తన ఐకానిక్ మేనరిజమ్స్ తో తమిళనాడుకే పరిమితం కాకుండా యావత్ భారతమంతా సుపరిచితుడు రజనీకాంత్. అదే సమయంలో ఆయన సూపర్ నేచురల్ ఫీట్స్.. నేటి సోషల్ మీడియా ఎరాలో అతిశయోక్తులు, ఫన్నీ మీమ్స్ కు ఉపకరణాలు. ఏదేమైనా, రజనీకి అంత గుర్తింపు తెచ్చింది మాత్రం లాజిక్కుకందని అతని క్రేజీ స్టైలే.
ముత్తు, భాషా వంటి సినిమాలతో జపాన్ వంటి దేశాల్లోనూ క్రేజ్ కూడగట్టుకున్న రజనీకాంత్ కు.. భారతదేశం నలుమూలలా అభిమానులున్నారు. ఎంతగా అంటే, మహారాష్ట్రలో ఒక రాజేశ్ ఖన్నా, ఓ అమితాబ్ బచ్చన్, ఓ దిలీప్ కుమార్, ఓ షారుక్ ఖాన్ వంటివారిని కాకుండా… అంతకుమించి రజనీని అభిమానించే కొన్ని ఊళ్లున్నాయి. అలా ఓ ఊరు ఇప్పుడు రజనీకాంత్ పేరుతో వెలవడమే విశేషం.

పూణే సమీపంలోని ఓ కుగ్రామంలోకి ఎంటరైతే రజనీ అంటే పడి చచ్చేంత క్రేజ్ కనిపిస్తుంది. రజనీకాంత్ తమ సొంత ఇంటివాడిలానే భావిస్తారు. అలా ఇంటింటా భావిస్తారు కాబట్టే.. ఏకంగా తమ గ్రామానికే రజనీకాంత్ అని పేరు పెట్టుకున్నారు.
ఇంతకీ ఆ రజనీ గ్రామమెక్కడ..?
అభిమానం వేరు. ఆ అభిమానం ముదిరి వెర్రిగా మారడం వేరు. అలాగే, వెర్రి వేయి రకాలని కూడా అంటారు. తమ ఆరాధ్య నటి బొమ్మలను టాటూలుగా శరీరంపై వెయించుకోవడం.. తమ అభిమాన హీరో పేరుతో క్రేజీ కటింగ్స్ చేయించుకోవడం.. తాము ఆరాధించేవారికి ఏకంగా గుడులే కట్టడం ఇప్పటికే చూస్తున్నాం. కానీ, మహారాష్ట్రలోని మావడి కడేపథర్ అనే ఓ ప్రశాంత వాతావరణంలో కనిపించే ఓ గ్రామం ఇప్పుడు తన పేరునే మార్చుకుని రజనీ గ్రామంగా చెలామణి అవుతోందియ
పూణేకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మావడి కడేపథర్. ఇక్కడ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ సినిమా రిలీజైనా.. ఆయన గొప్పతనాన్ని తెలిపే ఏ వార్త వచ్చినా సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ గ్రామస్థుల దృష్టిలో రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్ కావడంతో… ఆయన్ను తమ భూమిపుత్రుడిగా భావిస్తారు. అందుకే మావడి కడేపథర్ తరచూ రజనీకాంత్ గ్రామంగా కూడా వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది.
స్థానికులు చెప్పేదాని ప్రకారం రజనీకాంత్ వంశస్థుల మూలాలు మావడి కడేపథర్ లో ఉన్నాయి. సుమారు వందేళ్ల క్రితం ఉపాధి కోసం కర్నాటకలోని విజయపురి తాలుకాలోని బసవన్న బగేవాడికి.. ఆ తర్వాత, అక్కడినుంచి బెంగళూరుకు రజనీ కుటుంబం వలస వెళ్లింది. అలా రజనీకాంత్ బెంగళూర్ లో జన్మించారు.
అందుకే, సినిమా రంగంలో విశేష ఆదరణను, విజయాల్ని సాధించడంతో… శివాజీరావ్ గైక్వాడ్ అయిన రజనీని తమ నేల పుత్రుడిగా కొలుస్తున్నారు మావడి కడేపథర్ స్థానికులు. ఇప్పటికీ మావడి కడేపథర్ లో అనేక గైక్వాడ్ కుటుంబాలున్నాయి. వీరి దృష్టిలో ఇది రజనీకాంత్ పూర్వీకుల ఊరు. అందుకే, పలుమార్లు రజనీని కలిసి ఊరుకు రావల్సిందిగా కూడా ఈ గ్రామస్థులు ప్రయత్నాలు చేశారట.
ఓసారి షూటింగ్ సమయంలో రజనీని మావడి కడేపథర్ గ్రామస్థులు కలుద్దామని యత్నిస్తే.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరోసారి ఓ హోటల్ లో లిఫ్ట్ దగ్గర రజనీని పట్టుకోగల్గారు. తాము హిందీలో మాట్లాడితే.. ఆయన వెంటనే తమను గమనించి మరాఠీలో మాట్లాడమన్నారని.. ఆయనకు మరాఠీ భాషపైనా మంచి పట్టుందంటున్నారు ఈ గ్రామస్థులు.

రజనీ రాకకై నిరీక్షిస్తున్న మావడి కడేపథర్!
ఆ తర్వాత చెన్నైలో కూడా మావడి కడేపథర్ గ్రామస్థులు ఆయన్ను కలవడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించారు. 2013లో మహారాష్ట్రలోని సాస్వడ్ లో జరిగిన ఓ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి ఆయనను ఆహ్వానించారు. కానీ, రజనీ నుంచి స్పందన రాలేదట. అయితే, ఎప్పుడో ఒక రోజు రజనీకాంత్ తన మూలాలను, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ తమ గ్రామానికి వస్తాడన్న నమ్మకం ఈ గ్రామస్థులో కనిపిస్తోంది. అలాగే, రజనీ రాక కోసం మావడి కడేపథర్ వేచి చూస్తోంది.
మావడి కడేపథర్ వాసులు సూపర్ స్టార్ నుంచి ఏదో ఆశించి ఆయన్ను గ్రామానికి ఆహ్వానించడం లేదట. ఆయనోసారి అలా అడుగుపెట్టి పోతే చాలనుకుంటున్నారు. అదే రజనీకాంత్ గా మారిన మావడి కడేపథర్ గ్రామానికి ఓ చిరస్మరణీయ క్షణం అవుతుందన్నది గ్రామస్థుల భావన.
రజనీ ప్రాంతాలకతీతమైన వ్యక్తిగా ఎదగడం తమకు గర్వకారణమని.. అందుకే, ఊరి పేరునే రజనీకాంత్ గా మార్చేశామంటున్నారు అక్కడివారు.
2010లో ఓసారి రజనీ తన మూలాల గురించి మాట్లాడినప్పుడు.. తానొక మరాఠీనని, కన్నడిగుణ్నని, ఓ తమిళ తంబీనంటూ చెప్పుకొచ్చారు. అలాగే, ఇప్పుడు రజనీ క్రేజ్ ఇదిగో ఇలా ఊళ్లకు ఆయన పేరు పెట్టుకునే స్థాయిలో పెరగడం విశేషమే మరి.
సూపర్ స్టార్ గ్రామాన్ని సందర్శించినా, సందర్శించకపోయినా… మహారాష్ట్రలోని మావడి కడేపథర్ ఇప్పుడు రజనీకాంత్ పేరుతో వార్తల్లో ఊరైంది.



