోలిన్ కు మెరుగులు దిద్దుకునే క్రమంలో ఎందరో ప్రాశ్చాత్య క్లాసికల్ కళాకారుల వాద్యాన్ని విని ప్రాక్టీస్ చేసిన సుబ్రహ్మణ్యం.. తన తండ్రే ఎంతో గొప్పగా చెప్పిన మోనూహిన్ నుంచి పిలుపునందుకోవడం తన వయోలిన్ జీవితంలోనే ఓ గొప్ప మరపురాని మలుపంటాడాయన.

ఆ సందర్భమేంటంటే… ఓరోజు ఫైన్ మార్నింగ్ మెనూహిన్ నుంచి ఓ కాల్ వచ్చింది సుబ్రహ్మణ్యానికి. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి మెనూహిన్ వ్యక్తిగత కార్యదర్శి. మీరు ప్రదర్శన చేయడానికి రాగలరా అనేది ఆ సెక్రటరీ నుంచి సుబ్రహ్మణ్యానికి ఎదురైన ప్రశ్న..? మెనూహిన్ తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భమది. మళ్లీ కాల్ చేసి చెబుతానని ఫోన్ పెట్టేసిన సుబ్రహ్మణ్యం.. తండ్రికి ఫోన్ చేస్తే.. అదో గొప్ప అవకాశం.. నువ్వు తప్పకుండా వెళ్లాలి.. అక్కడ నీ ప్రదర్శన ఇవ్వాలి.. ఆయనతో మన్ననలు పొందాలి అని చెప్పేశారట. కట్ చేస్తే సాయంత్రం ప్రముఖ ప్రాశ్చాత్య వయోలిన్ విద్వాంసుడైన మెనూహిన్ 70వ జన్మదిన వేడుకలో సుబ్రహ్మణ్యం వాయులీనం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ వెంటనే స్టేజ్ పైకొచ్చిన మెనూహిన్… సుబ్రహ్మణ్యాన్ని హగ్ చేసుకుని.. మనిద్దరం కలిసి ఏదైనా చేయాలనడం తన జీవితంలో ఓ మరపురాని అనుభూతి అంటారు సుబ్రహ్మణ్యం.

తాను మెనూహిన్ తో పాటు… మెడికల్ కళాశాలలో చదువుతున్నప్పుడు.. JASHCA HEIFETZ వయోలిన్ ను బాగా ఆస్వాదించేవాడినంటారు. మెనూహిన్, JASHCA HEIFETZ వీరంతా ఆల్ టైం ది గ్రేట్ వయోలినిస్టులంటాడాయన. వీరందరి పేర్లు తన తండ్రి ద్వారానే పరిచయమైనాయని.. తను వయోలిన్ విద్వాంసుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం వెనుక నాన్నే ఉత్ప్రేరకమంటారు సుబ్రహ్మణ్యం.

అలా తండ్రి కోరికను తీర్చిన కుమారుడిగా.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వయోలినిస్టుగా.. లార్డ్ యెహూదీ మెనూహిన్, స్టెఫాన్ గ్రెపెల్లీ వంటి గొప్ప గొప్ప కళాకారులతో కలిసి పనిచేశారు సుబ్రహ్మణ్యం.

సుబ్రహ్మణ్యం వాడే వయోలిన్ తయారీ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. దాన్ని ఆయన ప్రత్యేకంగా ఓపెన్ హాల్ కాన్సర్ట్స్ కు తగ్గట్టు ప్రతిధ్వనించేలా తయారు చేయిస్తారు. 1984 సంవత్సరం నుంచి తాను వయోలిన్స్ ప్రత్యేకంగా తయారు చేయిస్తూ వస్తున్నారు సుబ్రహ్మణ్యం.

ప్రపంచంలోనే ది గ్రేట్ డ్యాన్స్ బ్యాలే కంపెనీసైన జోస్ బ్యాలే, ఆల్విన్ ఐలీ అమెరికన్ డ్యాన్స్ థియేటర్, మారిన్సికీ బ్యాలే వంటి సంస్థల ప్రదర్శనలకు సంగీత దర్శకత్వాన్ని వహించారు. సలామ్ బాంబే, మిస్సిసిపీ మసాలా, లిటిల్ బుద్ధ, కాటన్ మేరీ వంటి చిత్రాలకు సంగీత సహకారాన్ని కూడా అందించారు సుబ్రహ్మణ్యం.

వైద్య వృత్తిలో స్థిరపడాల్సిన సుబ్రహ్మణ్యం… తన తండ్రి మార్గదర్శకత్వంలో ఓ ప్రపంచ ప్రఖ్యాత వయోలనిస్టుగా పేరు సంపాదించుకోగా.. విజయశ్రీ శంకర్ ను వివాహమాడారు. ఆమె 1995లో మరణించాక.. ప్రముఖ గాయని కవితా కృష్ణమూర్తిని వివాహం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యం, విజీ సుబ్రహ్మణ్యానికి నల్గురు పిల్లల్లో.. జింగర్ శంకర్, బిందు సుబ్రహ్మణ్యం, నారాయణ సుబ్రహ్మణ్యం, అంబీ సుబ్రహ్యణ్యం ఉండగా.. వీరంతా మ్యూజికల్ ఫ్యామిలీగా… తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే సుబ్రహ్మణ్యం ఘరానాగా ఆ ఫ్యామిలీ జర్నీ మొత్తం సంగీతంతోనే కొనసాగుతుండటం… కర్నాటిక్ క్లాసికల్ తో పాటు.. జాజ్, ఫ్యూజన్, ఇండో జాజ్, వరల్డ్ ఫ్యూజన్, వెస్ట్రన్ మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లోనూ విదేశాల్లోనూ ఉవ్వెత్తున భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తుండటం గర్వకారణం.

తన తండ్రి లక్ష్మీనారాయణ పేరుతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్స్ వంటి కాన్సర్ట్స్ చేయడంతో పాటు.. బెంగళూర్ వేదికగా సుబ్రహ్మణ్యం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ పేరుతో ఓ స్కూల్ నూ నడుపుతున్నారు. అంతేకాదు, ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ చెన్నై కోడంబాకం వేదికగా నడిపిస్తున్న కేఎమ్ మ్యూజిక్ కన్సర్వేటరీ అడ్వైజరీ బోర్డులోనూ కీలకపాత్ర పోషిస్తున్న సభ్యుడు ఆయన. డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు ఎల్. సుబ్రహ్మణ్యం జర్నీలో సర్వసాధారణం. తాజాగా భారత ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ తో సత్కరించిన ఆ చెన్నై వయోలిన్ సంగీత మాంత్రికుడికి.. అభినందనలతో!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles