వీధులను చల్లబర్చే ఔట్ డోర్ ఏసీలు.. ఈ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్!

ఏ ఆవిష్కరణకైనా సమస్యే మూలం. వాటిని సవాళ్లుగా తీసుకుని బుర్రకు పదునుపెడితే.. సృజనాత్మకతకు ఏదో ఒక రోజు ఆ సమస్య తలవంచుతుంది. అద్భుతమైన ఆవిష్కరణ పుట్టుకొస్తుంది. అలాంటి ఓ ఆవిష్కరణే ఇప్పుడు చైనాలో విరివిగా కనిపిస్తూ వైరలవుతోంది. ఆశ్చర్యపరుస్తోంది.

అదే సంప్రదాయ ఏసీలను తలపించే ఔట్ డోర్ ఏసీ. వేడిగాలులు వీచే సమయంలో వీధులనే చల్లగా మార్చే ఔట్ డోర్ ఏసీలతో.. చైనాలోని షాంక్సీ ప్రావిన్స్ వీడియోలు ఇప్పుడు ప్రపంచంలో చర్చగా మారాయి. అసలా విజ్ఞానశాస్త్రమేంటి..?

ఇప్పుడంటే యూరప్ కూడా వేడెక్కుతోందిగానీ… సాధారణంగా వేసవి కాలమంటే ఆసియా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో వేడి గాలి ఉష్ణోగ్రతల తీవ్రతలు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కాంక్రీట్ జంగల్స్ గా మారిపోతూ… ఆకాశహర్మ్యాలను తలపించే నగరాలు, పట్టణాలైతే పగటిపూట సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. అధిక జనసాంద్రత కూడా అందుకు మరో కారణం. అయితే ఆ వేడి సూర్యాస్తమయం తర్వాత కూడా విడుదలవుతూనే ఉంటుంది. దాంతో జనం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించకుండా ఏసీ గదుల్లోనో, కూలర్ల ముందో.. లేక, కనీసం ఫ్యాన్స్ ముందో కూర్చోక తప్పనిసరి పరిస్థితులేర్పడుతున్నాయి.

పెరుగుతున్న ఉష్ణ తాపం గురించి ఓవైపు ప్రపంచమంతా చర్చించుకుంటున్న ఈ దశలోనే… చైనాలోని కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరలవుతున్నాయి. భవనాల పై కప్పులు, ఓపెన్ టెర్రసులన్నీ సూక్ష్మమైన నీటి పొగమంచుతో కప్పేయబడి ఆ వీడియోల్లో కనిపిస్తోంది. దాన్నే ఔట్ డోర్ ఎయిర్ కండిషనర్ గా పిలుస్తున్నారు. అదేం సంప్రదాయ ఎయిర్ కండిషన్ కాదు. చాలాకాలంగా కూడా ఉన్నదే. కానీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మళ్లీ తెరపైకొచ్చి ప్రాధాన్యత సంతరించుకుంది.

మరి ఆ ఔట్ డోర్ కూలింగ్ సిస్టమ్ వెనుకనున్న శాస్త్రమేంటి..?

దీన్ని ఔట్ డోర్ మిస్ట్ కూలింగ్ సిస్టమ్ అంటారు. సాధారణ ఏసీలా కంప్రెసర్స్, రిఫ్రిజరెంట్లు ఉపయోగించి గాలిని చల్లబర్చదుగానీ.. ప్రత్యేకంగా రూపొందించిన నాజిల్స్ నుంచి అత్యంత సూక్ష్మమైన నీటి బిందువులను గాలిలోకి పిచికారీ చేస్తుంది ఈ సిస్టమ్. ఆ నీటి బిందువులు చిన్నవిగా ఉండటంతో వెంటనే గాలిలో ఆవిరైపోతాయి. నీరు ద్రవరూపం నుంచి ఆవిరిగా మారే సమయంలో చుట్టూ ఉన్న గాలిలోని వేడిని అబ్జార్బ్ చేస్తుంది. ఈ సహజ ప్రక్రియనే ఎవాపొరేటివ్ కూలింగ్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తే నేల తడవకుండా, ప్రజలూ తడవకుండా, చుట్టుపక్కల ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది.

అయితే దీని పరిమితి కొంతవరకే. ఏ ఏ ప్రదేశాల్లోనైతే వీటని అమర్చారో ఆయా ప్రాంతాల్లో మాత్రమే చల్లదనాన్నందిస్తుంది. కూర్చునే ప్రదేశాలు, నడకమార్గాలు.. లేదా టెర్రసుల వంటి నిర్దిష్ఠ ప్రదేశాల్లో మాత్రమే చల్లదనాన్ని ఎక్కడంటే అక్కడ కల్పించేలా అరేంజ్ చేసుకోవచ్చు.

ఈ మిస్ట్ కూలింగ్ సిస్టమ్ ఉష్ణోగ్రతలను ఎలా తగ్గిస్తుంది..?

ఈ వ్యవస్థ వెనుక ఉన్న సూత్రం చాలా సులభమైంది. నీరు ఆవిరిగా మారేందుకు శక్తి అవసరమైతే.. ఆ శక్తిని గాలిలోని వేడి నుంచి తీసుకుంటుంది. అలా లక్షలాది సూక్ష్మ నీటి బిందువులు ఆవిరైపోయే సమయంలో గాలిలోని కొంత వేడిని తగ్గిపోవడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. దాంతో ఆ ప్రాంతమంతా చల్లగా మారిపోతుంది. మొత్తానికి మొత్తం ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం జరక్కపోయినా… కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలను తగ్గించగల్గే పవర్ ఈ మిస్ట్ కూలింగ్ సిస్టమ్ కల్గి ఉంటుంది. అయితే, ఎంత మేరకు ఉష్ణోగ్రతలను తగ్గించగల్గుతుందనేది.. గాలిలోని వేగం, తేమ, ఉష్ణోగ్రతలను బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పొడి వాతావరణంలో నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీంతో కూలింగ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది.

ఈ సిస్టమ్స్ ఎందుకు ఎక్కువగా ప్రచారంలోకొచ్చాయి..?

ఔట్ డోర్ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ చాలా ఏళ్లుగా వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నవే. ముఖ్యంగా బయట ఎక్కువసేపు గడిపే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రెస్టారెంట్స్, కెఫేలు, హోటల్ టెర్రసులు, తోటలు, అమ్యూజ్మెంట్ పార్క్స్, గోదాముల ప్రవేశ ద్వారాలు, ఈవెంట్స్ నిర్వహించే వేదికల్లో ఇవి కనిపిస్తుంటాయి. మొత్తం బహిరంగా ప్రదేశాన్ని ఏసీతో చల్లబర్చే యత్నం కంటే.. తక్కువ విద్యుత్ వినియోగంతో ఇవి పనిచేస్తాయి. అలాగే అధిక పీడన పంపుల ద్వారా సూక్ష్మమైన నీటి బిందువులు మాత్రమే విడుదలవ్వడంతో నీటి వినియోగం కూడా నియంత్రణలో ఉంటుంది. పైకప్పు అంచుల్లో వీటిని సులభంగా అమర్చుకోవచ్చు.

గ్రామాల కంటే నగరాలెందుకు వేడెక్కుతున్నాయి..?

అర్బన్ హీట్ ల్యాండ్ ఎఫెక్ట్ తో ఈ సాంకేతికతపై ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో ఆసక్తి పెరుగుతోంది. నగరాల్లో భవనాలు, రోడ్లు, ఫుట్ పాత్ లు, పగటిపూట భారీ సూర్యరశ్మిని గ్రహించి.. ఆ వేడిని నెమ్మదిగా సాయంత్రం నుంచి విడుదల చేస్తుంటాయి. వీటికి తోడు పచ్చదనం తక్కువ ఉండటం, వాహనాల వల్ల ఉత్పత్తయ్యే వేడి, ఎత్తైన భవనాల కారణంగా సహజ గాలి ప్రవాహం తగ్గిపోవడం వంటి అంశాలు నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాలు.

దీంతో గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువ డిగ్రీల్లో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ నిపుణులు చెప్పే మాట. వేడిగాలులతో రాత్రి వేళ కూడా ఆ హీట్ తగ్గకపోవంతో ప్రజలకు ఇబ్బందిగా మారిపోతోంది.

తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ఏ మేరకు పనిచేస్తాయి..?

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు.. కల్గుతున్న వాతావరణ మార్పులకు ఈ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ప్రత్యామ్నాయమేం కావు. కానీ, ఉపశమనం. ప్రజాకూడళ్లల్లో, బస్ స్టాపుల్లో, మార్కెట్లలో, రెస్టారెంట్స్, ఔట్ డోర్ సిట్టింగ్ ప్రాంతాల్లో ఇవి ఉపయోగపడతాయి. కొంతలో కొంత ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి.

పైగా ఏసీలు బహిరంగా ప్రదేశాల్లో ప్రభావవంతంగా పని చేయవు. ఎందుకంటే, చల్లని గాలి బయట నిల్వ ఉండదు కాబట్టి. అందుకే ఈ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ కు ఇప్పుడు డిమాండ్ ఏర్పడుతోంది. అయితే, గాలిలో తేమ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది.

నగరాలకు సవాల్ విసురుతున్న వేడి తరంగాలు!

ఇప్పటికే భారత్ సహా అనేక దేశాల్లో పెరుగుతున్న వేడిగాలులు, ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ ఔట్ డోర్ కూలింగ్ యూనిట్స్ పై ఆసక్తి పెరుగుతోంది. వాతావరణ నిపుణుల ప్రకారం క్లైమేట్ ఛేంజ్ కారణంగా హీట్ వేవ్స్ మరింత వేడెక్కే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయాల్లో మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ఉపశమనాన్నిచ్చే ప్రత్యామ్నాయంగా విపణిలోకొచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles