వైవిధ్యమైన గొంతు.. సాంత్వన చేకూర్చే తాత్విక గానం: వెంటాడే భూపిందర్ పాట!

దిల్ డూండుతా.. హై ఫిర్ వొహీ…పురుసత్ సే రాత్ దిన్ అంటూ చిన్న చిన్న సంతోషాలు, ఎలాంటి బాధ్యతలు, ఒత్తిడి లేని క్షణాలు, ప్రేమ, ప్రశాంతతలోని ఆనందాలు వెతుక్కుంటూ సాగే తాత్వికమైన గీతాన్ని వినని హిందీ చిత్రగీతాల ప్రేమికులెవరుంటారు..? ఆ తాత్విక గొంతుకు కేరాఫ్ భూపీందర్ సింగ్. ఓసారి ఆయన పాట గురించి… సంగీత దర్శకుల వద్ద వివిధ వాద్యాలనందించిన కళ గురించి చెప్పుకుందాం.

తనకేం ఇష్టమో అదే చేయడం అందరికీ సాధ్యపడదు. కానీ, భూపీందర్ సింగ్ మాత్రం అదే చేశాడు. తన పాటలో ఆ ఇష్టం కనిపిస్తుంది. ఒకింత తాత్వికతతో స్టార్ డమ్ ను సైతం దాటిపోయి నిల్చిన అమర గాయకుడు భూపీందర్ సింగ్.

భౌతికంగా ఆయన లేనప్పటికీ.. పాటలో ఎప్పటికీ చిరంజీవే. రుత్ జవాన్ జవాన్ అంటూ ఖయ్యాం ఆఖిరీ ఖత్ కోసం ఆయన హమ్ చేసిన స్వరం.. ఇప్పటికీ ఫ్రెష్ గా ఆయన ఇంకా మన మధ్యే ఉన్న ఓ నూతన యువకుడి గొంతును పరిచయం చేస్తుంది. కాలం.. యవ్వనంతో ఉప్పొంగుతున్నట్టు.. ప్రకృతి, ప్రేమ.. నూతనోత్సాహంతో కళకళలాడుతున్నట్టు ఆ పాట మనసుల్ని దోచుకుంటుంది. అదే సమయంలో యవ్వనం తాత్కాలికమైందని.. ప్రేమైక క్షణాలే అమూల్యమైనవనీ చెబుతుంది. ప్రకృతీ, మనసూ రెండూ ఒకేసారి వికసిస్తే ఎలా ఉంటుందో రుత్ జవాన్ జవాన్ పాటలో వినొచ్చు.

సంగీత కళాకారుల స్వర విన్యాసాలపై, సంగీతంపై పరిశోధనలు చేసిన భూపీందర్ సింగ్ స్నేహితుడు పవన్ ఝా ఏమంటారంటే… మహ్మద్ రఫీ మాధుర్యం.. కిషోర్ కుమార్ ఉల్లాసభరితం.. హేమంత్ కుమార్ మృదుత్వం… తలాత్ మహ్మూద్ వెన్నెల వేదన ఇన్నింటి మధ్య… ఒక బరువైన గాత్రం.. విషాదంతో లోతును చూపించే స్వరం భూపీ అంటారాయన. మా స్నేహితుల మధ్య అంత మంది లెజండరీ సింగర్స్ గురించి చర్చల్లోనూ.. భూపీందర్ సింగే ప్రధాన ఆకర్షణ.

మన్నాడే, భూపేన్ హజారికా, కే.జే. ఏసుదాసులా భూపీందర్ కూడా అప్పట్లో సాధారణ శ్రోతలందరికీ సరిపోయిన ఒక కచ్చితమైన మోల్డ్ కాదు. కానీ, విన్నాకొద్దీ.. కాలక్రమేణ పరిపక్వత సాధించినకొద్దీ ఆయన సంగీతం గొప్పతనమేంటో శ్రోతలకు అర్థమైందంటారు పవన్ ఝా.

బేసికల్లీ గిటారిస్ట్ గా, వయోలినిస్ట్ గా కెరీర్ ను ఆరంభించినప్పటికీ.. భూపీందర్ సింగ్ గాత్రంలోని లోతు, రీసౌండ్ దేవుడిచ్చిన వరం. అదే ఆయనకు గొప్ప గాయకుడిగా ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది. ఒక స్పెషల్ టోన్.. అంతే నాణ్యత ఆ గాత్ర విశేషాలు. ఇంకెవ్వరినైనా మిమిక్రీ చేసి పాడొచ్చేమోగానీ.. భూపీ పాటను మాత్రం ఇంకెవ్వరూ కాపీ చేయలేకపోవడమే ఆ స్వరం ప్రత్యేకత.

