థియేటర్ నచ్చింది.. సినిమా నిరాశపర్చింది!

ఇష్టమైతుందో, లేదో అనుకున్నది తీరా వెళ్లాక ఇష్టం కావచ్చు. నచ్చుతుందనుకున్నది నచ్చకపోవచ్చు. ఒక ఐదు నిమిషాల క్రితం ఉన్న అభిప్రాయం మారిపోవచ్చు. ఎందుకంటే మార్పు అనివార్యం.

అలాంటి కథే… ఒక థియేటర్… అందులో ఓ సినిమా కథ!

శంకర్ భారతీయుడు 2కు ముందు వచ్చిన సినిమాలన్నీ చూసిన ఆయన ఎందరో అభిమానుల్లో నేనూ ఒకణ్ని. ఎందుకంటే అన్నీ బాగా తీస్తాడని కాదుగానీ… తీవాలనుకున్నది టైట్ స్క్రీన్ ప్లే రైటింగ్ తో తీస్తాడని. ఏదో ఒక కొత్త పాయింట్ తో జనంలోకొస్తాడని. మూసధోరణి సినిమాలకు భిన్నంగా ఆలోచిస్తాడని.

కానీ, ఆ శంకరే నిరాశపరుస్తున్నాడు. భారతీయుడు 2తోనే పూర్తిగా నిరాశపర్చాడంటూ ఎందరో పెదవి విరిచారు. ఇక గేమ్ ఛేంజర్ విషయంలోనైతే.. భారతీయుడు 2తో తగిలిన ఎదురుదెబ్బతోనైనా శంకర్ మునుపటిలా తీయకపోతాడా అని భావించిన అభిమానులకు మళ్లీ ఆశనిపాతమే ఎదురైంది. అందులో నేనూ ఒకణ్ని. దానికి కారణం ఆయన ఆలస్యం కూడాను! ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారిపోతున్న సినిమాను మూడు, నాల్గేళ్లపాటు సాగదీతలు… తెలుగుకొచ్చేసరికి స్టార్స్, వాళ్ల కొడుకులతో ఎంతో కొంత కాంప్రమైజేషన్ ధోరణులు కూడా తప్పకపోవడం వంటివీ సినిమాను నిండా ముంచేవే!

భారతీయుడు 2 చూడని నాకు.. ఎందుకో గేమ్ ఛేంజర్ పైనా అంత సదభిప్రాయమేం లేకుండే. కానీ, ఎవరో కొందరు అభిమానులు సినిమా బాగుందనే మౌత్ టాక్ అక్కడక్కడా వినిపించడం, విమర్శలకు తోడు అక్కడో ఇక్కడో పర్లేదనిపించే పోస్టులు సోషల్ మీడియాలో కనిపించడంతో.. ఊరికెళ్లాం కదా ఓల్డ్ థియేటర్ లో సరదాగా గేమ్ ఛేంజర్ చూస్తే మూడు ఛేంజవుతుందనుకున్న నాకు నిజంగానే ఆ మూడ్ రివర్స్ గేర్ లో ఛేంజైంది. టాకీసులోకి ఎంటరైన నాకు… శంకర్ ఎంతగా చేంజైపోయాడో అర్థమైపోయింది. ఏది నాటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే… ఏది అప్పడాలమ్ముకునే నాటి జెంటిల్మెన్ వ్యూహారచన… ఏది ఒకే యాక్టర్ తో అపరిచితుడిగా రంగంలోకి దింపి దక్షిణ, ఉత్తరభారతదేశాల హీరోగా విక్రమ్ ని సుపరిచితుణ్ని చేసిన ఆలోచన… ఏది నాటి ముక్కాలా ముక్కాబులా… ఏది నా ఇంటి ముందున్న పూదోటనడిగేవోనంటూ వినిపించే మెలోడీ… ఇదిగో ఇలా ప్రతీ చోటా శంకర్ డిజప్పాయింట్ చేసేశాడు.

సినిమా అంటే కల్పితం కావచ్చు. కానీ, అది ఇష్టపడేంత పరిమితితో కూడిన కల్పితంగా ఉండొచ్చు. లేదా, ఊహలకందని ఏదో ఓ కొత్త విషయాన్ని ఎంతైనా కల్పితంగా ఆడుకోవచ్చు. కానీ, నిత్యం రాజకీయాలు, బ్యూరోక్రసీ, మీడియా ఇవన్నీ జనం బాగా గమనిస్తున్నవి. అలాంటి అకల్పితమైన అంశాల్లో కల్పితం శృతి మించితే ఏమవుతుందో గేమ్ ఛేంజర్ చెబుతుంది. భారీతనం పేరుతో ఈవీఎంల ధ్వంసం, కౌంటింగ్ ను ఆపే ప్రక్రియ అసలు డైరెక్టర్ ఏం చెప్పదల్చుకున్నాడన్నదానికంటే… మెగా కుటుంబపు హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు సినిమానే ఎటుపోతుందో తెలుసుకోలేని ఓ స్థితిలో సోయి తప్పాడనిపించాడన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం. సినిమా ఒక ఆర్ట్ ఫామ్ అని.. దాన్ని ఎంత కళాత్మకంగా… రసహద్యంగా తీర్చిదిద్దితే అది అంతగా కనెక్టవుతుందని తెలియని మనిషేం కాదు శంకర్.. కానెందుకో దారితప్పాడు. గేమ్ ఛేంజర్ అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు చాలామంది ఔట్ డేటెడ్ అనే ఒక స్టేట్ మెంట్ ఇచ్చేసే స్థాయికి ఒక జెంటిల్మన్, ఒక ప్రేమికుడు, ఒక భారతీయుడు, ఒక అపరచితుడు శంకర్ మారిపోవడం గేమ్ ఛేంజర్ ఆయనకు మిగిల్చిన విషాదం.

అయితే, ఇక్కడే ఇంకో కథ ఉంది. ఈ గేమ్ ఛేంజర్ అసలు చూడొద్దనే అనుకున్నా. పట్టణాల బతుకుల్లో మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చి.. పాప్ కార్నులతో కలిపి వేల రూపాయలు విడగొట్టుకునే రోజుల్లో… ఎప్పుడోగానీ సినిమాకు వెళ్లడం మానేశాం. ఓటీటీల్లో అంతకంటే అద్భుతమైన వినోదం.. మళయాళ, మరాఠీ, బెంగాలీ, తమిళ సినిమాల్లో దొరుకుతోంది. అవేకంగా తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. లేదంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ను అర్థమైనంతలో అర్థం చేసుకుని ముచ్చటగా చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్ గురించే ఆలోచనలసలు బందైపోయాయి.

కానీ, మా ఊళ్లో ఓ థియేటర్ ఉంది. గట్టిగా చెప్పాలంటే అదో రేకుల షెడ్డు. సీట్లన్నీ తీసేసి మిల్లేర్పాటు చేస్తే జస్ట్ రైస్ మిల్లు. ఎప్పుడో 1994లో యమలీల అనే ఎస్వీ. కృష్ణారెడ్డి సోషియో ఫాంటసీ సినిమాతో ప్రారంభమైన థియేటర్. సినిమా రిలీజ్ రోజే ఫ్రెండ్స్ తో కలిసి చూసిన ఓ మధుర జ్ఞాపకం. అయితే, ఇప్పటికీ 30 ఏళ్లుగా ఈ థియేటర్ నడుస్తూనే ఉంది. ఎలా అంటే.. ఏదైనా మంచి సినిమా వచ్చి పండుగకో, పబ్బానికో ఉరంతా పట్నం నుంచి వస్తారనుకున్నప్పుడు ఓనర్ కు మూడొస్తే మళ్లీ ఆట మొదలైతుంది. మిగిలినరోజుల్లో ఎలుకా, పిల్లాటకు వేదికవుతుంది.

వాస్తవానికి ఇంట్లో హోంథియేటర్ పెట్టుకుని మంచి సౌండ్ తో ఫోర్ కే క్వాలిటీతో ఓటీటీలో చూసే అనుభూతిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అయినా, అదో నోస్టాల్జియా!

అందుకే ఫ్రెండ్ తో కలిసి అలా గేమ్ ఛేంజర్ కు పోయే ముందు కొందరు హెచ్చరించారు. మీరు పోతున్నారు సరే.. మీకు సినిమాతో పాటు బల్లులు, నల్లులు, ఎలుకలు ఫ్రీ.. వాటిని వేటాడే పిల్లులూ అప్పుడప్పుడూ కాళ్లకు తగులుతుంటాయి. కిందకు జారిన ప్రతీసారీ సీటులో మనకి మనమే వెనక్కి జరిగి కూర్చోవాలి. పైగా పోతోంది సెకండ్ షో. కాబట్టి ఏ కాస్త ఆదమర్చినా సీట్లోంచి జారి కిందపడి కొత్త ప్రమాదం కొని తెచ్చుకునే అవకాశముందన్నది ఆ హెచ్చరిక. దాంతో పాటు.. యమలీల చూసినప్పుడు 15 రూపాయల టిక్కెట్ ఉన్న ఆ థియేటర్ లో.. 30 ఏళ్ల తర్వాత వసతులు మారకపోగా నాటి కంటే దిగజారి పలకరిస్తుంటే.. తలకు నూటాయాభై చెల్లిస్తేనే లోనికి ఎంట్రీ. దానికి తోడు ఇంటర్వెల్ లో వాష్ రూమ్ కు వెళ్లితే… మేం యమలీల చూసినప్పట్నుంచీ ఇప్పటివరకూ ఎప్పుడూ కడగనంత దుర్గంధం అక్కడి మరో విశిష్ఠత.

ఎలాగోలా చూద్దామనుకుని బాల్కనీకెక్కుతుంటే.. యమలీల నాటి వయస్సులో ఉన్న ఎత్తుకు పైన తాకలేదుగానీ.. ఇప్పుడున్న ఎత్తుకు వంగి వెళ్లకపోతే థియేటర్ లోకి ఎంట్రీ అయ్యేకంటే ముందే ఇంకో గాయం ఫ్రీ. అలా మెల్లిగా లోపలికెళ్లాక.. నేను నా ఫ్రెండ్… ఇంకో దోస్త్ ఫ్యామిలీ… ఇంకో రెండు జంటలు.. ఇలా ఒక రెండు వందల సీట్ల టాకీసులో.. మొత్తం ఓ పన్నెండుమందిమి మాత్రమే.

అయితే, శంకర్ కదా బాగుంటుదనుకున్న గేమ్ ఛేంజరేమో అప్పటివరకూ బాగున్న మైండునే ఛేంజ్ చేసి పడేస్తే… అప్పటివరకూ థియేటర్ గురించి భయపెట్టినవన్నీ సరదాకేనని తెలిసి… లోనికెళ్లాక ముందు చెప్పుకున్నట్టే ఏమీ మారకపోయినా… ఆ చిన్న టాకీస్ అనుభవం మాత్రం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఆ అనుభవం తాలూకు అనుభూతి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చూసిన యమలీలలా… మరో ముప్పై ఏళ్లు లీలగా గుర్తుండేంత!

అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడగలమో, లేదోననుకుని పోయిన థియేటర్ నచ్చింది. శంకర్ అనే దర్శకుడిపైనున్న ఇష్టంతో వెళ్లిన సినిమా పూర్తిగా నిరాశపర్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles