వైద్యం అందని ద్రాక్ష అయినప్పుడు.. వేల మంది బిడ్డలకు ప్రాణం పోసింది ఆ మంత్రసాని!

వైద్యం అందని ద్రాక్షైన రోజుల్లో… 13 వేల మంది గర్భిణులకు ప్రసవం చేసింది.

1972వ సంవత్సరం అది.. 22 ఏళ్ల ఎల్లమ్మ తీవ్రమైన ప్రసవవేదనతో బాధపడుతోంది. అందుబాటులో ఆసుపత్రుల్లేవు. మారుమూల గ్రామంలో ఉన్న ఎల్లమ్మ పాలిట ఆనాడు వైద్యురాలైంది ఈరమ్మ. సాధారణ సుఖ ప్రసవంతో తల్లీ, బిడ్డను కాపాడింది. ఆమె చేసిన సుఖ ప్రసవంతో ప్రస్తుతం 53 ఏళ్లు నిండుకున్న మంజప్ప అనే నాటి బాలుడు జన్మించేందుకు కారణమైంది ఈరమ్మ.

రోజుకు 5 రూపాయలు మాత్రమే ఈరమ్మ సంపాదన. ప్రసవం అయ్యేవారికి జన్మించే బిడ్డ మగనా, ఆడనా అన్న లింగభేదాన్ని బట్టి ఈరమ్మ సంపాదనలో కొద్దిపాటి తేడా ఉండేది.

సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా మిడ్ వైఫ్ సేవలందించిన ఈరమ్మ ఇప్పుడు వయసు రిత్యా సెంచరీ కొట్టిన 103 ఏళ్ల యువతి. తన గ్రామం ఒబళశెట్టి హళ్లితో పాటు.. పరిసర ప్రాంతాల్లోని నిండు చూలాళ్లకు 13 వేల మందికి పైగా ప్రసవాలు చేసింది. కర్నాటకలో సులగత్తి ఈరమ్మ అంటే ఫేమస్ మంత్రసాని. ఆరోగ్య సేవలు పట్టణాలకే పరిమితమైన రోజుల్లో… పల్లెలకు ఆమే ప్రధాన వైద్యురాలు. అయితే ఆమెను అక్కడి పల్లెలు వైద్యురాలిగా కాదు.. తమ పాలిట దేవతగా కొలుస్తారు.

నేటి ఆధునిక వైద్యసేవలు ఇంకా అందుబాటులోకి రాని కాలంలో.. తెలంగాణా ప్రాంతంలో ప్రసవాలు చేసేవారిని మంత్రసాని అని ఎలాగైతే పిల్చుకునేవారో… కన్నడంలో సులగత్తి అంటే ప్రసవాలు చేసే మిడ్ వైవ్స్ అని అర్థం.

1922లో జన్మించిన ఈరమ్మ అంటే.. కర్నాటకలోని తన చుట్టుపక్కల గ్రామాల్లో సెలబ్రిటీలంత క్రేజ్. ఈరమ్మకు చిన్న ఈడులోనే పెళ్లైంది. ఉత్తర కర్నాటకలో ప్లేగు వ్యాధి విజృంభించిన కాలంలోనే.. తను ముగ్గురు పిల్లలకు తల్లైంది. తన అమ్మమ్మ వద్ద మిడ్వైఫ్రీలో ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించింది. తన 30 ఏళ్ల వయస్సులో మొదటిసారి ఒక మహిళకు ప్రసవం చేసింది. ఆ సమయంలో తనపై తనకెలాంటి అనుమానం లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రసవానికి ముందుకొచ్చింది. అంతే నమ్మకాన్ని గ్రామస్థులు కూడా ఈరమ్మపై ఉంచారు. అలా ఆమె చేసిన మొదటి కాన్పు ఆరోజుల్లో పెద్ద వార్తై కూర్చుంది.

ఆ తర్వాత ఈరమ్మకు ఒక ప్రసవం పూర్తవుతూనే.. మరో చోటునుంచి పిలుపందేది. అలా బిజీ బిజీగా గడిపేది. 30 కిలోమీటర్ల పరిధిలోని తన పల్లె చుట్టూ ఉన్న పల్లెలలన్నింటికీ నాటి గైనకాలజిస్ట్ ఈరమ్మే. ఎడ్ల బండి.. లేదా, సైకిల్ ఇవే ఈరమ్మ వాహనాలు. పగలు- రాత్రి అన్న తేడా లేకుండా ప్రసవాలు చేసేదే తప్ప… ఎవ్వరికీ లేదు, ఇప్పుడు కాదు అంటూ వారించిన దాఖలాలే లేవు. అందుకే ఈరమ్మ ఆ చుట్టపక్కల ఊళ్లకు తమ గ్రామదేవతైంది.

ఆసుపత్రి అనే భావనే తట్టని ప్రాంతాలవి!