తన తండ్రి నాథా సింగే భూపీందర్ కు గురువు. ఖయ్యాం, మదన్ మోహన్, జైదేవ్, ఆర్జీ బర్మన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. కొన్ని పాటలకే సూట్ అవుతుందని.. కొన్ని గీతాలకే పరిమితమని.. ఏక రూప గాత్రమనీ.. కొందరు ముద్ర వేశారు. కానీ, హిందుస్థానీ క్లాసికల్ టచ్ తో పాటు, ప్రాశ్చాత్య శైలిని ఆవాహన చేసుకున్న గాత్రమది.

గిటార్, వయోలిన్ వంటివాటిపై పట్టు వల్ల గజల్ గానంలో ప్రాశ్చాత్య సంగీత వాద్యాల స్పర్శను టచ్ చేస్తూ అలరించారు.

జీవన గమనంలోని బాధలు, సందేహాలు, తాత్విక ఆలోచనలు, అస్తిత్వ సంక్షోభాలను ప్రతిబింబిస్తూ తన గాత్రంతో ఒకింత వైరాగ్యభావన వినిపించిన ఆ గాయకుడి నుంచే… పాటంతా యవ్వనం పర్చుకునేలా చేసే దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే జో దిల్ కో వంటి పాటల్లోని గిటార్ కార్డ్స్ వినిపించాయి.

భూపీందర్ సింగ్ పాటలు ఏదో సాహిత్యానికి, సంగీతాన్ని సమకూర్చి ఓ గాయకుడు పాడిన పాటలుగా మిగిలిపోలేదు. జీవితపు ఒడిదుడుకుల్లో తోడుగా నిల్చే తాత్విక స్నేహితుల్లా మిగిలిపోయాయి. మనం ముందే చెప్పుకున్నట్టు దిల్ డూండ్తా హై ఫిర్ వహీ అంటూ జీవన పరుగులో, అలసటలో కాసేపు ఆగి వెనక్కి చూసే అవసరాన్ని ఆ స్వరం అద్భుతంగా వ్యక్తీకరించింది. ఏక్ అకేలా ఇస్ షహర్ మే లో దిన్ ఖాళీ ఖాళీ బర్తన్ హై.. ఔర్ రాత్ హై జైసే అంధా కువాన్ అనే పదాల ద్వారా ఒంటరితనం, నిరాశ వంటివాటిని భూపీ మాత్రమే అంత లోతుగా పలికించగల్గారు.

జిందగీ మేరే ఘర్ ఆనాలో.. ఆశ, నిరాశ మధ్య దోబూచులాట కనిపిస్తుంది. జిందగీ సిగరెట్ కా ధువాన్ లో జీవితం నశ్వరమైనదే అయినా.. ఆశ విడవకూడదనే భావన వ్యక్తవుతుంది. మరోవైపు, ఖయ్యాం స్వరకల్పనలో వచ్చిన ఆహిస్తా ఆహిస్తా సినిమాలో కభీ కిసీకో ముకమ్మల్ జహా నహీ మిల్తా పాట వినండి.. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సంపూర్ణమైన జీవితం దొరకదనే పూర్తి కాంట్రాడిక్ట్ భావననూ అదే గొంతు వినిపిస్తుంది. కొంతమందికి నేల ఉంటుంది.. కానీ, ఆకాశముండదు. మరికొందరికి ఆకాశముంటుంది.. కానీ, నేల దొరకదంటూ సమాజ జీవన చిత్రాన్నీ, సత్యాన్నీ కళ్లకు కట్టిన పాట అది. కొందరికి డబ్బుండొచ్చు.. మనశ్శాంతి ఉండదు. మరి కొందరికి ప్రేమలుండొచ్చు, కుటుంబాలుండొచ్చు.. కానీ, స్థిరత్వం అందని ద్రాక్షే. ఇంకొందరు విజయవంతులైనా ఒంటరిగానే బతకాల్సి రావొచ్చు. అందుకే, జీవితంలో సంపూర్ణతను ఆశించొద్దనీ.. అసంపూర్ణతనూ అంగీకరించాల్సిందేనన్న ఆ సాహిత్యానికి… భూపీందర్ గాత్రం కాక మరొకరిని ఊహించనేలేం.

నన్నోసారి యాజ్జేసుకుంటే ప్రతీ చిన్న విషయం నీకు జ్ఞప్తికొస్తుంది. అది కేవలం నన్ను గుర్తు చేసుకోవడం కాదు.. నాతో గడిపిన క్షణాలు, మనిద్దరి మధ్య జరిగిన సంభాషణలోని మాటలు, నవ్వులు, పడ్డ బాధలు, ఇద్దరం కలిసి కన్న కలలు అన్నీ గుర్తొస్తాయంటూ ఖయ్యాం స్వరకల్పనలోని.. కరోగే యాద్ తో హర్ బాత్ యాద్ ఆయేగీ పాటకు ప్రాణం పోసిన గాత్రమది. సితారా సినిమాలో లతా మంగేష్కర్ తో కలిసి… పెద్ద పెద్ద కలలేం వద్దు… చిన్ని చిన్నిసంతోషాలుంటే చాలంటూ.. ఊపిరి పీల్చే స్వేచ్చ, ప్రేమించే మనస్సు, ప్రశాంతమైన జీవితం గురించి భూపీందర్ పాడిన ఆ పాట మధ్య తరగతి ఆనందాన్ని, అనుభూతిని చూపిస్తుంది

హకీఖత్ లో మహ్మద్ రఫీ, మన్నాడే, తలాత్ మహ్ముద్ తో కలిసి పాడిన హోకె మజ్బూర్ ముజే ఉస్నే భులాయా హోగా పాట భూపీందర్ కు ఇండస్ట్రీలో పెద్ద బ్రేకునిచ్చింది. ఉద్ధండులైన గాయకులతో కలిసి.. ఈ లెజండరీ సింగర్ పంచుకున్న గాత్రం చిరస్థాయిగా నిల్చిపోయింది. సరదా సంభాషణలా సాగిపోతూ హుజూర్ ఇస్ క దర్ భీ నా ఇత్రాకె చలియే అంటూ గుల్జార్ సాహిత్యానికి పంచమ్ చేసిన మ్యూజిక్ కు సురేష్ వాడేకర్ తో గళం కలిపి మ్యాజిక్ చేశాడు భూపీందర్.

ఈ శరీరం శాశ్వతం కాదు.. పేరు, ఖ్యాతి కూడా కాలంతో పాటే మాయమైపోతాయి.. కానీ, మనం ప్రపంచానికిచ్చిన కళ, ప్రేమ, జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోతాయనే అర్థంతో… నామ్ గుమ్ జాయేగాలోని.. మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై అనే పంక్తులు… సాహిత్యం సమకూర్చిన గుల్జార్ కూ, స్వరకల్పన చేసిన పంచమ్ కూ.. పాడిన లతా, భూపేందర్ సింగ్ కు సరిగ్గా సరిపోయేవి.

కినారాలో ఏక్ హీ ఖ్వాబ్ కయీ బార్ దేఖా హై పాట ఓసారి వినండి.. అదో పాటే కాదు.. ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణ, కవితా వచనం. పాట పాడినట్టుండదు.. జస్ట్ ఏదో చదువుతున్నట్టుగానే తన అరుదైన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు భూపీ.

ముఖ్యంగా ముఖేష్ అనంతరం విషాద, విరహ గీతాలను అంత లోతుగా ఆలపించేవారు కరువైన రోజుల్లో.. భూపీందర్ ఆ లోటు భర్తీ చేశాడు.

అంతటి అద్భుతమైన సంగీత సంపద ఉన్నప్పటికీ.. భూపీందర్ ఎందుకో అనుకున్నంత గుర్తింపు సంపాదించుకోలేకపోయారు.. ఎందుకు..? సినిమా వెలుగుల నుంచి క్రమంగా ప్రైవేట్ ఆల్బమ్స్, మెహ్ ఫిల్స్, సంగీత కచేరీల వైపు వెళ్లిపోయాడెందుకు…? ఆయన బతికున్నప్పుడు అంతగా పట్టించుకోని సమాజం.. ఆయన మరణానంతరం మాత్రం ఆయన్ను ఎక్కువగా గుర్తు చేసుకుంటోంది.

అందుకు భూపీందర్ వ్యక్తిత్వమే కారణమనేవారున్నారు. భూపీది పోటీ మనస్తత్వం కాదు. ప్రశాంత జీవనశైలి. జైదేవ్, మదన్ మోహన్ వంటి వారిపట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండేవాడు. పరిశ్రమలో కొద్దిమంది స్నేహితులే ఉన్నా.. భూపీతో బంధమేర్పర్చుకున్నవారి స్నేహం బలంగా కొనసాగింది. పేరు, ఖ్యాతి కోసం ఏనాడూ పరిగెత్తే స్వభావం కాదు భూపీందర్ ది.

భూపీందర్ కొన్ని పాటల్లోనూ ఆయన నిరాడంబరమైన నిజజీవితం ప్రస్ఫుటమైనట్టుగా కనిపిస్తుంది. అందుకే, స్టార్ డమ్ ను దాటి నిల్చిపోయిన అమర గాయకుడయ్యాడు భూపీందర్ సింగ్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles