Sudhakar Modumudi..✍️
చెన్నై నుండి వచ్చి కచేరీ చేసిన విద్వాంసులకు, ఆ ఊళ్లోని ఒక సంగీత అభిమాని ఇంట భోజనం ఏర్పాటయింది. ఆవురావురుమంటూ ఇదివిస్తరి ముందు కూర్చున్న విద్వాంసులకు వడ్డన జరుగుతోంది. ముందుగా సంప్రదాయం ప్రకారం,పప్పు వడ్డిస్తున్నారు అందరికీ.అయితే, కచేరీలో ప్రధాన కళాకారుడైన గాయకులు ఎమ్టీ కే గారికి మాత్రం ముందుగా మజ్జిగ వడ్డించారు.ఆశ్చర్యం వేసినా,ఆకలితో ఏమీ పట్టించుకోకుండా మజ్జిగ తాగటం పూర్తి చేశారు ఆయన.వెంటనే సాంబారు,ఆ వెంటనే కూర,చివరికి పప్పు, ఆ పిదప అన్నం వడ్డించారు ఆతిథ్యమిచ్చిన గృహిణిగారు.
కోపం కట్టలు తెంచుకుంది గాయకునికి.

“ఏమిటి మీ వడ్డన? వరసా,వాయా లేకుండా? అతిథులకు అన్నం ఎలా వడ్డించాలో మీపెద్దవాళ్లు నేర్పలేదా?” ఆవేశంతో ఊగిపోయారు ఎమ్టీ కే గారు.
అప్పుడు ఆ గృహిణి ఎంతో శాంతంగా ఇలా అన్నది:
” కచేరీలో పాడే అంశాలు ఏ వరుసలో ఉండాలో మీ గురువులు మీకు చెప్పలేదా?
మీరు ఈరోజు మంగళంతో కచేరీ ఆరంభించారు. ఆలాపన ఒక రాగంలో ,కృతి వేరే రాగంలో పాడారు.చివరలో పాడవలసిన జావళి,తిల్లానా ఆరంభంలో పాడి,ముందు పాడవలసిన వర్ణం, గణేశస్తుతి చివరికి పాడి,కచేరీ పూర్తి చేశారు.
మీ వరస చూశాక,మీ భోజన పద్ధతి కూడా అంతే అనుకున్నాను.”
ఎమ్టీకే గారికి భూమి తలక్రిందిలైనట్టు,కళ్ళు తేలిపోతున్నట్టు అనిపించి,ముందు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి,ఆ గృహిణికి ఒక నమస్కారం చేసి,భోజనం పూర్తి చేసి,తిరుగు ప్రయాణమయ్యారు.