ఒబళశెట్టి హళ్లిలోగానీ.. చుట్టుపక్కల పల్లెకుగానీ.. హాస్పిటల్ మాట దేవుడెరుగు.. అసలు వైద్యుడు అనే పదమే తెలియనంత వెనుకబడిన ప్రాంతాలవి. వారికి సమీపంలో పట్టణమంటే 76 కిలోమీటర్ల దూరంలో బళ్లారి వెళ్లాల్సిందే. నాటి కాల, మాన పరిస్థితులకు అక్కడివరకూ వెళ్లడమంటే ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈరమ్మే లేకపోతే, ఎందరో మహిళలు, శిశువుల ప్రాణాలే దక్కేవి కావు. ఎందరు మృత్యువాత పడేవారో కూడా ఊహించుకుంటేనే గగుర్పాటు కల్గిస్తుంది. దాదాపు 25 ఏళ్ల క్రితం వరకూ అంటే 2000 వ సంవత్సరం వరకూ చుట్టుపక్కల హాస్పిటల్సే లేవు. పాతికేళ్ల క్రితం ఒబళశెట్టి హళ్లికి ఏడు కిలోమీటర్ల దూరంలో చిక్కజోగహల్లిలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెలిసింది. సరిగ్గా 2010లో అంటే 15 ఏళ్ల క్రితమే అది ప్రసవాలు చేసే స్థాయికి అప్ గ్రేడ్ అయింది.

మా అమ్మ ప్రసవ సమయంలో ఈరమ్మే లేకపోతే నేను 23 ఏళ్ల వయస్సులో ఇలా కో ఆపరేటివ్ సొసైటీలో అటెండర్ గా పనిచేస్తుండేదాన్నే కాదంటుంది నాగవేణి. ఒబళశెట్టి హళ్లి చుట్టుపక్కల గ్రామస్థులు కూడా కాస్తా దూరం వెళ్లితే హాస్పిటల్స్ కు వెళ్లే సౌకర్యాలందాక కూడా ఈరమ్మనే నమ్ముకున్నారు. సిజేరియన్స్ కు భయపడీ డాక్టర్ల కన్నా కూడా ఈరమ్మనే నమ్మేవారు.

ఆరోజుల్లో అంత పెద్ద ఆరోగ్య సేవలందిస్తే ఆమెకు దక్కింది కేవలం రోజుకు ఐదు రూపాయల సంపాదన మాత్రమే. అదీ శిశువు మగా, ఆడా అన్న లింగాన్ని బట్టే చెల్లింపు.

తానెప్పుడూ డబ్బు అడగలేదు. ఎవరెంత ఇస్తే అంతే తీసుకునేది. పుట్టింది అబ్బాయైతే రెండు తట్టల జొన్న.. లేదా, రాగి ఇచ్చేవారు. పాపైతే ఒకటే తట్టెడు జొన్న.. లేదా, రాగి ఇచ్చేవారు. అందుకోసం 16 రోజుల పాటు తల్లీ, బిడ్డ సంక్షేమం కూడా ఈరమ్మ బాధ్యతే. అలా తన 85 ఏళ్ల వరకూ ఈరమ్మ 13 వేల పైచిలుకు ప్రసవాలు చేసింది. ఆ తర్వాత ఊళ్లో ఆరోగ్య సౌకర్యాలు అందడంతోనూ.. తానూ వృద్ధురాలవ్వడంతోనూ ఇక తన సేవలను ఆపేసింది. పైగా అక్కడికొచ్చిన ప్రభుత్వ నర్సులు కూడా తనను మంత్రసానిగా పనిచేయడం బంద్ చేయాలని హెచ్చరించడం కూడా అందుకు కారణమైంది.

ఈరమ్మ సేవలను గుర్తించిన కర్నాటక సర్కార్!

కర్నాటక గ్రామీణ భారతంలో మెటర్నిటి హెల్త్ సర్వీస్ లో ఈరమ్మ చేసిన సేవలను ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడు ఈరమ్మను కర్నాటక రాజ్యోత్సవ అవార్డ్ తో ఈ 103 ఏళ్ల వయస్సులో సత్కరించింది. పురస్కారాలకు అర్రులు చాచే చాలామందిలా ఆమేం ఆ అవార్డుకు దరఖాస్తు చేయలేదు. అసలు ఆ అవార్డ్ ఒకటుందన్న సంగతే ఈరమ్మకు తెలియదు. అదీ ఈ ముదిమి వయస్సులో ఆమె పట్టించుకునే అవకాశమే లేదు. కానీ, ఈరమ్మ సేవలను గుర్తించిన కర్నాటక సర్కార్.. అలాంటి అవార్డుతో ఈ 103 ఏళ్ల వయస్సులో ఆమెను సత్కరించడం ఒక గొప్ప విషయం. ఈరమ్మకు దక్కిన గౌరవం కన్నా కూడా.. ఆ అవార్డ్ ను ఆమెకు ఇప్పటికైనా ఇవ్వడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వమే తన గౌరవాన్ని పెంచుకోగల్గిందంటే ఇంకా సమంజసం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles